బడ్జెట్: మహిళలకు ఉన్న ప్రత్యేక ప్రయోజనాలు ఏంటి

ఫొటో సోర్స్, DEV IMAGES
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఐదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున అందరి చూపు ఈ బడ్జెట్‌పైనే పడింది.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇదే పూర్తి స్థాయి చివరి బడ్జెట్.
సుమారు గంటన్నర సేపు బడ్జెట్ ప్రసంగం చేశారు నిర్మలా సీతారామన్.

ఫొటో సోర్స్, DEEPAK SETHI
ఈ బడ్జెట్‌లో మహిళలకు ఏం ఇచ్చారు?
కేంద్ర బడ్జెట్ 2023-24లో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.25,448.75 కోట్లు కేటాయించారు. 2022-23లో కేటాయింపుతో పోలిస్తే రూ.267 కోట్లు పెంచారు.
ఈ బడ్జెట్లో మహిళలు, బాలికలకు మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన పథకం ప్రకటించారు.
ఈ పథకం కింద మహిళలు రెండేళ్లపాటు 2 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. దీని మీద 7.5% వడ్డీ వస్తుంది.
ఇందులో పాక్షిక ఉపసంహరణ సదుపాయం కూడా ఇచ్చారు. చిన్న పొదుపులను పెంచుకోవడానికి ఇది మంచి మార్గంగా నిపుణులు పేర్కొంటున్నారు.
సీనియర్ ఎకనామిక్ జర్నలిస్ట్ మధురేంద్ర సిన్హా మాట్లాడుతూ "ఇది మహిళలు, బాలికలకు మంచి పథకం. మధ్యమధ్యలో డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కూడా బాగానే ఉంది. ఎందుకంటే చాలా సార్లు ఇంట్లో అవసరం ఏర్పడుతుంది. కానీ వర్కింగ్ మహిళలకు పన్ను మినహాయింపు ఇచ్చి ఉండాల్సింది'' అన్నారు.
దీంతో పాటు మహిళా సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సౌకర్యాలపై నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు.
దీన్ దయాళ్ అంత్యోదయ యోజన- జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద 81 లక్షల స్వయం సహాయక సంఘాలతో లింక్ చేస్తారు.
దీంతో పాటు పెద్ద మార్కెట్‌లో వస్తువులను అమ్ముకునేలా ఈ మహిళలను ఆర్థిక స్వావలంబనతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
సీనియర్ జర్నలిస్ట్ హేమా రామకృష్ణన్ మాట్లాడుతూ “మహిళల సాధికారత కోసం ఇటువంటి విధానాలను తీసుకురావడం అభినందనీయం. కానీ వారు సంప్రదాయ పాత్రలకే పరిమితం కాకూడదు. కొత్త నైపుణ్యాలను కూడా నేర్పించాలి. అదే సమయంలో మహిళల భాగస్వామ్యానికి సంబంధించి జెండర్ గ్యాప్ కనిపిస్తుంది. అది తగ్గించడానికి కృషి చేయాలి'' అన్నారు.

ఫొటో సోర్స్, ANI
సీనియర్ సిటిజన్ల కోసం ఏం ప్రకటించారు?
సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లేదా ఎస్‌సీఎస్‌ఎస్ కింద ఉమ్మడి పెట్టుబడి పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు.
గతంలో భార్యాభర్తల ఉమ్మడి ఖాతా పరిమితి రూ.15 లక్షల వరకు ఉండేది.
ఒంటరి సీనియర్ సిటిజన్ ఖాతా ఉంటే అందులోనూ పరిమితిని రూ.4.50 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు.
అయితే ఈ పరిమితిని పెంచడంపై సీనియర్ ఎకనామిక్ జర్నలిస్ట్ మధురేంద్ర సిన్హా ప్రశ్నలను లేవనెత్తారు. ''ఎంతమంది సీనియర్ సిటిజన్‌ల వద్ద ఇంత పెద్ద మొత్తం ఉంది?
ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాలలో ఉన్నత స్థానంలో ఉన్న వారు మాత్రమే ప్రయోజనం పొందుతారు.
అటువంటి పరిస్థితిలో ఇది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనకరంగా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే రూ. 30 లక్షల మూలధనాన్ని డిపాజిట్ చేయడం సామాన్యుడికి చాలా కష్టం'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, DEEPAK SETHI/GETTY IMAGES
ఒంటరి మహిళల కోసం ప్రకటనేది?
పరిశోధనల కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ల్యాబ్‌లను విస్తరించడంపై ఆర్థిక మంత్రి మాట్లాడారు.
ఐసీఎంఆర్ భారత ప్రభుత్వం క్రింద పని చేస్తుంది. 157 కొత్త నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు.
2047 నాటికి సికిల్ సెల్ ఎనీమియా (రక్తహీనత)ను నిర్మూలించేందుకు మిషన్ ప్రారంభిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు.
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 డేటా ప్రకారం భారతదేశంలో 5 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 67 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
అయితే 15-49 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో 57 శాతం మందికి రక్తహీనత ఉంది. రక్తం లేకపోవడం వల్ల చాలా మంది చనిపోతున్నారని కూడా మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు.
జాతీయ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తామని, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక లైబ్రరీల ఏర్పాటుపై దృష్టి సారిస్తామని బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ వెల్లడించారు.
రానున్న మూడేళ్లలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 38,800 మంది ఉపాధ్యాయులను నియమించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
అయితే నిర్మలా సీతారామన్ మహిళ కాబట్టి మహిళలకు పన్ను మినహాయింపు కోసం ప్రత్యేక ఏర్పాటు చేసి ఉండాల్సిందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ బడ్జెట్‌లో ఒంటరి మహిళల గురించి ఆర్థిక మంత్రి ఆలోచించి ఉండాల్సిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఇవి కూడ చదవండి:
- కల్పనా చావ్లా: కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ కూలిపోతుందని నాసాకు ముందే తెలుసా... ఆ రోజు ఏం జరిగింది
- అదానీ గ్రూప్: ఎల్ఐసీ పెట్టుబడులపై ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి
- నిన్న ఆనం, నేడు కోటంరెడ్డి... నెల్లూరు వైసీపీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోందా
- దావూద్ ఇబ్రహీం: మాఫియా డాన్ హైదరాబాద్ గుట్కా కంపెనీ కథ ఏమిటి? మాణిక్ చంద్, జేఎం జోషి వివాదంలో దావూద్ పాత్ర ఏమిటి?
- పాకిస్తాన్: కిలో ఉల్లిపాయలు రూ.250... ‘కోయకుండానే కళ్లల్లో నీళ్లు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














