తెలంగాణ: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం ఎలా జరిగింది?

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్ద ఆందోళన

ఫొటో సోర్స్, Bhanu prakash Bjym/Facebook

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రేణుక అనే హిందీ టీచర్, ప్రవీణ్ అనే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్… ఈ ఇద్దరూ కలసి దాదాపు 55 వేల మంది యువత జీవితాలను గందరగోళంలోకి నెట్టేశారు.

రోజుకో మలుపుతో ఆసక్తికరంగా నడిచిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో అసలు ఏం జరిగింది?

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిబ్బందిని నియమించడం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పని. అందులో 2017 నుంచీ పనిచేస్తున్నాడు పులిదిండి ప్రవీణ్ కుమార్. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న తండ్రి మరణంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొంది, జూనియర్ అసిస్టెంటుగా చేరి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా ఎదిగి, ఆ సంస్థ మొత్తానికి కీలకమైన కమిషన్ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా (పీఏ)గా చేస్తున్నాడు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఒకసారి పని మీద వెళ్లిన రేణుకకు అతనితో పరిచయం అయింది. వాళ్లిద్దరూ స్నేహితులుగా ఉండేవారు. రేణుక ఒక ప్రభుత్వ గురుకులంలో హిందీ టీచర్‌గా పనిచేస్తుండగా, ఆమె భర్త ఢాక్యా నాయక్ కూడా ఒక ప్రభుత్వ శాఖలో టెక్నికల్ అసిస్టెంటుగా పనిచేస్తున్నారు.

రేణుక తమ్ముడు రాజేశ్వర్ నాయక్ కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువుకుంటున్నారు.

అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష కోసం చదువుతోన్న తన తమ్ముడు రాజేశ్వర్‌కి సాయం చేయడం కోసం, రేణుక ఆమె భర్త ఢాక్యా ప్రవీణ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఏఈ పరీక్ష క్వశ్చన్ పేపర్ తమకు ఇస్తే, 10 లక్షల రూపాయలు ఇస్తామని ప్రవీణ్‌కు ఆశ పెట్టారు ఈ భార్యాభర్తలు. ఆ డబ్బు కోసం పేపర్ అమ్మడానికి ఒప్పుకున్నాడు ప్రవీణ్.

పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో తాత్కాలిక ఉద్యోగిగా ఆరేళ్ల నుంచి పనిచేస్తోన్న రాజశేఖర రెడ్డి ప్రవీణ్‌కి స్నేహితుడు. రాజశేఖర రెడ్డి తాత్కాలిక ఉద్యోగియే కానీ, కంప్యూటర్ విభాగం చూడ్డం వల్ల కంప్యూటర్ నెట్వర్కింగ్ మీద బాగా పట్టుంది. దీంతో ఈ ఇద్దరూ కలసి క్వశ్చన్ పేపర్ కొట్టేసే ప్లాన్ చేశారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పనిచేసే శంకర లక్ష్మి అనే ఆవిడ డైరీలో తన కీలకమైన కంప్యూటర్ల ఐపీ అడ్రస్, యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంటాయి. ఆవిడ సంస్థ కార్యదర్శిని కలవడానికి వెళ్లినప్పడు ఆవిడ డైరీలోని ఈ వివరాలు తీసేసుకున్నట్టు పోలీసులు ముందు అంగీకరించాడు ప్రవీణ్. అదే విషయాలన్ని పోలీసులు తమ రిమాండు రిపోర్టులో రాశారు. ఆ పాస్ వర్డ్ వాడి సర్వర్ నుంచి దాదాపు 4 ఫోల్డర్లు డౌన్లోడ్ చేసి పెన్ డ్రైవ్‌లో వేసుకున్నారు. అందులో నుంచి ఏఈ పరీక్షా పత్రాన్ని ప్రింట్లు తీసుకున్నారు. కంప్యూటర్ల నుంచి పేపర్ దొంగిలించే కార్యక్రమం మొత్తం రాజశేఖర రెడ్డి సహకారంతో జరిగింది.

పేపర్ రేణుకకు వచ్చాక తమ్ముడొక్కడికే కాకుండా తమ కులానికే చెందిన ఇంకొందరికి అమ్మకానికి పెట్టింది. తమకు తెలిసిన వాళ్లను సంప్రదించి ఏఈ పేపర్ ఉందంటూ బేరాలు ఆడారు భార్యాభర్తలు. ఆ క్రమంలో హైదరాబాద్ శివార్లలో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న బంధువు శ్రీనివాస్ ద్వారా నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్ అనే ఇద్దరికి కూడా అమ్మకానికి పెట్టారు.

టీఎస్‌పీఎస్‌సీ

ఫొటో సోర్స్, TSPSC website

హ్యాక్ – హనీ ట్రాప్ – పాస్వర్డ్ థెఫ్ట్:

పేపర్ లీక్ వ్యవహారం బయట పడడంతో మెల్లిగా విషయం పోలీసుల వరకూ చేరింది. వారు ఇదే విషయంపై పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఎలర్ట్ చేశారు. అటు సర్వీస్ కమిషన్ వారూ తప్పు జరుగుతోందని ఆలస్యంగా గుర్తించి పోలీసు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులకు ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయి.

మొదట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్వర్లు హ్యాక్ అయ్యాయి అని అనుమానించారు. మొట్టమొదట బేగం బజార్ పోలీస్ స్టేషన్లో మార్చి 11న హ్యాకింగ్ గురించే ఫిర్యాదు చేశారు. అంతేకాదు తరువాత జరగబోయే అంటే మార్చి 12, మార్చి 15, మార్చి 16 తేదీల్లో జరగబోయే పరీక్షలన్నిటినీ వాయిదా వేసింది కమిషన్.

నిజానికి అప్పటికే జరిగిపోయిన ఒక పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయి అన్న విషయం అప్పటికి వారికి కూడా తెలియదు.

పోలీసుల ప్రాథమిక విచారణలో ఇది హ్యాకింగ్ కాదనీ, హనీ ట్రాప్ అనీ అనుమానం వచ్చింది. ప్రవీణ్ మొబైల్ ఫోన్లో కొందరు మహిళలకు సంబంధించిన కాంటాక్టులు, చాటింగులను బట్టి వారికి ఆ అనుమానం వచ్చింది.

అయితే ప్రస్తుత లీకేజీ వ్యవహారం డబ్బు విషయంగా జరిగిందనే పోలీసులు చెబుతున్నారు. ఇందులో మహిళతో సంబంధాల కోణం ఉన్నదని పోలీసులు ఎక్కడా ధ్రువీకరించడం లేదు.

‘‘అతని సెల్ ఫోన్‌లో ఉన్న ఫోటోలు, చాటింగులు, చాటింగుల్లోని ఫోటోలు ఆధారంగా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అతని ఫోన్లో మహిళల కాంటాక్టులు ఎక్కువ ఉన్నాయి. అయితే ప్రస్తుతం రేణుకకు క్వశ్చన్ పేపర్ 10 లక్షల రూపాయలకు అమ్మినట్టుగా మాత్రం తెలుసు. ఇదంతా రేణుకా, ఆమె భర్త కలిసే చేశారు. ఇద్దరూ కలిసే ప్రవీణ్ తో మాట్లాడారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇతరులకు పేపర్ అమ్మారు. . వాళ్లిద్దరకీ పరిచయం ఉందనీ తెలుసు. అంతకుమించి ఇది హనీ ట్రాప్ అనడానికి పూర్తి సాక్ష్యాలు లేవు’’ అని బీబీసీతో చెప్పారు ఒక పోలీసు అధికారి.

చివరగా ఇది యూజర్ ఐడీ, పాస్వర్డ్‌లను కొట్టేసి చేసిన నేరం అని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. 12వ తేదీనే అరెస్టులు ప్రారంభం అయ్యాయి. పులిదిండి ప్రవీణ్ కుమార్, అట్ల రాజశేఖర రెడ్డి, లాద్యావత్ రేణుక, లాద్యావత్ ఢాక్యా, కేతావత్ రాజేశ్వర్, కేతావత్ నీలేశ్ నాయక్, పత్లావత్ గోపాల్ నాయక్, కేతావత్ శ్రీనివాస్, కేతావత్ రాజేంద్ర నాయక్‌లను అరెస్టు చేశారు పోలీసులు.

వీరి నుంచి పెద్ద ఎత్తున పెన్ డ్రైవులు, ఫోన్లు, ల్యాప్ టాపులు స్వాధీనం చేసుకున్నారు. అన్నిటికీ మించి ఏఈ క్వశ్చన్ పేపర్ 24 కాపీలు తీసుకున్నారు.

టీఎస్‌పీఎస్‌సీ

డబ్బు చేతులు మారింది ఇలా

మార్చి 2వ తేదీన రేణుక, ఢాక్యాలు ప్రవీణ్ కు 5 లక్షల రూపాయలు ఇచ్చారు. 6వ తేదీన మరో 5 లక్షలు ఇచ్చారు. రేణుక తమ్ముడు రాజేశ్వర్ తో పాటూ, బంధువు శ్రీనివాస్ ద్వారా మరో ఇద్దరు ఈ పేపర్లు కొన్నారు.

నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్‌లు కలసి రేణుకకు 13 లక్షల 50 వేల రూపాయలు ఇచ్చారు. ఇద్దరూ చెరో 14 లక్షలూ ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నారు. అయితే వ్యవహారం బయటకు పొక్కకుండా వారిని తమ ఇంట్లోనే పెట్టుకుని పరీక్షకు తీసుకుని వెళ్లారు.

టీఎస్‌పీఎస్‌సీ

కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కి ఎలా వెళ్లారు?

నిజానికి టీఎస్పీఎస్సీలో ఎప్పటి నుంచో సిబ్బంది కొరత ఉంది. అక్కడ పూర్తి స్థాయి ఉద్యోగులు 83 మందే. తాజా ఘటన జరిగిన వెంటనే కంప్యూటర్ల భద్రతను పెంచేలా సైబర్ నిపుణులతో సమావేశం నిర్వహించారు చైర్మన్ జనార్థన రెడ్డి.

సిబ్బంది తక్కువ మంది ఉండడం చేత కీలకమైన పనుల్లో కూడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఆ క్రమంలోనే మొత్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నెట్వర్క్ మొత్తం ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర రెడ్డి చేతిలో పడింది.

సాధారణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నా పత్రాలన్నీ ముందుగానే సిద్ధం అవుతాయి. వాటిని కాన్ఫిడెన్సియల్ అనే సెక్షన్లో ఉంచుతారు. అక్కడకు వెళ్లడానికి అందరికీ అనుమతి ఉండదు. అదే సమయంలో వాటి పాస్ వర్డులు కూడా కొందరికే చెబుతారు.

కానీ ఈ మొత్తం వ్యవస్థ అంత పటిష్టంగా లేకపోవడంతో ప్రవీణ్ – రాజశేఖర్ల పని సులువు అయింది. ప్రవీణ్ స్వయంగా సంస్థ కార్యదర్శికి పీఏ కావడంతో అతనికి పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ వ్యవహారంపై కమిషన్ చైర్మన్ జనార్ధన రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘సంస్థలో ఉద్యోగులను కుటుంబ సభ్యులలా చూస్తాం. కానీ మేం వారిని నమ్మితే వారు గొంతు కోశారు. తక్కువ మంది సిబ్బంది కాబట్టి ఉన్నవారినే బుజ్జగించి పనిచేయించుకుంటాం. ఎవరిమీదైనా నేరం రుజువు అయితే తప్ప ఎవర్నీ అనుమానించలేం. మాకిప్పటి వరకూ ఎవరిమీదా అనుమానం రాలేదు’’ అంటూ చెప్పారాయన.

‘‘రాజశేఖర రెడ్డి ఆరేడేళ్ల నుంచి ఇక్కడ నెట్ వర్క్ ఎక్స్‌పర్ట్‌గా ఉన్నారు. ఆయనకు అన్ని ఐపీ అడ్రస్లూ తెలుసు. ఐపీ అడ్రస్ తెలిస్తే ఎక్కడ నుంచి అయినా సర్వర్ యాక్సెస్ చేయవచ్చు. ఆయన ఇలా చేస్తాడు అనుకోలేదు. ప్రవీణ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు’’ అన్నారు జనార్ధన రెడ్డి.

మీడియాతో మాట్లాడే క్రమంలో టీఎస్పీఎస్సీ ఎంత పారదర్శకంగా పనిచేస్తున్నదీ వివరించే ప్రయత్నం చేశారు చైర్మన్ జనార్ధన రెడ్డి.

ప్రవీణ్ గ్రూప్ 1 పరీక్ష రాసింది వాస్తవమేననీ కానీ ప్రవీణ్‌కి వచ్చిన మార్కులు హయ్యస్ట్ కాదనీ ఆయన చెప్పారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ మార్కులు కొలమానం కాదనీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే కాబట్టి, ప్రవీణ్ ఆ పరీక్ష రాసినంత మాత్రాన ఆ పరీక్షపై ఈ ప్రభావం ఉండదనీ జనార్థన రెడ్డి చెప్పారు.

టీఎస్‌పీఎస్‌సీ

నేరం చేయలేదు.. కానీ విషయం తెలిసీ పోలీసులకు చెప్పనూ లేదు

రేణుకకు బంధువైన కానిస్టేబుల్ శ్రీనివాసు కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. నిజానికి అతను క్వశ్చన్ పేపర్ వద్దన్నారు. కానీ తన స్నేహితులకు కావాలేమోనని రిఫర్ చేశారు. అదే కొంప ముంచింది.

తన స్నేహితులకు కావాలేమో అంటూ వారి నంబర్ ఇచ్చారు. దీంతో నేరం జరుగుతుందనీ తెలిసీ పోలీసులకు చెప్పనందుకు గానూ అతనిపై కూడా కేసు పెట్టినట్టు చెప్పారు హైదరబాద్ పోలీసులు. ప్రస్తుతానికి రాజశేఖర రెడ్డిని ఉద్యోగంలో నుంచి తీసేశారు. ప్రవీణ్ ని సస్పెండ్ చేశారు.

రద్దు చేసిన పరీక్షలు త్వరలోనే నిర్వహిస్తామన్న చైర్మన్, ఏఈ పరీక్ష ఏం చేయబోతున్నారనేది మాత్రం ఇంకా చెప్పలేదు.

ఈ అంశం రాజకీయంగా కూడా మారింది. అన్ని పార్టీలూ ఈ విషయంలో ఘాటుగా స్పందించాయి. బీజేపీ బండి సంజయ్, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, బీఎస్పీ ప్రవీణ్ కుమార్లు ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. బీఎస్పీ నాయకులు, బీజేపీ యుజవన విభాగం నాయకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ఆందోళనకు దిగారు.

మరో వైపు ప్రభుత్వం కేసును ప్రత్యేక విచారణ బృందం సిట్‌కి బదిలీ చేసింది. సిట్ తరుపున సీనియర్ అధికారి శ్రీనివాస రావు కేసు విచారించనున్నారు.

వీడియో క్యాప్షన్, తొలి ప్రయత్నంలోనే న్యాయసేవలో ఉన్నత ఉద్యోగాన్ని సాధించిన హరియాణాకు చెందిన రేణు బాలా కథేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)