అదానీ గ్రూప్‌ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు ఏడాదిగా ఎందుకు నిరసనలు చేస్తున్నారు?

ఛత్తీస్‌గఢ్

ఫొటో సోర్స్, PRITAM ROY

ఫొటో క్యాప్షన్, ఈ గిరిజనులకు అగ్ర రాజకీయ నాయకులు, ప్రముఖ సామాజిక ఉద్యమకారుల నుంచి మద్దతు లభిస్తోంది.
    • రచయిత, నిఖిల్ ఇనామ్‌దార్
    • హోదా, బీబీసీ న్యూస్, ఛత్తీస్‌గఢ్

ఛత్తీస్‌గఢ్‌లో అదానీ గ్రూపు చేతికి వచ్చిన ఒక కొత్త బొగ్గు గనికి వ్యతిరేకంగా ఏడాది నుంచి గిరిజనలు నిరసన చేపడుతూనే ఉన్నారు.

అగ్ర రాజకీయ నాయకులు, ప్రముఖ సామాజిక ఉద్యమకారుల నుంచి కూడా వీరికి మద్దతు లభిస్తోంది. అయితే, ఈ పోరాటంలో గిరిజనులు విజయం సాధించాలంటే చాలా కృషి చేయాల్సి ఉంటుంది.

ఛత్తీస్‌గఢ్‌లోని హరిహర్‌పుర్ గ్రామం రెండు భిన్న ప్రపంచాల మధ్య ఉన్నట్లుగా కనిపిస్తుంది. తూర్పు వైపున దశాబ్దాల నాటి పార్సా ఈస్ట్ కాంటా బేసిన్ (పీఈకేబీ) ఓపెన్ క్యాస్ట్ బొగ్గు గని కనిపిస్తుంది. కనుచూపు మేరంతా కనిపించే ఈ గని అదానీ గ్రూపు చేతికి దక్కింది. మరోవైపు హస్‌దేవ్ అటవీ ప్రాంతంలో అక్కడక్కడా విసిరేసినట్లుగా ఇళ్లు కనిపిస్తాయి. ఇక్కడే బిలియన్ టన్నుల బొగ్గు ఇంకా భూమిలో ఉంది.

మధ్య భారత్‌లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో హస్‌దేవ్ కూడా ఒకటి. 1,70,000 హెక్టార్ల పరిధిలో ఉండే ఈ ప్రాంతాన్ని ఛత్తీస్‌గఢ్‌కు ఊపిరితిత్తులుగా అభివర్ణిస్తుంటారు. ఇక్కడే లెమ్రూ ఏనుగుల అభయారణ్యం కూడా ఉంది.

ఇక్కడ కొత్త బొగ్గు గనిని తెరచే ప్రయత్నాలను దశాబ్దం నుంచీ గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ఎంత ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ, గిరిజనులపై, అడవిపై చాలా ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రభుత్వ అటవీ పరిశోధన సంస్థ హెచ్చరికలు చేసినప్పటికీ, గత ఏడాది ఈ గని తెరచేందుకు అనుమతులు జారీచేశారు. దీంతో 2022 మార్చి 2న ఇక్కడ నిరవధిక దీక్ష మొదలైంది. రోజూ ఇక్కడకు వచ్చి గిరిజనులు నిరసన తెలియజేస్తున్నారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అదానీ గ్రూపుకు సంపద దోచిపెట్టేలా వ్యవహరిస్తున్నారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లపై తరచూ విమర్శలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ అనుమతులు జారీచేసింది.

ఛత్తీస్‌గఢ్

ఫొటో సోర్స్, PRITAM ROY

ఆ గుడిసే నిరసనల కేంద్రం

హరిహర్‌పుర్‌కు వెళ్లే దారిలో గడ్డితో నేసిన గుడిసె ఈ నిరసనలకు కేంద్రంగా మారింది. ఏడాది నుంచి ఈ గుడిసె కింద గిరిజనులు నిరసన తెలియజేస్తున్నారు. రోజూ దగ్గర్లోని ఫతేపుర్, ఘట్‌బర్రా, సాల్హి గ్రామాల నుంచి గిరిజనులు ఇక్కడకు వస్తారు. ప్రశాంతంగా వీరు ధర్నాకు కూర్చుంటారు.

వారానికి ఒకసారి ఇక్కడకు వందల మంది గిరిజనులు వచ్చి అదానీ ‘‘గో బ్యాక్’’అంటూ నినాదాలు చేస్తుంటారు.

‘‘మా భూమిని అధికారులు అక్రమంగా సేకరించారు. గ్రామ సభ పేరుతో వారు నకిలీ పత్రాలను సృష్టించారు. మేం అసలు దీనికి అనుమతే ఇవ్వలేదు’’అని హస్‌దేవ్ అరంద్ బచావో సంఘర్ష్ సమితి సభ్యుడు మునేశ్వర్ సింగ్ పోర్టే బీబీసీతో చెప్పారు.

బీబీసీ అడిగిన ప్రశ్నలకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. అయితే, ఈ ఆరోపణలను అదానీ గ్రూపు ఖండించింది. ఇక్కడి చట్టాలకు లోబడే తాము పనిచేస్తున్నాని సంస్థ వివరించింది.

భూ సేకరణకు సంబంధించిన పనులను రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ (ఆర్ఆర్‌వీయూఎన్ఎల్) చూసుకుంటుందని అదానీ గ్రూపు వెల్లడించింది. ప్రస్తుతం తవ్వకాలు చేపడుతున్నదానితోపాటు కొత్త గనులు కూడా ఆర్ఆర్‌వీయూఎన్ఎల్ యాజమాన్యంలో ఉన్నాయి. అయితే, వీటికి అదానీ గ్రూపు గనుల డెవలపర్‌, ఆపరేటర్‌గా కొనసాగుతోంది. ఈ భాగస్వామ్యంలో అదానీ గ్రూపు వాటా 74 శాతం.

‘‘పక్కాగా న్యాయపరమైన, ప్రాధికార నిబంధనలను అనుసరించాం. గ్రామ సభ అనుమతులను కూడా నిబంధనలను అనుసరించే తీసుకున్నాం. ఈ ప్రక్రియలను రికార్డు కూడా చేశాం’’అని అదానీ గ్రూపు వెల్లడించింది.

అయితే, మేం పర్యటించిన గ్రామాల్లో గిరిజనులు మాత్రం హస్‌దేవ్ అరంద్ ప్రాంతంలోని గ్రామ సభ నిర్ణయాలను తరచూ ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.

ఈ విషయంపై మూడు గ్రామాలకు చెందిన గిరిజనులు జిల్లా పరిపాలనా యంత్రాంగాన్ని ఆశ్రయించారు. ఈ ఉల్లంఘనలపై విచారణ చేపట్టాలని వారు కోరారు. ఆ పత్రాలను బీబీసీ పరిశీలించింది. వీటిలో ఇక్కడి భూసేకరణ, పర్యావరణ అనుమతులకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అప్పీలు పత్రాలు కూడా ఉన్నాయి.

‘‘ఇక్కడి అడవుల్లోనే మా గ్రామ దేవతలు ఉంటాయి. మేం బొమ్మలకు పూజలు చేయం. ఇక్కడ గనుల తవ్వకం మొదలుపెడితే, మా ప్రాచీన సంప్రదాయాలను ధ్వంసం చేసినట్లు అవుతుంది’’అని నిరసన తెలుపుతున్న రామ్‌లాల్ కార్యం చెప్పారు. ఇక్కడ గనుల తవ్వకాన్ని అడ్డుకునేందుకు 2021లో 300 కి.మీ. పాదయాత్రగా రాయ్‌పుర్‌కు వెళ్లినవారిలో ఆయన కూడా ఒకరు.

ఛత్తీస్‌గఢ్

ఫొటో సోర్స్, PRITAM ROY

ఫొటో క్యాప్షన్, మునేశ్వర్ సింగ్ పోర్టే

భిన్న వాదనలు..

ఇక్కడ గిరిజనులు చెబుతున్న అంశాలను కెమెరాలో రికార్డు చేయడం అంత తేలిక కాదు. నిరసనలు పతాక స్థాయికి చేరడంతో ఈ ప్రాంతంపై కొందరు నిఘా పెట్టారు.

మేం రెండు రోజులు అటవీ ప్రాంతంలో గడిపినప్పుడు, మా వెనుకే కొందరు బైక్‌లు, ఎస్‌యూవీలపై వచ్చారు. మేం ఘట్‌బర్రాలో గ్రామపెద్దతో మాట్లాడేందుకు వెళ్తున్నప్పుడు మా వాహనాన్ని ధ్వంసం చేస్తామని కూడా కొందరు బెదిరించారు.

ఆ బెదిరించిన యువత కూడా ఇక్కడివారే. వారు గనుల తవ్వకానికి గట్టి మద్దతు తెలుపుతున్నారు. వీరి సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ, వారి స్వరం వినిపించడం ఎక్కువ అవుతోంది.

‘‘అభివృద్ధి జరిగేటప్పుడు కొంత విధ్వంసం కూడా జరుగుతుంది’’అని ఫతేపుర్‌ గ్రామానికి చెందిన కేశవ్ సింగ్ పోర్టే చెప్పారు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఘట్‌బర్రాకు వెళ్లినప్పుడు ఆయన మా వెంటే వచ్చారు.

‘‘కేవలం అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడటం కాదు. మాకు కూడా పెద్ద పెద్ద కలలు ఉంటాయి’’అని ఆయన అన్నారు. అయితే, ఈ రెండింటికీ మధ్య సమతూకం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

మేం మరొక గ్రామానికి వెళ్లినప్పుడు చంద్ర కుమార్, ఆయన సోదరుడు మా కారును అడ్డుకునేందుకు యత్నించారు.

అదానీ గ్రూపు గనిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నట్లు చంద్రకుమార్ చెప్పారు. ఇక్కడి గ్రామాల్లో అదానీ గ్రూపు వల్ల చాలా సానుకూల మార్పులు వచ్చాయన్నారు. ఇక్కడ ఒక పాఠశాల, నీటి సదుపాయం, ఆసుపత్రిని నిర్మించినట్లు తెలిపారు.

స్థానికులకు సాధికారత కల్పించేందుకు ఇక్కడ తాము చాలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు అదానీ గ్రూపు బీబీసీకి వెల్లడించింది. 800 మంది విద్యార్థుల కోసం ఒక పాఠశాల, 4,000 మంది యువత కోసం వృత్తివిద్యా కోర్సుల కేంద్రం, మొబైల్ క్లినిక్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించింది.

2013 నుంచి బొగ్గును ఉత్పత్తి చేస్తున్న పీఈకేబీ గని నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా 15,000 మంది ఉపాధి పొందుతున్నారని, స్థానికుల సాయం లేకుండా తాము ఇక్కడ ఇంత చక్కగా పనిచేయలేమని వ్యాఖ్యానించింది.

ఇలాంటి సానుకూల మార్పుల పేరుతో నిరసనల నోరు నొక్కేయాలని అదానీ గ్రూపు ప్రయత్నిస్తోందని స్థానిక ప్రజలు, సామాజిక ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామంలో యువతను నియమించుకొని గ్రామంలో జరిగే అన్ని కార్యకలాపాలపై గ్రూపు నిఘా పెడుతోందని వారు వివరించారు. ముఖ్యంగా నిరసనలపై నియంత్రణ కోల్పోకుండా చేసుకునేందుకు ఈ యువతను అడ్డుపెట్టుకుంటోందని ఆరోపించారు.

ఛత్తీస్‌గఢ్

ఫొటో సోర్స్, PRITAM ROY

గత ఏడాది మీడియాలో చర్చ

ఇక్కడి గిరిజనుల అభ్యర్థనలపై గత ఏడాది మీడియాలో భారీగా చర్చ జరిగింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన సొంత పార్టీ నిర్ణయంతో విభేదిస్తూ ఇక్కడి గిరిజనులకు మద్దతు కూడా పలికారు.

దిల్లీలో రైతుల నిరసనల్లో ప్రధాన పాత్ర పోషించిన రాకేశ్ టికైత్ కూడా ఒక్క చెట్టును కూల్చినా నిరసనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

మరోవైపు గనుల అనుమతులను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ఒక లేఖ కూడా రాసింది.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత కావాలనే జాప్యం చేస్తూ వచ్చిందని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అలోక్ శుక్లా ఆరోపించారు. అనుమతులను వెనక్కి తీసుకునే హక్కు రాష్ట్రానికి రాజ్యాంగం కల్పించిందని, దీని కోసం కేంద్రాన్నే ఆశ్రయించాల్సిన అవసరంలేదని ఆయన అన్నారు.

‘‘ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం కొరవడింది. ఎందుకంటే ఇక్కడ రాజస్థాన్ ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంది. అక్కడ కూడా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. అక్కడ విద్యుత్ ఉత్పత్తికి ఇక్కడి నుంచి తవ్వితీసే బొగ్గు అవసరం’’అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, ఆరేళ్లలో ప్రపంచ సంపన్నుడిగా ఎదిగిన అదానీ

దగ్గరపడుతున్న అసెంబ్లీ ఎన్నికలు

ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో పరిస్థితులు మరింత జటిలంగా మారుతున్నాయి. మరోవైపు వేసవి సమీపిస్తుండటంతో విద్యుత్ కోతలపై రాజకీయ వర్గాల దృష్టి మళ్లే అవకాశముంది.

తాజా ప్రాజెక్టుపై నిలుపుదల ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అయితే, తమకు న్యాయం జరుగుతుందని గిరిజనులు నమ్మకంతో ఉన్నారు.

‘‘మాకు కోర్టులపై నమ్మకముంది’’అని నిరసనలు చేపడుతున్న వారిలో ఒకరైన ఉమేశ్వర్ సింగ్ ఆర్మో చెప్పారు.

‘‘ఇది కేవలం హస్‌దేవ్ గురించి పోరాటం కాదు. వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం వెంటాడుతున్న నేపథ్యంలో మేం ఈ దేశం కోసం, ప్రపంచం కోసం పోరాడుతున్నాం’’అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)