ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి? ఒక బ్యాట్స్‌మన్ ఔటైతే, ఈ ఆటగాడితో బ్యాటింగ్ చేయించొచ్చా?

ఫొటో సోర్స్, FACEBOOK/CHENNAI SUPER KINGS
- రచయిత, వద్ది ప్రభాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఈ రోజు (మార్చి 31న) ప్రారంభం కానుంది.
అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్టుతో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడబోతోంది.
ఏళ్లుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఈ మెగా టోర్నీలో బీసీసీఐ ఈ సారి ఓ కొత్త రూల్‌ను పరిచయం చేయబోతోంది . అదే 'ఇంపాక్ట్ ప్లేయర్'.
ఇటీవలే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేశారు.
ఈ రూల్ ఏంటి?
దీని అమలుకు బీసీసీఐ విధించిన షరతులేంటి?
'ఇంపాక్ట్ ప్లేయర్' ఆప్షన్ ప్రకారం ఒక ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకోవడానికి జట్టును అనుమతిస్తారు.
ఇది గేమ్‌లో కొత్త వ్యూహాలకు అవకాశం కల్పిస్తుంది. మ్యాచ్‌ను రసవత్తరంగా మారుస్తుంది.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఇలా జట్టులోకి వచ్చే ఆటగాడు భారత ప్లేయర్ అయి ఉండాలని బీసీసీఐ నిబంధన పెట్టింది.

ఫొటో సోర్స్, BCCI/IPL
ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఎవరు ఎంపిక చేయాలి?
- జట్టు కెప్టెన్ మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్‌ను నామినేట్ చేస్తాడు.
- మైదానంలో ఉన్న అంపైర్‌కి గానీ, ఫోర్త్ అంపైర్‌కి గాని ఈ విషయం తెలియజేయాలి. అంపైర్ ఇంపాక్ట్ ప్లేయర్ ఎంట్రీని ఒక 'సిగ్నల్' ద్వారా తెలియజేస్తారు.
- జట్టు ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ముందు ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు.
- ఓవర్ పూర్తయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. లేదా వికెట్ పడినప్పుడు, రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగినప్పుడు ప్లేయర్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది.
- ఇన్సింగ్స్ అయిపోయాక కూడా ఆ ప్లేయర్‌ను ప్రకటించవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్ చేయవచ్చు. నాలుగు ఓవర్ల పూర్తి కోటా బౌలింగ్ కూడా చేయవచ్చు.
అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ ప్లేయింగ్-11 జాబితాతో పాటు ఐదుగురు సబ్‌స్టిట్యూట్ల పేర్లను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకోవాలంటే కచ్చితంగా ఆ మిగిలిన ఐదుగురిలోని భారత ఆటగాడినే తీసుకోవాలి.
ఇరు జట్లు ఒక ఇంపాక్ట్ ప్లేయర్‌ను మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకోవాలనే కచ్చితమైన నిబంధననేమీ లేదు.
ఎవరి స్థానంలో అయితే ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చాడో అతను ఇక ఆ మ్యాచ్‌లో పాల్గొనడానికి వీల్లేదు. ఫీల్డర్‌గా కూడా అతడిని తీసుకోకూడదు.
ఏ ఆటగాడైన గాయపడినా ఆ ప్లేయర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. అయితే గాయపడిన ఆటగాడు మళ్లీ మ్యాచ్‌లో ఆడటానికి వీల్లేదు.
ఒకవేళ ప్లేయింగ్ లెవన్‌లోని ఆటగాడు బ్యాటింగ్ చేసి ఔటైతే, అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే ఆటగాడు కూడా బ్యాటింగ్ చేయవచ్చు. అయితే ఒక ఇన్నింగ్స్‌లో పదకొండు మంది మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
విదేశీ ఆటగాడిని తీసుకోవాలంటే?
అప్పటికే ప్లేయింగ్ ఎలెవన్‌లో నలుగుగు విదేశీ ఆటగాళ్లే ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్‌గా మరో విదేశీ ఆటగాడిని తీసుకోవాలనుకుంటే కుదరదు.
ఎందుకంటే టీం ప్లేయింగ్ ఎలెవన్‌లో కేవలం నలుగురు మాత్రమే విదేశీ ప్లేయర్ల నిబంధన ఉంది. అయితే బీసీసీఐ ఒక వెసులుబాటు ఇచ్చింది. దాని ప్రకారం- కెప్టెన్ మొదటగా 8 మంది భారత ఆటగాళ్లు, ముగ్గురు విదేశీ ప్లేయర్లతో మైదానంలోకి దిగాలి. అపుడు మ్యాచ్ మధ్యలో మిగతా ఐదుగురు సబ్‌స్టిట్యూట్లలో భాగమైన విదేశీ ఆటగాళ్లలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవచ్చు.
అప్పటికే ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్న మిగతా 8 మంది భారత ఆటగాళ్లలో ఒకరిని బెంచ్‌లో కూర్చోబెట్టొచ్చు.

ఫొటో సోర్స్, IPL
వికెట్ పడిన సమయంలో బౌలింగ్ చేసే జట్టు కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు.
అయితే ఓవర్ మధ్యలో వికెట్ పడితే బౌలింగ్ చేసే జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కొత్త ఆటగాడు అదే ఓవర్ బౌలింగ్ చేసే వీలుండదు.
ఆ ఓవర్ అయిపోయాక బౌలింగ్ చేయవచ్చు. ఒకవేళ కొన్ని ఓవర్లు వేసిన బౌలర్ ప్లేస్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ వస్తే తన పూర్తి కోటా (4) కంప్లీట్ చేయొచ్చు.
ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ కూడా గాయపడితే అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌ను తీసుకునేందుకు అవకాశం ఉంది. కానీ, మరో ఇంపాక్ట్ ప్లేయర్‌కు అవకాశం లేదు.
ఇప్పటివరకు ఈ 'ఇంపాక్ట్ ప్లేయర్ రూల్' బాస్కెట్‌బాల్, బేస్‌బాల్, ఫుట్ బాల్, రగ్బీలలో ఉంది.

ఫొటో సోర్స్, BCCI/IPL
మ్యాచ్‌ను ఏ విధంగా ప్రభావితం చేయవచ్చు?
ఇంపాక్ట్ ప్లేయర్ కాన్సెప్ట్ వల్ల టాస్ ప్రభావం తగ్గుతుంది. గతంలో చాలా మ్యాచ్‌లలో ఫలితాన్ని టాస్ బాగా ప్రభావితం చేసింది.
రాత్రి పూట మంచు ఎక్కువగా కురిసే మైదానాల్లో రెండో సారి బౌలింగ్ చేసే జట్టుకు ఇబ్బందులు తలెత్తేవి.
దీంతో టాస్ గెలిచిన జట్టు నేరుగా బౌలింగ్ ఎంచుకునేది. ఇలాంటి మైదానాల్లో టాస్ ఓడిపోయి, మొదట బ్యాటింగ్, తర్వాత బౌలింగ్ చేయాల్సి వచ్చిన జట్టుకు కొత్త నిబంధన కాస్త ఊరట కలిగించేదే.
ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్‌గా మరో బౌలర్‌ను తీసుకొచ్చి బౌలింగ్‌ను బలోపేతం చేసుకోవచ్చు.
అలాగే జీవం లేని పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో అదనపు బ్యాటర్‌ను తీసుకొచ్చి బ్యాటింగ్‌నూ బలోపేతం చేసుకోవచ్చు.
ఈ కొత్త రూల్ కారణంగా మ్యాచ్‌లో ఎవరైనా గాయపడితే ఆ లోటు ప్రభావాన్ని తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది.
ఈ కొత్త రూల్ పై అభిమానులు ఆసక్తిగా ఉన్నా, కొందరు విమర్శిస్తున్నారు. ఈ వెసులుబాటు కారణంగా జట్టులో ఆల్ రౌండర్ల ప్రాబల్యం తగ్గిపోతుందని వాదిస్తున్నారు.
జట్టు అవసరాల దృష్ట్యా తుది జట్టులో ఉన్న ఆల్‌రౌండర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా స్పెషలిస్టు బ్యాట్స్ మన్‌నుగాని, స్పెషలిస్టు బౌలర్‌నుగాని తీసుకొంటారని మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు.

ఫొటో సోర్స్, BCCI / IPL
టాస్ తర్వాతే జట్టు ప్రకటన
టీ20ల్లో టాస్ ప్రభావాన్ని తగ్గించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టాస్ తర్వాతే తుది జట్టును ప్రకటించే అవకాశాన్ని ఈసారి నుంచి కల్పిస్తోంది.
ఇరు జట్ల కెప్టెన్లు రెండు 'ప్లేయింగ్ లెవన్' జాబితాలతో టాస్‌కు వెళ్లే అవకాశం ఉంది. టాస్ ఫలితాన్ని బట్టి వారి దగ్గరున్న రెండింటిలో ఒకదానిని ప్రకటించొచ్చు.
- ఇక వైడ్, నో బాల్స్ కూ డీఆర్‌ఎస్
ఇప్పటిదాకా బ్యాటర్ ఔట్, నాటౌట్ విషయాల్లో అంపైర్ల నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు ఇరు జట్లకు ఇన్నింగ్స్ లో ఒక్కో డీఆర్‌ఎస్ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వైడ్, హైట్ నోబాల్స్‌కూ డీఆర్‌ఎస్ కోరవచ్చు.
- స్లో ఓవర్ రేట్
ఇన్నింగ్స్ నిర్ణీత సమయంలో పూర్తయ్యేందుకు బీసీసీఐ చొరవ తీసుకుంటోంది. బౌలింగ్ చేసే జట్టు టైమ్ ఔట్స్ తో కలిపి నిర్ణీత 90 నిమిషాల్లో 20 ఓవర్లు పూర్తి చేయాలి.
లేదంటే 90 నిమిషాలు దాటిన తర్వాత మిగిలిన ఓవర్లలో 30 గజాల సర్కిల్ బయట ఐదుగురు కాకుండా నలుగురు ఫీల్డర్లనే అనుమతిస్తారు.
ఇది బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలం కానుంది.
- కదిలితే జరిమానా
బౌలర్ బంతిని వేసేటప్పుడు బ్యాటర్ ఏకాగ్రత దెబ్బతీసేలా ఫీల్డర్, వికెట్ కీపర్ దురుద్దేశపూర్వంగా కదిలినట్టు అంపైర్ గుర్తిస్తే ఫీల్డింగ్ జట్టుకు ఐదు రన్స్ జరిమానా విధిస్తాడు.
రెండు గ్రూపులు
ఐపీఎల్ సీజన్ 16 టైటిల్ కోసం పది జట్లు పోటీపడనున్నాయి.
అహ్మదాబాద్, హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు, చెన్నై, జైపూర్ సహా 12 నగరాల్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
లీగ్ దశలో 70 మ్యాచ్‌లు ఉంటాయి. ప్లే ఆఫ్ దశలో మూడు మ్యాచ్‌లు (క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2) జరుగుతాయి. ఆ తర్వాత ఫైనల్ ఉంటుంది.
జట్లను ఏ, బీ అని రెండు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్-ఏ లో ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జయింట్స్, దిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి.
గ్రూప్ బీ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఉన్నాయి.
ఇప్పుడు ఒక గ్రూప్‌లోని జట్టు అవతలి గ్రూప్‌లోని ఐదు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. తమ గ్రూప్‌లోని నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఉదాహరణకు గ్రూప్-ఏ లోని ముంబయి జట్టు అదే గ్రూపులోని 4 జట్లతో ఒక్కో మ్యాచ్, గ్రూప్ - బీ లోని ఐదు జట్లతో రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఆడుతుంది.
గత కొన్ని సీజన్లుగా కరోనా కారణంగా అభిమానుల హాజరుపై బీసీసీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకైతే ఈ సీజన్‌లో ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
ఇవి కూడా చదవండి
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
- ప్రియాంక గాంధీ దూకుడు కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తీసుకురాగలదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














