ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఈ ఇంట్లో 18 ఓట్లు ఉన్నాయి... కానీ వారెవరో ఇంట్లో వాళ్లకు తెలియదు

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో తిరుపతిలో బోగస్ ఓట్లు భారీగా నమోదవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో వాస్తవాలు తెలుసుకోడానికి బీబీసీ ప్రయత్నించింది.
తిరుపతిలో బోగస్ ఓట్లు ఉన్నాయని చెబుతున్న కొన్ని ప్రాంతాలకి వెళ్లి పరిశీలించింది.
తిరుపతి కేబీ లేఔట్‌లోని 6-19- S7-354 నంబర్ ఉన్న ఒకే ఇంట్లో 18 ఓట్లు నమోదైనట్లు విపక్షాలు ఆరోపించాయి. ఆ ఇంటికి వెళ్లి బీబీసీ పరిశీలించినప్పుడు అది నిజమేనని తేలింది. అది ఓటర్ల జాబితాలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
ఎ.మణి అనే పేరుతోనే ఏకంగా 11 ఓట్లు నమోదైనట్లు ఓటర్ల లిస్టులో కనిపిస్తోంది. అయితే ఆ పేరు కింద ‘‘సన్ ఆఫ్’’ అని ఉన్నచోట తండ్రుల పేర్లు మాత్రం వేరువేరుగా ఉన్నాయి.
ఇదే ఓటర్ల జాబితాలో ఇంకో విచిత్రం కూడా కనిపిస్తోంది. ఇంగ్లిష్‌లో ఉన్న పేరు ఎ.మణి అని ఉండగా దాని కింద తెలుగులో మాత్రం పూర్తిగా వేరే పేర్లున్నాయి.
తెలుగులో ‘‘ఎ.మణి’’ అని రాయాల్సిన స్థానంలో ‘‘కె.విజయ శ్రీహరి’’, ‘‘పి.సోమశేఖర్’’ అని వేరు వేరు పేర్లు కనిపిస్తున్నాయి.
మరికొన్ని చోట్ల పేరు వెంకటరాయులు శెట్టి అని ఉంటే.. కానీ మహిళ ఫొటో ఉంది.
ఇక 18 ఓట్లు నమోదైనట్లు చెబుతున్న ఇంట్లో ఉన్న వాళ్లు మాత్రం అసలు ఆ విషయమే తెలియదని చెప్పారు.
ఓటు నమోదు కోసం తమ ఇంటికి ఎవరూ రాలేదని ఆ ఇంట్లో ఉంటున్న వర ప్రసాద్ అన్నారు.
“ఇక్కడికొచ్చి ఆరు నెలలు అవుతోంది. ఇంట్లో మేం ఉండేది ఇద్దరం. మా అమ్మ నేను. ఆ ఓట్ల గురించి మాకు ఏం తెలీదు. ఎ.మణి అనే పేరుతో ఇక్కడ అసలు ఎవరూ లేరు. మేం ఆర్నెళ్ల నుంచే ఇక్కడున్నాం. అంతకు ముందు ఇక్కడ ఎవరున్నారో మాకు తెలీదు. ఈ ఫొటోల్లో ఉన్న వారు కూడా నాకు తెలీదు” అని వర ప్రసాద్ తెలిపారు.
తిరుపతి రాఘవేంద్ర నగర్‌లో ఒకే ఇంటిలో 20 ఓట్లు ఉన్నాయని తెలియడంతో బీబీసీ ఆ ఇంటికి కూడా వెళ్లింది.
“7-18, రాఘవేంద్ర నగర్‌లో ఉంటున్నాం. ఇది మాది సొంత ఇల్లు. గత 25 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాం. మా ఇంటి నెంబర్ మీద 20 ఓట్లు ఉన్నాయి. మాకైతే ఓట్లు ఏమీ లేవు. నా పేరు ఏమన్నా ఉందేమో అని వెరిఫికేషన్ చేస్తే నేను గ్రాడ్యుయేట్ కాదు కాబట్టి, నా పేరు లేదు. ఇన్ని ఓట్లు ఉన్నాయని చెబుతున్నా ఓటు వేయాలని అడగడానికి ఎవరూ రాలేదు” అని ఆ ఇంటి యజమాని ప్రసాద్ అన్నారు.

ఫొటో సోర్స్, UGC
ఒక వాలంటీర్ ఇంటి నంబరు మీద 14 ఓట్లు నమోదయ్యాయని సీపీఐ నారాయణ చేసిన ఆరోపణల నేపథ్యంలో సుందరయ్య నగర్‌లో ఉన్న ఆ ఇంటిని బీబీసీ పరిశీలించింది.
“మా ఇంట్లో మొత్తం మూడు పోర్షన్లు ఉన్నాయి. మూడు పోర్షన్లకు మొత్తం నాలుగు ఓట్లు ఉన్నాయి. మా ఇంట్లో ఇంకా అదనంగా 10 ఓట్లు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఆ 10 ఓట్లు గతంలో మా ఇంట్లో ఉండి వెళ్లిపోయిన వాళ్లవి కావొచ్చు.
వాళ్లు ఇప్పుడు లేరు. గతంలో ఉండి వెళ్లిపోయారు. వాలంటీర్‌ను బ్లేమ్ చేయాలి, వాలంటీర్ పార్టీ కోసం పని చేస్తున్నాడు. ప్రజల కోసం కాదు అని ఎత్తి చూపియ్యడానికి ఇటువంటి కుట్రలు” అని వాలంటీర్ ముస్తఫా అన్నారు.

నెహ్రూ నగర్‌లో 4-4-562 నంబర్‌లో 36 ఓట్లు ఉన్నాయని తెలియగానే బీబీసీ అక్కడ కూడా పరిశీలించింది. అదే నంబరు ఇంట్లో తిరుపతి పడమర విభాగం వైసీపీ కార్యాలయం ఉంది.
ఆ ఇంట్లో 36 ఓట్లు ఎలా వచ్చాయని స్థానిక వైసీపీ నాయకుడు ఇమ్రాన్‌ను ప్రశ్నించినపుడు, ఆయన అందులో ఆరు ఓట్లు ఇంటి యజమాని కుటుంబంలోనివి అని చెప్పారు.
“నెహ్రూ నగర్ 4-4-562 వైసీపీ ఆఫీస్ అడ్రస్‌లో ఉన్న ఓట్లలో ఆరు మాత్రమే ఆ హౌస్ ఓనర్ వాళ్లకు సంబంధించినవి. మిగిలిన ఓట్లు ఎలా నమోదైయ్యాయో తెలియదు.
బహుశా ఎమ్మార్వో ఆఫీసు పొరపాటుగా ముద్రించి ఉండొచ్చు. ఆరు మంది తప్ప మా పార్టీ కార్యాలయం అడ్రస్ పేరుతో ఉన్న ఓట్లు ఎవరివో మాకు తెలియదు” అని ఇమ్రాన్ బీబీసీతో చెప్పారు.

అసలు ఆరోపణ ఏంటి
తిరుపతి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదైన ఓట్లలో అసలు ఓట్ల కంటే బోగస్ ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
ఎక్కడెక్కడ బోగస్ నోట్లు ఉన్నాయో తాము గుర్తించామని కొన్ని ఇంటి నెంబర్లు కూడా చెప్పారు. ఆ ఇంటి నంబర్ల దగ్గరికి వెళ్లి బీబీసీ పరిశీలించింది.
మరోవైపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అనర్హులకు ఓట్లు రాయించారని, ఇంత భారీగా ఓట్ల నమోదు జరిగిందంటే దొంగ ఓట్లు చేర్చారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి ఆరోపించారు.
ఓటర్ నమోదు సందర్భంగా అవసరమైన డాక్యుమెంట్స్ ఏమీ లేకపోయినా అధికారులు సంతకాలు పెట్టి ఓటర్లను నమోదు చేశారని మురళి ఆరోపించారు.
“మూడు లక్షల ఎనభై ఒక్క వేల మంది పట్టభద్రులు, 27 వేల మంది టీచర్స్ ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. గతంలో 1,80,000 మంది మాత్రమే పట్టభద్రులు ఓటర్లుగా ఉండే వాళ్లు. ఇప్పుడు రెండు లక్షల మంది అదనంగా చేరిన పరిస్థితి. అదే విధంగా టీచర్లు గతంలో 16 వేల మంది ఉండేవాళ్లు ఈ దఫా 27,000 మంది ఉన్నారు. అంటే 11,000 మంది పెరిగారు.
పెరిగిన ఓటర్లు నిజమైన వారు అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దురదృష్టం ఏంటంటే అధికార పార్టీ నాయకులు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వారు గెలవాలనే లక్ష్యంతో దొంగ ఓట్లు భారీ స్థాయిలో నమోదు చేశారు’’ అని ఆయన అన్నారు.

‘‘యశోద నగర్ పోలింగ్ పరిధిలో ఖాళీ స్థలం ఉంది. ఆ ఇంటి ఓనర్ హైదరాబాద్లో నివాసం ఉంటాడు. ఆ ఖాళీ స్థలానికి పదిమంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నట్టు నమోదు చేశారు.
కొత్తపల్లి ఆటో స్టాండ్‌లో ఆటో కార్మికులకి 61 ఓట్లు నమోదు చేశారు. ఐదు, ఆరు తరగతి వరకి చదివిన వాళ్లే తప్ప పదో తరగతి కంటే మించి చదివినోళ్లయితే అక్కడ లేరు.
ఒకే కుటుంబంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. చాలా వివరంగా సీరియల్ నెంబర్ తో పాటు వారి పేర్లు, వాళ్ళ విద్యార్హలపై పిర్యాదు చేశాం” అని కందారపు మురళి బీబీసీతో అన్నారు.
ఆ ఖాళీ స్థలం నెంబరు 18-1-66 అని ఆయన తెలిపారు.
‘‘తిరుపతి కేపీ లేఅవుట్‌లో బూత్ నెంబర్ 619 సీరియల్ నెంబర్ 768 మణి... వాళ్ల తండ్రి పేరు వెంకటేశ్వర్లు. అదే దీనిలో వెంకటేశ్వర్లు, రామదాసు, కృష్ణయ్య సోమశేఖర్ ఈ విధంగా పేర్లు మార్చుకుంటూ వచ్చారు’’ అని నారాయణ విమర్శించారు.


“ఫేక్ ఓట్లు నమోదు చేసే మనస్తత్వం ఉండే ప్రభుత్వం మాది కాదు. చదువుకున్న వాళ్ల, టీచర్ల ఎన్నికలివి. ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారో వాళ్లు స్వయంగా వారి పేరు నమోదు చేసుకున్నారు. ఎవరూ డబ్బులు ఇచ్చి చేయలేదు’’ అని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖా మంత్రి నారాయణ స్వామి బీబీసీతో అన్నారు.
అసలు ఓట్లకంటే బోగస్ ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.

తిరుపతిలో బోగస్ ఓట్లు బయటపడడంపై తిరుపతి కలెక్టర్ వెంకటరమణా రెడ్డిని బీబీసీ ప్రశ్నించగా, ఆయన దీనిపై ఎంక్వైరీ చేసి ఈసీకి నివేదిక అందిస్తామని తెలిపారు.
“మనకు 13వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. బోగస్ ఓట్ల గురించి వస్తున్న ఆరోపణలపై విచారణ చేయడం జరుగుతుంది. అది పూర్తయిన తర్వాత ఎలక్షన్ కమిషన్‌కు నివేదిక అందిస్తాం” అన్నారు.
తూర్పు రాయలసీమ పరిధిలో మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 22 మంది గ్రాడ్యుయేట్ అభ్యర్థులు పోటీలో ఉండగా 8 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు.
ఇక్కడ మొత్తం 3,81,181 పట్టభద్రుల ఓట్లకు 453 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 27,694 ఉపాధ్యాయుల ఓట్లకు 176 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత మీద ఈడీ ఆరోపణలు ఏమిటి?
- అన్ని వయసుల వారికీ గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్.. ముందే గుర్తించడం ఎలా?
- IWD2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఊదా రంగును ఎందుకు ధరిస్తారు...
- అక్కడ విడాకులను వేడుకగా జరుపుకుంటారు
- Sexual Health: ‘‘వయాగ్రా తీసుకొని మద్యం తాగడంతో మరణించిన వ్యక్తి’’... అరుదైన కేసుగా వెల్లడి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














