గవర్నర్ పోస్టును రద్దు చేయాలా? వారి పనితీరుపై విమర్శలెందుకు?

ఫొటో సోర్స్, PTI
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, భారత బీబీసీ ప్రతినిధి
గవర్నర్ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతే, ప్రజాస్వామ్యం బలహీనపడే అవకాశం ఉందని గత వారం భారత అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.
గత ఏడాది శివసేన తిరుగుబాటుదారులతో అట్టుడుకుతున్న సమయంలో అప్పటి ప్రభుత్వాన్ని మహారాష్ట్ర గవర్నర్ బలపరీక్షకు పిలవడం ద్వారా ప్రభుత్వం కుప్పకూలింది. మహారాష్ట్ర గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చేసింది.
మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ల కూటమి అధికారంలో ఉండేది. కానీ శివసేనను సీనియర్ నాయకుడు ఏక్‌నాథ్ శిందే చీల్చారు. తన వర్గం ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
నాడు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఆదేశించారు. కానీ విశ్వాస పరీక్షకు ముందే ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు.
ఈ పరిణామాల మీద దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా మహారాష్ట్ర గవర్నర్ వ్యవహరించిన తీరు సరైంది కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు.
గవర్నర్ తీసుకునే నిర్ణయాల వల్ల ప్రభుత్వం పడిపోతుందనుకుంటే వారు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదన్నారు.

ఫొటో సోర్స్, AFP
‘ప్రజాస్వామ్యానికి అంపైర్’
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాజ్యాంగ ప్రతిష్టంభనకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లింది.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అలాగే, కేరళను లెఫ్ట్ పార్టీల కూటమి పాలిస్తోంది. ఈ రాష్ట్రాలకు, మహారాష్ట్రకు గవర్నర్లుగా బీజేపీకి చెందిన వారిని నియమించింది కేంద్రం.
ప్రధాన మంత్రి సూచన మేరకు రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తారు. రాష్ట్రానికి రాజ్యాంగ అధినేత గవర్నర్.
రాష్ట్ర పరిపాలనలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించడం గవర్నర్ విధి. కార్యనిర్వాహక, శాసనపరమైన, పర్యవేక్షణ అధికారాలు వీరి చేతులోనే ఉంటాయి.
రాష్ట్ర ఎన్నికల సమయంలో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు, ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పుడు గవర్నర్ నిర్ణయం కీలకంగా మారుతుంది.
క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే గవర్నర్ ప్రజాస్వామ్యానికి అంపైర్‌గా భావించవచ్చు.
కానీ, గవర్నర్లు రాజకీయ పక్షపాతిగా ఉంటున్నారని చాలా కాలంగా రాష్ట్రాల గవర్నర్లపై ఆరోపణలున్నాయి. వారు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్లు పనిచేస్తున్నారని విమర్శలున్నాయి.
‘గవర్నర్‌షిప్ అనేది అద్భుతమైన రిటైర్‌మెంట్’
కేంద్ర ప్రభుత్వాలు సాంప్రదాయంగా తమ ప్రత్యర్థులు నియమించిన గవర్నర్లను తొలగించి, కొత్త వారిని నియమిస్తూ వస్తున్నాయి. ఇది కూడా గవర్నర్ కార్యాలయాన్ని పూర్తిగా రాజకీయం చేస్తోంది.
1950 నుంచి 2015 మధ్య కాలంలోనే కేవలం 25 శాతం మంది గవర్నర్లు మాత్రమే ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. 37 శాతం మంది గవర్నర్లు తమ ఆఫీసులో ఏడాది కంటే తక్కువగానే ఉన్నారు.
ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం కోరకుండానే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గవర్నర్లను ప్రతిపాదిస్తూ వెళ్తుంది. ఈ కారణంతోనే, కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాల అంతరాయం పెరుగుతోంది.
గత కొన్ని దశాబ్దాలుగా, చాలా మంది గవర్నర్లు, సజావుగా సాగుతోన్న ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల్లో జోక్యం చేసుకోవడం చూశాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి విపక్ష పార్టీలు కావడం గమనార్హం.
పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసి 1980లో పదవీ విరమణ పొందిన బీకే నెహ్రూ తనకు తాను ఒకసారి ‘‘అధికార పార్టీలో అలసట పొందిన పదవీ విరమణ సభ్యుడు, ఆయనకు గవర్నర్‌షిప్ అనేది అద్భుతమైన రిటైర్‌మెంట్’’ అంటూ వర్ణించుకున్నారు.
పార్టీకి నమ్మకంగా పనిచేసిన వారికి, వారి సేవలకు ప్రతిఫలంగా ఈ పదవి ఇచ్చేందుకు మొగ్గుచూపుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
1950 నుంచి 2015 వరకు 52 శాతం రాజకీయ నాయకులకు లేదా 26 శాతం పదవీ విరమణ పొందిన బ్యూరోక్రాట్స్‌కు భారత్‌లో గవర్నర్ పదవులు దక్కాయని తన స్టడీలో ప్రొఫెసర్ అశోక్ పంకజ్ పేర్కొన్నారు.
మిగతా వారు జడ్జీలు, న్యాయవాదులు, రక్షణ శాఖ అధికారులు, విద్యావేత్తలు ఉన్నారు. గవర్నర్లందరిలో ఐదింట ఒకవంతు మాజీ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలని పేర్కొన్నారు.
అందుకే గవర్నర్ పోస్టును రద్దు చేసే సమయం ఆసన్నమైందని చాలా మంది నమ్ముతున్నారు.
‘‘ఏదైనా ఒకరోజు ఈ పోస్టు కనుమరుగైతే, ఏం జరగదు’’ అని ది ప్రింట్ ఎడిటర్ శేఖర్ గుప్తా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నియామకం మరింత పారదర్శకంగా జరగాలి
ఒకవేళ గవర్నర్ల స్థానాలను రద్దు చేయకపోతే, వారి అధికారాలను పరిమితం చేయడం మంచిదని చరిత్రకారుడు ముకుల్ కేశవన్ అన్నారు.
భారత్‌లో గవర్నర్ల పాత్రపై విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ థింక్ ట్యాంక్ సభ్యులు వివరణాత్మకంగా ఒక అధ్యయనాన్ని చేపట్టారు. ‘హెడ్స్ హెల్డ్ హై: సాల్వేజింగ్ స్టేట్ గవర్నర్స్ ఫర్ 21 ఫస్ట్ సెంచరీ ఇండియా’ పేరుతో ఈ స్టడీని నిర్వహించారు.
రాజ్ భవన్‌ను తీసేయడం కంటే, ఈ ఆఫీసును సంస్కరించాలని ఈ అధ్యయనం సూచించింది.
గవర్నర్లను నియమించడం, తొలగించడంలో అధికార పార్టీకి విశేషాధికారాలు ఉండకూడదని ఈ అధ్యయనాన్ని చేపట్టిన రచయితలు చెప్పారు.
మరింత సమాఖ్య, సహకార విధానంలో వీరి నియామకం, తొలగింపు ప్రక్రియ జరగాలన్నారు. గవర్నర్లపై తాము తీసుకునే చర్యలకు సంబంధించిన కారణాలు, ఇతర విషయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
గవర్నర్ల బాధ్యతలను ఎగ్జిక్యూటివ్‌కి లేదా జడ్జీలకు అప్పగిస్తే, ఆ రెండింటిని రాజకీయం చేసే అవకాశం ఉందన్నారు ఈ బుక్ సహ రచయిత లలిత్ పాండ.
లలిత్ పాండ స్టేట్‌మెంట్‌తో ఏకీభవించిన ప్రముఖ న్యాయవాది కేవీ విశ్వనాథన్, గవర్నర్ ఆఫీసుతో ఎలాంటి సమస్య లేదు, కానీ, ఈ కార్యాలయానికి ఎంపికయ్యే కొందరు అధికారుల చేతనే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు.
ఈ కార్యాలయాన్ని రద్దు చేయొద్దని, గవర్నర్ల చర్యలకు గల కారణాలను తెలుసుకుని, రికార్డు చేయాలని, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. వారి నియామకం మరింత పారదర్శకంగా జరగాలన్నారు.
ఇవి కూడా చదవండి:
- రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు కారణమైన పూర్ణేశ్ మోదీ ఎవరు? ఆయనకు నరేంద్ర మోదీకి సంబంధం ఏమిటి?
- 90 వేల మంది ఊచకోత: 45 ఏళ్ల తరువాత శవాలను తవ్వితీసి అస్థికలు అప్పగించిన ప్రభుత్వం, తమవారివి కావంటున్న కుటుంబీకులు
- ప్రియాంక గాంధీ: ‘‘రాముడు, పాండవులవి కూడా కుటుంబ రాజకీయాలా..? నా అన్నకు తండ్రి ఎవరో తెలియదంటూ నా తల్లిని మీరు అవమానించలేదా?’’
- రాహుల్ గాంధీ: రాజకీయ చదరంగంలో పోరాడుతున్న అయిదో తరం ‘యోధుడు’
- ‘రామ్‌జీ నగర్ గ్యాంగ్’: లాయర్లను పెట్టుకుని మరీ దొంగతనాలు చేసే ముఠా కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








