స్టాక్ మార్కెట్‌ ద్వారా తక్కువ కాలంలో ధనవంతులు కావొచ్చా? ఇందులో నిజమెంత?

మ్యూచువల్ ఫండ్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఐవీబీ కార్తికేయ
    • హోదా, బీబీసీ కోసం

‘‘మ్యూచువల్ ఫండ్స్ సహీ హై’’ లాంటి మార్కెటింగ్ ప్రవాహం నుంచి అనుభవజ్ఞులైన మదుపరులు నిర్వహించే బూట్ క్యాంప్ దాకా... ఇండెక్స్ ఫండ్స్ నుంచీ ఫ్యూచర్స్-ఆప్షన్స్ వరకు... మదుపు, పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించిన అనేక అంశాలు ప్రస్తుత తరానికి అందుబాటులో ఉన్నాయి.

1990 దశకాన్ని కంప్యూటర్ విప్లవంగా అభివర్ణించినట్లు ప్రస్తుత కాలాన్ని మార్కెట్ విప్లవంగా అభివర్ణించడం అతిశయోక్తి కాదు.

వీటి ఫలితంగా మార్కెట్లో మదుపు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. గత ఏడాది విదేశీ మదుపరులు భారత మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్న మొత్తం రూ. 1,20,000 కోట్లు.

గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సెంటిమెంట్ దెబ్బతిని మార్కెట్ నష్టాల్లోకి వెళ్ళింది.

కానీ, ఈసారి అలాంటి నష్టాలు పెద్దగా కనిపించలేదు. ఎందుకంటే అదే 2022 సంవత్సరంలో దేశీయ చిన్న మదుపరులు మ్యూచువల్ ఫండ్స్ రూపంలో చేసిన మదుపు రూ. 74,000 కోట్లు.

ఇందులో కూడా SIP మార్గంలో చేసిన మదుపు ప్రధానమైన అంశం.

ఒకవైపు పర్సనల్ ఫైనాన్స్ సమాచారం ఇబ్బడి ముబ్బడిగా అందుబాటులో ఉన్నా అవగాహన లేమితో నష్టపోయేవారు కూడా ఉన్నారు.

ఇటీవల వార్తల్లోకి వచ్చిన ప్రముఖ నటుడు అర్షద్ వార్సి వివాదం అలాంటిదే. యూట్యూబ్ ఛానల్ ఆధారంగా జరిగిన ఆ కుంభకోణంలో ఎంతోమంది మదుపరులు తమ కష్టార్జితాన్ని నష్టపోయారు.

ఇలాంటివి జరగకూడదంటే పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్‌కు సంబంధించిన కొన్ని మౌలిక విషయాల గురించి స్పష్టత రావాలి

మదుపు

ఫొటో సోర్స్, Getty Images

1. ఖర్చు లేదా మదుపు

మన బ్యాంక్ ఖాతా నుంచి వేళ్ళే ప్రతీ రుపాయి కూడా ఖర్చు పెడుతున్నామా లేక మదుపు చేస్తున్నామా అనే అవగాహన ఉండాలి.

ఖరీదైన వస్తువులు, ఇతర విలాసాలకు పెట్టే ఖర్చు మన సంపాదనకు అనుగుణంగా ఉందో లేదో చూసుకోవాలి.

ఉదాహరణకు మన సర్కిల్లో ఎవరి దగ్గరో ఖరీదైన ఫోన్ ఉందని మనం కూడా అదే ఫోన్ కొంటె అది ఖర్చు. ఒకవేళ ఆ ఫోన్ ద్వారా మన భవిష్యత్తుకు అవసరమయ్యే కోర్సులు లేదా మరేదైనా ఉపయోగకరమైన పని చేస్తే అది మదుపు.

చాలామంది వేరే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు లేదా వారి జీవన విధానాన్ని గమనించి అలాంటి వాటి కోసం తమ సంపాదన వెచ్చిస్తారు. ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్ సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధం.

మనకు అవసరం లేని వస్తువులు కొనే అలవాటు ఉన్నవాళ్ళు ఏదో ఒకరోజు తమకు అవసరం అయిన వస్తువులు అమ్ముకుంటారు అని వారెన్ బఫెట్ చెప్పిన సూక్తిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

మ్యూచువల్ ఫండ్స్

ఫొటో సోర్స్, Getty Images

2. త్వరగా డబ్బు సంపాదించే మార్గాలు

స్టాక్ మార్కెట్ మదుపు ద్వారా ఎంతో మంది బలమైన ఆర్థిక వనరుల్ని సృష్టించుకున్నారు. కానీ, వారెవరూ తక్కువ వ్యవధిలో ఆ డబ్బు సంపాదించలేదు.

చాలామంది కొత్త మదుపరులు త్వరగా డబ్బు సంపాదించేందుకు స్టాక్ మార్కెట్ ఒక వేదిక అనే అభిప్రాయంలో ఉంటారు. ఇది పూర్తిగా తప్పు. పలానా కంపెనీ షేర్లలో మదుపు చేస్తే ఏడాదికి రెట్టింపు రాబడి వస్తుంది, రెండేళ్ళల్లో మరింత రాబడి వస్తుంది అనే ప్రకటనలు చూస్తూ ఉంటాం.

ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ లేని మదుపు ఉండదు. ఎవరైనా ఎక్కువ డబ్బు తక్కువ వ్యవధిలో వస్తుంది అంటే దానిలో ఏదో ఒక రిస్క్ ఉందనే విషయాన్ని మర్చిపోకూడదు.

అలాగే, ఫ్యూచర్స్-ఆప్షన్స్ పరంగా కూడా పలానా వ్యక్తి ఏడాదిలో తన మదుపు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంపద సృష్టించారు అనే ప్రకటనలు చూస్తూ ఉంటాం.

ఇవి కూడా ఎంతో రిస్క్ ఉన్న మదుపు మార్గాలు. మరోవైపు పర్సనల్ ఫైనాన్స్ సూత్రాల ప్రకారం మదుపు అంటే దీర్ఘకాల పరిమితి కలిగిన అంశం.

మ్యూచువల్ ఫండ్స్

ఫొటో సోర్స్, NORA CAROL PHOTOGRAPHY

3. మన సమయం వెచ్చించకుండా డబ్బు సంపాదించవచ్చు

స్టాక్ మార్కెట్ గురించి ఉన్న అనేక అపోహలలో ఇదీ ఒకటి. స్టాక్ మార్కెట్ అనేది మన జీతం కాకుండా వేరే ఆర్థిక వనరులు సృష్టించుకునే మార్గం అనడంలో తప్పు లేదు. కానీ మన సమయాన్ని వెచ్చించకుండా ఆదాయం వస్తుందని అనడం సరికాదు.

మన మదుపు పట్ల నిబద్ధతతో ఒక బలమైన పోర్ట్ ఫోలియో నిర్మించుకోవడానికి పట్టే సమయం చాలా విలువైనది.

మన ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే వెసులుబాటు వంటి విషయాలన్నీ ఆలోచించుకుని ఆ తర్వాత మన పోర్ట్‌ఫోలియో నిర్మించుకోవాలి.

ఇదంతా మన సమయాన్ని తీసుకుని జరిగే ప్రక్రియ. ఒకసారి పోర్ట్‌ఫోలియో నిర్మించుకున్న తర్వాత కూడా ప్రతీ ఆరునెలలకు ఆ పోర్ట్ ఫోలియో ఎలాంటి ఆదాయం ఇస్తుందో గమనించుకుంటూ ఉండాలి.

ఏదైనా మదుపు మార్గం ద్వారా ఆశించినంత రాబడి రాకుంటే ఆ విషయం గురించి విశ్లేషణ చేసి తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా మన సమయాన్ని వెచ్చిస్తే జరిగే పనులు.

ఇలాంటి వైరుధ్యమైన పరిస్థితుల్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా మొదలుపెట్టాలి అంటే ఈ క్రింద ఇచ్చిన ప్రశ్నలకు నిజాయతీగా సమాధానం ఇవ్వాలి.

వీడియో క్యాప్షన్, క్రెడిట్ స్కోర్ ఎందుకు ముఖ్యం, అది బాగుంటే కలిగే అదనపు ప్రయోజనాలు ఏంటి?

ప్రశ్నలు-సమాధానాలు

1. ఏదైనా అనుకోని ఉపద్రవం సంభవించి మీకు ప్రాణహాని జరిగితే మీ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చే వనరులు అందుబాటులో ఉన్నాయా?

సాధారణంగా ఇలాంటి ఆలోచనలు మానసిక ధైర్యాన్ని దెబ్బతీస్తాయి అంటారు. కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో ఎలాంటి భావోద్వేగాలకు తావు లేదు. ఇది మీ కుటుంబం ఆర్థిక భద్రత గురించి అని మర్చిపోకండి. మీ ఖర్చులకు తగినంత జీవిత బీమా కచ్చితంగా ఉండాలి.

2. ఏదైనా అనుకోని అవాంతరాల వల్ల జీతం వచ్చే ఉద్యోగం లేకపోతే ప్రస్తుత జీవన విధానాన్ని కొనసాగించగలరా?

గవర్నమెంట్ ఉద్యోగులకు ఉన్న ఉద్యోగ భద్రత, ప్రైవేట్ ఉద్యోగులకు ఉండదు. 2008 లాంటి ఆర్థిక సంక్షోభం ఎంతో మంది ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసింది. అలాంటి పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువే కానీ అదొక గుణపాఠంగా తీసుకుని ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి.

3. మీ ప్రస్తుత ఆర్థిక వనరుల ద్వారా మీ పిల్లల ఉన్నత చదువులకు సరిపడినంత రాబడి అందుతుందా?

ఇది ఒక ఊహాజనితమైన ప్రశ్నలా అనిపించవచ్చు. కానీ, ప్రస్తుత తరం వారు తమ జీవిత కాలంలో చేసే అతి పెద్ద ఖర్చు పిల్లల చదువు అంటే అతిశయోక్తి కాదు. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని మీ పిల్లల గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సమయానికి తగిన ఆర్థిక వనరులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.

4. మీ రిటైర్మెంట్ జీవనం కూడా ఇప్పుడు ఉన్నంత సౌకర్యంగా ఉండే ఆర్థిక వనరులు ఉన్నాయా?

చాలామంది రిటైర్మెంట్ జీవనం ఇంకా మాకు చాలా దూరంలో ఉందనే అపోహలో ఉంటారు. కానీ, పర్సనల్ ఫైనాన్స్ సిద్దాంతాల ప్రకారం మనం తప్పించుకోలేని ఖర్చు గురించి తెలిసినప్పుడు దానికి తగిన విధమైన కార్యాచరణ ఉండాలి

5. మీ కుటుంబంలో వంశపారంపర్యంగా వచ్చే రుగ్మతలు ఏమైనా ఉన్నాయా?

ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇలాంటి రుగ్మతలు నలభై దాటాక కానీ బయటపడవు. అలాంటి సమయంలో బీమా దొరకడం కూడా కష్టం. కాబట్టి కుటుంబ చరిత్రలో రుగ్మతలు ఉన్నవారు ముందే కవరేజ్ ఎక్కువగా ఉన్న పాలసీ తీసుకోవడం చెప్పదగిన సూచన.

(నోట్: ఈ కథనం అవగాహన కోసం మాత్రమే)

వీడియో క్యాప్షన్, రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేసే మార్గాలివి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)