ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమా ఏం మ్యాజిక్ చేసింది? ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి సహా.. ఏకంగా 7 ఆస్కార్ అవార్డులు ఎలా కొట్టేసింది?

ఫొటో సోర్స్, EVERYTHING EVERYWHERE ALL AT ONCE
- రచయిత, లైరే సేల్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమా మార్చి 12 ఆదివారం నాడు లాస్ ఏజిల్స్‌లో ఆస్కార్ వేదికపై వెలుగులీనింది. నామినేట్ అయిన 11 అవార్డులలో ఏడింటిని గెలుచుకుంది.
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా ఆస్కార్ (2023) అవార్డు గెలుచుకుంది.
ఉత్తమ నటిగా మిషెల్ యో, ఉత్తమ సహాయ నటులుగా కే హుయ్ క్వాన్, జామీ లీ కర్టిస్ అవార్డులు సొంతం చేసుకున్నారు.
బెస్ట్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ అవార్డులను సాధించింది.
ఇందులో మిషెల్ యో ప్రధాన పాత్ర పోషించారు. కాలిఫోర్నియాలో లాండ్రీ నడుపుతున్న చైనా వలసదారు ఎవెలిన్ వాంగ్ పాత్రలో ఆమె నటించారు.
సై-ఫై, సిల్లీ కామెడీ, మార్షల్ ఆర్ట్స్, కుటుంబ కథ.. అన్నీ ఉన్నాయి ఇందులో. దీన్ని ఫలానా సినిమాగా వర్గీకరించడం కష్టం.
ఈ సినిమా విడుదలై బాక్సాఫీసు హిట్ కొట్టింది. మొత్తంగా 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 822 కోట్లు) కలెక్షన్లు సాధించింది. దీనికి పెట్టిన ఖర్చు కేవలం 14 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 115 కోట్లు). ఏ24 అనే చిన్న సంస్థ ఈ సినిమాను నిర్మించింది.
ఆస్కార్‌కు ముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, క్రిటిక్స్ చాయిస్, స్పిరిట్ అవార్డులు సహా అనేక అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమాను ఉత్తమ సినిమాగా గుర్తించని సినీ పరిశ్రమ లేదంటే అతిశయోక్తి కాదు.
ఇన్ని అవార్డులు, ఇంత డబ్బు, ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.
ఏమిటా రహస్యం? ఏముంది ఈ సినిమాలో? ఏం మ్యాజిక్ చేసింది?

ఫొటో సోర్స్, Getty Images
1. సినిమా మొత్తం గందగోళంగా అనిపిస్తుంది. కానీ...
"90లలో టరంటినో మూవీలు సినిమాకు కొత్త ఊపిరిలూదినట్టు, ఈ చిత్రం నేటి సినిమాలకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది" అన్నారు మెక్సికన్ ఫిల్మ్‌మేకర్ అల్ఫోన్సో కరోన్.
"ఈ తరం ట్రైన్‌స్పాటింగ్" అంటూ 1996లో డానీ బాయ్‌లే దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'ట్రైన్‌స్పాటింగ్'తో కంపేర్ చేశారు దిగ్దర్శకులైన అలెజాండ్రో గొంజాలెజ్ ఇనారిటు, గిల్లెర్మో డెల్ టోరో.
గిల్లెర్మో డెల్ టోరో నిర్మించిన 'పినోచియో' ఉత్తమ యానిమేషన్ చిత్రంగా ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది.
'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' సినిమాకు స్క్రీన్ ప్లే అందించిన డేనియల్ క్వాన్, డానియల్ షీనెర్ట్‌లకు ఇది కేవలం రెండవ సినిమా. వారి మొదటి సినిమా 'స్విస్ ఆర్మీ మ్యాన్' (2006) కూడా సూపర్ హిట్ అయింది.
రెండో సినిమాతో దుమ్ము లేపారు. 140 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా సంప్రదాయ చిత్ర నిర్మాణాన్ని సవాలుచేసింది. సమాకాలీన అంశాలను, శూన్యవాదాన్ని హైలైట్ చేసింది.
"సినిమా మొత్తం గందగోళంగా అనిపిస్తుంది. కానీ చక్కగా తీర్చిదిద్దిన గందరగోళం. ప్రతీ షాట్, సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్స్.. అనంతమైన అవకాశాలున్న ప్రపంచంలో మనుగడ కోసం పోరాటాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి" అని ఫిల్మ్ క్రిటిక్ పీటర్ డెబ్రూగ్ వెరైటీ పత్రికలో రాశారు.
"అటెన్షన్ డెఫిసిట్ ఉన్న ప్రేక్షకులకు ఇదో హైపర్‌యాక్టివ్ పరిష్కారం. మహమ్మారి వ్యాధులు, యుద్ధాలు, వెల్లువెత్తుతున్న నిరసనలు, ఉద్యమాల మధ్య సాధారణ ప్రజలకు నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలు చాలా ప్రాథమికమైనవి. తల్లిదండ్రులతో గొడవలు, అద్దె చెల్లించలేకపోవడం లాంటివి. సాధారణ జీవితం, సై-ఫై ఫాంటసీ కలగలిపి ఈ సినిమా ప్రేక్షకులను కుర్చీకి కట్టేస్తుంది" అంటారు పీటర్ డెబ్రూగ్.

ఫొటో సోర్స్, Getty Images
2. పాత్రల్లో ఎవరి ప్రపంచం వారిదే.. అయినా
అమెరికాలో స్థిరపడిన వాంగ్స్ పొట్టకూటికి పడే కష్టాలతో సినిమా మొదలవుతుంది.
వాళ్లు ఒక లాండ్రీ నడుపుతుంటారు. ఆ వ్యాపారం బాగా నడవదు. ఆదాయపన్ను చెల్లించాల్సి వచ్చినప్పుడు మరిన్ని కష్టాల్లో పడతారు.
దాంతో, వాళ్ల జీవితం ఛిన్నాభిన్నమవుతుంది. భర్తతో సంసారం సరిగా సాగడం లేదని గమనిస్తుంది ఎవెలిన్. మరోవైపు తండ్రితో పొరపొచ్చాలు.
దాంతో, ఆమె వేరే ప్రపంచం గురించి ఆలోచిస్తుంది. ఈ విశ్వంలో సమాంతర లోకాలు ఉంటాయని, అక్కడ తాను వేరే జీవితం జీవిస్తుంటుందని భావిస్తుంది. వేరే లోకాలకు వెళ్లి విధ్వంసాలు జరగకుండా ఆపాలని చూస్తుంది.
అనేక మెలికలతో సాగుతుందీ కథ. కానీ, అత్యంత వాస్తవం అనే భావన కూడా కలుగుతుంది.
"అన్ని పాత్రలూ వాటి ప్రపంచంలో అవి ఉంటాయి. ఎవరి గొడవ వారిదే. ఒకరి మాట ఒకరు వినిపించుకోరు. మనం వాస్తవంలో వేరు వేరు ప్రపంచాల్లో జీవిస్తుంటాం అని చెప్పడానికి ఇది సరిగ్గా సరిపోతుంది" అని డానియల్ క్వాన్ స్క్రిప్ట్ అపార్ట్ పాడ్‌కాస్ట్‌తో అన్నారు.
ఇంత గందరగోళంలోనూ ఈ సినిమాలో మనకు బాగా తెలిసిన తల్లీబిడ్డల ప్రేమ, తరాల మధ్య అంతరం, వలసదారుల అవస్థలు, డిప్రెషన్, గతాన్ని మోస్తుండడం, జీవించడానికి కారణాలు వెతకడం.. ఇవన్నీ కనిపిస్తాయి.
"ఇలాంటి కథ రాయడం చాలా సరదాగా ఉంటుంది. మన దృక్కోణాన్ని ప్రతిబింబించే వెర్రి, విచిత్రమైన, అసంబద్ధమైన తాత్విక విషయాలను అన్వేషించడానికి ప్రయత్నిస్తుంటాం" అన్నారు డానియల్ షీనెర్ట్.
"ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమా.. కాపురం విచ్ఛిన్నమైపోవడం, ప్రశాంతమైన జీవితం కోసం ఒక కుటుంబం పడే పాట్లు చెప్పే క్లాసిక్ కథ. నిరాశ, శూన్యవాదానికి అడ్డుకట్ట వేస్తుంది. చివరికి అందరూ ప్రేమగా ఒకరినొకరు వాటేసుకోవడంతో కథ ముగుస్తుంది. అది ప్రేక్షకులకు సాంత్వన కలిగిస్తుంది" అని లాస్ ఏంజిల్స్ టైమ్స్‌లో కాలమిస్ట్, సినీ విమర్శకుడు గ్లెన్ విప్ రాశారు.

ఫొటో సోర్స్, LIONSGATE
3. సైఫై, కుంగ్ ఫూ, హాస్యం, వ్యంగ్యం, డ్రామా.. అన్నీ...
చిత్రవిచిత్రమైన కల్పనలు, వివిధ జానర్‌లు కలగాపులగంగా సాగే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుంది.
సైన్స్ ఫిక్షన్ అభిమానులకు ఇది పండుగ. కుంగ్ ఫూ సినిమాలు నచ్చేవారికి, అసంబద్ధ హాస్యం, అధివాస్తవికత, వ్యంగ్యం... ఇలా ఎవరికి ఏది కావాలంటే అది అందిస్తుంది ఈ సినిమా.
ది మాట్రిక్స్, సైబర్‌పంక్ సినిమాలు, 1970, 1980లలో వచ్చిన మార్షల్ ఆర్ట్స్ సినిమాలు.. క్లాన్ ఆఫ్ ది వైట్ లోటస్ లాంటివి, ఏ స్పేస్ ఒడిసీ, ఇన్ ది మూడ్ ఆఫ్ లవ్ వంటి సినిమాలన్నీ గుర్తొస్తాయి.
భిన్న సంస్కృతులను, భిన్న తరాలను ఆకర్షించేందుకు ప్రయత్నించింది ఈ సినిమా.
"మూడు తరాలు ఈ సినిమాను ఆస్వాదించగలవు. వివిధ జాతులు, సంస్కృతుల నుంచి వచ్చిన వలసదారులు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు" అని కారిన్ జేమ్స్ బీబీసీ ఫ్యూచర్‌లో రాశారు.
భిన్న జాతుల నుంచి వచ్చిన వలసదారులకు ఇది నిజ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది.
ఆసియన్-అమెరికన్ కమ్యూనిటీని ప్రపంచం దృష్టికి తీసుకువస్తుందని ఇందులో ప్రధాన పాత్ర పోషించిన మిషెల్ యో అన్నారు.
"ఆస్కార్ అవార్డు నటిగా నాకు గుర్తింపుకు మించినది. ఆసియన్ కమ్యూనిటీ మొత్తం.. 'మాకోసం నువ్వు ఇది చేయాలి' అని చెబుతున్నట్టు అనిపించింది" అని మిషెల్ యో బీబీసీతో చెప్పారు.
60 ఏళ్ల మిషెల్ ఎన్నో సినిమాలు చేశారు. 'టుమారో నెవర్ డైస్', 'టైగర్ అండ్ డ్రాగన్' సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమా ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. నటిగా ఆమెను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది.

ఫొటో సోర్స్, Getty Images
మరొక నటుడు హుయ్ క్వాన్.. 'ఇండియానా జోన్స్' 'ది టెంపుల్ ఆఫ్ డూమ్', 'ది గూనీస్' చిత్రాలతో బాలనటుడిగా ప్రసిద్ధికెక్కారు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ ఈ సినిమాతో వెనక్కి వచ్చారు.
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాని మొదట 2022 మార్చి 11న ఆస్టిన్, టెక్సాస్‌లలో ప్రదర్శించారు. కొన్ని నెలల తరువాత అమెరికాలో 3,000 థియేటర్లలో ఆడింది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. బాక్సాఫీసు బద్దలుగొట్టింది.
నోటి మాట ఈ సినిమాకి మంచి పబ్లిసిటీ ఇచ్చిందని నిపుణులు అంటున్నారు.
ఇంతకీ ఈ సినిమా ఎందుకు విజయం సాధించింది అనే ప్రశ్నకు సమాధానం.. అందరికీ నచ్చింది కాబట్టి.
ఇవి కూడా చదవండి:
- మాతృత్వం: ‘మా అమ్మ వయసు 50 ఏళ్లయితే మాత్రం.. రెండవ బిడ్డను కనడానికి ఎందుకు సిగ్గుపడాలి?’
- ‘బాంబులు పడుతున్నా.. యుక్రెయిన్‌కు తిరిగి వెళ్లక తప్పట్లేదు’ - భారత వైద్య విద్యార్థుల దుస్థితి
- లావణి డ్యాన్స్: మహిళలను ప్రైవేటుగా బుక్ చేసుకునే ఈ నృత్యం ఏంటి? ఈ జీవితం మీద ఆ మహిళలు ఏమంటున్నారు?
- స్టాక్ మార్కెట్ ద్వారా తక్కువ కాలంలో ధనవంతులు కావొచ్చా? ఇందులో నిజమెంత?












