ఆస్కార్ 2023: ‘‘నాటు నాటు’’ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డు

కీరవాణి, చంద్రబోసు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు.. నాటు’ పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.

లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున) జరిగిన 95వ అకాడమీ వేడుకలలో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది.

కీరవాణి, చంద్రబోసు ఈ అవార్డు అందుకున్నారు.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటునాటు’ పాటను సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్ చేశారు. గేయ రచయిత చంద్రబోస్ ఈ పాటను రాశారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తమ గాత్రంతో ఈ పాటకు ఊపు తెచ్చారు.

ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ స్టెప్పులతో పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లారని చెప్పవచ్చు.

నాటు నాటు పాట

ఫొటో సోర్స్, TWITTER @RRR MOVIE

ఒరిజినల్ సాంగ్ విభాగంలో..

ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాలుగు పాటలు పోటీ పడ్డాయి. నాలుగు పాటలు నామినేట్ అయినట్లు జనవరి 24న అకాడమీ ప్రకటించింది.

వీటిల్లో ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ‘నాటు నాటు’ పాటతో పాటుగా ‘టెల్ ఇట్ లైక్ ఎ విమెన్’ నుంచి అప్లాజ్, టాప్ గన్;మావ్ రిక్ సినిమా నుంచి హోల్డ్ మై హ్యాండ్ పాట, బ్లాక్ పాంథర్;వకండా నుంచి లిఫ్ట్ మీ అప్ పాటలున్నాయి.

మిగిలిన మూడు పాటలను వెనక్కి నెట్టి ఆర్ఆర్ఆర్‌లోని ‘నాటు నాటు’ పాట అకాడమీ అవార్డు సొంతం చేసుకుంది.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ

ఫొటో సోర్స్, RRR

ఇప్పటికే ఎన్నో అవార్డులు

‘నాటు నాటు’ పాట ఇప్పటికే ఎన్నో అవార్డులు, ప్రశంసలు సొంతం చేసుకుంది.

ఈ ఏడాది జనవరి 10న బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకుంది. ఈ అవార్డు సాధించిన తొలి భారతీయ సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించింది.

జనవరి 15న ‘బెస్ట్ సాంగ్’ కేటగిరీలో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు దక్కింది. జనవరిలో ఆన్లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు, ఫిబ్రవరిలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్, హ్యుస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులు దక్కాయి.

ఏఆర్ రెహమాన్

ఫొటో సోర్స్, A.R. RAHMAN/FACEBOOK

అప్పుడు ఏఆర్ రెహమాన్.. ఇప్పుడు కీరవాణి

2008లో విడుదలైన స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జయహో పాటకు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆస్కార్ గెలుచుకున్నారు. ఆ సినిమాకు ఇంగ్లాండ్‌కు చెందిన డాన్నీ బొయల్ దర్శకత్వం వహించారు.

ఇప్పుడు మాత్రం ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు భారతీయులు.. అందులోనూ తెలుగువారే పనిచేశారు.

ఈ పాటను కంపోజ్ చేసిన కీరవాణి తెలుగుతోపాటు వివిధ భాషల్లో ప్రముఖ సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సహా వివిధ భాషల్లో వందలాది పాటలను స్వరపరిచారు.

ఆయనకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు లభించాయి. 1997లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి నేషనల్ అవార్డు దక్కింది. ఇప్పటివరకు 11 నంది అవార్డులు, 13 సౌత్ ఇండియన్ ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు.

రాహుల్ సిప్లిగంజ్

ఫొటో సోర్స్, RAHUL SIPLIGUNJ/FACEBOOK

విడుదలైనప్పటి నుంచి సంచలనమే

‘నాటు నాటు’ పాట తొలుత 2021 నవంబరు 10న యూట్యూబ్‌లో విడుదలైంది. అప్పటినుంచే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.

24 గంటల్లో 17 మిలియన్ వ్యూస్‌తో రికార్డు సాధించింది. తర్వాత సినిమా విడుదలైనప్పట్నుంచి పాటలోని స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నాటు నాటు

ఫొటో సోర్స్, FACEBOOK

రాహుల్, కాలబైరవ పోటాపోటీ

పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలబైరవ పోటీ పడి మరీ పాడారు. వీరిలో కాలబైరవ, కీరవాణి కుమారుడు. అంతకుముందు బాహుబలిలోనూ పాటలు పాడారు. పాటను కాలబైరవ తెలుగు, కన్నడ భాషల్లో పాడారు.

రాహుల్ సిప్లిగంజ్‌కు మాస్ పాటలు పాడటంలో మంచి పేరుంది. ముందుగా ట్రాక్ పాడించి అది నచ్చడంతో ఒరిజినల్ సాంగ్ పాడించారని రాహుల్ వివిధ సందర్భాల్లో చెప్పారు. ఆ తర్వాత తమిళ్, కన్నడ, హిందీ వెర్షన్లలోనూ రాహులే పాటను పాడారు.

తారక్, చరణ్ కోసమే పుట్టి.. ప్రపంచాన్ని ఊపేస్తూ..

నాటు.. నాటు పాటను ఆర్ఆర్ఆర్ సినిమాలో పెట్టడానికి ముఖ్య కారణం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళినే పలు సందర్భాలల్లో చెప్పారు.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్లు కావడంతో ఇద్దరితో కలిపి డ్యాన్స్ చేయించాలని రాజమౌళి భావించారు.

ఈ విషయాన్ని కీరవాణికి రాజమౌళి చెప్పారు. ఆ తర్వాత కీరవాణి చంద్రబోస్‌ను పిలిపించి సుదీర్ఘంగా చర్చించారు.

తొలుత ‘నాటు.. నాటు’ హుక్ లైన్ తో మొదలు పెట్టి పాటను రాసుకున్నారు.

మొదట రెండో రోజుల్లో 90శాతం పాట చంద్రబోస్ రాయగా.. మార్పులు చేర్పులూ చేస్తూ పోతూ.. పూర్తిగా సిద్ధం చేయడానికి 19 నెలలు పట్టిందట.

రాజమౌళి

ఫొటో సోర్స్, FACEBOOK/RRRMOVIE

ప్రేమ్ రక్షిత్ ప్రతిభ చాటిన పాట

కొరియాగ్రాఫర్‌గా ప్రేమ్ రక్షిత్‌కు సినీ పరిశ్రమలో బాగా పేరుంది. కానీ, ఈ పాట కోసం దాదాపు 95 స్టెప్పులు కంపోజ్ చేశారు.

చరణ్, ఎన్టీఆర్ చేతులు కలుపుతూ చేసే సిగ్నేచర్ స్టెప్పు కోసం ఏకంగా 30 వెర్షన్లు సిద్ధం చేశారు. ఈ విషయాన్ని ప్రేమ్ రక్షిత్ సినిమా విడుదల సమయంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పారు.

సిగ్నేచర్ స్టెప్పు కోసం చరణ్, ఎన్టీఆర్ 18 టేకులు చేశారు. ఓసారి ఎన్టీఆర్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఆ స్టెప్పు ఎన్నిసార్లు చేసినా.. ముందుగా జక్కన్న(రాజమౌళి) ఒకే అనేవారు. తర్వాత వన్ మోర్ అనేవారు.

ఇద్దరి కాళ్లు సింక్ కాలేదని అనేవారు. ఇద్దరి ముఖాలు ఒకేసారి తిప్పలేదని అనేవారు.. అలా స్టెప్పు కోసం ఏకంగా 18 టేకులు తీసుకున్నాం. కానీ అన్ని చేసినా, చివరికి రెండో టేక్‌నే సినిమాలో ఫైనల్ చేశారు’’ అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు.

అలా పాట కోసం ఎన్టీఆర్, చరణ్, కొరియోగ్రాఫర్, రాజమౌళితోపాటు చిత్ర బ్రందం ఎంతో కష్టపడిందని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)