చైనా: జాక్ మా, బావో ఫ్యాన్, మరికొందరు.. బిలియనీర్ల వరుస అదృశ్యాల వెనుక మిస్టరీ ఏంటి?

చైనా వ్యాపారవేత్తలు జాక్ మా, బావో ఫ్యాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా వ్యాపారవేత్తలు జాక్ మా, బావో ఫ్యాన్
    • రచయిత, పీటర్ హాస్కిన్స్
    • హోదా, బిజినెస్ రిపోర్టర్

చైనాలో మరో దిగ్గజ వ్యాపారవేత్త అదృశ్యం అయ్యారు. దీంతో, చైనాలో కోటీశ్వరులు కనిపించకుండా పోవడం అనే అంశం మరోసారి అందరిలో ఆసక్తిని రేకెత్తించింది.

చైనాకు చెందిన టెక్నాలజీ డీల్ మేకర్ బావో ఫ్యాన్, గల నెలలో అదృశ్యం కావడంతో ఈ విషయం మరోసారి చర్చల్లో నిలిచింది.

‘‘చైనా రనెసాన్స్ హోల్డింగ్స్’’ అనే ప్రైవేటు బ్యాంకింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు బావో ఫ్యాన్. చైనా టెక్ రంగంలో బావో ఫ్యాన్‌ను ప్రముఖుడిగా పరిగణిస్తారు.

పీపుల్స్ రిపబ్లిక్ చైనాలో ప్రభుత్వ ఏజెన్సీల అధికారులు నిర్వహిస్తున్న దర్యాప్తుకు బావో సహకరిస్తున్నారని ఆయన కంపెనీ ప్రకటించడానికి కొన్ని రోజుల ముందు నుంచి ఆయన కనిపించకుండా పోయారు.

ప్రభుత్వానికి చెందిన ఏ సంస్థ ఈ విచారణను నిర్వహిస్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అలాగే బావో ఆచూకీ గురించి కూడా తెలియట్లేదు.

అలీబాబా గ్రూపు అధినేత ‘జాక్ మా’తో సహా ఇటీవల సంవత్సరాలలో పలువురు చైనా పారిశ్రామిక వేత్తలు కనిపించకుండా పోయారు. ఇప్పుడు బావో అదృశ్యం కూడా మిస్టరీగా మారింది.

ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, మానవ హక్కుల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సాధారణ పౌరులు కూడా చైనాలో కనిపించకుండా పోతున్నారు. అయితే, ఇలాంటి కేసులకు బిలియనీర్ల అదృశ్యానికి దక్కినంత ప్రచారం లభించట్లేదు. అందుకే ఇవి ఎక్కువగా వెలుగులోకి రావట్లేదు.

బావో ఫ్యాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బావో ఫ్యాన్

తాజాగా బావో అదృశ్యంతో, చైనా ఆర్థికవ్యవస్థపై తన నియంత్రణను పటిష్టం చేసుకునేందుకు అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అనుసరించే మార్గాలలో పారిశ్రామిక వేత్తలను మాయం చేయడం కూడా ఒకటనే అభిప్రాయాలు మరోసారి బలంగా వినిపిస్తున్నాయి.

2015లో అయిదుగురికి పైగా ఎగ్జిక్యూటివ్‌లు కనిపించకుండా పోయారు. వీరిలో ఫోసన్ ఇంటర్నేషనల్ గ్రూపు చైర్మన్ గువో గ్వాంగ్‌చాంగ్ కూడా ఉన్నారు.

2015 డిసెంబర్ నెలలో గువో కనిపించకుండా పోయారు. ఆయన తిరిగి కనిపించిన తర్వాత, ఇంతకాలం దర్యాప్తు సంస్థలకు ఆయన సహకరించారని ఆయన కంపెనీ ప్రకటించింది.

ఇది జరిగిన రెండేళ్ల తర్వాత హాంకాంగ్‌లోని ఒక విలాసవంతమైన హోటల్‌లో చైనీస్-కెనడియన్ వ్యాపారవేత్త షియావో జిన్వువాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

చైనాలోని అత్యంత ధనికుల్లో ఆయన ఒకరు. అవినీతి ఆరోపణలతో ఆయన గతేడాది జైలుకు వెళ్లారు.

కరోనా మహమ్మారిని నియంత్రించడంలో షీ జిన్‌పింగ్ ఒక ‘విదూషకుడు’ తరహాలోనే వ్యవహరించారని వ్యాఖ్యానించిన రియల్ ఎస్టేట్ టైకూన్, బిలియనీర్ రెన్ జికియాంగ్ 2020 మార్చిలో కనిపించకుండా పోయారు.

ఆ తర్వాత ఏడాది ఆయనపై ఒక రోజు న్యాయ విచారణ జరిపి అవినీతి ఆరోపణలతో 18 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

రెన్ జికియాంగ్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, రెన్ జికియాంగ్

అయితే, ఇలా అదృశ్యమైనవారిలో అత్యంత ఉన్నత స్థాయి గుర్తింపు ఉన్న బిలియనీర్, అలీబాబా గ్రూపు వ్యవస్థాపకుడు జాక్ మా.

అప్పట్లో చైనాలోనే అత్యంత సంపన్నుడైన జాక్ మా 2020 చివర్లో కనిపించకుండా పోయారు. దేశ ఆర్థిక నియంత్రణ విధానాలను విమర్శించిన తర్వాత జాక్ మా కనుమరుగయ్యారు.

రెండేళ్లకు పైగా ఆయన ఎవరికీ కనిపించలేదు. ఆయనపై ఎలాంటి నేరారోపణలు కూడా నమోదు కాలేదు.

ఇటీవలి నెలల్లో జపాన్‌, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియాల్లో జాక్ మా కనిపించారనే వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పటికీ జాక్ మా ఆచూకీపై స్పష్టత లేదు.

దేశంలోని కొంతమంది సంపన్నులపై తీసుకున్న చర్యలు, పూర్తిగా చట్టబద్ధమైనవని చైనా ప్రభుత్వం నొక్కి చెబుతుంది. దేశంలో అవినీతి మూలాల్ని అంతం చేస్తామని చైనా ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసింది.

అయితే, చైనా ప్రభుత్వ చర్యలు దశాబ్దాల నాటి సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

జాక్ మా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జాక్ మా

ఈ సరళీకరణ విధానాలే బిలియనీర్ల సమూహాలు పుట్టుకురావడానికి సహాయపడ్డాయి. బిలియనీర్లు వారి సంపదతో, అధికారం చెలాయించే సామర్థ్యాన్ని అందిపుచ్చుకున్నారు.

ఇప్పుడు షీ జిన్‌పింగ్ నాయకత్వంలోని చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆ అధికారాలను తిరిగి తీసుకునేందుకు ఇలాంటి చీకటి మార్గాలను అనుసరిస్తుందని కొంతమంది పరిశీలకులు అంటున్నారు.

షీ జిన్‌పింగ్ పూర్వీకులు జియాంగ్ జెమీన్, హూ జింటావో విధానాల కారణంగా చైనాలో ముఖ్యంగా సాంకేతిక పరిశ్రమ శక్తిమంతంగా మారింది.

దీనికంటే ముందు చైనా దృష్టి అంతా సంప్రదాయ అధికార కేంద్రాలు అంటే మిలిటరీ, భారీ పరిశ్రమలు, స్థానిక ప్రభుత్వాల మీదే ఉండేది.

ఈ ఏరియాల్లో పట్టును కొనసాగిస్తూనే, ఎనానమీని మరింతగా నియంత్రణలోకి తెచ్చుకోవడంపై షీ జిన్‌పింగ్ తన దృష్టిని విస్తృతం చేశారు.

ఆయన తెచ్చిన ఉమ్మడి పాలసీ, ఎకానమీతో పాటు ముఖ్యంగా సాంకేతిక పరిశ్రమలో కుదుపులకు కారణమైంది.

‘‘చివరకు ఇదంతా ఆర్థిక వ్యవస్థలోని కొంత భాగంపై నియంత్రణ, అధికారాన్ని ప్రదర్శించాలనే ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. గత దశాబ్దానికి పైగా షీ జిన్‌పింగ్ ప్రభుత్వం పాలనా శైలిలో ఇదే కీలక లక్షణంగా ఉంది’ అని ద ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు చెందిన నిక్ మారో, బీబీసీతో చెప్పారు.

షియావో

ఫొటో సోర్స్, CUHK

ఫొటో క్యాప్షన్, చైనీస్-కెనడియన్ వ్యాపారవేత్త షియావో జిన్వువా

పెద్ద సాంకేతిక వ్యవస్థలు, వ్యక్తులు తమ సొంత బ్రాండ్లను అభివృద్ధి చేసుకోకుండా నిరోధించడంపైనే చైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇలా జరిగితే తమకు పాలనలో ఇబ్బందులు ఎదురవుతాయని, బీజింగ్ ప్రాధాన్యతలకు వ్యతిరేకంగా వారు వెళ్లే అవకాశం ఉంటుందని చైనా ప్రభుత్వం భావించింది’’ అని గ్లోబల్ అడ్వైజరీ సంస్థ అల్‌బ్రిట్ స్టోన్‌బ్రిడ్జ్ గ్రూపులో చైనా టెక్నాలజీ పాలసీ హెడ్ పాల్ ట్రియోలో వివరించారు.

బిలియనీర్ల అదృశ్యం చుట్టూ ఉన్న మిస్టరీతో పాటు వ్యాపారం పట్ల చైనా ప్రభుత్వ విధానాలు తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చని ఆయన అన్నారు.

కొత్త వ్యాపార ప్రతిభను ప్రభుత్వ విధానాలు నిరోధించే అవకాశం ఉందని కొంతమంది పరిశీలకులు అంటున్నారు.

‘‘టెక్ బిలియనీర్ల పట్ల ప్రభుత్వ విధానాలు, మరో జాక్ మా తరహాలో ఎదగాలని ఆశిస్తోన్న టెక్ పారిశ్రామికవేత్తలపై మరింత ఒత్తిడిని కలిగిస్తాయి’’ అని ట్రియోలో చెప్పారు.

చైనాలో ప్రైవేటు సెక్టార్ ప్రాధాన్యత గురించి ఈ వారం జరిగిన ఎన్‌పీసీ ప్రసంగంలో షీ జిన్‌పింగ్ నొక్కి చెప్పారు.

ప్రైవేటు సంస్థలు, వ్యాపారవేత్తలు ధనవంతులుగా, బాధ్యతాయుతంగా, నీతిగా, ప్రేమగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పదవి నుంచి దిగిపోవాలంటూ నినాదాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)