ఆస్కార్ 2023: కూతుర్ని 16 ఏళ్లు ఇంటర్వ్యూ చేశాడు.. ఆ షార్ట్ ఫిల్మ్‌ ఆస్కార్ రేసులో నిలిచింది

రోసెన్‌బ్లాట్, ఎల్లా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కూతురు ఎల్లాతో జో రోసెన్‌బ్లాట్

ఆలోచనల కంటే సాంకేతికత ఎప్పటికీ ముఖ్యమైనది కాదు, ప్రత్యేకించి ఈ ఆలోచనలు ప్రేమతో రూపొందితే దానికి ఏదీ సాటిరాదు.

జే రోసెన్‌ బ్లాట్ (68) అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంటారు. ఆయన కూతురు పేరు ఎల్లా. రెండు దశాబ్దాల క్రితం ఎల్లా ప్రతీ పుట్టినరోజున వీడియో చిత్రీకరణ చేయాలని ఆ తండ్రి నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఎల్లాకి 2 సంవత్సరాలు.

రోసెన్‌ బ్లాట్ ఒక చిత్ర నిర్మాత. తన కళాత్మక వృత్తిని విడిచిపెట్టకుండా తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని ఆయన భావించేవారు.

అందుకే తన కుమార్తె ప్రతి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంట్లో కెమెరాను ఆన్ చేసి, ఆమెకు సాధారణ మైక్రోఫోన్‌ను సెట్ చేసేవారు.

కూతుర్ని బెడ్ మీద కూర్చోబెట్టి, ప్రతీసారి అవే ప్రశ్నలను అడిగేవారు.

దాని ఫలితమే 'హౌ డు యు మెజర్ ఏ ఇయర్?'. అదే ఆయన కుటుంబ సంబంధాలు, మానవ అభివృద్ధి, పితృత్వాన్ని తెలిపే షార్ట్ ఫిల్మ్.

రోసెన్‌బ్లాట్

ఫొటో సోర్స్, Getty Images

ఆస్కార్ బరిలో నిలిచిన తండ్రీకూతుళ్ల జ్ఞాపకాలు

రోసెన్‌బ్లాట్ స్వయంగా 16 ఏళ్లుగా చిత్రీకరించిన ఈ వీడియో ఉత్తమ షార్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్‌కి నామినేట్ అయింది.

"నేను నిజం కావాలనుకున్నాను. ఇది మా ప్రత్యేక సంబంధం అని ప్రజలు భావించాలని కోరుకున్నా.పిల్లలు, తల్లిదండ్రుల వారి అనుబంధాలను గుర్తించగలగాలి" అని 2021లో షార్ట్ ప్రీమియర్ అయినప్పుడు రోసెన్‌బ్లాట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇది ఖచ్చితంగా నిరాడంబరత్వమే, అయితే ఆయన పనితీరు మాత్రం విమర్శకుల దృష్టిని ఆకర్షించింది.

రోజర్ ఎబెర్ట్ అనే పోర్టల్ ప్రకారం గతేడాది ఈ దర్శకుడి 'వెన్ వి ఆర్ బుల్లీస్' డాక్యుమెంటరీ ఇదే విభాగంలో ఆస్కార్‌కి నామినేట్ అయింది.

ఇందులో ఆయన వ్యక్తిగత కథను కూడా అన్వేషించారని చెప్పినప్పటికీ మిగతావాటికంటే ఆయన గురించే డాక్యుమెంటరీలో ఎక్కువుందని తెలిపింది.

"ఇది మరీ అంతలా లేదు. కానీ ఆయన గెలిస్తే ఆశ్చర్యపోకండి" అని పోర్టల్ అంటోంది.

ఎల్లా

ఫొటో సోర్స్, SCREENSHOT

వీడియో చిత్రీకరణ ఎలా జరిగేది?

డాక్యుమెంటరీలో గది డిజైన్ ప్రతీసారి ఒకే విధంగా ఉంటుంది, ఒక సోఫా, ఒక సాధారణ అమెరికన్ లివింగ్ రూం, గోడ పూలతో అలకరించి ఉంటుంది.

అయితే దాదాపు ప్రతి షాట్‌లోనూ రోసెన్‌బ్లాట్ ఆయన కుమార్తె ముఖాన్ని ఎక్కువగా చూపిస్తారు. ఇక అమ్మాయి నవ్వుతుంది, దూకుతుంది. కొన్నిసార్లు కళ్లు కూడా తిప్పుతుంది.

సంవత్సరాలు గడిచేకొద్దీ, ఆమె తనను తాను విభిన్నమైన హెయిర్‌స్టైల్స్‌తో కాలానుగుణంగా చూసుకుంటుంది.

ఆమె తన తండ్రి పట్ల తన వైఖరిని కూడా మార్చుకుంటుంది.

చిన్నతనంలో కెమెరాను ఇష్టపడేవారు. యుక్తవయసులో కొన్నిసార్లు ప్రతిదీ త్వరగా చేయమని అడిగేవారు.

తరువాత తన కుటుంబం పట్ల ప్రేమతో కూడిన మాటలు చూసి పొంగిపోయేవారు.

దర్శకుడి వరకైతే ఆమెను తేలికైన ప్రశ్నలనే అడుగుతున్నట్లు భావిస్తాడు, కానీ ఆ అమ్మాయికి అవి అలా అయితే ఉండవు.

ఎల్లా

ఫొటో సోర్స్, SCREENSHOT

కూతురు సమాధానాల్లో ఎలాంటి తేడాలుండేవి?

"నీ వయస్సు ఎంత?" లేదా "డ్రీమ్స్ ఏమిటి?" అని అడిగేవారు.

ఆమె కొన్నిసార్లు హాస్యాస్పదంగా, మరికొన్ని సార్లు చాలా తెలివిగా, కొన్నిసార్లు బాధాకరమైన స్పందన తెలియజేసేది.

ఆమె 9 ఏళ్లపుడు తన తండ్రికి సమాధానాలు చెప్పినప్పుడు భయపడింది. ఏదైనా తేడాగా చెబుతున్నానా? సరిపోతుందా? అనుకునేది.

కానీ 11 ఏళ్ల వయస్సులో ఆమె అదే ప్రశ్నకు సమాధానమిచ్చింది. "నాకు జీవితం అంటే భయం, బతకడానికి భయపడుతున్నా. ఎందుకంటే మనం ఊహించని మలుపులు ఉంటున్నాయి. అవి కఠినంగా ఉంటాయి. నాకు వద్దు. అలా వెళ్లడం నాకు ఇష్టం లేదు" అని వ్యాఖ్యానించింది.

ఆమె వ్యాఖ్యలను చూస్తే ఆమె వయస్సుకి తగినట్లుగా పరిణతి చెందుతోందని అర్థమవుతోంది. యుక్తవయస్కురాలి మనస్సు ఎంత క్లిష్టంగా ఉంటుందో చెబుతుంది.

ఎల్లా

ఫొటో సోర్స్, SCREENSHOT

18 ఏళ్ల వరకూ ఇంటర్వ్యూ

రోసెన్‌బ్లాట్ యూట్యూబ్ ఛానెల్ ఫిల్మ్‌మేకర్ ఫెస్ట్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏళ్లుగా తేడాలను చూడటం చాలా ఆసక్తికరంగా అనిపించిందన్నారు.

భావోద్వేగాలు ఎలా మారాయి? ఏడాది తర్వాత తనను తాను ఎలా విభిన్నంగా వ్యక్తీకరించుకున్నారు? కొన్ని సందర్భాల్లో వద్దనుకున్నా కమ్యూనికేట్ చేయడం కష్టం అనిపిస్తుందంటూ తెలిపారు.

డాక్యుమెంటరీ కూడా వారి రిలేషన్‌కు సంబంధించిన చిత్రం. ఉదాహరణకు కొన్నిసార్లు యువతి తన తగాదాల గురించి, వారు ఎలా రాజీపడతారో వీడియోలో మాట్లాడుతుంది.

సంవత్సరాల తరబడి సింపుల్‌గానే వీడియో ఎడిట్ చేశారు. ఎల్లా ఈ సారి ప్రశ్నలు లేకుండానే వీడియో ముందుకు వచ్చారు.

ఎల్లా ఇప్పుడు యూనివర్సిటీలో చదువుతున్న 18 ఏళ్ల అమ్మాయి. ఆమె మాట్లాడుతూ "నేను యూనివర్సిటీకి వెళ్లినప్పుడు నేను నిన్ను మిస్ అవుతాను.

మీరు ప్రతీ ఏడాది ఇలా చేస్తున్నందుకు సంతోషిస్తున్నా. అవి నన్ను సంతోషపరుస్తాయి. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు గుర్తుచేస్తాయి" అని తెలిపారు.

రోసెన్‌బ్లాట్

ఫొటో సోర్స్, Getty Images

గ్రాడ్యుయేషన్ చేస్తుండగా 'మనుసు మార్చుకున్న దర్శకుడు'

రోసెన్‌బ్లాట్ 'హౌ డు యు మెజర్ ఏ ఇయర్?'ను కామెడీ డాక్యుమెంటరీగా, ఆయన మునుపటి వాటి కంటే చాలా సరళమైన పనిగా విమర్శకులు అభివర్ణించారు.

''నా ఇతర సినిమాలు చాలా సీరియస్ సబ్జెక్ట్‌లతో చాలా హెవీగా ఉండేవి’’ అని రోసెన్‌బ్లాట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

దర్శకుడి వెబ్‌సైట్‌లో చిత్రాలు జీవిత చరిత్రను చెబుతాయి. భావోద్వేగాలు, మనస్తత్వాన్ని అన్వేషించేలా ఉంటాయి.

ఫిల్మ్ మేకర్ కావడానికి ముందు రోసెన్‌బ్లాట్ థెరపిస్ట్, కౌన్సెలింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండటం కూడా వీటికి కారణం కావచ్చు.

గ్రాడ్యుయేషన్ చేస్తున్నపుడు ఎలెక్టివ్ సబ్జెక్ట్‌గా 'ఫిల్మ్' ఎంపిక చేసుకున్న తర్వాత, తన ప్రధాన సబ్జెక్ట్స్ మార్చాలని నిర్ణయించుకున్నారు రోసెన్‌.

"నేను అక్కడ ఫిల్మ్ క్లాస్ తీసుకున్నాను. దానితో ప్రేమలో పడ్డాను.

నా కౌన్సెలింగ్ క్లాస్‌లలోని అన్ని పనుల కంటే ఈ చిన్న ప్రాజెక్ట్‌లకే ఎక్కువ సమయం వెచ్చించాను" అని ఫిల్మేకర్ ఫెస్ట్‌లో రోసెన్‌బ్లాట్ గుర్తుచేసుకున్నారు.

తరువాత రోసెన్‌బ్లాట్ సినిమాలో రెండో మాస్టర్స్ డిగ్రీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫలితంగా 100 కంటే ఎక్కువ అవార్డులు వచ్చాయి.

అలాగే ఆస్కార్ నామినేషన్లతో పాటు సన్ డ్యాన్స్ వంటి ప్రముఖ వేడుకలలో పాల్గొన్నారు.

రోసెన్‌బ్లాట్ 'హౌ డు యు మెజర్ ఏ ఇయర్?' సినిమా ఆయన ఎంతవరకు చేస్తారో తెలియకుండానే ప్రారంభించారు.

కరోనా సమయం వరకు ఆయనకు మెటీరియల్ చూడటానికి, సమీకరించడానికి సమయం దొరకలేదు. ఇప్పుడు అన్వేషణ కొనసాగిస్తానని చెప్పారు.

అయితే తన దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదని రోసెన్‌బ్లాట్ ఇటీవల స్పష్టంచేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)