క్రికెట్: టీం ఇండియా‌కు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లు సవాలుగా మారారా..? విరాట్ కోహ్లీ వారిని ఎదుర్కోగలడా?

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శివకుమార్ ఉలగనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘అతను ఒక ఓవర్‌లో ఆరు బంతులు వేస్తాడు.

ప్రతి బంతి ఒక్కో రకంగా బ్యాట్స్‌మన్ మీదుకు దూసుకొస్తుంది. ఇతర లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ల తరహాలోనే అతను కూడా ఒక అరుదైన, అసలు సిసలైన ప్రతిభావంతుడు.’’

ఈ మాటలు అన్నది ప్రముఖ భారత క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్‌ను ఉద్దేశించి ఒక సందర్భంలో నవజ్యోత్ సిద్ధూ పైవ్యాఖ్యలు చేశారు.

చాలా ఏళ్లుగా ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లను ఒక ప్రత్యేకమైన, అరుదైన ప్రతిభ ఉన్న బౌలర్లుగా పరిగణిస్తున్నారు.

బంతిని మంచి లయతో సంధిస్తూ, స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడంలో వీరు ప్రత్యేక ప్రతిభ కనబరుస్తారు.

ఎందుకంటే, బ్యాట్స్‌మెన్‌లో ఎక్కువగా కుడిచేతి వాటం కలిగిన వారే ఉంటారు. కాబట్టి వారికి ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ప్రదర్శించే స్వింగ్, బౌన్స్, పేస్ వైవిధ్యాలను అంచనా వేయడం చాలా కష్టం అవుతుంది.

అందుకే ప్రస్తుతమే కాకుండా గతంలో కూడా ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో బ్యాట్స్‌మెన్ చాలా ఇబ్బంది పడేవారు.

టీమిండియా బ్యాట్స్‌మెన్ కూడా లెఫ్టార్మతో ఫాస్ట్‌బౌలర్లతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడ్డారు.

వసీమ్ అక్రమ్

ఫొటో సోర్స్, WILLIAM WEST/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, వసీమ్ అక్రమ్
మిచెల్ స్టార్క్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2015 వరల్డ్ కప్ సెమీస్‌లో ఉమేశ్ వికెట్ తీసిన ఆనందంలో స్టార్క్

సెమీ ఫైనల్ సంక్షోభం

2015 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో భారత్‌కు భారీ లక్ష్యం ఎదురైంది. లక్ష్య ఛేదనలో భారత్‌కు శుభారంభం లభించింది. కానీ, ఆస్ట్రేలియా లైనప్‌లో మిచెల్ జాన్సన్, మిచెల్ స్టార్క్ రూపంలో ఇద్దరు లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు.

ఆ మ్యాచ్‌లో జాన్సన్, స్టార్క్ మంచి ప్రదర్శన కనబరిచారు. చెరో రెండు వికెట్లు తీశారు.

భారత్‌కు అత్యంత కీలకమైన విరాట్ కోహ్లి వికెట్‌ను జాన్సన్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రేసులో న్యూజీలాండ్ లెఫ్టార్మ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌తో మిచెల్ స్టార్క్ కూడా పోటీపడ్డాడు. వీరిద్దరూ ప్రపంచకప్‌లో 22 వికెట్లు తీసి సమానంగా నిలిచారు.

ఈ మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

అయితే, 2019 ప్రపంచకప్‌లో కూడా భారత్‌ను సెమీ-ఫైనల్ కష్టాలు వెంటాడాయి. సెమీస్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ కాస్త సవాలుతో కూడిన వికెట్‌పై 240 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో కూడా మరో ఎడమ చేతి వాటం ఫాస్ట్‌బౌలర్ భారత్‌ను దెబ్బతీశాడు.

విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలను ట్రెంట్ బౌల్ట్ అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లే తీయగలిగాడు. కానీ, ఈ మ్యాచ్‌లో అతను చూపిన ప్రభావం మాత్రం టోర్నీలో భారత జట్టు గెలుపు అవకాశాలను పూర్తిగా మార్చేసింది. జడేజాను అవుట్ చేసిన విధానం అందర్నీ ఆకట్టుకుంది.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, ANI

పాకిస్థాన్ నుంచి రెట్టింపు కష్టాలు

2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ చాలా కీలకమైనది. ఫైనల్లో భారత్, పాకిస్తాన్‌లు తలపడ్డాయి. మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అందరూ ఊహించారు. కానీ, భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడూ మర్చిపోవాలని అనుకునే మ్యాచ్‌గా ఇది మిగిలిపోయింది.

ఫఖర్ జమాన్ సెంచరీతో పాకిస్తాన్ భారీ స్కోరు నమోదు చేసింది. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్, భారత్ గెలుపు అవకాశాలను పూర్తిగా లాగేసుకున్నాడు.

ఆ మ్యాచ్ ఆరంభంలో అత్యంత కచ్చితత్వంతో బంతులు సంధించిన అమీర్, భారత టాపార్డర్‌ను కూల్చేశాడు.

వరుసగా రోహిత్ శర్మ (0), విరాట్ కోహ్లి (5), శిఖర్ ధావన్ (21)లను అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో అమీర్ స్పెల్‌కు చాలా కాలం పాటు ప్రశంసలు లభించాయి.

మరో పాకిస్థానీ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్, 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను అడ్డుకున్నాడు. ఆ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది. అతను 3 కీలకమైన వికెట్లు తీయడంతో భారత్ కోలుకోలేకపోయింది.

టాపార్డర్ బ్యాట్స్‌మన్ అయిన కేఎల్ రాహుల్ (3), రోహిత్ శర్మ (0), విరాట్ కోహ్లి (57) వికెట్లను షాహీన్ షా ఆఫ్రిది దక్కించుకున్నాడు.

విరాట్ కోహ్లి

ఫొటో సోర్స్, Getty Images

ఈ నాలుగు సందర్భాల్లోనూ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లు కీలకమైన వికెట్లు తీయడమే కాకుండా భారత బ్యాట్స్‌మెన్‌ను సందిగ్ధంలో పడేలా చేశారు.

ఇప్పటివరకు ఉదహరించిన అంతర్జాతీయ మ్యాచ్‌లన్నీ, పిచ్ నుంచి బౌలర్లకు బాగా సహకారం అందిన మ్యాచ్‌లు. అంటే అవి కొంత ఎక్కువగా బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌లు. అయితే, గత వారం విశాఖపట్నంలోని ఒక సాధారణ, తక్కువ ప్రమాదకరమైన పిచ్‌పై కూడా భారత బ్యాట్స్‌మెన్‌ను ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ దెబ్బతీశాడు.

విశాఖపట్నం వన్డేలో మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో స్టార్క్ అయిదు వికెట్లతో చెలరేగగా, భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. అంతకుముందు మ్యాచ్‌లోనూ మూడు వికెట్లు తీసిన స్టార్క్, భారత విజయానికి అడ్డుగోడగా మారాడు.

వన్డే ప్రపంచకప్‌ సమీపిస్తోంది. ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్ల నుంచి ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి భారత్ వద్ద చాలా తక్కువ సమయం ఉంది. ముఖ్యమైన నాకౌట్ మ్యాచ్‌లో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లు మరింత ప్రమాదకరంగా మారతారు.

ఇషాంత్ శర్మ

ఫొటో సోర్స్, ANI

భారత్‌కే కాదు ఇతర జట్లకు ముప్పే..

భారత బ్యాటింగ్ లైనప్‌ను కూల్చేస్తున్న లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ల ముప్పు గురించి సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ శంకర్, బీబీసీతో మాట్లాడారు.

“విషయం ఏంటంటే, ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్ల వల్ల కేవలం భారతే కాకుండా ఇతర దేశాల జట్లు కూడా ముప్పును ఎదుర్కొంటున్నాయి. వారి వైవిధ్యాన్ని, బౌన్స్‌ను అంచనా వేయడం అంత సులభం కాదు. అంతేకాకుండా, దేశవాళీ మ్యాచ్‌ల్లో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లను ఆడటానికి ఎక్కువ అవకాశం లభించదు’’ అని ఆయన అన్నారు.

కీలకమైన మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లి, ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ల చేతిలో తరచుగా అవుట్ అవ్వడం ఆందోళన కలిగించే అంశమా అనే ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

"విరాట్ కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్. అతను కొన్ని సందర్భాల్లో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ల చేతిలో అవుటయ్యాడనేది నిజమే. కానీ, సరైన సమయంలో వారిని అతను దీటుగా ఎదుర్కొంటాడు. కానీ, ప్రస్తుతం భారత లైనప్ అకస్మాత్తుగా బలహీనంగా కనిపిస్తోంది. సమర్థులైన ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేందుకు సరైన వ్యూహాలు రచించడానికి చాలా తక్కువ సమయం ఉంది’’ అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, షబ్నమ్: అండర్ 19 మహిళల ప్రపంచకప్ టోర్నీలో తెలుగమ్మాయి ప్రతిభ

వన్డే ప్రపంచకప్‌కు ఇంకా ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలింగ్, భారత్ విజయానికి అడ్డంకిగా మారుతుందో లేదో చూడాలి. అలాగే, భారత జట్టులో చాలా తక్కువ మంది లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు.

అర్ష్‌దీప్ సింగ్ యువకుడు. అతను ఇప్పుడిప్పుడే ఆటలో రాటుదేలుతున్నాడు. జైదేవ్ ఉనాద్కట్ చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడాడు. అతనికి అనుభవం తక్కువ. నటరాజన్ కొంతకాలం కిందట మైదానంలో కనిపించాడు. చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్ పేర్లు తెరపైకి వస్తున్నా వారికీ పెద్దగా అవకాశాలు లభించడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ముందు రెండు సవాళ్లు నిలిచాయి. వాటిలో మొదటిది ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడం, రెండోది జట్టులో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లను తయారు చేయడం.

ఈ నెలాఖరులో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇది మరో ఫార్మాట్‌లో జరుగుతుంది. కాబట్టి, మరికొంతకాలం వరకు లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్లపై చర్చ తెరమరుగు అవుతుంది. కానీ, ప్రపంచకప్‌కు సన్నద్ధం కావడానికి భారత్‌కు ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉందన్న మాట మాత్రం నిజం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)