చెడ్డీ గ్యాంగ్: ఒంటికి నూనె రాసుకుని వస్తారు, చేతికి చిక్కకుండా జారుకుంటారు. ఈ దొంగల ముఠాలను ఎలా గుర్తించొచ్చంటే..

ఫొటో సోర్స్, AP Police
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
ఎండాకాలం వస్తోందంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతటా దొంగతనాలు ఎక్కువవుతాయి. వేసవి సెలవులకు ఊళ్లకు వెళ్లేవారి ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చెడ్డీ గ్యాంగ్, పార్థీ గ్యాంగ్ లాంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు చెలరేగిపోతాయని పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.
ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ సంచరించినట్లు సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా తిరుపతి జిల్లాలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే గతంలో తిరుచానూరు, చిగురువాడ, తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ కదలికలను పోలీసులు గుర్తుచేసుకుంటున్నారు.
వేసవి వచ్చేయడం, దొంగల ముఠాల కదలికలు కూడా కనిపించడంతో ప్రజలను అప్రమత్తం చేసి, వారిలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తిరుపతి జిల్లా పోలీసులు.
అసలు ఈ గ్యాంగ్స్ ఎలా పనిచేస్తాయి?, ఎలా దొంగతనాలు చేస్తాయి? అన్నది వివరించిన తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి, ఆ దొంగలను ఎలా గుర్తు పట్టవచ్చు, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఎలా కాపాడుకోవచ్చో కూడా బీబీసీకి వివరించారు.

అసలేంటీ చెడ్డీ గ్యాంగ్?
ఈ చెడ్డీ గ్యాంగ్ ముఠాలు ఎక్కువగా మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల నుంచి దక్షిణాదికి వస్తారని ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు.
“రాత్రి సమయంలో చొక్కా లేకుండా, చెడ్డీలు వేసుకుని తిరుగుతారు. ఎవరైనా వెంటాడి పట్టుకున్నా తప్పించుకోవడానికి వీలుగా ఒళ్లంతా నూనె రాసుకుంటారు. రాడ్లు, కత్తులు వంటి మారణాయుధాలతో తిరుగుతారు. ఎవరైనా ప్రతిఘటిస్తే వాళ్ళను గాయపరచడం, ప్రాణాలు తీసేసి పారిపోవాలనే ఉద్దేశంతో ఉంటారు” అన్నారు.
ఈ దొంగల ముఠాలు పగటి పూట సంచార కుటుంబాల్లా రోడ్లపై చీరలు, గిఫ్ట్ ఐటమ్స్ లాంటివి అమ్ముకుంటున్నట్లు కనిపిస్తారని పోలీసులు చెప్పారు.
వస్తువులు అమ్ముకుంటూనే దోచుకోవడానికి వీలుగా ఉన్న ఇళ్లను రెక్కీ చేస్తారని, రాత్రి పూట ఆ సెలక్ట్ చేసిన ఇళ్లలో దొంగతనాలు చేస్తారని పోలీసులు చెబుతున్నారు.
ఈ గ్యాంగ్‌ను ఎలా గుర్తించవచ్చో కూడా పోలీసులు చెప్పారు. స్థానికులకు అనుమానం రాకుండా ఉండేందుకు వారు లోకల్ భాషలో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తారని, కానీ స్థానికులు మాట్లాడినంత సరళంగా మాట్లాడలేకపోతున్న వారిని ఇలాంటి గ్యాంగ్ సభ్యులుగా అనుమానించవచ్చని చెప్పారు.
అలాంటి అనునామాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేసి వివరాలు చెబితే, పోలీసులు తక్షణం చర్యలు తీసుకుంటారని ఎస్పీ పరమేశ్వర రెడ్డి వివరించారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
చెడ్డీ గ్యాంగ్‌కు తమ ఇల్లు టార్గెట్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా పోలీసులు వివరించారు. ఇంటి చుట్టూ ఎలక్ట్రిక్ లేదా సోలార్ ఫెన్సింగ్ వేసుకోవాలని లేదా కాలనీ ప్రజలందరూ కలిసి గార్డును పెట్టుకోవడం మంచిదని సూచించారు.
“వీళ్లు తమకు అనువుగా ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఉన్నప్పటికీ గడియ సరిగా పెట్టామా, లోపల నుంచి లాక్ వేసుకున్నామా అనేది చూసుకోవాలి. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఉన్నవారు తమ ఇళ్ల చుట్టూ సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడం మంచిది. కాస్త మంచి నాణ్యమైన కెమెరాలను పెట్టుకోవాలి. ఇంటికి ఎలక్ట్రిక్, సోలార్ ఫెన్సింగ్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలి. వీలైతే కొన్ని కాలనీల వాళ్లు అందరూ కలిసి ప్రైవేట్ గుర్ఖాను గానీ, నైట్ వాచ్‌మెన్‌ను గానీ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు అతని మూమెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ దొంగతనం జరిగే అవకాశం ఉండదు” అన్నారు.

వేసవి సెలవుల్లో వెళ్తుంటే ‘LHM’
ఎవరైనా వేసవి సెలవుల్లో వేరే ఊళ్లకు, లేదా బంధువుల ఇళ్లకు వెళ్లే సమయంలో ముందే పోలీసులకు సమాచారం ఇస్తే ఆ ఇళ్లపై నిఘా పెడతామని, దొంగతనాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తిరుపతి పోలీసులు చెబుతున్నారు.
లాక్డ్ హౌస్ మానిటరింగ్ (LHM) అనే సిస్టమ్‌ను రూపొందించామని, దీని సాయంతో ఇళ్లపై నిఘా పెట్టవచ్చని, దొంగతనాలు అడ్డుకోవచ్చని పరమేశ్వర్ రెడ్డి చెప్పారు.
“ఇల్లు వదిలిపెట్టి వేరే ఊళ్లకు వెళ్లేటప్పుడు ముందే పోలీసులకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం ద్వారా నిఘా పెట్టమని రిక్వెస్ట్ ఇవ్వాలి. అలా సాయం కోరిన వారి ఇంట్లో పోలీసులు ఒక కెమెరా పెడతారు. అక్కడి నుంచి కంట్రోల్ రూమ్‌కు కనెక్షన్ ఉంటుంది. దానిపై 24 గంటలూ నిఘా ఉంటుంది. అపరిచితులు ఎవరైనా తాళం విరగ్గొట్టి ఆ ఇంట్లోకి అడుగుపెడితే వెంటనే ఇక్కడ అలారం మోగుతుంది. వెంటనే పోలీసులు, సమీపంలో ఉన్న పెట్రోలింగ్ బృందాలు అక్కడికి వెళ్లి దొంగలను పట్టుకుంటారు” అని వివరించారు.
ఎవరైనా, ఎప్పుడైనా సెలవులకు వెళ్తుంటే విలువైన బంగారం, డబ్బు, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకపోవడమే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. వాటిని తమతోపాటూ తీసుకెళ్లడంగానీ, లేదా బ్యాంక్ లాకర్‌లో భద్రపరచడం గానీ చేయడం మంచదని చెబుతున్నారు.
ఈ చెడ్డీ గ్యాంగ్, పార్థీ గ్యాంగ్, ఇతర దొంగతనాలను అడ్డుకోవడానికి ప్రజల సహకారం కూడా అవసరమని పోలీసులు చెబుతున్నారు. అనుమానాస్పద వ్యక్తుల గురించి సమాచారం అందించడం వల్ల వాళ్లను వెంటనే అరెస్ట్ చేసే వీలుంటుందని పరమేశ్వర రెడ్డి చెప్పారు.

ప్రజల సాయం అవసరం
“ప్రజలు కూడా తమను సివిల్ పోలీసులుగా భావించాలి. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం గురించి 100కు డయల్ చేసి చెప్పడంగానీ, స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడంగానీ చేయాలి. లేదా ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి అప్రమత్తం చేయాలి. ఇలా చేస్తే ప్రజలు తక్షణం అప్రమత్తం అవుతారు. జాగ్రత్తలు తీసుకుంటారు. మేం కూడా వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్లి వాళ్లను అరెస్ట్ చేయడం, చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది” అన్నారు.
ఎలా కెమెరాలు అమర్చుతారో కూడా పోలీసులు బీబీసీ బృందానికి చూపించారు.
బయటి ఊళ్లకు వెళ్లే వారు (LHM)కు రిక్వెస్ట్ పెట్టిన వెంటనే పోలీసు టెక్నికల్ టీం అక్కడికి వెళ్లి కెమెరాలు అమర్చుతున్నారు. ఆ వెంటనే ఆ ఎరియాకు సంబంధించిన బ్లూ కోట్స్ టీంకు ఇళ్లును చూపించి నిఘా ఉంచమని చెబుతారు. దీనికి సంబంధించి ఏఏ సిబ్బంది ఆద్వర్యంలో ఈ కెమెరాలు అమర్చారో కూడా రికార్డులో నమోదు చేస్తారు.
తిరుపతి జిల్లా అంతటా ఆయా ప్రాంతాల్లో ఉన్న సచివాలయ మహిళా పోలీసులు పార్థీ గ్యాంగ్, చెడ్డీ గ్యాంగ్ లాంటి ముఠాల, దొంగతనాలను అడ్డుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే ఏం చేయాలి లాంటి వివరాలు ఉన్న పాంప్లెట్లను ఇంటింటికీ అందిస్తూ, దొంగతనాలకు గురికాకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని మహిళా పోలీస్ మురళి కుమారి చెప్పారు.

తిరుపతి జిల్లా ఎప్పుడూ అలర్ట్ ఎందుకు.?
తిరుపతికి రోజూ సుమారు లక్షమంది బయట నుంచి వచ్చే యాత్రికుల సంఖ్య ఉంటుంది.
కొన్ని నెలల క్రితం తిరుచానూరు పరిధిలో చెడ్డీ గ్యాంగ్ కదలికలు కనిపించాయి. దానికి ముందు చిగురువాడలోనూ ఈ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. అవి సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో ఆ ముఠా మూడు నాలుగు ఇళ్లను రెక్కీ చేసినట్లు పోలీసులు గమనించారు. రెండు ఇళ్లలో వారు దోచుకున్నప్పటికీ, ఆ ఇళ్లలో విలువైన వస్తువులు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 2021లో విద్యానగర్‌లో కూడా దొంగతనాలకు పాల్పడ్డారు. దానికి ముందు కూడా చెడ్డీ గ్యాంగ్ కదలికలు తిరుపతిలో ఉన్నాయి.
రాష్ట్రంలోనూ చెడ్డీ గ్యాంగ్ కేసులు ఎక్కడో ఒక చోట నమోదు అవుతూనే ఉన్నాయి. మాచర్లలో నెల క్రితం చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడినట్లు కథనాలు వచ్చాయి. గతంలో నాయుడు పేట, ఓంగోలు, విజయవాడ లాంటి ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ చోరీలకు పాల్పడినట్టు కథనాలు వచ్చాయి.
బయట నుంచి వచ్చే దోపిడీ దొంగల గురించి నిరంతరం తిరుపతి జిల్లా అంతటా తనిఖీలు చేస్తుంటామని, అనుమానితుల వివరాలు సేకరించి ప్రశ్నిస్తుంటామని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి చెప్పారు.
“తిరుమల, తిరుపతిలో ఉన్న హోటళ్లలో పనిచేసే అందరినీ వారి ఆధార్ కార్డు వివరాలను బట్టి తనిఖీలు చేస్తుంటాం. వాళ్ల యజమానుల దగ్గర కూడా వివరాలు తీసుకుంటూ ఉంటాం. అలాగే నిర్మాణ పనుల కోసం బీహార్, ఒరిస్సా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తుంటారు. వాళ్ళ వివరాలను కూడా వెరిఫై చేస్తుంటాం. వారి బాధ్యత తీసుకున్న మేస్త్రీలపై కూడా నిఘా పెడతాం. ఈ పనుల్లోకి తీసుకునే వ్యక్తుల వివరాలను తనిఖీ చేసి, అవి సరైనవేనని నిర్ధరించుకున్న తర్వాతే వారిని తీసుకోవాలి. ఇతర రాష్ట్రాల నుంచి దొంగతనాల కోసం వచ్చేవారు, ముఖ్యంగా పగలు ఇలాంటి పనులు చేసుకుంటూ, అలా నటిస్తూ ఫ్రీ టైమ్‌లో రెక్కీ చేసుకొని రాత్రి పూట దొంగతనాలకు ప్రయత్నిస్తుంటారు” అని ఎస్పీ వివరించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














