భోపాల్ సంస్థానం: 107 ఏళ్లు పాలించిన బేగమ్‌ల కథ... అక్కడ హిందువులు, ముస్లింలు కలిసి పని చేసేవారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షురైహ్ నియాజీ
- హోదా, బీబీసీ కోసం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోన్న మహిళా శక్తి గురించి, సమాజానికి వారు అందిస్తున్న సహకారం గురించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం తెలుపుతుంది.
ఒకసారి భోపాల్ సంస్థానం చరిత్రలోకి వెళ్లి చూస్తే దాన్ని పాలించిన మహిళల గొప్పతనం గురించి తెలుసుకోవచ్చు. అక్కడ పురుషులు కూడా సులభంగా చేయలేని పనులన్నింటినీ మహిళా పాలకులు చేసి చూపించారు.
ఫతేఘఢ్ కోటను నిర్మించడం ద్వారా సర్దార్ దోస్త్ మొహమ్మద్ ఖాన్, భోపాల్ సంస్థానానికి పునాది వేశారు.
కానీ, ఆ సంస్థానానికి గుర్తింపు తెచ్చింది మాత్రం అక్కడి బేగమ్ నవాబులే.
బేగమ్‌ల పాలన కుద్సియా బేగమ్‌తో మొదలైంది. సికిందర్ జహాన్ బేగమ్ నుంచి సుల్తాన్ జహాన్ బేగమ్ వరకు మొత్తం 107 ఏళ్ల పాటు వీరి పాలన కొనసాగింది.
1819 నుంచి 1926 వరకు భోపాల్ సంస్థానం పాలన బేగమ్‌ల చేతుల్లోనే ఉంది.
ఈ సంస్థానాన్ని పాలించిన మొట్టమొదటి మహిళా నవాబు గురించి మాట్లాడుకోవాలంటే ‘కుద్సియా బేగమ్’ పేరు ముందు వస్తుంది. ఆమెనే గౌహర్ బేగమ్ పేరుతో కూడా పిలిచేవారు.
ఆమె భర్త 1819లో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆమెను నవాబ్ చేశారు. 18 ఏళ్ల వయస్సులోనే ఆమె నవాబ్ అయ్యారు.
ఆమె చదువుకోలేదు. కానీ, చాలా ముందుచూపుతో ఆలోచించేవారని చరిత్రకారులు అంటారు. ఆమె సైన్యంతో కలిసి అనేక యుద్ధాల్లో కూడా పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, SUREH NIAZI
ఆమె కట్టించిన ‘గౌహర్ మహల్’ ఇప్పటికీ పెద్ద చెరువు ఒడ్డున ఉంది. భోపాల్‌లో జామా మసీదును కూడా ఆమె నిర్మించారు.
సైఫియా కాలేజీ ప్రొఫెసర్, చరిత్రకారుడు అషర్ కిద్వాయి, బీబీసీతో మాట్లాడుతూ, ‘‘ఈ కాలంలోని ప్రజలు కూడా మహిళలను పైస్థాయిలో చూడటాన్ని కోరుకోరు. కానీ, భోపాల్ సంస్థానం ఇందుకు మినహాయింపు. అక్కడ మహిళలే రాజ్యం ఏలారు. రాజ్యాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లారు’’ అని అన్నారు.
‘‘ఈ మహిళలు రాజ్యాన్ని పాలించడమే కాకుండా హిందువులు, ముస్లింలను కలుపుకొని వెళ్లారు. వీరి మంత్రి వర్గంలో ముస్లిం, హిందువులు కలిసి పనిచేశారు’’ అని చెప్పారు.
ఆమె తర్వాత భోపాల్‌ను పాలించిన సికిందర్ జహాన్ బేగమ్ కూడా చాలా సవాళ్లను ఎదుర్కొన్నారని అషర్ కిద్వాయి తెలిపారు.
ఆమె పాలన కాలంలో ఆమె మేనమామ ఫౌజ్దార్ మొహమ్మద్ ఖాన్ మంత్రిగా ఉండేవారు. ఆయన కారణంగా ఆమె పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, చివరకు ఫౌజ్దార్ మొహమ్మద్ ఖాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
సికిందర్ జహాన్ బేగమ్ ప్రత్యేకత ఏంటంటే, ఆమె గుర్రం మీద సంస్థానం మొత్తాన్ని చుట్టేసేవారు.
దిల్లీలోని జామా మసీదును బ్రిటిష్ వారి నుంచి ముస్లింలు తిరిగి పొందడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
1857 తిరుగుబాటు తర్వాత జామా మసీదును మూసి వేశారు. ముస్లింలు అందరూ మసీదులో కలిసి తమ మీద కుట్రకు పాల్పడతారని బ్రిటిష్ వారు నమ్మేవారు.

ఫొటో సోర్స్, SUREH NIAZI
‘‘తన సంస్థానంలోని ప్రతీ గ్రామంలో సికిందర్ జహాన్ బేగమ్ పర్యటించేవారు. గ్రామానికి సంబంధించిన మ్యాపులను తయారు చేసుకున్నారు. ఈ మ్యాపులను చేతులతో రూపొందించారు. ప్రతీ అంశాన్ని అందులో పొందుపరిచారు. సంస్థానంలో పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? నీటి వనరులు ఎక్కడ ఉన్నాయి? ఇలా అన్ని అంశాలను పటాలలో పొందుపరిచారు’’ అని కిద్వాయి చెప్పారు.
ఆ సమయంలో ఒక నవాబు ఇలాంటి పని చేయడం అదే మొదటిసారి అని ఆయన తెలిపారు.
సికిందర్ జహాన్ విద్య కోసం చాలా కృషి చేశారు. విద్యను ప్రోత్సహించడం కోసం బయట నుంచి పండితులను కూడా పిలిపించారు.
మరో చరిత్రకారుడు డాక్టర్ శంభుదయాల్ గురు చెప్పినదాని ప్రకారం, సికిందర్ జహాన్ బేగమ్ చాలా చక్కగా పరిపాలించేవారు. తన సమర్థత కారణంగా భోపాల్ సంస్థానంపై ఉన్న రూ. 30 లక్షల అప్పును ఆమె చాలా సులభంగా తిరిగి చెల్లించగలిగారని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అప్పట్లో కాంట్రాక్టు పద్ధతిలో జరిగే రెవిన్యూ సేకరణను సికిందర్ జహాన్ రద్దు చేశారని ఆయన వెల్లడించారు.
మహిళా పాలకుల జాబితాలో మూడో వరుసలో వచ్చే పేరు షాజహాన్ బేగం.
తన కంటే ముందు పాలించిన ఇద్దరు మహిళా నవాబులు తలపెట్టిన పనులను షాజహాన్ బేగం ముందుకు తీసుకెళ్లారు. అయితే, ఆమెకు భవనాలను నిర్మించడం చాలా ఇష్టమైన పని.
ఆగ్రాలోనే కాకుండా భోపాల్‌లో కూడా తాజ్ మహల్ పేరుతో ఒక కట్టడం ఉందని, దాన్ని షాజహాన్ బేగమ్ కట్టించారని చాలా కొద్దిమందికే తెలుసు. దీనితో పాటు ఆమె తాజుల్ మసీదు నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. కానీ, దాన్ని పూర్తి చేయలేకపోయారు.
దేశంలోని అతిపెద్ద మసీదుల్లో తాజుల్ మసీదు ఒకటి. ఆమె మరణం తర్వాత ఆ మసీదు నిర్మాణం పూర్తయింది.

ఫొటో సోర్స్, SUREH NIAZI
అదే సమయంలో ఆమె షాజహానీ మసీదు అని పిలిచే మరో కట్టడాన్ని కూడా నిర్మించారు. షాజహాన్ బేగమ్ మంచి పాలకురాలే కాకుండా చేయి తిరిగిన రచయిత్రి కూడా. ఆమె ఉర్దూ భాషలో అనేక పుస్తకాలు రాశారు.
హిందువుల రక్షణ కోసం ఆమె అనేక చట్టాలను తయారు చేశారని పలువురు చరిత్రకారులు చెబుతారు. హిందువుల ఆస్తుల భద్రత, రక్షణ కోసం హిందూ ప్రాపర్టీ ట్రస్టును నెలకొల్పారు.
ముస్లిం బాలికల విద్య కోసం పాఠశాలలను ఏర్పాటు చేశారు. కానీ, అందులో ఖురాన్, దీన్‌ను కూడా బోధించేవారు. ఈ కారణంగా హిందూ అమ్మాయిలు అక్కడ చదువుకోలేరు కాబట్టి హిందూ బాలికల కోసం పాఠశాలలను ప్రారంభించారు.
భోపాల్‌ను పాలించిన చివరి మహిళా నవాబు సుల్తాన్ జహాన్ బేగమ్. 1901లో ఆమె సింహాసనాన్ని అధిష్టించారు. సుల్తాన్ జహాన్ బేగమ్ కూడా విద్యకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు.

ఫొటో సోర్స్, SUREH NIAZI
భోపాల్ ఆధునీకరణ
ఆ కాలంలోనే తన సంస్థానాన్ని ఆధునీకరించాలని తాపత్రయపడిన మహిళగా సుల్తాన్ జహాన్ బేగమ్‌ను కిద్వాయి పరిగణిస్తారు.
ఆమె భోపాల్‌లో కస్ర్-ఎ-సుల్తానీ ప్యాలెస్‌ను నిర్మించారు. ఇప్పుడు దీన్ని అహ్మదాబాద్ ప్యాలెస్‌గా పిలుస్తున్నారు. దానితో పాటు మింటో హాల్‌ను నిర్మించారు. తర్వాత దీన్ని చాలా కాలం పాటు మధ్యప్రదేశ్ అసెంబ్లీ భవనంగా ఉపయోగించారు.
అప్పట్లో ఆమె ఏర్పాటు చేసిన సుల్తానియా బాలికల పాఠశాల ఇప్పటికీ అక్కడ నడుస్తోంది. అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీకి ఆమె తొలి చాన్సులర్‌గా వ్యవహరించారు. అలాగే ఆలిండియా కాన్ఫరెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు తొలి అధ్యక్షురాలు కూడా.
భోపాల్‌లో నవాబుల కాలంలో నిర్మించిన ఆర్చిటెక్చర్‌పై అధ్యయన చేసే ‘స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్’కు చెందిన ప్రొఫెసర్ సవితా రాజే, బీబీసీతో మాట్లాడారు.
భోపాల్‌లో బేగమ్‌లు నిర్మించిన ప్యాలెస్‌లు ఇతర నిర్మాణాలను రక్షించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, SUREH NIAZI
‘‘మీరు దేశంలోని ఇతర ప్యాలెస్‌లను గమనిస్తే అందులో పురుషులు, మహిళలకు సంబంధించిన ప్రత్యేక భాగాలు కనిపిస్తాయి. కానీ, భోపాల్‌లో మాత్రం మీకు అవి కనిపించవు. ఎందుకంటే ఇక్కడ మహిళలే పురుషుల తరహాలో పని చేశారు’’ అని రాజే వ్యాఖ్యానించారు.
ఈ మహిళా నవాబులు, భోపాల్ నగరానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చారని బర్ఖతుల్లా యూత్ ఫోరం కో ఆర్డినేటర్ అనస్ అలీ అన్నారు. ఈ ఫోరం, ప్రతీ ఏడాది ‘యాద్-ఎ-బేగ్మత్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
చివరి నవాబు అయిన సుల్తాన్ జహాన్ బేగమ్, భోపాల్‌లో కింగ్ జార్జి ఆసుపత్రిని నిర్మించారని అలీ చెప్పారు. ఇప్పుడు ఆ ఆసుపత్రిని హమిదియా ఆసుపత్రిగా పిలుస్తున్నారని, నగరంలో ఇదే అత్యంత ప్రముఖమైన ఆసుపత్రి అని ఆయన తెలిపారు.
‘‘ఈ మహిళా నవాబులు భవనాలు నిర్మించారు. శాంతిని నెలకొల్పారు. పరిశ్రమలను ఏర్పాటు చేశారు. బాలికల కోసం పాఠశాలలను తెరిచారు. అలాంటి గొప్ప చరిత్రను ఎప్పుడూ గుర్తు పెట్టుకోవడం, దాన్ని పునరావృతం చేయడం మన కర్తవ్యం’’ అని అలీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత మీద ఈడీ ఆరోపణలు ఏమిటి?
- అన్ని వయసుల వారికీ గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్.. ముందే గుర్తించడం ఎలా?
- IWD2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఊదా రంగును ఎందుకు ధరిస్తారు...
- అక్కడ విడాకులను వేడుకగా జరుపుకుంటారు
- Sexual Health: ‘‘వయాగ్రా తీసుకొని మద్యం తాగడంతో మరణించిన వ్యక్తి’’... అరుదైన కేసుగా వెల్లడి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















