కే హుయ్ క్వాన్: ఒకప్పుడు శరణార్థి...నేడు ఆస్కార్ విజేత

కే హుయ్ క్వాన్

ఫొటో సోర్స్, Reuters

కే హుయ్ క్వాన్.. 1980లలో వచ్చిన రెండు అతిపెద్ద హాలీవుడ్ చిత్రాలలో నటించిన బాలనటుడు, 95వ ఆస్కార్ వేడుకలలో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు.

ఆస్కార్ అందుకున్న తరువాత హుయ్ క్వాన్ మాట్లాడుతూ, "ఇలాంటి విచిత్రాలన్నీ సినిమాలలోనే జరుగుతాయి అనుకుంటాం. నాకు అవార్డు రావడం ఓ కలలా ఉంది .. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను" అంటూ సంతోషం వ్యక్తంచేశారు.

కే హుయ్ క్వాన్ జీవితంలో చాలా ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. అదో సినిమా స్క్రిప్ట్‌లా ఉంటుంది.

చిన్నతనంలో శరణార్థిగా వియత్నాం నుంచి హాంగ్‌కాంగ్ చేరుకుని, అక్కడి నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.

అనుకోకుండా సినిమాల్లోకి వచ్చారు. 1984లో వచ్చిన 'ఇండియానా జోన్స్' 'టెంపుల్ ఆఫ్ డూమ్' సినిమాలలో బాల నటుడిగా చేశారు.

మరుసటి సంవత్సరం, 'ది గూనిస్' అనే టీవీ షోలో గాడ్జెట్‌ను ఇష్టపడే పిల్లవాడి పాత్రను పోషించే అవకాశం లభించింది.

అయితే, ఎదుగుతున్న కొద్దీ క్వాన్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో, స్టంట్ కో-ఆర్డినేటర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ వరకు తెర వెనుక ఎన్నో పనులు చేశారు. తెర మీద ఆయన ఉనికి క్రమంగా తగ్గుతూ వచ్చింది.

కే, హారీ ఫోర్డ్

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, ఇండియానా జోన్స్ సినిమాలో బాలనటునిగా కే
కే హుయ్ క్వాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కే హుయ్ క్వాన్

కొన్ని సంవత్సరాల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'క్రేజీ రిచ్ ఆసియన్స్' అనే డాక్యుమెంటరీ సిరీస్ చూసి మళ్లీ నటనపై ఆయనకు ఆసక్తి కలిగింది.

ఆర్టిస్ట్ ఏజెంట్‌గా పనిచేసే ఒక స్నేహితుడు క్వాన్ పేరును అందరి దగ్గరా ప్రస్తావించడం ప్రారంభించారు.

సరిగ్గా రెండు వారాల తరువాత, ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ 'ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' నిర్మాతల నుంచి క్వాన్‌కు కాల్ వచ్చింది.

ఈ చిత్రం ఆయనకు మరోసారి తన కలను సాకారం చేసుకునే అవకాశం ఇచ్చింది. మళ్లీ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

కే హుయ్ క్వాన్‌కి ఇదే మొదటి అకాడమీ అవార్డు.

ఆస్కార్ అవార్డును ముద్దాడుతూ, "మా అమ్మకి 84 ఏళ్లు. ఆమె టీవీలో ఈ ప్రోగ్రాం చూస్తున్నారు. అమ్మా... నేను ఆస్కార్ గెలుచుకున్నాను. నా ప్రయాణం ఒక పడవలో మొదలైంది. శరణార్థి శిబిరంలో ఒక ఏడాది గడిపాను. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేదికపై నిల్చున్నాను" అన్నారు.

"నా భార్యకు కృతజ్ఞతలు. నాకూ మంచి టైం వస్తుందని గత ఇరవై ఏళ్లుగా చెబుతూనే ఉంది" అన్నారు.

కే హుయ్ క్వాన్

ఫొటో సోర్స్, Lionsgate

స్టీవెన్ స్పీల్‌బర్గ్, కే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1985: స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో కే
2023: ఆస్కార్ కార్యక్రమంలో స్పీల్‌బర్గ్, కే

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 2023: ఆస్కార్ కార్యక్రమంలో స్పీల్‌బర్గ్‌తో కే

క్వాన్‌ ఈ సినిమా స్క్రిప్ట్ చదివినప్పుడు, ఇది ఇంత పెద్ద హిట్ అవుతుందని, ఆస్కార్ గెలుచుకుంటుందని ఊహించి ఉండరు.

వలసదారుల ఇక్కట్లు, సైన్ ఫిక్షన్, సూపర్ హీరోలు, భిన్న లోకాలు..వీటన్నిటి మీదుగా సాగుతుంది ఈ సినిమా.

ఈ చిత్రంలో హుయ్ క్వాన్.. లాండ్రీ నడిపే ఎవెలిన్ (మిషెల్ యో) భర్త వేమండ్ వెంగ్ పాత్ర పోషించారు.

మిషెల్ యో ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్నారు.

'ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' సినిమా మొత్తంగా ఏడు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది.

ఈ సినిమా ఆస్కార్‌కు ముందు పలు ప్రముఖ సినిమా అవార్డులను గెలుచుకుంది. హుయ్ క్వాన్ పేరు ప్రపంచమంతటా మారుమోగింది. ప్రసిద్ధ హాలీవుడ్ తారల చిత్రాలతో పాటు క్వాన్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

"మీ కలలపై మీకు నమ్మకం ఉండాలి. కొంత కాలం తరువాత నేను నా కలను వదులుకున్నాను. మీకు నేనిచ్చే సలహా.. మీ కలలను సజీవంగా ఉంచుకోండి. నన్ను మళ్లీ ఇక్కడకు (హాలీవుడ్ సినిమాల్లోకి) ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మీ అందరికీ నా ప్రేమ" అంటూ హుయ్ క్వాన్ ఆస్కార్ వేదికపై తన ప్రసంగం ముగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)