బస్సులు, రైళ్లలో పిన్నీసే ఆడవాళ్ల ఆయుధమా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్
మహిళలు తరచూ లైంగిక వేధింపులను ఎదుర్కొంటూ ఉంటారు.
బస్సులు, రైళ్లు వంటి రద్దీగా ఉండే ప్రాంతాల్లో దాదాపుగా ప్రతి మహిళా ఏదో ఒక రూపంలో లైంగిక వేధింపులను ఎదుర్కొనే ఉంటారు.
కొందరు మహిళల రొమ్ములను తాకితే మరికొందరు వారి పిరుదులను ఒత్తడం, గిచ్చడం చేస్తుంటారు.
మరికొందరు మోచేయితో ఆడవారి ఛాతి మీద రుద్దితే ఇంకొందరు కావాలనే మహిళల మీద పడిపోతూ ఉంటారు.
ఇలాంటి లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు ఆడవాళ్లు ప్రయత్నిస్తూనే ఉంటారు. కొన్ని దశాబ్దాల కిందట కాలేజీ విద్యార్థులతో రద్దీగా ఉండే కోల్‌కతాలోని ట్రాముల్లో నేను, నా ఫ్రెండ్స్ ప్రయాణించేటప్పుడు మేం ఆకతాయిలను ఎదుర్కొనేందుకు గొడుగులను వాడేవాళ్లం.
మనలో చాలా మంది గోర్లను పొడవుగా పెంచుకుంటారు. మరికొందరు ‘పాయింటీ హీల్స్’ వేసుకుంటారు. రద్దీని అవకాశం తీసుకొని కొందరు మగవాళ్లు పురుషాంగాలను ఆడవాళ్లకేసి రుద్దుతుంటారు. అలాంటి వారిని కాలితో తన్నడానికి ‘పాయింటీ హీల్స్’ పనికొస్తాయి.

ఫొటో సోర్స్, Thinkstock
లైంగిక వేధింపులను ఎదుర్కొనేందుకు చాలా మంది ఆడవాళ్లు వాడే శక్తిమంతమైన ఆయుధం... సేఫ్టీ పిన్. దీన్నే వాడుకలో చాలామంది పిన్నీసు అంటారు.
1849లో సేఫ్టీ పిన్‌ను కనిపెట్టారు. నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా మహిళలు వస్త్రధారణలో భాగంగా వీటిని వాడుతున్నారు.
భారత్‌లో అయితే చీర కట్టుకునే వాళ్లు పిన్నీసులను వాడటం చాలా సాధారణమైన విషయం.
అదే పిన్నీసుతో లైంగిక వేధింపులను ఆడవారు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడూ పిన్నీసును తమతో ఉంచుకుంటామని కొన్ని నెలల కిందట దేశంలో చాలా మంది ఆడవాళ్లు తెలిపారు. అలా తెలిపిన వారిలో దీపిక షేర్గిల్ ఒకరు.
ఒకసారి తనను వేధించిన వ్యక్తిని పిన్నీసుతో రక్తం వచ్చేలా గుచ్చినట్లు దీపిక షెర్గిల్ బీబీసీతో చెప్పారు. కొన్ని దశాబ్దాల కిందట ఆ ఘటన జరిగినప్పటికీ ఆమెకు ఇప్పటికీ అది గుర్తుంది. అప్పుడు ఆమె వయసు20 ఏళ్లు కాగా ఆమెను వేధించిన వ్యక్తి వయసు 40ఏళ్లకు పైగా ఉంటాయి. అతను బూడిద రంగు సఫారీ సూటు వేసుకునేవాడు.
‘‘ప్రతిరోజూ బస్సులో వచ్చి నా వెనుక నిలబడే వాడు. నాకు చాలా దగ్గరగా ఉండేవాడు. తన అంగాన్ని నా వెనుక రుద్దుతూ ఉండే వాడు. డ్రైవర్ బ్రేకులు వేసినప్పుడల్లా నా మీద పడుతూ ఉండేవాడు.
ఆ రోజుల్లో నాకు అంత ధైర్యం లేకపోయింది. అందరూ నా గురించి మాట్లడుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నెలలపాటు మౌనంగా దాన్ని భరిస్తూ వచ్చాను.
కానీ ఒక రోజు అతను హస్తప్రయోగం చేసుకొని నా భుజం మీద వీర్యం కార్చాడు. దాంతో ఇక సహించకూడదని నిర్ణయించుకున్నా. నేను మలినం అయినట్లు అనిపించింది.
ఇంటికి వెళ్లిన తరువాత చాలా సేపు స్నానం చేశాను. ఆ రోజు ఏం జరిగిందో మా అమ్మకు కూడా చెప్పలేదు. రాత్రి నిద్ర కూడా పోలేదు. ఉద్యోగం మానేద్దామని అనుకున్నా. కానీ నాకు జరిగినదానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నా.
మరొకసారి నాతో అలా చేయకుండా ఉండేలా అతనికి గట్టిగా బుద్ధి చెప్పాలని అనుకున్నా. మరుసటి రోజు పాయింటీ హీల్స్ చెప్పులు వేసుకున్నా. పిన్నీసు దగ్గర పెట్టుకున్నా.
ఎప్పటిలాగే అతను బస్సులో వచ్చి నా పక్కన నిలబడ్డాడు. నేను నా సీటులో నుంచి లేచి అతని కాలిని గట్టిగా తొక్కాను. అతను నొప్పితో విలవిల్లాడటం చూసి చాలా ఆనందం కలిగింది. పిన్నీసుతో అతని చేయి మీద గట్టిగా చీరాను. ఆ తరువాత వేగంగా బస్సు దిగి వెళ్లిపోయాను.
ఆ ఘటన జరిగిన తరువాత ఏడాది పాటు నేను బస్సులో ప్రయాణించాను. కానీ నాకు అతను ఎప్పుడూ కనిపించలేదు’’ అని షెర్గిల్ తెలిపారు.
ఆమె చెప్పిన కథ షాక్ కలిగించేదే కానీ కొత్త మాత్రం కాదు.

ఫొటో సోర్స్, DEEPIKA SHERGILL
30లలో ఉన్న ఒక కొలీగ్ కూడా కొంత కాలం కిందట తన అనుభవాన్ని నాతో పంచుకున్నారు. కోచీ నుంచి బెంగళూరుకు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు రాత్రి పూట ఆ ఘటన జరిగింది. ఒక వ్యక్తి పదేపదే ఆమె మీద చేతులు వేయడం మొదలు పెట్టాడు.
‘‘మొదట్లో అనుకోకుండా జరిగింది అనుకున్నా... కానీ ఆ తరువాత కావాలనే వేస్తున్నట్లు అర్థమైంది. ఆ రోజు నేను స్కార్ఫ్‌కు పెట్టుకున్న పిన్నీసు నన్ను కాపాడింది.
చేతులు వేసినప్పుడు పిన్నీసుతో గుచ్చాను. దాంతో అతను వెనక్కి తీసుకున్నాడు. ఆ తరువాత కూడా చేతులు వేయడానికి అతను ప్రయత్నించాడు. అతను ప్రయత్నించినప్పుడల్లా నేను పిన్నీసుతో గుచ్చుతూ ఉన్నాను. చివరకు అతను మానుకున్నాడు.
ఆరోజు నా వద్ద పిన్నీసు ఉన్నందుకు చాలా సంతోషం కలిగింది. కానీ అతని చెంపను పగులకొట్టలేక పోయినందుకు కాస్త బాధపడ్డాను. ఒకవేళ నేను చెప్పినా యూత్‌లో ఉన్న నాకు ఎవరూ అండగా నిలబడరని భయపడ్డాను’’ అని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
2021లో భారతదేశంలోని 140 నగరాల్లో 56శాతం మంది మహిళలు బస్సులు, రైళ్లు వంటి వాటిలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారని ఒక ఆన్‌లైన్ సర్వే చెబుతోంది. కానీ వారిలో 2శాతం మాత్రమే పోలీసుల దగ్గరకు వెళ్లారు. చాలా మంది విషయాన్ని పెద్దగా చేయడం ఇష్టం లేక సర్దుకొని పోయారు.
‘‘అభద్రతా భావం’’ వల్ల చదువు, ఉద్యోగాలు మానేసినట్లు 52శాతాని పైగా ఆడవారు తెలిపారు.
‘‘లైంగిక వేధింపుల భయం ఆడవారి మానసికఆరోగ్యం మీద ప్రభావం చూపుతోంది. వారు ఎక్కడకు వెళ్లలేక పోతున్నారు’’ అని స్వచ్ఛంద సంస్థ సేఫ్టీపిన్ సహవ్యవస్థాపకురాలు కల్పన విశ్వనాథ్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఆడవారి భద్రత కోసం ఈ సంస్థ పాటుపడుతోంది.
‘‘ఇది రేప్ చేయడం కంటే కూడా చాలా పెద్ద సమస్య. ఇది దేశానికి మాత్రమే పరిమితం కాదు. అంతర్జాతీయంగా ఉంది. లండన్, న్యూయార్క్, మెక్సికో సిటీ, టోక్యో, కైరోలలోని వెయ్యిమంది మహిళలను థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం ప్రయాణం చేసే సమయంలో ఎక్కువ మంది మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు.
లాటిన్ అమెరికా, ఆఫ్రికాలలోని మహిళలు కూడా పిన్నీసు తమతో ఉంచుకుంటామని మాతో చెప్పారు’’ అని కల్పన విశ్వనాథ్ అన్నారు. 1900లలోనే మగవారి నుంచి రక్షణగా అమెరికాలోని మహిళలు పిన్నీసులను ఉపయోగించేవారని స్మిత్‌సోనియన్ మ్యాగజైన్ వెల్లడించింది.
కానీ ఈ సమస్యను భారతదేశ ప్రభుత్వం పెద్దగా గుర్తించినట్లు లేదు. లైంగిక వేధింపుల ఘటనలు సరిగ్గా రిపోర్ట్ కాకపోవడం వల్ల జాతీయ నేర రికార్డుల్లో అవి నమోదు కాకపోవడానికి ఒక కారణం కావొచ్చని కల్పన అన్నారు. అయితే కొన్ని నగరాల్లో పరిస్థితులు మారుతున్నాయని ఆమె తెలిపారు.
దేశ రాజధాని దిల్లీలోని బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్నీ బటన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. మహిళా డ్రైవర్ల సంఖ్య పెరిగింది. డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన కల్పించేలా శిక్షణ ఇస్తున్నారు. మార్షల్స్‌ను కూడా బస్సుల్లో ఉంచుతున్నారు.
మహిళల భద్రత కోసం పోలీసులు కూడా హెల్ప్‌లైన్ నెంబర్లు, యాప్స్ తీసుకొచ్చారు.
అయితే అసలు సమస్య లైంగిక వేధింపుల గురించి మాట్లాడటమే అని కల్పన విశ్వనాథ్ అన్నారు. దీని మీద మీడియాలో తగిన ప్రచారం జరగాలి అని ఆమె సూచించారు.
ఇవి కూడా చదవండి:
- గువాహటి: రైల్వే స్టేషన్లో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ టీ స్టాల్.. ‘‘గౌరవంగా బతకడం కోసమే ఈ పోరాటం’’ అంటున్న ట్రాన్స్జెండర్లు
- ఆంధ్రప్రదేశ్: స్కూల్లో ఫ్యాన్ పాడు చేశారంటూ పిల్లల్ని పోలీస్ స్టేషన్లో పెట్టిన టీచర్లు.. అసలు ఏం జరిగింది?
- తెలంగాణ: ఘన వ్యర్థాల నిర్వహణపై డిజిటల్ క్లాసుల ద్వారా శిక్షణ ఇస్తున్న స్వచ్ఛ బడి
- నరేంద్ర మోదీ: విదేశీ పర్యటనల్లో ప్రధాని కూడా వివాదాస్పద ప్రసంగాలు చేశారా?
- ఊతకర్ర సాయంతో బ్యాక్‌ఫుట్‌పై అద్భుతంగా బ్యాటింగ్ చేసే క్రికెటర్లు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














