ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే ఇక్కడ మీకు దొరకొచ్చు

మహిళలు

ఫొటో సోర్స్, Trilok

    • రచయిత, ఎ. కిశోర్‌బాబు
    • హోదా, బీబీసీ కోసం

ప‌ట్టా చేత‌ప‌ట్టుకుని కొలువు కోసం ఎదురు చూసే యువ‌త‌కు ప్ర‌ధానంగా ఎదుర‌య్యే స‌మ‌స్య‌...ఉద్యోగాలు ఎక్క‌డున్నాయి? ఖాళీలు ఎక్క‌డున్నాయి? అని తెలుసుకోవ‌డ‌మే.

ఇదిగో ఇక్క‌డ జాబ్ ఉంది, అక్క‌డ ఖాళీ ఉందంటూ ర‌క‌ర‌కాల జాబ్ పోర్ట‌ళ్లు, ర‌క‌ర‌కాల కెరీర్ గైడెన్స్ సంస్థ‌లు అభ్య‌ర్థుల‌ను ఆక‌ర్షిస్తూ వేల‌కు వేలు ఫీజుల రూపంలో వసూలు చేస్తుంటాయి.

వీటిల్లో డ‌బ్బు క‌ట్టి మోస‌పోయిన‌, మోస‌పోతున్న యువ‌త చాలా ఎక్కువే. ఈ ప‌రిస్థితుల్లో పైసా ఖ‌ర్చు లేకుండా మీ అర్హ‌త‌ల‌ను బ‌ట్టి మీకు ప్రైవేటు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో ఉద్యోగావ‌కాశాల‌ను క‌ల్పించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం నేష‌న‌ల్ కెరీర్ స‌ర్వీసు (National Career Service - NCS) పోర్ట‌ల్‌ను నిర్వ‌హిస్తోంది.

ఇందులో ప్రైవేటు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లోని ఖాళీలే కాకుండా, విదేశీ ఉద్యోగాల వివ‌రాల‌ను కూడా అందిస్తోంది.

ఫుల్‌టైమ్‌, పార్ట్ టైమ్‌, వ‌ర్క్ ఫ్రం హో ఇలా వివిధ కేట‌గిరీల్లో దాదాపు 3.66 ల‌క్ష‌ల‌కు పైగా ఖాళీల‌ను ఈ పోర్ట‌ల్ చూపిస్తోంది.

మ‌రి ఈ నేష‌న‌ల్ కెరీర్ స‌ర్వీస్ (National Career Service - NCS) అంటే ఏమిటి? అందులో ఎలా న‌మోదు చేసుకోవాలి? ఉద్యోగాలు ఎలా వెతుక్కోవాలి? ద‌ర‌ఖాస్తు చేసుకునే విధానం ఏమిటి? త‌దిత‌ర వివ‌రాల్ని ఇక్కడ తెలుసుకుందాం....

నేషనల్ కెరీర్ సర్వీస్

ఫొటో సోర్స్, NCS WEBSITE

నేష‌న‌ల్ కెరీర్ స‌ర్వీస్ అంటే ఏమిటి?

ఇది కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించే ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీ. దేశంలోని పౌరుల‌కు వారి కెరీర్ సంబంధిత అంశాల‌కు ఇది వన్ స్టాప్ ప‌రిష్కార వేదిక.

2015 జులై 20వ తేదీన కేంద్ర ప్ర‌భుత్వం ఈ నేష‌న‌ల్ కెరీర్ స‌ర్వీసును ఐదేళ్ల పాటు మిష‌న్ మోడ్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. కేంద్ర ప్ర‌భుత్వ కార్మిక, ఉద్యోగ క‌ల్ప‌న మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్ట్‌ను అమ‌లు చేస్తోంది.

ఉద్యోగాలు వెతుక్కునే వారికి, ఇటు అభ్య‌ర్థుల కోసం చూసే సంస్థ‌లకు మ‌ధ్య ఈ పోర్ట‌ల్ ఒక వార‌ధిలా పనిచేస్తోంది.

ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్య‌ర్థుల‌కు కేవ‌లం ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించ‌డ‌మే కాకుండా వారు ఉద్యోగం పొందేందుకు అవ‌స‌ర‌మైన కెరీర్ గైడెన్స్‌, ఉద్యోగ మేళాలను ఉచితంగా నిర్వహిస్తోంది.

దేశంలోని అన్ని రాష్ట్రాల ఉద్యోగ క‌ల్ప‌నా కార్యాల‌యాలు(Employment Exchanges) ఈ నేష‌న‌ల్ కెరీర్ స‌ర్వీస్ పోర్ట‌ల్‌తో అనుసంధానమై ఉంటాయి.

ఎంప్లాయిమెంట్ ఎక్సేంజీలతో సంబంధం లేకుండా అభ్య‌ర్థులు నేరుగా ఈ పోర్ట‌ల్‌లో ఉద్యోగం కోసం న‌మోదు చేసుకోవ‌చ్చు.

ఇలా తమ పేర్లను నమోదు చేసుకున్న వారి వివరాలను సంస్థ‌ల‌కు, ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్లకు అంద‌జేసి అభ్య‌ర్థులు త‌గిన ఉద్యోగావ‌కాశాలు పొందేలా సహకరిస్తోంది.

నేషనల్ కెరీర్ సర్వీస్

ఫొటో సోర్స్, NCS WEBSITE

నేష‌న‌ల్ కెరీర్ స‌ర్వీసు పోర్ట‌ల్‌లో న‌మోదు చేసుకోవ‌డానికి విద్యార్హ‌త‌లు ఏమిటి?

ఎలాంటి క‌నీస విద్యార్హ‌త అవ‌స‌రం లేదు.

చ‌దువుకోని వారి నుంచి ఉన్నత విద్య అభ్యసించిన వారి వ‌ర‌కు నిరుద్యోగులు ఎవ‌రైనా ఈ పోర్ట‌ల్‌లో తమ పేర్లను న‌మోదు చేసుకోవ‌చ్చు.

నిరుద్యోగులు

ఫొటో సోర్స్, Getty Images

క‌నీస వ‌యో ప‌రిమితి ఉందా?

14 సంవ‌త్స‌రాల వ‌య‌సు పైబ‌డిన వారంద‌రూ ఈ పోర్టల్‌లో తమ పేర్లను న‌మోదు చేసుకోవ‌చ్చు.

నేష‌న‌ల్ కెరీర్ స‌ర్వీసు పోర్ట‌ల్‌లో నమోదు చేసుకోవ‌డానికి కావాల్సిన క‌నీస వివ‌రాలు ఏమిటి?

మీ పేరు, పుట్టిన తేదీ, మీ విద్యార్హ‌త‌లు, మీకున్న నైపుణ్యాలు వంటి క‌నీస వివ‌రాలు ఇస్తే చాలు.

వాటితోపాటు ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, యూఏఎన్ నంబర్లలో ఏదో ఒక్కటి ఉంటే చాలు. మీ పేరును ఈ పోర్టల్‌లో న‌మోదు చేసుకోవ‌చ్చు.

నేషనల్ కెరీర్ సర్వీస్

ఫొటో సోర్స్, NCS WEBSITE

రిజిస్ట్రేష‌న్ చేసుకునే విధానం

అభ్య‌ర్థి ఎవ‌రైనా స‌రే ముందుగా నేష‌న‌ల్ కెరీర్ స‌ర్వీసు పోర్ట‌ల్‌ను సంద‌ర్శించాలి.

https://www.ncs.gov.in/_layouts/15/NCSP/Registration.aspx క్లిక్ చేసి ఆన్‌లైన్‌లో మీ వివ‌రాలు న‌మోదు చేయాలి.

లేదా మీకు ద‌గ్గ‌ర్లోని మోడ‌ల్ కెరీర్ సెంట‌ర్ (Employment Exchange) లేదా పోస్టాపీసును సంద‌ర్శించి సంబంధిత అధికారి సాయంతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

పోర్ట‌ల్‌లోకి వెళ్ల‌గానే రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చా?

పోర్ట‌ల్‌లో మీకు ప‌లు ర‌కాల విండోస్ క‌నిపిస్తుంటాయి. జాబ్ సీక‌ర్‌, ఎంప్లాయిర్‌, ప్లేస్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ లాంటి విండోలు క‌నిపిస్తాయి.

  • ఉద్యోగావ‌కాశాల కోసం న‌మోదు చేసుకునే వారు Jobseeker అనే విండోపై క్లిక్ చేయాలి.
  • అందులో మీరు జాబ్ సీక‌ర్‌గా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి.
  • రిజిస్ట్రేష‌న్ కోసం పోర్ట‌ల్‌లో అడిగిన వివ‌రాల‌న్ని న‌మోదు చేయాలి.
  • వివ‌రాల‌న్ని ఇచ్చాక మీకు ఒక యూజ‌ర్ ఐడీ క్రియేట్ అవుతుంది.
  • మీ మొబైల్ నెంబ‌రుకు ఒక ఓటీపీ వ‌స్తుంది
  • దాని ద్వారా మీరు అందులో లాగిన్ అవ్వ‌చ్చు.
నిరుద్యోగులు

ఇతర ప్రశ్నలు-సమాధానాలు

1. పోర్ట‌ల్‌లో నేను న‌మోదు చేసుకున్నాన‌ని నాకు తెలిసేదెలా?

ఈ పోర్టల్‌లో మీరు విజ‌య‌వంతంగా రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తి చేయ‌గానే మీ మొబైల్‌కు ఎన్‌సీఎస్ గుర్తింపు నంబ‌రుతో ఒక ఎస్ఎంఎస్ వ‌స్తుంది.

ఇప్ప‌టికే ఎంప్లాయీమెంట్ ఎక్సేంజీలో న‌మోదు చేసుకున్న‌వారు మ‌ళ్లీ కొత్త‌గా ఈ పోర్ట‌ల్‌లో న‌మోదు చేసుకోవ‌చ్చా?

త‌ప్ప‌కుండా న‌మోదు చేసుకోవ‌చ్చు. కాకుంటే ఎంప్లాయిమెంటు ఎక్స్చేంజీ మీ రిజిస్ట్రేష‌న్ నంబర్‌ను ఇందులో పొందుప‌రిస్తే చాలు.

2. ఎన్‌సీఎస్ రిజిస్ట్రేష‌న్ చేసుకోగానే ఉద్యోగం వ‌చ్చేస్తుందా?

వెంట‌నే రాదు. మీ ద‌ర‌ఖాస్తును ఎన్‌సీఎస్ పరిశీలించి, మీ ప్రొఫైల్‌ను వివిధ సంస్థ‌ల రిక్రూట్‌మెంట్ కోసం అందుబాటులో ఉంచుతుంది.

మీ అర్హ‌త‌ల‌ను బ‌ట్టి ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించే సంస్థ నుంచి మీకు కాల్ లెట‌ర్ వ‌చ్చేలా చూస్తుంది.

3. పోర్ట‌ల్‌లోకి వెళ్ల‌గానే దరఖాస్తు చేసుకోవ‌చ్చా?

వెతుక్కోవ‌చ్చు. ఇందులో మీరు రిజిస్ట్రేష‌న్ చేసుకున్న త‌రువాత ఫైండ్ జాబ్ అనే విండో ఉంటుంది. అందులోకి వెళ్తే అక్క‌డ మీకు ఆస‌క్తి ఉన్న రంగాల్లో ఉద్యోగ ఖాళీలు, ఆ సంస్థ‌ల వివ‌రాలు ఉంటాయి.

అక్క‌డే వాటికి అప్లయి బ‌ట‌న్ క్లిక్ చేయ‌డం ద్వారా ఆన్‌లైన్‌లోనే మీరు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

4. ఉద్యోగాలిచ్చే సంస్థ నుంచి నేరుగా కాల్ వ‌స్తుందా?

రాదు. కేవ‌లం ఆ సంస్థ ఆ ఉద్యోగాల‌కు సంబంధించి ఎప్పుడు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తోంది, ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి చివ‌రి తేదీ ఎప్పుడు వంటి వివ‌రాల‌తో కూడిన ఎస్ఎంఎస్ అలర్ట్ మాత్రమే వ‌స్తుంది.

మీ ప్రొఫైల్ ఆ సంస్థ‌కు న‌చ్చితే మీకు ఆ సంస్థ నేరుగా కాల్ లెట‌ర్ పంపుతుంది.

5. ఉద్యోగం పొంద‌డానికి ఇంట‌ర్వ్యూ కాల్ లెట‌ర్ కోసం ఏమైనా డ‌బ్బు చెల్లించాలా?

ఎన్‌సీఎస్ పోర్ట‌ల్‌కు సంబంధించి న‌యాపైసా కూడా చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.

మొత్తం ప్ర‌క్రియ అంతా ఉచితం.

6. ఉద్యోగ మేళాలు, ఇంట‌ర్వ్యూల షెడ్యూళ్ల గురించి తెలియ‌జేస్తారా?

త‌ప్పకుండా తెలియ‌జేస్తారు. ఎక్క‌డెక్క‌డ ఎప్పుడెప్పుడు జాబ్ మేళాలు నిర్వ‌హిస్తున్నారో తెలియ‌జేస్తారు. అందులో అభ్య‌ర్థులు ఎవ‌రైనా పాల్గొన‌వ‌చ్చు.

అలాగే ప‌లు ఉద్యోగాల‌కు సంబంధించి ఇంట‌ర్వ్యూల షెడ్యూళ్ల వివ‌రాలు కూడా అభ్య‌ర్థుల ఫోన్‌కు మెసేజ్ పంపుతారు.

7. ప్ర‌భుత్వ ఉద్యోగాల గురించి ఇందులో ఉంటాయా?

ప్ర‌భుత్వ ఉద్యోగ ఖాళీల గురించి కూడా ఇందులో ఉంటాయి

8. నేను నివసించే ప్రాంతంలో ఉద్యోగావ‌కాశాల గురించి ఉంటాయా?

ఉంటాయి. మీరున్న ప్రాంతం, మీ రాష్ట్రంలో ఆయా రంగాల్లో, ఆయా సంస్థ‌ల్లో ఉన్న ఖాళీల గురించి పూర్తి వివ‌రాలు ఇందులో ఉంటాయి.

9. ప్లేస్‌మెంటు సంస్థ‌ల మోసాలను గుర్తించ‌డం ఎలా?

  • మీకు వ‌చ్చిన కాల్ లెట‌ర్ ప‌ట్ల మీరు జాగ్ర‌త్తగా ఉండాలి.
  • మీకు ఉద్యోగం ఇస్తున్నామ‌ని, దానికి డ‌బ్బు చెల్లించ‌మ‌ని ఏ సంస్థ కూడా అడ‌గ‌దు.
  • అలా డ‌బ్బు అడిగితే ఆ సంస్థ మోసం చేస్తుంద‌ని అర్థం. అలాంటి కాల్ లెట‌ర్ల‌ను, ప్లేస్‌మెంట్ ఆర్డ‌ర్ల‌ను న‌మ్మ‌కూడ‌దు.
  • అలాగే మీ బ్యాంకు వివ‌రాలు, ఓటీపీ వివ‌రాల‌ను అడిగితే కూడా వారు మోసం చేస్తున్న‌ట్లే అర్థం.
  • ‘‘డైరెక్ట్ జాయినింగ్, నో ఇంటర్వ్యూ లేదా సెలక్షన్ ప్రాసెస్’ అని ఆఫర్ వస్తే అనుమానించాల్సిందే.
  • చిన్న, తేలికైన ప‌ని కోసం ఎక్కువ వేత‌నం ఆశ చూపుతుంటే అనుమానించాలి.

10. ఇలాంటి సంద‌ర్భంలో అభ్య‌ర్థి ఏం చేయాలి?

మీకు వ‌చ్చిన కాల్ లెట‌ర్‌, లేదా అపాయింట్‌మెంటు ఆర్డ‌రు, అందులో ఉన్న నిబంధ‌న‌ల గురించి మీకు ఏమాత్రం అనుమానం వ‌చ్చినా ఎన్‌సీఎస్ అధికారుల సాయం కోర‌వ‌చ్చు.

దీని కోసం మీరు [email protected] చిరునామాకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.

11. నాకు NCS సంస్థ నుంచి ఒక మెయిల్ వ‌చ్చింది. అది నిజ‌మైన‌దా కాదా తెలుసుకోవ‌డం ఎలా?

NCS నుంచి మీకు ఏ మెయిల్ వ‌చ్చిన అవి @gov.in or @nic.in అనే ఈ రెండు ఈమెయిల్ ఐడీల‌తోనే వ‌స్తాయి. ఇవి కాకుండా జీ మెయిల్‌, ఇత‌ర‌త్రా మెయిల్ ఐడీల‌ పేరుతో వ‌స్తే అవి అన‌ధికారిక‌మైన‌వి. వాటిని ప‌ట్టించుకోకూడ‌దు.

ఒక‌వేళ ఇలాంటి మెయిళ్లు వ‌స్తే మీరు వెంట‌నే [email protected] చిరునామాకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.

12. ఎన్‌సీఎస్ ఏమైనా నైపుణ్య శిక్ష‌ణ ఇస్తుందా?

ఎలాంటి నైపుణ్య శిక్ష‌ణ ఇవ్వ‌దు. కానీ కెరీర్ గైడెన్సు మాత్రం అంద‌జేస్తుంది

13. మ‌రి టీసీఎస్ అయాన్ అందిస్తోన్న కెరీర్ స్కిల్స్ ట్రైనింగ్ అంటే ఏమిటి?

ఇది అభ్య‌ర్థి ఉద్యోగం పొంద‌డానికి ఉండాల్సిన సాఫ్ట్ స్కిల్స్ శిక్ష‌ణ ఇవ్వ‌డానికి ఎన్‌సీఎస్ అంద‌జేస్తున్న స‌ర్టిఫికెట్ ప్రోగ్రామ్. ఈ శిక్ష‌ణ అభ్య‌ర్థుల‌కు వ్య‌క్తిగ‌తంగా కూడా అంద‌జేస్తారు.

14. దీనికి ఏమైనా డ‌బ్బు చెల్లించాలా?

చెల్లించ‌క్క‌ర్లేదు. ఎన్‌సీఎస్ అందించే ఏ కార్య‌క్ర‌మానికి కూడా ఎలాంటి డ‌బ్బు చెల్లించ‌క్క‌ర్లేదు. అలా ఎవ‌రైనా డ‌బ్బు అడిగితే మిమ్మ‌ల్ని మోసం చేస్తున్న‌ట్లే అని గుర్తుంచుకోండి.

15. నా వీడియో ప్రొఫైల్ ఇందులో అప్‌లోడ్ చేయొచ్చా?

ఒక‌సారి మీరు రిజిస్ట్రేష‌న్ చేసుకున్నాక మీ వీడియో ప్రొఫైల్‌ను పోర్ట‌ల్‌లో అప్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

16. నా విద్యార్హ‌త‌ల‌ను అప్‌గ్రేడ్ చేసుకోవ‌చ్చా?

ఎన్‌సీఎస్ పోర్ట‌ల్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకున్న తర్వాత ఎప్ప‌టిక‌ప్పుడు లేదా మీకు న‌చ్చిన‌ప్పుడు మీ విద్యార్హ‌త‌ల‌ను అప్‌గ్రేడ్ చేసుకోవ‌చ్చు.

17. ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉద్యోగ ఖాళీలున్నాయా?

ఎన్‌సీఎస్ పోర్ట‌ల్ ఆరంభించాక ప‌లు సంస్థ‌లు త‌మ విభాగాల్లోని ఉద్యోగ ఖాళీల‌ను ఈ పోర్ట‌ల్‌లో పొందుప‌రుస్తున్నాయి. అలా ఏటా ఇందులో ఉద్యోగ ఖాళీల సంఖ్య అస‌మానంగా పెరుగుతోంది.

2022 సెప్టెంబ‌రు నెల‌లో ఏకంగా 4,82,264 ఖాళీల‌ను ఇందులో పొందుప‌రిచాయి.

ఇది వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొంద‌డానికి దోహ‌ద‌ప‌డింది.

ప్ర‌స్తుతం 3.66 ల‌క్ష‌ల‌కు పైగా ఉద్యోగ ఖాళీల‌ను ఈ పోర్ట‌ల్ చూపిస్తోంది.

18. వ‌ర్క్‌ఫ్రం హోం ఉద్యోగాలు ఉన్నాయా?

వ‌ర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు ఆశించే అభ్య‌ర్థుల కోసం ఇందులో ఒక ప్ర‌త్యేక విండో ఉంటుంది. అందులో ఆ వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.

19. విదేశీ ఉద్యోగాల గురించి తెలుసుకోవ‌డం ఎలా?

విదేశీ ఉద్యోగాల‌కు సంబంధించి ఇంట‌ర్నేష‌న్ జాబ్స్ అనే విండోస్ ఉంటుంది. అందులో తెలుసుకోవ‌చ్చు.

20. పోర్ట‌ల్‌లో రిజిస్ట్రేష‌న్ లేదా ఇత‌ర‌త్రా కెరీర్ సంబంధిత అంశాల‌పై అనుమానాలు నివృత్తి చేసుకోవాలంటే ఎవ‌ర్ని సంప్ర‌దించాలి?

అభ్య‌ర్థులు ఎన్‌సీఎస్ నుంచి సహాయం కోసం 1514 టోల్ ఫ్రీ నంబ‌ర్‌కి కాల్ చేసి స‌ల‌హాలు పొంద‌వ‌చ్చు.

ఈ కాల్ సెంట‌ర్ మంగ‌ళ‌వారం నుంచి ఆదివారం వ‌ర‌కు ఉద‌యం 8 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తుంది.

ఈ కాల్ సెంట‌ర్‌లో మీకు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, త‌మిళం ఇలా ఏడు భాష‌ల్లో సేవ‌లు పొందొచ్చు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)