ప్రియాంక గాంధీ: ‘‘రాముడు, పాండవులవి కూడా కుటుంబ రాజకీయాలా..? నా అన్నకు తండ్రి ఎవరో తెలియదంటూ నా తల్లిని మీరు అవమానించలేదా?’’

ప్రియాంక గాంధీ

ఫొటో సోర్స్, Priyanka Gandhi Vadra/Facebook

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన నేపథ్యంలో ‘‘సంకల్ప్ సత్యాగ్రహ’ఈ పేరుతో కాంగ్రెస్ పార్టీ దీక్ష చేపట్టింది.

దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ప్రియాంక గాంధీ, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.

కుటుంబ రాజకీయాలు అంటూ తమను మాటిమాటికి బీజేపీ అవమానిస్తోందని ప్రియాంక గాంధీ అన్నారు.

ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే...

''ఒక అమరు(రాజీవ్ గాంధీ)ని కొడుకును పార్లమెంటులో అవమానించారు.

ఒక అమరుని కొడుకును దేశద్రోహి అని మీరు పిలుస్తున్నారు. మీర్ జాఫర్ అన్నారు.

అతని తల్లి(సోనియా గాంధీ)ని కూడా అవమానించారు. మా అమ్మను మీ(బీజేపీ) మంత్రి పార్లమెంటులో అవమానించారు.

రాహుల్ గాంధీకి అతని తండ్రి ఎవరో కూడా తెలియదు అని మీ ముఖ్యమంత్రి ఒకరు అన్నారు.

నెహ్రూ పేరును ఎందుకు పెట్టుకోవడం లేదని మీ ప్రధానమంత్రి పార్లమెంటులో నిలబడి ప్రశ్నించి మా కుటుంబాన్ని అవమానించారు. కశ్మీరీ పండితుల పరంపరను అవమానించారు.

రాహుల్ గాంధీని ఎంతగా అవమానించాలో అంతగా అవమానించారు. కుటుంబ రాజకీయాలంటూ పదేపదే విమర్శించారు.

మాటిమాటికి కుటుంబ రాజకీయం అంటూ బీజేపీ అంటోంది.

భగవాన్ రాముడు ఎవరు?

రాముడిని అడవులకు పంపారు. తన కుటుంబం, జన్మభూమి, ధర్మం కోసం ఆయన నిలబడ్డాడు. మరి రాముడు కుటుంబవాదా?

తమ కుటుంబ సంప్రదాయాల కోసం పోరాడిన పాండవులు కుటుంబవాదులా?

మేం ఎందుకు సిగ్గుపడాలి?

ఈ దేశం కోసం మా ఇంట్లో వాళ్లు ప్రాణాలు త్యాగం చేశారు. ఈ దేశం జెండాలోనూ మట్టిలోనూ మా వాళ్ల రక్తం ఉంది.

ఈ దేశ రాజకీయాల కోసం మా కుటుంబం నెత్తురు చిందించింది.

మమ్మల్ని అవమానించి, ఈడీ వంటి ఏజెన్సీలతో బెదిరిస్తే మేం భయపడతామనుకోవడం పొరపాటు.

మేం భయపడే వాళ్లం కాదు. మేం పోరాడతాం. ఈ దేశ రాజకీయాల కోసం మేం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.

ఈ దేశం స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడింది. నేడు కూడా ఈ దేశ స్వాతంత్ర్యం పోరాడుతూనే ఉంది'' అని ప్రియాంక గాంధీ అన్నారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

ఫొటో సోర్స్, Priyanka Gandhi Vadra/Facebook

‘‘అదానీకి దోచి పెడుతున్నారు’’

ఈ దేశ సంపదను అదానీకి ‘దోచి’ పెడుతున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. మేం ప్రశ్నించినందుకే మా మీద ఇలా దాడులు చేస్తున్నారని విమర్శించారు.

‘‘అదానీ అనే ఒక్క వ్యక్తిని కాపాడేందుకు ప్రధాని, మంత్రులు... మొత్తం ప్రభుత్వం ఎందుకు వస్తోంది?’’ అంటూ ఆమె ప్రశ్నించారు.

అదానీతో నరేంద్ర మోదీకి ఎటువంటి సంబంధాలు లేవని బీజేపీ చెబుతోంది.

రాహుల్ గాంధీ తప్పు చేయడం వల్లే చట్టప్రకారం కోర్టులు దోషిగా తేల్చాయని అస్సా ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ అన్నారు. రాహుల్ గాంధీ ఓబీసీలను కించపరిచేలా మాట్లాడారని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)