రాహుల్ గాంధీ: కాంగ్రెస్ నేత ముందున్న మార్గాలు ఏంటి?

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Rahul Gandhi/Facebook

    • రచయిత, శుభం కిశోర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం కోల్పోయారు.

‘మోదీ ఇంటిపేరు’ను ఉద్దేశించి నాలుగేళ్ల క్రితం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది.

దాంతో ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటిస్తూ శుక్రవారం మధ్యాహ్నం లోక్‌సభ సచివాలం నోటిఫికేషన్ విడుదల చేసింది.

కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు.

మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ముందున్న మార్గాలేమిటి? తర్వాత ఏం జరగొచ్చు? లాంటి అంశాల మీద మాజీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేసీ కౌశిక్‌తో బీబీసీ మాట్లాడింది.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, INDRANIL ADITYA/NURPHOTO VIA GETTY IMAGES

‘‘హడావుడి నిర్ణయం’’

ఈ కేసులో గురువారం శిక్ష విధించిన వెంటనే కోర్టు ఆయనకు నెల రోజులపాటు గడువు ఇచ్చింది. అంటే, ఈ సమయంలో ఆయన అప్పీలు చేసుకోవచ్చు.

అందుకే రాహుల్‌పై ప్రస్తుతానికి లోక్‌సభ సచివాలయం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవచ్చనే వార్తలు, విశ్లేషణలు వచ్చాయి.

అయితే, ప్రస్తుతం ఈ కేసులో స్పీకర్ హడావిడిగా నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందని కేసీ కౌశిక్ వ్యాఖ్యానించారు.

‘‘స్పీకర్ ఆగమేఘాలపై నిర్ణయం తీసుకోవాల్సిన కేసు కాదిది. తన నిర్ణయాన్ని నెల రోజులపాటు ఆయన వాయిదా వేసుకొని ఉండాల్సింది. ఎందుకంటే కోర్టే నెల రోజుల గడువు ఇచ్చింది. అంటే ఇక్కడ నెల రోజులపాటు శిక్షను సస్పెండ్ చేసింది. నా అభిప్రాయం ప్రకారం, స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించలేదు’’ అని ఆయన అన్నారు.

అయితే, శిక్ష పడిన తర్వాత చట్ట ప్రకారం సభ్యత్వాన్ని రద్దుచేస్తూ స్పీకర్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందేనని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చెబుతోంది.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ATUL LOKE/GETTY IMAGES

స్పీకర్ నిర్ణయాన్ని రాహుల్ సవాల్ చేయొచ్చా?

తన సభ్యత్వాన్ని రద్దుచేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు.

‘‘అప్పీలు చేసుకునే హక్కు రాహుల్ గాంధీకి ఉంది. ఎవరివైనా హక్కుల ఉల్లంఘన జరిగితే, రాజ్యాంగ ప్రకారం, రాజ్యంగ కోర్టులు (హైకోర్టు లేదా సుప్రీం కోర్టు)లను వారు ఆశ్రయించొచ్చు. ఆర్టికల్ 226 కింద ఆయన హైకోర్టుకు వెళ్లొచ్చు. లేదా ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీం కోర్టుకు వెళ్లొచ్చు’’ అని కౌశిక్ అన్నారు.

హైకోర్టు నుంచి ఉపశమనం వస్తే, ఏం జరుగుతుంది?

మొదట సూరత్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.

అక్కడ ఈ కేసు నుంచి విముక్తి లభించినా లేదా శిక్షను తగ్గించినా నేరుగా ఆయన పార్లమెంటు సభ్యత్వ పునరుద్ధరణ జరగదు. దీని కోసం మళ్లీ ఆయన హైకోర్టు లేదా సుప్రీం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.

‘‘ఈ కేసులో తన ఆదేశాలను స్పీకర్ సమీక్షించుకోవడానికి వీలుపడదు. హైకోర్టు లేదా సుప్రీం కోర్టు నిర్ణయం కోసం ఆయన ఎదురుచూడాల్సి ఉంటుంది’’ అని కౌశిక్ చెప్పారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

వాయనాడ్‌లో ఎన్నికలు నిర్వహిస్తారా?

స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో రాహుల్‌కు ఉపశమనం లభించకపోతే, పరువు నష్టం కేసులో నేరుగా హైకోర్టు లేదా సుప్రీం కోర్టుకు ఆయన వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ఆయన ఈ శిక్షపై స్టే తెచ్చుకోవాలి. ఈ మధ్యలో వాయనాడ్‌లో ఎన్నికల ప్రక్రియలు మొదలుకావొచ్చు.

‘‘ఈ స్థానం ఖాళీ అయిందని ఎన్నికల కమిషన్ నిర్ధారించిన వెంటనే, ఎన్నికలపై నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ను కూడా కావాలంటే రాజ్యాంగ కోర్టుల్లో సవాల్ చేయొచ్చు. ఇది రాహుల్ ముందుండే మూడో మార్గం అవుతుంది’’అని కౌశిక్ వివరించారు.

‘‘అయితే, ఒకసారి ఎన్నికల షెడ్యూల్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటిస్తే, కోర్టుల నుంచి ఉపశమనం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు’’ అని ఆయన చెప్పారు.

అంటే ఎన్నికలను అడ్డుకోవాలి అంటే, ఆ స్థానం ఖాళీ అయిందని ఎన్నికల కమిషన్ ప్రకటించిన వెంటనే రాహుల్ గాంధీ హైకోర్టుకు వెళ్లాలి.

రాహుల్ శిక్ష తగ్గిస్తే ఏం జరుగుతుంది?

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

రాహుల్ గాంధీకి మేజిస్ట్రేట్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష మరీ ఎక్కువని భావిస్తే, హైకోర్టు దీన్ని తగ్గించే అవకాశముంటుంది.

ఇప్పుడు ఒకసారి ప్రజాప్రాతినిధ్య చట్టం-1951ని ఒకసారి పరిశీలిద్దాం.

  • ఈ చట్టంలోని సెక్షన్ 8 (1) ప్రకారం, రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం, లంచం తీసుకోవడం, ఎన్నికలను ప్రభావితం చేయడం లాంటి కేసుల్లో శిక్ష పడితే చట్టసభ సభ్యత్వం కోల్పేయే అవకాశం ఉంటుంది.
  • మరోవైపు ఆహార పదార్థాలను అక్రమంగా నిల్వచేయడం లేదా కల్తీ చేయడం లాంటి కేసులో శిక్ష పడినా లేదా వరకట్న నిషేధ చట్టం కింద ఆరు నెలలు శిక్ష పడినా సభ్యత్వం కోల్పోవచ్చు.
  • చట్టంలోని సెక్షన్ 8 (3) ప్రకారం, ఏదైనా కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడినా సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఈ కేసులో అంతిమ నిర్ణయం స్పీకర్‌దే.

అంటే ఒకవేళ హైకోర్టు రాహుల్ గాంధీ శిక్షను రెండేళ్ల కంటే తక్కువకు తగ్గిస్తే, ప్రస్తుత సీటును ఆయన కాపాడుకోవచ్చు. అంతేకాదు, భవిష్యత్ ఎన్నికలకు అనర్హుడు కాకుండా అడ్డుకోవచ్చు.

వీడియో క్యాప్షన్, తెలంగాణలో భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీని కలిసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

ఇప్పుడు రాహుల్ ఏం చేస్తారు?

సూరత్ కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మొదట రాహుల్ గాంధీ అప్పీలు చేసుకోవాల్సి ఉంటుందని కౌశిక్ అన్నారు.

‘‘ఆ అప్పీలు దాఖలు చేసిన వెంటనే, తన శిక్షపై నిలుపుదల ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషన్ వేయాలి. మరోవైపు స్పీకర్ నిర్ణయాన్ని కూడా సవాల్ చేయాలని రాహుల్ న్యాయవాది ఆయనకు సూచించొచ్చు’’ అని ఆయన చెప్పారు.

స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయొచ్చు.

వీడియో క్యాప్షన్, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కంటైనర్ల కాన్వాయ్ ఎందుకు?

అసలేం జరిగింది?

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కర్నాటకలోని కోలార్‌లో మాట్లాడుతూ రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

‘‘అందరి దొంగల ఇంటి పేర్లలోనూ మోదీ అనే ఎందుకు ఉంటుంది’’అనే వ్యాఖ్య కూడా వాటిలో ఒకటి.

దీంతో భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 499, సెక్షన్ 500 కింద రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ సెక్షన్ల కింద గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష విధించొచ్చు.

రాహుల్‌కు శిక్ష పడిన వెంటనే ఈ కేసు వేసిన పిటిషనర్ పూర్ణేశ్ మోదీ మీడియాతో మాట్లాడారు. ‘‘కోర్టు నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. రెండేళ్ల జైలు శిక్షతో సంతప్తి చెందామా? లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, దీన్నొక సామాజిక ఉద్యమంగా చూడాలి. ఏదైనా కులం, సమాజానికి వ్యతిరేకంగా మనం వ్యాఖ్యలు చేయకూడదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, రాహుల్ గాంధీ ఏ వర్గాన్నీ కించపరిచేందుకు ఆ వ్యాఖ్యలు చేయలేదని కేసు విచారణ సమయంలో రాహుల్ న్యాయవాదులు మీడియాతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)