రాహుల్ గాంధీపై అనర్హత వేటు

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ అభ్యర్థిత్వంపై అనర్హత వేటు పడింది.
ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ నోటీసులు జారీ చేశారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1), ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.
కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా గెలుపొందారు.
రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయంపై తాము రాజకీయంగా, న్యాయపరంగా పోరాడుతామని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు.
ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని, మాట్లాడకుండా కూర్చుంటామని అనుకోవద్దని జైరాం రమేశ్ అన్నారు.
ప్రధాని, అదానీ మధ్య సంబంధాల విషయంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయకుండా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని ఆయన ఆరోపించారు.
‘భారతదేశ ప్రజాస్వామ్యానికి ఓం శాంతి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘మోదీ ఇంటిపేరు’ను ఉద్దేశించి నాలుగేళ్ల క్రితం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది.
రెండేళ్ల శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది.
ఈ నేపథ్యంలో ఎంపీగా ఆయనపై లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనర్హత వేటు వేశారు.
శిక్ష పడిన రోజు నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Getty Images
అసలేం జరిగిందంటే
దొంగలందరి ఇంటి పేర్లలో 'మోదీ' అని ఎలా ఉందంటూ రాహుల్ వ్యాఖ్యానించారంటూ 2019లో ఒక క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలైంది.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్నాటకలోని కోలార్‌లో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 499, 500ల కింద రాహుల్‌పై కేసు నమోదైంది. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది.
పొరపాటును అంగీకరిస్తున్నారా అని రాహుల్‌ను జడ్జి అడగ్గా, తాను ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదని ఆయన బదులిచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాది మీడియాతో చెప్పారు. తన వ్యాఖ్యలు పిటిషనర్‌కు ఎలాంటి హానీ చేయలేదని రాహుల్ చెప్పారు.
తన వాంగ్మూలం ఇచ్చేందుకు 2021 అక్టోబరులో రాహుల్ సూరత్ కోర్టులో హాజరయ్యారు.
ఈ కేసులో చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ గత వారం విచారణ ముగించి, తీర్పు వాయిదా వేశారు. గురువారం కోర్టుకు రాహుల్ హాజరయ్యారు.
రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
రాహుల్‌ను దోషిగా గుర్తించి, తీర్పు ప్రకటించిన తర్వాత, కోర్టు ఆయనకు బెయిలు ఇచ్చింది. పైకోర్టులో అప్పీలు చేసుకొనేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది.
రాహుల్‌పై ఫిర్యాదు దాఖలు చేసినన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ, కోర్టు తీర్పును స్వాగతించారని వార్తాసంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. సమాజానికి, కులానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకూడదని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, Getty Images
తీర్పు తర్వాత రాహుల్ ఒక ట్వీట్‌లో- సత్యం, అహింసలపై తన మతం ఆధారపడి ఉందని, సత్యమే తన దైవమని, దానిని చేరుకోవడానికి అహింసా విధానమే తనకు మార్గమని వ్యాఖ్యానించారు.
తీర్పు అనంతరం కాంగ్రెస్ స్పందిస్తూ- దేశంలోని నియంతపై రాహుల్ గళం విప్పుతున్నారని, అందుకే ఆయన్ను ఈడీ, పోలీసులు, శిక్షలతో బెదిరించాలని చూస్తున్నారని ఆరోపించింది.
ఈ దేశం సొమ్ముతో పరారైన నీరవ్ మోదీ, లలిత్ మోదీ, ఇతర మోదీలను దృష్టిలో ఉంచుకొని అప్పట్లో రాహుల్ వ్యాఖ్యలు చేశారని, ఆ సందర్భాన్ని చూడాలని కాంగ్రెస్ చెప్పింది.
సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ అప్పీలుకు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేశారు?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 102(1), 191(1) ప్రకారం, పార్లమెంటు లేదా శాసన సభ సభ్యుడు ఏదైనా లాభదాయకమైన పదవిని కలిగి ఉంటే, మతిస్థిమితం కోల్పోతే, చట్టబద్ధమైన భారతీయ పౌరుడు కాకపోతే అతని చట్టసభ సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు.
ఒక చట్టసభ సభ్యున్ని అనర్హుడిగా ప్రకటించడానికి మరో నిబంధనను రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో పొందుపరిచారు. దీని ప్రకారం ఫిరాయింపులకు పాల్పడితే ఒక సభ్యున్ని అనర్హుడిగా ప్రకటించవచ్చు.
అంతేకాకుండా, ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం కూడా ఎంపీ లేదా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు.
క్రిమినల్ కేసుల్లో శిక్ష పడిన ఎంపీ లేదా ఎమ్మెల్యే సభ్యత్వాన్నిరద్దు చేసే నిబంధన ఈ చట్టంలో ఉంది. రాహుల్ గాంధీని ఈ చట్టం ప్రకారమే అనర్హుడిగా ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951 ఏం చెబుతోంది?
ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8(1) ప్రకారం రెండు గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, లంచం తీసుకోవడం లేదా ఎన్నికల్లో తన ప్రభావాన్ని దుర్వినియోగం చేయడం వంటి కారణాల వల్ల చట్టసభ సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు.
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ఎమ్మెల్యే ఆజం ఖాన్ సభ్యత్వాన్ని కూడా 2022 అక్టోబర్‌లో రద్దు చేశారు. ద్వేషపూరిత ప్రసంగం కేసులో కోర్టు ఆయనకు మూడేళ్ల శిక్ష విధించింది. ద్వేషపూరిత ప్రసంగం కారణంగా ఈ కేసు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8(1) పరిధిలోకి వస్తుంది. అయితే, ఈ సెక్షన్‌లో పరువు నష్టం ప్రస్తావన లేదు.
సెక్షన్ 8 (2) ప్రకారం ఆహారం-పానీయాల కల్తీకి పాల్పడితే లేదా వరకట్న నిషేధ చట్టం కింద కనీసం ఆరు నెలల జైలు శిక్షకు గురైతే సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు.
సెక్షన్ 8 (3) ప్రకారం ఒక వ్యక్తి దోషిగా తేలి, ఆయనకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం శిక్ష పడితే ఇకపై ఆయన సభలో సభ్యుడిగా ఉండేందుకు అర్హులు కాదు. దీనిపై తుది నిర్ణయం సభ స్పీకర్ తీసుకుంటారు.
ఈ నిబంధన ప్రకారం, సదరు ఎంపీ లేదా ఎమ్మెల్యే దోషిగా తేలిన తేదీ నుంచి అనర్హులుగా మారతారు. శిక్షా కాలం పూర్తయిన తర్వాత కూడా ఆరేళ్ల పాటు వారు అనర్హులుగానే ఉంటారు. అంటే, దీని ప్రకారం రాహుల్ గాంధీ శిక్ష పడిన రెండేళ్లు, ఆ తర్వాత ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు.
ఇవి కూడా చదవండి:
- కత్తిపీటతో హత్య చేసేందుకు మా నాన్నే ప్రయత్నించారు – కులం, గౌరవం, ప్రేమ కథ
- ‘రంగమార్తాండ' రివ్యూ: గుండె లోతుల్లోని ఉద్వేగాన్ని బయటకు లాక్కొచ్చే సినిమా
- అదానీ గ్రూప్ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు ఏడాదిగా ఎందుకు నిరసనలు చేస్తున్నారు?
- ఉగాది: మనం ఉన్నది 2023లో కాదు.. 1945 లేదా 2080
- వడగళ్ల వానలు ఎందుకు పడతాయి? అవి వేసవిలోనే ఎందుకు ఎక్కువ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














