ఆస్కార్ ఉత్తమ నటి మిషెల్ యో ఎవరు? జాకీ చాన్ కోసం రాసిన ‘ఎవిరిథింగ్ ఎవిరివేర్ ఆల్ ఎట్ వన్స్’ పాత్ర ఆమెను ఎలా వరించింది?

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఆండ్ ద ఆస్కార్ గోస్ టు...’’ అనే మాట తర్వాత కొన్ని సెకన్ల పాటు ఏర్పడిన నిశ్శబ్ధం అందరిలో సస్పెన్స్‌ను తారా స్థాయికి చేర్చింది. అప్పుడు ‘‘మిషెల్ యో’’ అనే పేరు వినిపించింది.
మిషెల్ యో అనే నటికి అది ఆస్కార్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే క్షణం. ‘ఉత్తమ నటి’ కేటగిరీలో ఆస్కార్ అవార్డు పొందిన ఆసియా మూలాలు ఉన్న తొలి నటి ఆమె.
‘‘అమ్మాయిలు, అబ్బాయిలందరికీ నేను చెప్పేదేంటంటే ఇది ఆకాంక్షలకు, అవకాశాలకు నిదర్శనం. కలలు నిజం అవుతాయనడానికి ఇది రుజువు. మీరు పెద్ద కలలు కనాలి. అవి నిజం అవుతాయి’’ అని తాను అందుకున్న ఆస్కార్ అవార్డును చూపిస్తూ మిషెల్ యో ఉద్వేగభరితంగా మాట్లాడారు.
‘‘డియర్ లేడీస్, మీ పని అయిపోందని చెప్పే అవకాశం ఎవరికీ ఇవ్వకండి’’ అని 60 ఏళ్ల మిషెల్ యో అన్నారు. ఆమె ఆ మాట అనగానే లాస్ ఏంజిల్స్‌లోని ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన వారంతా పెద్దగా చప్పట్లు కొట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
స్నేహితుడు, మార్గదర్శి.. జాకీ చాన్
మిషెల్ యో ఒక వాణిజ్య ప్రకటనలో జాకీ చాన్‌తో కలిసి నటించడానికి తన స్వదేశం అయిన మలేసియా నుంచి హాంకాంగ్ వచ్చారు.
జాకీచాన్‌తో ఈ పరిచయం తర్వాత 40 ఏళ్ల పాటు విజయవంతమైన కెరీర్‌కు దారితీస్తుందని అప్పుడు ఆమెకు తెలియదు.
జాకీ చాన్ చేయాల్సిన పాత్రను తాను పోషించి, ఆ పాత్రకు గానూ ఆస్కార్ అవార్డు గెలుస్తాననే ఊహ కూడా ఆమెకు ఎప్పుడూ రాలేదు. అప్పట్లో ఆ ఊహ రావడం కూడా అంత సులభం కాదు.
‘ఎవిరిథింగ్ ఎవిరివేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమాలో పోషించిన పాత్రకు గానూ మిషెల్ యోకు ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు వచ్చింది.
నిజానికి, తొలుత ఈ పాత్రకు మార్షల్ ఆర్ట్స్‌లో నిపుణుడైన జాకీ చాన్‌ను అనుకున్నారు.
‘‘జాకీ చాన్‌ను దృష్టిలో పెట్టుకునే ఆ పాత్రను రాశారు. జాకీ చాన్‌కు భార్యగా నన్ను అనుకున్నారు. కానీ, చివరకు సినిమాలో మా పాత్రల స్వభావాన్ని పూర్తిగా మార్చేశారు’’ అని మిషెల్ యో గుర్తు చేసుకున్నారు.
ఇప్పుడు ఎవెలిన్ పాత్ర లేకుండా ‘ఎవిరిథింగ్ ఎవిరివేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమాను ఊహించడం చాలా కష్టం. ఈ సినిమాలో ఎవెలిన్ పాత్రను మిషెల్ యో పోషించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘మిస్ మలేసియా’ నుంచి ‘బాండ్ గర్ల్’ వరకు...
నటి కావాలని మిషెల్ యో ఎప్పుడూ అనుకోలేదు. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సొంత బ్యాలె స్కూల్ కూడా ఉంది. ఆమె బ్యాలె డ్యాన్స్‌లో శిక్షణ కూడా ఇచ్చేవారు.
కానీ, ఆమె జీవితంలో ఒకటి కోరుకుంటే మరొకటి జరిగింది. ఉదాహరణకు, యవ్వనంలో ఉండగా ఆమె మిస్ మలేసియా పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. తర్వాత తల్లి ఒత్తిడి మేరకు ‘మిస్ వరల్డ్’ పోటీల్లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించారు. మిషెల్‌కు చెప్పకుండానే ఆమె తల్లి ఈ పోటీలకు ఆమె పేరును పంపించారు.
జాకీ చాన్‌తో కలిసి పనిచేసిన ఫలితంగానే, పురుషుల ఆధిపత్యం ఉండే మార్షల్ ఆర్ట్స్ సినిమా ప్రపంచంలో తాను కూడా భాగం కావాలని నిర్ణయించుకున్నట్లు బీబీసీ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.
‘‘నన్ను ఆ మార్షల్ ఆర్ట్స్ ప్రపంచం ఆకర్షించింది. అదొక గొప్ప కొరియోగ్రఫీలా నాకు అనిపించేది. మార్షల్ ఆర్ట్స్ నిజంగా నాకు ఒక అద్భుత డ్యాన్స్ రూపంగా అనిపించేది. అందుకే దాన్ని ప్రయత్నిద్దామని ఆ ప్రపంచంలోకి వెళ్లిపోయా. దాన్ని నేను చేయగలనని నాకు తెలుసు’’ అని ఆమె అన్నారు.
1980ల్లో మిషెల్ చాలా పాపులర్ అయ్యారు. అప్పటికే ఆమె హాంకాంగ్ యాక్షన్ సినిమాల్లో ప్రముఖ హీరోయిన్లలో ఒకరుగా మారారు. అత్యంత ప్రమాదకరమైన స్టంట్‌లను కూడా స్వయంగా చేయగలిగే నటీమణిగా ఆమె గుర్తింపు పొందారు.
1997లో తొలిసారి ఆమెకు హాలీవుడ్‌లో పెద్ద బ్రేక్ లభించింది. ‘‘టుమారో నెమర్ డైస్’’ అనే సినిమాలో ఆమె బాండ్ గర్ల్‌గా నటించారు. ఆ సినిమాలో ఏజెంట్ 007ను కలిసే చైనీస్ జర్నలిస్ట్ పాత్రను ఆమె పోషించారు.
ఆ పాత్ర ద్వారా పీపుల్స్ మ్యాగజీన్ ప్రచురించిన ప్రపంచంలోని అత్యంత అందమైన 50 మంది వ్యక్తుల్లో ఆమె ఒకరిగా నిలిచారు. అయితే, కేవలం వృత్తి వల్లనే ఆమెకు ఈ గుర్తింపు లభించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
మైనారిటీ నుంచి రోల్ మోడల్ వరకు
హాలీవుడ్‌లో అడుగుపెట్టిన కొత్తలో అక్కడి పరిస్థితులు తనను షాక్‌కు గురిచేశాయని బీబీసీ ఇంటర్వ్యూలో మిషెల్ యో చెప్పారు.
‘‘అప్పుడు అది నాకు కాస్త వింతగా అనిపించింది. ఆసియా నుంచి అమెరికాకు వెళ్లగానే, మీకు మైనారిటీ అనే గుర్తింపు ఆపాదిస్తారు. మైనారిటీ అనే పదం నాకు పూర్తిగా కొత్తది’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.
2000లో ఆమె తొలి గ్లోబల్ బాక్సాఫీస్ సక్సెస్‌ను అందుకున్నారు. ‘‘ద టైగర్ అండ్ ద డ్రాగన్’’ అనే సినిమా పెద్ద హిట్ అయింది. దీంతో బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అవార్డ్స్‌కు ఆమె పేరు నామినేట్ అయింది.
ఆ తర్వాత చాలా కాలం పాటు భారీ విజయాలు ఆమెకు అందలేదు.
2018లో ‘‘క్రేజీ రిచ్ ఆసియన్స్’’ సినిమాతో ఆమె కెరీర్‌కు కొత్త ఊపు వచ్చింది.
ఆ తర్వాత ‘‘షాంగ్ చి అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్’’ సినిమాతో ఆమె మార్వెల్ యూనివర్స్‌లోకి ప్రవేశించగలిగారు. ‘ఎవిరిథింగ్ ఎవిరివేర్ ఎట్ ద సేమ్ టైమ్’ సినిమాలో ఎవెలిన్ పాత్రతో చరిత్ర సృష్టించారు.
గతేడాది టైమ్స్ మ్యాగజీన్ ప్రచురించిన ప్రపంచంలోని 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయన్షియల్ పీపుల్ జాబితాలో ఆమె కూడా చోటు దక్కించుకున్నారు.
యునైటెడ్ నేషన్స్ అభివృద్ధి కార్యక్రమానికి గుడ్ విల్ అంబాసిడర్‌గానూ ఎంపికయ్యారు.
‘‘గొంతు లేని వ్యక్తులకు నేను గొంతుక అవుతాను. నా ద్వారా వారి గొంతును ప్రపంచం వినగలుగుతుంది. మహిళలు, నాయకులుగా ఎదగడం చాలా కీలకం. ఎందుకంటే నేటి చిన్నారులు వారిని చూసి మేం కూడా అలా చేయగలం అని అనుకుంటారు. ఇది సమాజానికి అందించాల్సిన చాలా ముఖ్యమైన సందేశం’’ అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్: జనసేన ఆవిర్భావ సభలో స్వరం మార్చిన అధినేత... కులాల చుట్టూ సాగిన ప్రసంగం
- రష్యా జెట్ ఢీకొని సముద్రంలో కూలిన అమెరికా డ్రోన్
- తెలంగాణ: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం ఎలా జరిగింది?
- సిలికాన్ వ్యాలీ బ్యాంక్: భారత స్టార్టప్‌లు దివాలా తీసిన ఆ బ్యాంకులో ఖాతాలు ఎందుకు తెరిచాయి
- టైగర్ నాగేశ్వర రావు రియల్ స్టోరీ ఏమిటి? ఉన్నోళ్లను దోచుకుని, లేనోళ్లకు పంచేవాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















