లావణి డ్యాన్స్: మహిళలను ప్రైవేటుగా బుక్ చేసుకునే ఈ నృత్యం ఏంటి? ఈ జీవితం మీద ఆ మహిళలు ఏమంటున్నారు?

లావణి నృత్యం

ఫొటో సోర్స్, BBC/Mangesh Sonawane

    • రచయిత, అనఘ పాఠక్, అషయ్ యెగ్గే
    • హోదా, బీబీసీ మరాఠి, బాయిమానుణుష్

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్, బీడ్‌ నగరాలను కలిపే హైవే, జంఖేడ్ అనే ఒక చిన్న పట్టణం గుండా వెళుతుంది.

ఈ పట్టణంలో పగటి సమయం అంతా నిద్రాణంగా ఉంటుంది. కానీ, రాత్రి వేళలు మరోలా ఉంటాయి.

దీనికి చుట్టుపక్కల పట్టణాలు, నగరాలకు చెందిన పురుషులు రాత్రి వేళలో మహిళల డ్యాన్సు చూడటానికి ఇక్కడికి పోటెత్తుతారు. ఇది లావణి ప్రపంచం.

జంఖేడ్‌లోనే నృత్య ప్రదర్శనలు, ప్రైవేట్ షోలను ప్రదర్శించే 10 థియేటర్లు ఉన్నాయి.

పురుషులను అలరించడానికి ఇక్కడ తరతరాలుగా మహిళలు ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. వారు తరచుగా లైంగిక వేధింపులకు గురవుతారు. పేదరికం కొన్నిసార్లు వారు సెక్స్ వర్క్‌కు ఒప్పుకునేలా చేస్తుంది.

ఇక్కడ మహిళల శరీరంతో వ్యాపారం జరుగుతుంది. వీరు ఒంటరి తల్లులు. ఇప్పటివరకు వీరి కూతుళ్లు కూడా ఇదే వృత్తిని కొనసాగించేవారు.

కానీ, ఈరోజు వారు తమ బిడ్డలకు మంచి భవిష్యత్‌ను అందించడం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

అక్కడ మేం 18 ఏళ్ల గీత బర్డేను కలిశాం. ఆమె నర్సు కావాలని అనుకుంటున్నారు. తన తల్లిని డ్యాన్సర్ వృత్తి నుంచి బయటకు తీసుకొచ్చి, గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని ఆమె ఆశిస్తున్నారు. కానీ, అది అంత సులభం కాదు.

లావణి నృత్యం

ఫొటో సోర్స్, BBC/Mangesh Sonawane

ఫొటో క్యాప్షన్, ‘‘సంగీత్ బారి’’లో లావణి నృత్యం ప్రదర్శిస్తున్న మహిళలు

డ్యాన్స్ చేసే చోటే నివాస స్థలం

ఒక సాయంత్రం తనకు ఎదురైన అనుభవాన్ని గీత గుర్తు చేసుకున్నారు. ‘‘ఆరోజు ఒక ప్రైవేట్ డ్యాన్స్ కార్యక్రమం జరుగుతుంది. అందులో మా అమ్మ డ్యాన్స్ చేయాల్సి ఉంది. అప్పుడు వర్షం కురుస్తుండటంతో మా అమ్మ గదిలోనే వర్షం తగ్గడం కోసం ఎదురుచూస్తూ కూర్చుంది.

ఇంతలో ఎవరో మా అమ్మతో ఉన్న నన్ను చూశారు. ఆ అమ్మాయి ఎవరు? అని మా అమ్మను అడిగారు. నా కూతురు అని మా అమ్మ చెప్పడంతో, మరి నువ్వెందుకు డ్యాన్స్ చేస్తున్నావ్, ఆమెను పంపించు. ఇంకా ఎందుకు ఆగుతున్నావ్’’ అంటూ ఇష్టమున్నట్లు మాట్లాడారు అని గీత గుర్తు చేసుకున్నారు.

తల్లుల దగ్గరే వారి బిడ్డలు కూడా ఉండటం, వారికి సవాలుగా మారింది. వారు పని చేసే ప్రదేశమే, నివాస ప్రాంతం కూడా కావడంతో వారి బిడ్డలకు అపాయంగా మారింది.

‘సంగీత్ బారీ’ అనేది థియేటర్. డాన్సర్లు ఎక్కువ సమయం ఇక్కడే ఉంటారు. అది ఒక హాస్టల్ లాంటిది. డ్యాన్సర్ల తిండి, నిద్ర, డ్యాన్స్ ప్రదర్శనలు అక్కడే జరుగుతాయి.

ప్రతీ థియేటర్‌కు 8 నుంచి 10 డ్యాన్సింగ్ ట్రూపులు ఉంటాయి. ప్రతీ ట్రూపులో 4 నుంచి అయిదుగురు డ్యాన్సర్లు, ఒక సింగర్, మ్యూజీషియన్లు ఉంటారు.

లావణి నృత్యం

ఫొటో సోర్స్, BBC/Mangesh Sonawane

ఫొటో క్యాప్షన్, పేదరికం నుంచి బయటపడటానికి ఇక్కడి మహిళలు నృత్యం చేస్తూ డబ్బు సంపాదించడాన్ని మార్గంగా ఎంచుకున్నారు

ఒక సంగీత్ బారీ కనీసం 70 నుంచి 80 మంది ప్రజలకు ఇల్లు లాంటిది.

ప్రతిరోజూ రాత్రి మహిళలు అలంకరించుకుంటారు. తర్వాత కస్టమర్ల రాక కోసం ఆ సంగీత్ బారి డోర్లను తెరుస్తారు.

అందుకే భద్రత దృష్ట్యా కూతుర్లు, తమ తల్లులకు దూరంగా ఉంటారు.

గీత తల్లి పేరు ఉమ. తన భర్త చనిపోవడంతో ఉమ, డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఒంటరిగా ఆమె పిల్లలను పెంచుతున్నారు.

వయస్సు పెరిగిపోవడంతో ఆమె స్థానంలో ఇప్పుడు ఆమె కూతురు గీతను డ్యాన్స్ కార్యక్రమాలకు పంపాలని అందరూ సలహాలు ఇస్తుంటారు. ఇలాంటి వెక్కిరింపు మాటలను వినాల్సి వస్తుందని ఆమె వాపోతున్నారు.

‘‘మమ్మల్ని చూసి నవ్వే వాళ్ల పళ్లు రాలగొట్టాలని అనిపిస్తుంది నాకు. ఒక ఒంటరి, బలహీన మహిళ ఇద్దరు పిల్లలను ఎలా పెంచుతుంది? వారి భవిష్యత్ కోసం ఏం చేయగలుగుతుంది? అని అందరూ అనుకుంటారు.

కానీ, నా పిల్లలకు నా గతి పట్టనివ్వను. పిల్లల చదువు కోసం నేను ఏదైనా చేస్తాను. తాగుబోతులు, వంకరబుద్ధి ఉన్న వాళ్ల ముందు నేను డ్యాన్స్ చేశాను. నా బిడ్డను నేను ఈ కూపంలోకి రానివ్వను’’ అని ఉమ చెప్పారు.

చాలా కఠిన నిర్ణయం అయినప్పటికీ, తమ పిల్లల భద్రత కోసం ఈ తల్లులు వారి బిడ్డలను తమకు దూరంగా ఉంచాలనే నిర్ణయం తీసుకున్నారు.

తక్కువ వయస్సు ఉన్న వారు డ్యాన్స్ చేస్తే ఎక్కువ డబ్బు వెదజల్లుతారు

ఫొటో సోర్స్, BBC/Mangesh Sonawane

ఫొటో క్యాప్షన్, తక్కువ వయస్సు ఉన్న వారు డ్యాన్స్ చేస్తే ఎక్కువ డబ్బు వెదజల్లుతారు

డబ్బు ఎర

సంగీత్ బారి అనేది ఒక సంక్లిష్ట ప్రపంచం.

మాతృస్వామ్యాన్ని అనుసరించే కోల్హటి తెగ వారు ఇక్కడ ప్రధానంగా డ్యాన్స్ ప్రదర్శనల్లో పాల్గొంటారు.

కుటుంబానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు, డబ్బు నిర్వహణను ఈ మహిళలే చూసుకుంటారని ఈ తెగ వారు చెబుతారు.

కానీ, నిజానికి ఈ మహిళలు తమ పిల్లలు, సోదరులతో సహా ప్రతీ ఒక్కరికీ అన్ని సమకూర్చడం కోసం నృత్యం చేస్తూ డబ్బు సంపాదిస్తూ తమ గౌరవ, మర్యాదల్ని కోల్పోతారు.

కుటుంబానికి వారే ఆధారం కావొచ్చు కానీ, వారికంటూ సాధికారత లేదు. పైగా వారి కష్టాన్ని అలుసుగా తీసుకుంటారు. వారి కుటుంబాల్లో ఈ మహిళలు తప్ప ఎవరూ కూడా జీవనోపాధి కోసం పని చేయరు.

దశాబ్దాలుగా వారు డ్యాన్స్ చేస్తూనే జీవనం వెళ్లదీస్తున్నారు.

లావణి నృత్యకారిణి

ఫొటో సోర్స్, BBC/Mangesh Sonawane

ఫొటో క్యాప్షన్, కుటుంబానికి ఆధారం అయిన ఈ మహిళలకు సమాజంలో గౌరవం, మర్యాద లభించదు

మధ్య వయస్సున్న డ్యాన్సర్, ఒక డ్యాన్స్ ట్రూప్ యజమాని బబితా అక్కాల్‌కోట్కర్ ఇలా అంటారు.

‘‘ఇంట్లో ఎవరైనా పని చేయాలి. కొంత డబ్బు సంపాదించాలి అని నేను అనుకుంటా. నా సోదరులు వారి డబ్బుతో కనీసం ఉప్పు ప్యాకెట్ అయినా కొనాలని నేను ఆశిస్తా’’ అని బబితా అన్నారు.

సంగీత్ బారీ లేదా పర్ఫార్మింగ్ థియేటర్లు అనేది తమాషా పార్టీలకు భిన్నంగా ఉంటాయి. అయితే, ఈ రెండు ప్రదేశాల్లో కూడా లావణి కళనే ప్రదర్శిస్తారు. తమాషా పార్టీలకు చెందిన వారు తమ బృందాలు, పరికరాలు తీసుకొని గ్రామగ్రామానికి తిరుగుతూ ప్రతీ రోజూ సాయంత్రం ప్రదర్శనలు చేస్తుంటారు.

తొలుత, లావణిని ఒక మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా పరిగణించేవారు. ప్రేక్షకులు వచ్చి, నామమాత్రపు ధరతో టికెట్ కొని మహిళల డ్యాన్సులు చూసి వెళ్లిపోయేవారు.

ఇప్పుడు, ముఖ్యంగా ఇలాంటి థియేటర్లలో ఇది చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది.

వీడియో క్యాప్షన్, లావణి డ్యాన్స్: ‘నా పిల్లలకు నా గతి పట్టనివ్వను’

‘‘ప్రైవేట్ షో’’ పేరిట తలుపులు మూసేసిన చిన్న గదుల్లో మహిళలు ప్రదర్శనలు చేస్తుంటారు. ఇలాంటి వాటి నుంచి నిర్వాహకులకు డబ్బు వస్తుంది.

గదుల్లోని సౌకర్యాలు, షో నిడివి, ముఖ్యంగా డ్యాన్సర్ల వయస్సుపై ఇలాంటి ప్రదర్శనల ధర ఆధారపడి ఉంటుంది.

తక్కువ వయస్సు ఉన్నవారికి ఎక్కువ డబ్బు అందుతుంది. అక్కడి తల్లులను ఈ భయమే వెంటాడతుంది. అందుకే తమ నుంచి తమ కూతుర్లను దూరంగా ఉంచుతారు.

‘‘ఒకవేళ నాతో పాటే నా కూతురు కూడా ఇక్కడే నివసిస్తే, ఈ ప్రభావం ఆమెపై పడుతుంది. ఇక్కడి అమ్మాయిలు ఆకర్షించేలా ఉంటారు. మేం కస్టమర్లతో మెలిగే తీరు, మేకప్ వేసుకోవడం వంటివన్నీ వారు చూడాల్సి వస్తుంది. చాలా మంది తల్లులు వారి బిడ్డల జీవితాలు నాశనం కావడం చూశారు. నా కూతురి విషయంలో ఇలా నేను జరుగనివ్వను. అందుకే నేను ఎప్పుడూ ఆమెను నాకు దూరంగా పెంచాను’’ అని లత అనే మహిళ వివరించారు.

లావణి నృత్యం

ఫొటో సోర్స్, BBC/Mangesh Sonawane

బయటపడే దారి

ఇప్పుడు ఈ మహిళల్లో కొంతమంది తమ బిడ్డల భవిష్యత్ కోసం చేతులు కలిపారు. తమ సంపాదనలో కొంతభాగాన్ని తమ పిల్లలు ఉండేందుకు హాస్టల్ కోసం వెచ్చించారు. ముఖ్యంగా తమ ఆడపిల్లలు సురక్షితమైన ప్రదేశంలో నివసిస్తూ, పాఠశాలకు వెళ్లేందుకు వీలుగా వారంతా కృషి చేశారు.

ఆ హాస్టల్ డైరెక్టర్ అరుణ్ జాధవ్‌ను మేం కలిశాం. డ్యాన్సర్లు అయిన సింధు గులాబ్ జాధవ్, కాంత జాధవ్, అల్కా యాదవ్‌లు కలిసి ఈ హాస్టల్ భవనాన్ని నిర్మించినట్లు అరుణ్ జాధవ్ చెప్పారు.

‘‘హాస్టల్ కోసం సహాయం చేయాల్సిందిగా వారంతా తమ కస్టమర్లను ప్రాధేయపడేవారు. పుణేలో ‘ఆర్యభూషణ్’ అనే కళాకేంద్రం ఉంది. అక్కడ సవితా అనే ఒక సోదరి తన ప్రైవేట్ డ్యాన్స్ సెషన్లకు హాజరయ్యే వారి నుంచి డొనేషన్లను తీసుకునేవారు. ప్రతీ కస్టమర్ నుంచి రూ. 500 విరాళంగా ఆమె సేకరించేవారు. ఆమె ఒక్కరే దాదాపు 50 నుంచి 60 వేల రూపాయలు పోగు చేశారు’’ అని ఆయన వెల్లడించారు.

డ్యాన్సర్ల నివసించే ప్రదేశానికి చాలా దూరంలో ఈ హాస్టల్ ఉంటుంది.

లావణి నృత్యకారిణి

ఫొటో సోర్స్, BBC/Mangesh Sonawane

డ్యాన్సర్లు నివసించే క్వార్టర్లు చాలా ఇరుగ్గా ఉంటాయి. ప్రతీ డ్యాన్స్ ట్రూప్‌కు ఒకటి లేదా రెండు గదులు ఇస్తారు. మహిళలు ఈ క్వార్టర్లలోనే నిద్రపోతారు. మ్యూజిక్ వాయించే పురుషులకు వేరు క్వార్టర్లను ఇస్తారు.

అక్కడ కొన్ని విలాసవంతమైన గదులు ఉన్నాయి. కొన్ని గదుల్లో ఏసీ ఉండగా, మరికొన్నింటిలో కూలర్లు, పరుపులు, టైల్స్ అమర్చి ఉన్నాయి. ఈ గదుల్లోనే ప్రైవేట్ ప్రదర్శనలు నిర్వహిస్తారు.

ఇక్కడి మహిళల రోజు, ఆలస్యంగా ప్రారంభం అవుతుంది. కొన్నిసార్లు మధ్యాహ్నం పూట వీరి దినచర్య మొదలవుతుంది. ప్రతీ ట్రూప్‌కు ఒక వంటమనిషి, ఇంటి పని చేసే ఒక వ్యక్తి ఉంటారు.

సాయంత్రం 4 గంటలకల్లా వారు అలంకరించుకోవడం మొదలుపెడతారు. అలంకరించుకున్నాక వాకిలిలో కస్టమర్ల రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారు. కొంతమంది పురుషులు, తమ ముఖాలను దాచుకుంటారు. తమకు నచ్చిన మహిళలను ప్రైవేట్ షో కోసం బుక్ చేసుకుంటారు.

ఈ పురుషులు తరచుగా డ్యాన్సర్లపై డబ్బును వెదజల్లుతారు. ఈ షో ఉదయం 4 గంటల వరకు కొనసాగుతుంది.

కొన్నిసార్లు కొంతమంది మహిళలు, క్లయింట్‌తో కలిసి బయటకు వెళ్తారు. అప్పుడు వారికి మరింత ఎక్కువ డబ్బు అందుతుంది. ఇలా లభించిన డబ్బును వారు థియేటర్ యజమాన, సంగీతకారులతో పంచుకోవాల్సిన అవసరం లేదు.

వీడియో క్యాప్షన్, కష్టాలను అధిగమించి బాడీ బిల్డర్‌గా ఎదిగిన ఒంటరి మహిళ

క్షీణిస్తున్న కళ

లావణి అనేది మహారాష్ట్ర జానపద నృత్యం. దీనికి ‘కథక్’ నృత్యంతో చాలా పోలికలు ఉంటాయి. ఇందులో ప్రావీణ్యం పొందడం చాలా కష్టం.

లావణి, శృంగారభరితమైనది. అందుకే, ఏళ్లుగా ఈ కళారూపాన్ని చిన్నచూపు చూసేవారు. అయినప్పటికీ, ఈ నృత్యంలో ప్రావీణ్యత సాధించిన నృత్యకారులు ఉన్నారు. ఈ నృత్యరూపకంలోని అందాన్ని వారు గుర్తు చేసుకుంటారు.

కానీ, ఇప్పుడుఈ కళారూపం క్షీణిస్తోంది. సంగీతకారులు ఆ రిథమ్‌ను కోల్పోతున్నారు. డ్యాన్సర్లు, బీట్‌ను పట్టుకోలేకపోతున్నారు. ఈ కళలో ఇప్పుడు నైపుణ్యత లేదు.

సీనియర్ డ్యాన్సర్, సింగర్ అయిన లతా పర్బానికర్ దీని గురించి మాట్లాడుతూ, ‘‘ఒకప్పుడు ప్రేక్షకులు ఈ కళను గౌరవంగా చూసేవారు. కానీ, ఇప్పుడు అందరూ శరీరాలనే చూడాలనుకుంటున్నారు’’ అని అన్నారు.

దీని నుంచి బయట పడాలని ఇక్కడి మహిళలు కోరుకుంటున్నారు. కానీ, ఇది అందరికీ సాధ్యం కాదు.

పేదరికం నుంచి బయటపడేందుకు ఇక్కడి మహిళలకు డబ్బు కావాలి. అలాంటి వారందరికీ సంగీత్ బారి ఒక్కటే దిక్కుగా మారింది.

జై అంబికా కళా కేంద్రంలో ఇది మరో సాయంత్రం. ఇక్కడ బాగా అలంకరించుకొని కస్టమర్ల కోసం ఎదురుచూస్తున్న మహిళల్ని మీరు చూడొచ్చు.

ఇక్కడికి దూరంలో ఉన్న హాస్టల్‌లో పిల్లలు ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తుంటారు. తమ పిల్లల్ని ఈ కూపంలోకి రానివ్వకూడదనే సంకల్పానికి తల్లులు కట్టుబడి ఉంటారు.

BBC She ప్రాజెక్టులో భాగంగా ఈ స్టోరీ చేశాం. మహిళల కథల కేంద్రంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. బీబీసీ షీ గురించి మరింత తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

(బీబీసీ షీ సిరీస్ నిర్మాత: దివ్య ఆర్య, బీబీసీ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)