నరేంద్ర మోదీ: విదేశీ పర్యటనల్లో ప్రధాని కూడా వివాదాస్పద ప్రసంగాలు చేశారా?

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్‌లో పర్యటించిన సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ‘ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్’, బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో జరిగిన రెండు వేరు వేరు కార్యక్రమాల్లో మాట్లాడారు.
ఈ కార్యక్రమాల్లో ఆయన భారత్‌లో ప్రస్తుత రాజకీయ వాతావరణం, భారత విదేశాంగ విధానంపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రాహుల్ ప్రసంగాల తర్వాత అధికార వర్గాల్లో కలకలం నెలకొనడం కనిపించింది.
అధికార పార్టీ నేతలు, మంత్రులు రాహుల్ గాంధీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కర్ణాటక హుబ్లీలో నాలుగు రోజుల క్రితం ఒక ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించకుండా.. “కొంతమంది లండన్‌లో భారత ప్రజాస్వామ్యాన్ని విమర్శిస్తున్నారని” వ్యాఖ్యానించారు.
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాట్లాడిన రాహుల్ గాంధీ భారత్‌ను ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అంటే ‘రాష్ట్రాల సంఘం’గా వర్ణించారు. భారత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థపై ఆధారపడి ఉందని చెప్పారు.
ప్రస్తుతం భారత పార్లమెంటులో బడ్జెట్ సెషన్ నడుస్తోంది. ఒకవైపు పార్లమెంటులో విపక్షాలు అదానీ గ్రూప్‌పై దర్యాప్తు చేయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుంటే, అటు అధికార పార్టీ మంత్రులు, ఎంపీలు మాత్రం రాహుల్ గాంధీ తన ప్రకటనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వాదోపవాదాలు, గందరగోళం మధ్య పార్లమెంటు కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి.
పార్లమెంటు బయట కూడా ఇరు పార్టీల నేతల ఘాటు విమర్శల పరంపర కొనసాగుతోంది.
గురువారం ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ, పార్లమెంటులో తనకు వాదన వినిపించే అవకాశమే ఇవ్వడం లేదని ఆరోపించారు.
తనను పార్లమెంటులో మాట్లాడనివ్వడం లేదని, తను ఎప్పుడు మాట్లాడాలని ప్రయత్నించినా మైక్ ఆఫ్ చేస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కఢ్ మీరట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో విమర్శలు చేశారు.
రాహుల్ ప్రకటన గురించి మాట్లాడుతూ “ప్రజాస్వామ్య దేవాలయాన్ని అవమానించడాన్ని అనుమతించలేమని” ధన్కఢ్ అన్నారు.
రాహుల్ గాంధీ ప్రకటనపై వివరణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే “ప్రభుత్వాన్ని విమర్శిస్తే, దేశాన్ని విమర్శించినట్లు కాదని” స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ గత ప్రసంగాల వీడియోలు వైరల్
మరోవైపు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సుప్రియా శ్రీనేత్ సహా, ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు మోదీ తన విదేశీ పర్యటనల సమయంలో గత ప్రభుత్వాలను విమర్శిస్తున్నట్లు కనిపించే వీడియోలను ఇపుడు షేర్ చేస్తున్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ 2013లో భారత సంతతి అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు. వారి ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చారు.
ఈ మాట 2013, మే 13 నాటిది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడిన మోదీ, యూపీఏ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని విమర్శిస్తూ “భారత్‌లో బలహీనులైన నాయకుల ప్రభుత్వం ఉంది” అన్నారు.
అప్పటి యూపీఏ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన ఆయన “ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం, నమ్మకం పోయింది” అన్నారు.
2015లో ప్రధానమంత్రి హోదాలో మోదీ కెనడాలో పర్యటించినపుడు టొరంటోలో ప్రసంగించారు. దీనిపై కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనపై విమర్శలు గుప్పించింది.
ప్రధానమంత్రి తన విదేశీ పర్యటనల సందర్భంగా గత ప్రభుత్వాలను విమర్శించడంపై కూడా పార్లమెంటులో కలకలం రేగింది.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ విదేశీ యాత్రల్లో వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో విమర్శలు
2015లో ఏప్రిల్ 28న రాజ్యసభలో గందరగోళం మధ్య అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మోదీకి మద్దతుగా నిలిచారు. విదేశీ పర్యటనల సమయంలో ప్రధాని ప్రసంగించడంపై ఎలాంటి ఆంక్షలూ లేవన్నారు.
అదే రోజు రాజ్యసభలో కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ టొరంటోలో ప్రధానమంత్రి ఇచ్చిన ప్రసంగం అంశాన్ని లేవనెత్తారు. “గతంలో స్కామ్ ఇండియా ఉండేదని, ఇప్పుడు స్కిల్ ఇండియాగా మారిందని ప్రధాని అన్నారని” గుర్తుచేశారు.
దీనిపై బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ, ఆనంద్ శర్మ మధ్య తీవ్ర వాదోపవాదాలు కూడా జరిగాయి. ఆ సమయంలో ఆనంద్ శర్మ సభను సంభోదిస్తూ “తప్పులు జరగొచ్చు, కానీ దేశాన్ని స్కామ్ అని అనకూడదు” అన్నారు.
2015లోనే మే నెలలో ప్రధాని మోదీ చైనా, దక్షిణ కొరియా పర్యటన సమయంలో చేసిన ప్రసంగాలపై కూడా విమర్శలు వచ్చాయి.
మే 16న షాంఘైలో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ “ఏడాది క్రితం వరకూ ఎవరైతే సిగ్గుపడేవారో, వారు ఇప్పుడు తమను భారతీయులుగా చెప్పుకోడానికి గర్వపడుతున్నారు” అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''ప్రధాని దేశాన్ని అవమానించినట్లు కాదా?''
తర్వాత గతేడాది మే నెలలోనే యూరోపియన్ దేశాల పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ మే 2న జర్మనీలోని బెర్లిన్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత భారత ప్రభుత్వాలను విమర్శించారు.
“2014కు ముందు ‘భారత్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్’గా ఉండేది, కానీ గత 8 ఏళ్ల నుంచి భారత్ అభివృద్ధి పెద్ద అంగలు వేస్తూ దూసుకెళ్తోందని” మోదీ అన్నారు.
2015లో సెప్టెంబర్ నెలలో అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఒక సభలో మాట్లాడిన మోదీ “భారత్‌లో అవినీతి ఒక సంస్కృతిగా మారిపోయిందని, రాజకీయ పార్టీల నేతలపై చాలా సులభంగా ఆరోపణలు చేసేస్తారు'' అని అన్నారు.
పార్లమెంటు, దాని బయట వరుసగా కొనసాగుతున్న వివాదాల మధ్య కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మార్చి 14న ప్రధాన మంత్రి మోదీ విదేశాల్లో ఇచ్చిన ప్రకటనలను ఉటంకిస్తూ ఒక ప్రశ్న అడిగారు.
“ప్రధాన మంత్రి చేసిన ఇలాంటి ప్రకటనలు దేశాన్ని అవమానించినట్లు కాదా?” అని విమర్శించారు.
ఇవి కూడా చదవండి:
- గోళ్లు ఎందుకు కొరుకుతారు?
- యువ అథ్లెట్లలో కొందరికి గుండెపోటు ఎందుకు వస్తోంది?
- ఈ స్కూలు పిల్లలు రోజూ రెండుసార్లు డబ్బాలు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు?
- తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ జాబ్... ఎంపిక ఎలా?
- గుజరాత్: శివాలయం మీద హక్కులను హిందూ సంస్థలకు ఇచ్చేందుకు జైనులు ఎందుకు ఒప్పుకోవడం లేదు...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














