విద్యార్థినుల న్యూడ్ వీడియోలు తీసి వేధిస్తున్నారంటూ మతాధికారిపై ఆరోపణలు, అసలేంటీ కేసు?

చర్చి మతాధికారి

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో మతాధికారి బెనెడిక్ట్ ఆంటో అక్కడి కళాశాల విద్యార్థినులు, యువతుల న్యూడ్‌ వీడియోలు తీసి బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

దీంతో కుమారి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఆ మతాధికారి కోసం గాలిస్తున్నారు.

బెనెడిక్ట్ ఆంటో స్వస్థలం కన్యాకుమారి జిల్లా కలియకవిలై సమీపంలోని ఫాతిమా పట్టణం. అక్కడి పిలంగలై ప్రాంతంలోని చర్చిలో ఆయన మతాధికారిగా పని చేసేవారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెనెడిక్ట్ చర్చికి వచ్చిన మహిళల వివరాలు తెలుసుకుని వారికి వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపి, ముందుగా స్నేహపూర్వకంగా మాట్లాడి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.

అలాగే, పరిచయం ఉన్న మహిళలతో వీడియో కాల్స్‌ చేసి అసభ్యకరంగా ప్రవర్తించేవారు.

అంతేకాకుండా మహిళల న్యూడ్ వీడియోలను రికార్డ్ చేస్తూ వారిని లైంగికంగా వేధించి, బెదిరించారని పోలీసులకఫిర్యాదులు వచ్చాయి.

న్యాయ విద్యార్థికి తెలియడంతో అనూహ్య మలుపు

ఈ కేసులో కట్టటూర సమీపంలోని పిలావళై ప్రాంతానికి చెందిన న్యాయ విద్యార్థి ఆస్టిన్ జినో గత కొన్నిరోజులుగా ‘మతాధికారి లీలల’ పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో బెనెడిక్ట్ ఆంటోక్, విద్యార్థి ఆస్టిన్ గినో మధ్య గొడవ జరిగింది.

అనంతరం ఆస్టిన్ జినో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బెనెడిక్ట్ ఆరోపించారు. మహిళలతో సరసాలాడుతున్నట్లు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని బెనెడిక్ట్ కొల్లంగోడ్ పోలీస్టేషన్‌లో ఆస్టిన్‌పై ఫిర్యాదు చేశారు.

మతాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొల్లంగోడ్ పోలీసులు ఆస్టిన్ జినోను అరెస్ట్ చేశారు.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

కొడుకు కోసం పోరాడిన తల్లి

ఆస్టిన్‌ జినో తల్లి కన్యాకుమారి జిల్లా ఎస్పీ హరిహరన్ ప్రసాద్‌ను స్వయంగా కలిసి, ఘటనపై ఫిర్యాదు చేశారు. ఆ మతాధికారి పలువురు మహిళలతో చేసిన అసభ్యకర చాటింగ్‌లతో పాటు ఫొటోలు, వీడియో సాక్ష్యాలను అందించారు.

11వ తేదీన కట్టటూర సమీపంలోని అలంతతువిళైకి చెందిన ఓ మహిళ కూడా ఎస్పీని కలిశారు.

మతాధికారి బెనెడిక్ట్ యువతులను, విద్యార్థినులను లైంగికంగా వేధించాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బాధిత మహిళలకు న్యాయం చేయాలని కోరారు.

రెండు రోజుల క్రితం పాచిపరై ప్రాంతానికి చెందిన ఒక నర్సింగ్ విద్యార్థిని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు ఫిర్యాదు చేశారు.

ఆమె ఫిర్యాదులో ‘‘బెనెడిక్ట్ మతాధికారిగా పనిచేస్తున్న చర్చికి వెళ్లాను. తొలుత క్యాజువల్‌గా మాట్లాడి ఆశీర్వదించారు. తర్వాత ఆయన నన్ను అనుచితంగా తాకడం ప్రారంభించారు. మేం ఇంటికి వచ్చాక, మా అమ్మ నుంచి సెల్‌ఫోన్ నంబర్ తీసుకుని నాతో మాట్లాడారు.

ఏం చేయాలో తెలియక మాట్లాడాను. అయితే వాట్సాప్‌లో అసభ్యంగా మాట్లాడారు. వీడియో కాల్ ద్వారా డిస్టర్బ్ చేశారు.

ఆయన నాతో మాత్రమే కాకుండా చాలా మంది మహిళలతో కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారని తెలుసు. ఆయన్ను హెచ్చరించాను. పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నాను. దీంతో ఆయన నన్ను బెదిరించారు. ఈ విషయంలో ఆయనపై చర్యలు తీసుకోవాలి'' అని ఆ యువతి కోరారు.

ఈ ఫిర్యాదుల ఆధారంగా గురువారం సాయంత్రం బెనెడిక్ట్ ఆంటోపై నాగర్‌కోయిల్ సైబర్ క్రైమ్ పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయపై ఇప్పటి వరకు ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదుల ఆధారంగా కుమారి జిల్లా ఎస్పీ హరిహరన్ ప్రసాద్ దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

తమిళనాడు

విషయం ఎలా బయటపడింది?

జైలులో ఉన్న ఆస్టిన్ జినో తల్లి మినీ అజిత బీబీసీ తమిళ్‌తో మాట్లాడుతూ “పాస్టర్ బెనెడిక్ట్ ఆంటో చర్చికి వచ్చే మహిళలతో అనుచితంగా ప్రవర్తించేవారు. వాట్సాప్ ద్వారా లైంగికంగా వేధించేవారు.

మతాధికారి వద్ద 'క్షమాపణ కోరడానికి' వెళ్లినప్పుడు, ఒక కళాశాల విద్యార్థిని ద్వారా మతాధికారి గురించి నా కొడుకుకు తెలిసింది.

ఆ విద్యార్థిని సెల్‌ఫోన్‌కు మతాధికారి బెనెడిక్ట్ రాత్రి వేళల్లో అసభ్యకరమైన సందేశాలు పంపి గదిలో ఉన్న విద్యార్థిని న్యూడ్ ఫోటోలు పంపాలని బెదిరించారు.

ఆయన గురించి తల్లిదండ్రులకు చెప్పలేక భయాందోళనకు గురైన విద్యార్థిని రక్షించాలంటూ నా కొడుకు వద్దకు వచ్చింది.

కాలేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపుల గురించి నా కొడుకు ఆ మతాధికారిని నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

సమస్యను పరిష్కరించేందుకు మతాధికారి నా కొడుకును లాయర్ ద్వారా తన ఇంటికి రమ్మన్నారు. అక్కడికి వెళ్లాక ఇంట్లోని వస్తువులను పగలగొట్టి డబ్బులు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆ మతాధికారి నా కొడుకుపై ఆరోపణలు చేశారు.

మహిళలతో ఆయన కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు పోలీసులు నా కొడుకును అరెస్టు చేసి జైలులో పెట్టారు.

మతాధికారి ఇంటికి వెళ్లిన నా కొడుకు ఆయన ల్యాప్‌టాప్ తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఇంట్లోని వస్తువులను పగలగొట్టారు.

ఆ ల్యాప్‌టాప్‌లో 50 మందికి పైగా మహిళల అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. అమాయకుడైన నా కుమారుడికి న్యాయం చేయాలని పోలీసు శాఖను కోరుతున్నా'' అని అన్నారు.

మతాధికారి ముసుగులో అనేక మంది మహిళల జీవితాలను నాశనం చేస్తూ అసభ్యకర చర్యలకు పాల్పడుతున్న బెనెడిక్ట్ ఆంటోపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆస్టిన్ జినో తల్లి మినీ అజిత ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

పోలీస్ కేసు

ఫొటో సోర్స్, Getty Images

ఆయన పరారీలో ఉన్నారు: పోలీసులు

ఓ సైబర్ క్రైమ్ పోలీసు అధికారి బీబీసీ తమిళ్‌తో మాట్లాడారు.

''సోషల్ మీడియాలో మతాధికారి అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు, మహిళల ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం మతాధికారిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

వీడియో వాస్తవికతను పోలీసులు పరిశీలిస్తున్నారు. మతాధికారి వద్ద మరో ల్యాప్‌టాప్ ఉంది. ఆయన పరారీలో ఉండటంతో దాన్ని స్వాధీనం చేసుకోలేకపోయాం, త్వరలోనే ఆ మతాధికారిని అరెస్ట్‌ చేస్తాం. ఒకవేళ ఆయన తన ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వీడియో, ఫోటోగ్రాఫ్‌లు డిలీట్ చేస్తే, సాక్ష్యాలను ధ్వంసం చేసిన అదనపు కేసు నమోదు అవుతుంది. వీడియో, ఫోటోలు రికవరీ అవుతాయి" అని సైబర్ క్రైమ్ అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)