ఎలిఫెంట్ విస్పరర్స్ మూవీ: ‘ఆస్కార్ వచ్చింది కానీ ఇప్పుడు మా రఘు మాతో లేనందుకు బాధగా ఉంది’ - బొమ్మన్, బెల్లీ

ఫొటో సోర్స్, KARTIKIGONSALVES/INSTAGRAM
ద ఎలిఫెంట్ విస్పరర్స్.. తమిళనాడులోని నీలగిరి జిల్లా ముదుములైలో ఓ జంట రఘు అనే ఒక గున్న ఏనుగుతో పెంచుకున్న అనుబంధంపై రూపొందించిన ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డ్ దక్కింది.
కట్టునాయకర్ కులానికి చెందిన బొమ్మన్, బెల్లీ జంట ముదుమలై శాంక్చురీలో ఏనుగుల సంరక్షకులుగా పనిచేస్తుంటారు.
‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’కు ఆస్కార్ అవార్డ్ వచ్చిన తరువాత బొమ్మన్ మాట్లాడుతూ.. ‘ఆస్కార్ రావడంపై చాలా ఆనందంగా ఉంది. దర్శకుడికే ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది. కానీ, ఈ సంతోషకర సమయంలో రఘు మాతో లేకపోవడం బాధగా ఉంది’ అన్నారు.
బొమ్మన్, బెల్లీ జంట అనాథ ఏనుగుల బాధ్యతలు చూస్తుంటారు. ఈ డాక్యుమెంటరీలో ఏనుగులతో వారికి ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంటరీకి కార్తీకి గొంజాల్వెజ్ దర్శకత్వం వహించారు. నిర్మాత గునీత్ మోంగా. నెట్‌ఫ్లిక్స్‌లో దీన్ని విడుదల చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
తమిళనాడులోని ముదుమలైలో ఏనుగులను సంరక్షించే గిరిజన జంట బొమ్మన్, బెల్లీల కథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినోటా వినిపిస్తోంది.
‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీతో వెలుగులోకి వచ్చిన వీరి జీవితం గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.
ఏనుగులు, బొమ్మన్-బెల్లీ జంట మధ్య భావోద్వేగ అనుబంధంలోని సున్నితమైన కోణాలను దర్శకురాలు కార్తీకి గొంజాల్వెజ్ హృద్యంగా చిత్రీకరించారు. కట్టునాయకర్ సమాజంలోని ప్రజల జీవనశైలినీ ఈ డాక్యుమెంటరీలో చక్కగా చూపించారు.
తల్లికి దూరమైన ఓ ఏనుగు పిల్ల ఒంటిపై గాయాలతో, తోక కూడా తెగిపోయి అడవిలో పడి ఉండగా బొమ్మన్ చూస్తారు. ఆ గున్న ఏనుగు చనిపోయే స్థితిలో ఉంటుంది. ఆ గున్న ఏనుగును సంరక్షించడం, దానికి ఆశ్రయం ఇవ్వడం కష్టమని అడవిలోని మిగతావారంతా భావించినా బొమ్మన్ మాత్రం దాన్ని ఇంటికి తీసుకొస్తారు.
ఆ గున్న ఏనుగు బాగోగులను బెల్లీ కూడా బెన్నన్‌తో పాటు చూసుకుంటుంటారు. ఇద్దరూ ఆ ఏనుగుకు రఘు అని పేరు పెట్టి పెంచుకుంటారు. రఘును బెల్లీ చక్కగా చూసుకుంటుండడంతో అమ్ము అనే మరో ఆడ ఏనుగు పిల్ల బాధ్యతనూ ఆమెకు అప్పగిస్తారు.
బొమ్మన్, బెల్లీలు ఇద్దరూ ఒకే ప్రాంతంలో ఉంటూ.. ఏనుగుల సంరక్షులుగా పనిచేస్తూ పెళ్లి చేసుకుంటారు. వారిద్దరికీ 50 ఏళ్లకు పైనే ఉంటుంది.

ఫొటో సోర్స్, KARTIKIGONSALVES/INSTAGRAM
బొమ్మన్, బెల్లీ, రఘు, అమ్ములు ఒక కుటుంబంగా జీవిస్తుంటారు. ఈ గున్న ఏనుగుల పట్ల బొమ్మన్ దంపతుల అవ్యాజమైన ప్రేమ కారణంగానే అవి సంతోషంగా ఉంటాయి.
ఇప్పుడు ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు దక్కింది. తమ కథకు ఇంత ఆదరణ దక్కుతుందని బొమ్మన్, బెల్లీ ఊహించలేదు. పెద్దఎత్తున దక్కుతున్న అభిమానం మధ్య వారిద్దరూ ఇంకా ఏనుగుల సంరక్షకులుగానే పనిచేస్తున్నారు. ఆస్కార్ నామినేషన్ల తరువాత మేం వారితో మాట్లాడేందుకు ప్రయత్నించిన సమయంలో బొమ్మన్ అడవిలో ఓ ఏనుగు సంరక్షణలో ఉన్నారు. బెల్లీ కూడా అక్కడే ఉండి త్వరగా పదమంటున్నారు.
ఏనుగు వెంట నడుస్తూనే బొమ్మన్ మాతో మాట్లాడారు.
‘కార్తీకి నాకు చాలాకాలంగా తెలుసు. ఆమె తన స్నేహితులతో కలిసి ముదుమలై వచ్చేవారు. ఒకప్పుడు నేను రఘు బాగోగులు చూసుకుంటున్న సమయంలో ఆమె ముదుమలై వచ్చారు. సినిమా తీస్తున్నామని అప్పుడు చెప్పారు. నా గురించి, ఏనుగుల గురించి చిత్రీకరణ ప్రారంభించారు. షూటింగ్ కోసం ప్రజలు వచ్చేవారు. వారిలో చాలామంది ముంబయి నుంచి వచ్చినట్లు అనుకుంటున్నాను’ అన్నారు బొమ్మన్.

ఫొటో సోర్స్, THE ELEPHANT WHISPERERS / NETFLIX
ఇప్పుడీ డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డు సాధించింది. అంతర్జాతీయంగా ఖ్యాతి దక్కినట్లయింది.
అవార్డ్ గురించి బొమ్మన్ మాట్లాడుతూ.. ‘మాపై చిత్రీకరణ చేస్తున్నప్పుడు ఈ డాక్యుమెంటరీకి ఇంత గుర్తింపు వస్తుందని అనుకోలేదు. అడవిలో రోజువారీ పనులు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మా కథను ప్రపంచానికి చూపించారు. కార్తీకికి కృతజ్ఞతలు’ అన్నారు బొమ్మన్.
అవార్డు ప్రకటించిన తరువాతా బొమ్మన్‌తో మాట్లాడాం. ‘నాకు మాటలు రావడం లేదు. ఈ సినిమా ఇంత విజయం సాధిస్తుందని నేను ఊహించలేదు. రఘు, అమ్ము ఇప్పుడు మాతో లేనందుకు బాధగా ఉంది’ అన్నారు బొమ్మన్.
ఇటీవల కృష్ణగిరిలో మూడు ఏనుగులు విద్యుత్ కంచెను తాకి మరణించాయి. ఈ ప్రమాదం నుంచి రెండు గున్న ఏనుగులు బయటపడ్డాయి. ఆ రెండు గున్న ఏనుగులను అడవిలోకి పంపించి ఏనుగుల గుంపుతో చేర్చాలని.. ఒకవేళ అడవిలోని ఇతర ఏనుగులు వీటిని చేర్చుకోకుంటే తమతో తెచ్చి సంరక్షించాలని బొమ్మన్, బెల్లీలు అక్కడికి వెళ్లారు.
ఆ గున్న ఏనుగులు అడవిలోకి వెళ్లాయని.. అడవిలోని ఏనుగుల మందతో కలిశాయని బొమ్మన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- గోళ్లు ఎందుకు కొరుకుతారు?
- యువ అథ్లెట్లలో కొందరికి గుండెపోటు ఎందుకు వస్తోంది?
- ఈ స్కూలు పిల్లలు రోజూ రెండుసార్లు డబ్బాలు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు?
- తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్సీఎల్లో సాఫ్ట్వేర్ జాబ్... ఎంపిక ఎలా?
- గుజరాత్: శివాలయం మీద హక్కులను హిందూ సంస్థలకు ఇచ్చేందుకు జైనులు ఎందుకు ఒప్పుకోవడం లేదు...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













