ప్రియాంక గాంధీ దూకుడు కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తీసుకురాగలదా?

ప్రియాంక గాంధీ

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, అభినవ్ గోయల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘ఈ దేశ ప్రధాన మంత్రి పిరికి వ్యక్తి. నాపై కేసు పెట్టండి... నన్ను జైల్లో వేయండి...’

‘అమరవీరుడి తండ్రిని అవమానించారు...’

‘నా తండ్రి మృతదేహాన్ని త్రివర్ణ పతాకాన్ని చుట్టి తీసుకొచ్చారు...’

‘అమరవీరుడి కుమారుడిని మీరు దేశద్రోహి అంటున్నారు...’

‘ఈ నేలలో నా కుటుంబ రక్తం ఉంది...’

‘నా తల్లిని అవమానించారు...’

‘నేను తల వంచను, వెనక్కి తగ్గను, విలువలకు కట్టుబడి ఉంటాను’

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గత మూడు రోజులుగా అంటోన్న మాటలివి.

తన సోదరుడు అయిన రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన తర్వాత, ప్రియాంక గాంధీ దూకుడుగా మాట్లాడుతున్నారు.

ప్రియాంక గాంధీని చూస్తే, కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఆమె సవాలు చేస్తారని అర్థమవుతోంది.

తాను మాట్లాడేటప్పుడు ప్రియాంక గాంధీ ఉపయోగించే పదాలను బట్టి, రాజకీయ నిపుణులు ఈ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ప్రియాంక గాంధీ కేవలం కాంగ్రెస్‌ను ఒడ్డున పడేయడంతో పాటు, సరికొత్త పయనానికి మార్గాన్ని సిద్ధం చేస్తారని నిపుణులంటున్నారు.

ఈ సమయంలో, ప్రియాంక గాంధీ అసలు స్వభావం ఏంటి? ఇది 2.0 అవతార్‌నా? కష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించే సత్తా ఆమెకు ఉందా? ఒకవేళ అలా నడిపే సత్తా ఆమెకుంటే, దేశ రాజకీయాల్లో దాని ప్రభావమేంటి? 2024 సాధారణ ఎన్నికల్లో ప్రభావమెలా ఉంటుంది? వంటి పలు విషయాలు చర్చకు వస్తున్నాయి.

ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే, ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు ఏం చెబుతున్నారో చూద్దాం..

ప్రియాంక గాంధీ

ఫొటో సోర్స్, PRIYANKA GANDHI VADRA/FACEBOOK

ప్రియాంకలో ఉన్న ప్రత్యేకత ఏంటి?

‘‘రాహుల్‌తో పోలిస్తే ప్రియాంక గాంధీ చాలా వేగంగా ప్రజలతో కనెక్ట్ అవుతారు. రాహుల్ గాంధీ ఇంగ్లీష్‌లో ఆలోచించి, దాన్ని హిందీలోకి మార్చుకుని, మాట్లాడతారు. కానీ, ప్రియాంక గాంధీ అలా కాదు. హిందీలోనే అర్థం చేసుకుని, హిందీలోనే మాట్లాడతారు.

దేశంలో 48 శాతం మంది మహిళా ఓటర్లున్నారు. మహిళలతో, యువతతో ప్రియాంక గాంధీ చాలా బాగా కలిసిపోతారు. రాహుల్ గాంధీని బీజేపీ పప్పు అంటోంది. కానీ, ప్రియాంక గాంధీ అలా కాదు. ఆమె ఇమేజ్‌ను దెబ్బతీయడం కాస్త కష్టతరమే.

ఆమె ప్రేమగా మాట్లాడతారు. అవసరమైనప్పుడు కోపం కూడా చూపిస్తారు. ఇది అచ్చం ఇందిరా గాంధీ శైలిని ప్రతిబింబిస్తుంది. 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలు, ప్రియాంక గాంధీలో ఇందిరా గాంధీని చూసుకుంటారు.

రాహుల్ గాంధీ జైలుకి వెళ్లినా, వెళ్లకపోయినా, ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. చివరిసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమెకు పార్టీ మద్దతు కావాల్సి వచ్చింది, కానీ ఈ సారి అలా కాదు. ఆమెకు ఆమే ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఒకవేళ రాహుల్ గాంధీపై నేరారోపణలు కొనసాగితే, అటువంటి పరిస్థితుల్లో ఆమె వాయ్‌నాడ్ నుంచి పోటీ చేయొచ్చు.

ఒకవేళ రాహుల్ గాంధీ సభ్యత్వం పునరుద్ధరిస్తే, ఆమె 2024 ఎన్నికల్లో అమేథి లేదా రాయ్‌బరేలి నుంచి పోటీ చేస్తారు. సోనియా గాంధీ ఇప్పటికే పదవీ విరమణ గురించి మాట్లాడారు. ఆమె వద్ద ప్రస్తుతం ‘డూ ఆర్ డై’ అనే పరిస్థితి మాత్రమే ఉంది’’ అని సీనియర్ జర్నలిస్టు హేమంత్ అత్రి అన్నారు.

ప్రియాంక గాంధీ

ఫొటో సోర్స్, ANI

కాంగ్రెస్ పార్టీకి లాభమా?

‘‘ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది. మహిళలు ప్రధాన ఓటు బ్యాంకుగా అవతరించడంతో, నరేంద్ర మోదీ కూడా దాన్ని అర్థం చేసుకుని, అందిపుచ్చుకున్నారు.

బిహార్‌లో కూడా నితీష్ కుమార్ మహిళల ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని, వారి ఓట్లను దక్కించుకున్నారు. ప్రియాంక గాంధీ ఈ ఓటు బ్యాంకును ఆమె వైపుకి తిప్పుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఒకవేళ ప్రియాంక గాంధీ బలంగా ముందుకు వస్తే, అది పార్టీకి లాభం చేకూరుస్తుంది. జాతీయ స్థాయిలో ఉన్న ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలతో పోలిస్తే, ప్రియాంక గాంధీ చాలా త్వరగా ప్రజలతో కలిసిపోతారు’’ అని మరో సీనియర్ జరల్నిస్టు నీరజా చౌదరి అన్నారు.

ప్రియాంక గాంధీ

ఫొటో సోర్స్, PRIYANKA GANDHI VADRA/FACEBOOK

‘‘అప్పుడు విజయవంతమైనట్లు భావించొచ్చు’’

‘‘రాహుల్ గాంధీతో పోలిస్తే ప్రియాంక గాంధీపై రాష్ట్రాల నేతలకు నమ్మకం ఉంది. మూడు నాలుగేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీని వీడిన వారు రాహుల్ గాంధీ వల్లే తప్పుకున్నారు కానీ, ప్రియాంక గాంధీ వల్ల కాదు.

హేమంత్ బిశ్వ శర్మ అయినా లేదా జ్యోతిరాధిత్య సిందియా అయినా లేదా ఇతర నేతలైనా ప్రియాంక గాంధీ వల్ల కాంగ్రెస్‌ను వీడలేదు.

హిమాచల్‌లో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సమస్యను ప్రియాంక గాంధీ పరిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచింది. హిమాచల్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు క్రెడిట్ అంతా ప్రియాంక గాంధీకే దక్కుతుంది.

రాజస్తాన్‌లోని కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత పోరుకు ఆమె తెరదించగలదు. చత్తీస్‌గఢ్‌లో భూపేష్ బాఘేల్ కూడా ప్రియాంక గాంధీకి మద్దతు ఇస్తున్నారు.

క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ వచ్చినప్పటి నుంచి ఆమె చాలా దూకుడుగా ఉంటున్నారు. లఖీంపుర్ ఖీరీ ఘటన సమయంలో ప్రియాంక గాంధీ గట్టిగా పోరాడారు. అఖిలేష్ యాదవ్, మాయవతి, రాహుల్‌ గాంధీలు యూపీ ఎన్నికల్లో దీని గురించి అంత ఎక్కువగా మాట్లాడలేదు. కానీ, కేవలం ప్రియాంక గాంధీ మాత్రమే అక్కడ కనిపించారు. ఈ ఘటనపై మాట్లాడారు. అయితే, అక్కడ పార్టీ బలంగా లేకపోవడంతో, సీట్లు తగినన్ని రాలేదు. ఆమె ఒక్కరే గట్టిగా పోరాడారు.

రాష్ట్రాల నాయత్వాల్లో మల్లికార్జున ఖర్గే ప్రస్తుతం ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రియాంక గాంధీ వీధి పోరాటాలకు మాత్రం నేతృత్వం వహించగలరు.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఒకరకంగా దారిద్య్ర రేఖ కింద ఉంది. అది ఒకేసారి ఫోర్బ్స్ జాబితాలోకి వస్తుందని ఆశించకూడదు. ఆ పార్టీ దిగువ మధ్య తరగతి, ఆ తర్వాత ఎగువ మధ్య తరగతికి రానీయండి.

ఒకవేళ కాంగ్రెస్ 50 సీట్లను కాపాడుకోగలిగితే, ప్రియాంక గాంధీ నిజంగా విజయవంతమైనట్లు భావించొచ్చు’’ సీనియర్ జర్నలిస్టు విజయ్ త్రివేది అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)