చైనా: ప్రభుత్వ ఆంక్షలను నిరసించిన వారు అదృశ్యమవుతున్నారు, ఎందుకు?

చైనా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, టెస్సా వాంగ్, గ్రేస్ సోయి
    • హోదా, బీబీసీ న్యూస్, సింగపూర్

కరోనా మహమ్మారిపై విజయం సాధించినట్టు చైనా ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో నవంబర్‌లో జీరో-కరోనా నిబంధనలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున జరిగిన ఆందోళనలను, ప్రస్తుతం ప్రజలు మెల్లమెల్లగా మరచిపోతున్నారు.

కానీ, దేశం ఈ జ్ఞాపకాలను మరిచిపోయి ముందుకు సాగుతున్న క్రమంలో, ఆందోళనలు చేపట్టిన వారిలో చాలామంది ఇంకా కనిపించడం లేదు.

నిరసనలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ అధికారులే గుట్టుచప్పుడు కాకుండా ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు.

దేశంలో కఠినతరమైన కరోనా విధానాలకు వ్యతిరేకంగా వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు.

చీకటిలో తెల్లటి కాగితాలను పట్టుకుని వారు ఆందోళనలు చేశారు. ఈ ఆందోళనలనే తెల్ల కాగితపు నిరసనలు (వైట్ పేపర్ ప్రొటెస్ట్స్ ) గా చెబుతున్నారు.

అధికారంలో ఉన్న చైనా కమ్యూనిస్ట్ పార్టీకి, ఆ పార్టీ అధినేత జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ఇలాంటి నిరసనలు చేపట్టడం చాలా అరుదు.

ఆ సమయంలో పోలీసు అధికారులు కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ, నెలలు గడుస్తున్నా, కొందరు నిరసనకారులు ఇంకా పోలీసు కస్టడీలోనే ఉన్నట్టు చైనీస్ కార్యకర్తలు చెప్తున్నారు.

ఆందోళనల సమయంలో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని అంతర్జాతీయ హక్కుల సంస్థలు, విదేశీ విశ్వవిద్యాలయాలు కోరుతున్నాయి.

పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి పేర్లను కూడా కార్యకర్తల సంఘాలు విడుదల చేశాయి. వీరిలో బీజింగ్‌తో పాటు షాంఘై, నాన్‌జింగ్, గ్వాంగ్జౌ వంటి ఇతర నగరాల్లో ఆందోళనలు చేసిన వారున్నారు.

అయితే, అదుపులోకి తీసుకున్న వారి గురించి చైనీస్ అధికారులు స్పందించడం లేదు. స్నేహితులను, న్యాయవాదులను ఇంటర్వ్యూలు చేయడం ద్వారా బీజింగ్‌లో అరెస్ట్ చేసిన 12 మంది పేర్లను బీబీసీ వెరిఫై చేసింది.

వారిలో అయిదుగురిని మాత్రమే బెయిల్‌పై విడుదల చేశారు. కస్టడీలో ఉన్న వారిలో నలుగురు మహిళలున్నారు.

పదేపదే ఘర్షణలకు దిగడం, ఆందోళనలకు కారణమవుతున్నారనే కారణంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఆరోపణల కింద గరిష్టంగా అయిదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అయితే, ఈ శిక్షను అసమ్మతిని అణచివేసేందుకు వాడుతున్నారని విమర్శకులంటున్నారు.

‘వారు కార్యకర్తలు కారు’

చైనా

ఫొటో సోర్స్, Getty Images

అరెస్ట్ అయిన వారిలో చాలామంది విద్యాధికులు. వీరిలో కొందరు బ్రిటన్, అమెరికా విశ్వవిద్యాలయాలలో చదువుకున్నారు.

రచయితలు, జర్నలిస్టులు, సంగీతకారులు, టీచర్లు, ఫైనాన్సియల్ ఇండస్ట్రీ ఉద్యోగులు కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నట్లు తెలిసింది.

బీజింగ్‌లో అదుపు తీసుకున్న వారిలో చాలా మంది కళలపై తమకున్న ప్రేమను ఇతర స్నేహితులతో పంచుకునేందుకు, తరచూ బుక్ క్లబ్‌లు, మూవీ థియేటర్లలో కలుసుకునే వారు. పలు అంశాలపై చర్చించుకునే వారు.

వారిలో చాలా మంది మహిళలున్నారు. వీరు స్త్రీవాదులా? లేదా స్త్రీవాద కార్యకలాపాల్లో పంచుకునేవారా? అనే విషయాలపై పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి.

ఇటీవల కాలంలో మహిళల హక్కుల కార్యకర్తలపై చైనా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.

వీరిలో కొందరు కార్యకర్తలు #METOO ఉద్యమకారిణి జియాగ్జికి మద్దతిచ్చారు. అయితే, వారు కార్యకర్తలు కాదని, స్నేహితులు మాత్రమేనని నొక్కి చెప్పారు.

‘‘వీరు కేవలం సమాజంపై శ్రద్ధ కలిగిన యువ సమూహం మాత్రమే. నా స్నేహితురాలి ఆసక్తి కేవలం మహిళల హక్కులపైనే కాదు. మానవ హక్కులపై కూడా ఆమెకు ఆసక్తి ఉంది. హక్కులు కాలరాసినప్పుడు గొంతెత్తి నినదిస్తారు. స్త్రీవాద కార్యకలాపాలతో చేసేదేమీ లేదు’’ అని అరెస్ట్ అయిన వారి స్నేహితుల్లో ఒకరు అన్నారు.

నవంబర్ 27న ఒక వర్గానికి చెందిన కొందరు మహిళలు బీజింగ్‌లో లియాంగ్మా నది వద్ద జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు.

రాత్రంతా మేల్కొని చేపట్టిన ఈ ఆందోళనలను వారు శాంతియుతంగా చేపట్టారు. తమ నిరసనలకు సంకేతంగా ప్రజలు బ్లాంక్ వైట్ పేపర్లను పట్టుకున్నారు.

‘‘అక్కడ వాతావరణం చాలా కాలం పాటు నిరసనలతోనే గడిచింది. అక్కడికి వెళ్లినప్పుడు వారు ఒక ఉద్యమంలో పాల్గొంటున్నారని అనుకోలేదు. భావోద్వేగాలను తెలియజేసే ఉద్యమంగానే వారు భావించారు’’ అని మరో స్నేహితురాలు చెప్పారు.

వారు పోలీసులతో గొడవపడలేదని లేదా తమ అభిప్రాయాలను కటువుగా చెప్పలేదని, ఇది ఇంత సీరియస్ అవుతుందని కూడా ఆందోళనకారులు భావించలేదని అన్నారు.

తమ గుర్తింపును కాపాడటం కోసమే వారు ప్రయత్నించారని స్నేహితులు చెప్పారు.

అయితే ఈ గ్రూప్‌ను పోలీసులు ఎలా గుర్తించారన్నది అస్పష్టంగా ఉంది. నిఘా కెమెరాలు, ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఆందోళనకారుల్ని వారు గుర్తించినట్టు తెలిసింది.

పోలీసులు అదుపు తీసుకున్న వారిలో ఒకరు టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి, ఆ గ్రూప్‌లో 60 మందికి పైగా సభ్యులను చేర్చారు.

ఈ గ్రూప్‌లో చేరిన వారందరూ తమ అసల పేర్లతోనే తమ మొబైల్ నెంబర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకు, వారిలో కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

‘‘ఆమెని అదుపులోకి తీసుకున్నప్పుడు మేమిద్దరం ఫోన్‌లో మాట్లాడుకుంటున్నాం’’ అని తన బాయ్‌ఫ్రెండ్ చెప్పారు. ఆ సమయంలో తన స్నేహితుల్లో కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆమె చెప్పిందని తెలిపారు.

తన మొబైల్ ఫోన్ నుంచి కొంత సమాచారాన్ని డిలీట్ చేయాలని ప్రయత్నించిందని, కానీ ఆమె ఆ పనిచేసే లోపే తనని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.

డిసెంబర్, జనవరిలో ఈ అరెస్ట్‌లు ఎక్కువగా జరిగాయి. ఒకరి తర్వాత మరొకరు అలా స్నేహితులందర్ని అదుపులోకి తీసుకున్నట్లు కార్యకర్తలు చెప్పారు.

తనను అరెస్ట్ చేస్తారని భావించిన కావో జిక్సిన్, ముందుగానే ఒక వీడియో మెసేజ్‌ను తన స్నేహితులకు పంపారు. ఒకవేళ తాను కనిపించకుండా పోతే, దాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయాలని చెప్పారు.

‘‘మేం చేసింది మా అభిప్రాయాలను సరైన విధానంలో తెలియజేయడమే’’ అని కావో తన క్లిప్‌లో తెలియజేశారు. కావో జిక్సిన్ వీడియో క్లిప్ వైరల్‌గా మారింది.

అరెస్ట్‌లను ఖండిస్తోన్న మానవ హక్కుల సంఘాలు

చైనా

ఫొటో సోర్స్, Getty Images

అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ పలు మానవ హక్కుల సంఘాలు, విద్యా సంస్థలు కోరుతున్నాయి. అంతర్జాతీయంగా వారిని విడుదల చేయాలంటూ డిమాండ్ పెరిగింది.

లీ సిఖీ తమ పూర్వ విద్యార్థి అని, ఆమె సంక్షేమంపై తాము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు బ్రిటీష్ యూనివర్సిటీ గోల్డ్‌స్మిత్స్ బీబీసీకి తెలిపింది.

చికాగో యూనివర్సిటీ, న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ(యూఎన్ఎస్‌డబ్ల్యూ) కూడా తమ పూర్వ విద్యార్థులు అరెస్ట్ అయినట్టు ధ్రువీకరించాయి.

లీ సిఖీతో పాటు అదుపులోకి తీసుకున్న నలుగురు నిరసనకారులు జర్నలిస్టులని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ పేర్కొంది.

తమ స్వేచ్ఛ, మానవ హక్కుల గురించి ధైర్యంగా గొంతెత్తిన చైనా యువతరం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని హ్యుమన్ రైట్స్ వాచ్ అన్నది.

అరెస్ట్ అయిన వారికి మద్దతు ఇవ్వాలని ప్రయత్నిస్తోన్న న్యాయవాదులను, స్నేహితులను చైనీస్ అధికారులు బెదిరిస్తున్నారని పేర్కొంది.

పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో చాలా మంది మహిళలే ఉన్నారు. వారు స్త్రీవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారా? అని వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

లైంగిక వేధింపులు, హింసకు గురైన మహిళా బాధితుల హై-ప్రొఫైల్ కేసులు ఇటీవల చైనాలో వెలుగు చూస్తున్నాయి. ఈ కేసుల్లో అధికారులు కఠినంగా వ్యవహరిస్తూ, మహిళా హక్కులకు మద్దతు ఇస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ఉద్యమాలు పెరుగుతున్న కొద్ది, ప్రభుత్వం చర్యలు కూడా కఠినంగా మారుతున్నాయి. 2015లో ఫెమినిస్ట్ ఫైవ్ అనే మహిళల గ్రూప్‌ను ప్రభుత్వం అణచివేసింది. అప్పటి నుంచి తమపై నిఘా పెరిగి, ఆన్‌లైన్‌లో దాడులు పెరిగినట్టు కార్యకర్తలు చెబుతున్నారు.

స్త్రీవాద ఉద్యమాలు విపరీతంగా పెరిగిపోవడాన్ని చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తోంది.

‘‘సామాజిక సామరస్యాన్ని కాపాడటం ప్రభుత్వానికి ఉన్న అతి ముఖ్యకర్తవ్యం. స్త్రీవాద ఉద్యమాలు రాజకీయ విధానంలో ఉన్న స్థిరత్వానికి ముప్పుగా పరిగణిస్తుంటారు’’ అని చైనీస్ జెండర్ పవర్ రిలేషన్స్‌పై అధ్యయనం చేస్తోన్న వార్విక్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆల్ట్‌మ్యాన్ పెంగ్ చెప్పారు.

బెయిల్‌పై బయటికి వచ్చిన వారిపై ఇంకా అభియోగాలు మోపాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కస్టడీలో ఉన్న వారు కొన్ని వారాల పాటు పోలీసుల అదుపులోనే ఉండనున్నారు. వారిపై అభియోగాలు మోపాలా వద్దా అన్నది ప్రాసిక్యూటర్లు నిర్ణయిస్తారని తెంగ్ అన్నారు.

అయితే, అరెస్ట్ అయిన వారి కుటుంబాలు ఈ విషయంపై నోరుమెదపడం లేదు. పోలీసుల అదుపులో ఉన్న వారి స్నేహితులతో కూడా మాట్లాడటం లేదు.

ఒక కుటుంబం తమ కూతురి కేసును వాదించేందుకు ఒక లాయర్‌ను నియమించుకుని, ఆ తర్వాత వెనక్కి తీసుకుంది. దానికి కారణమేమిటన్నది తెలియదు.

వారిపై తీవ్రమైన ఒత్తిడి ఉండటం వల్లనే అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యులు నోరు మెదపడం లేదని హక్కుల కార్యకర్త యాంగ్ జాంగ్‌జింగ్ అన్నారు.

‘‘పోలీసులు క్యారెట్, స్టిక్ విధానాన్ని అనుసరిస్తున్నారు. అంటే మంచిగా ప్రవర్తిస్తే రివార్డును(క్యారెట్‌ను) ఇస్తారు. ఒకవేళ తేడా వేస్తే తాట(స్టిక్) తీస్తారు. వారు నోరు మెదపకుండా ఉంటే త్వరగా విడుదల చేస్తామని అరెస్ట్ అయిన వారి కుటుంబాలకు అధికారులు చెప్పారు. ఒకవేళ అలా ఉండకపోతే, వారి ఉద్యోగాలను, పెన్షన్లను వదులుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు’’ అని యాంగ్ చెప్పారు.

అయితే, ఈ అరెస్ట్‌లపై అంతర్జాతీయంగా విచారణ పెరిగితే, కస్టడీలో ఉన్న వారికి సాయం దొరుకుతుందన్నారు. రాజకీయంగా సున్నితమైన కేసుల్లో, వారిని త్వరగా విడిచిపెట్టడం లేదంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా జైలులో మెరుగైన సౌకర్యాలు అందించడం జరుగుతూ ఉంటుందని యాంగ్ చెప్పారు.

జైళ్లలో ఉన్న వారి స్నేహితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి వ్యక్తిగత రక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాబ్‌లను పెట్టుకుని, సమాచారం ఎప్పటికప్పుడు తమ వారికి అందజేస్తున్నారు.

విదేశాల్లో ఉండి నవంబర్‌ నెలలో జరిగిన ఆందోళనలకు రాలేకయిన చాలా మంది ఆన్‌లైన్ లైవ్‌ ద్వారా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం తమను కూడా లక్ష్యంగా చేసుకుని అరెస్ట్ చేస్తారేమోని భయపడుతున్నారు. తమ స్నేహితుల అరెస్ట్‌లను అంతర్జాతీయ వేదికపైకి తీసుకొస్తున్నారు.

జైలులో ఉన్న ఒక అమ్మాయి మెసేజ్‌ను వారు ఆన్‌లైన్‌లో సర్క్యూలేట్ చేశారు. ఆమె తన స్నేహితులకు పూర్తి భరోసా ఇచ్చారు.

ఖైదీలుగా ఉన్న వారు తమ స్ఫూర్తిని ఏ మాత్రం కోల్పోలేదని ఆ వీడియోలో ఆమె తెలిపారు. ‘‘ మా ఇంటరాగేటర్లు మా చుట్టుపక్కల ఉన్న స్నేహితుల్ని ద్రోహులుగా లేదా శత్రువులుగా చిత్రీకరిస్తున్నారు. కానీ, నేనిప్పటికీ మేమందరం ఒకే తాటిపై ఉన్నట్లు నమ్ముతున్నాను’’ అని ఆమె ఈ వీడియోలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)