ఆంధ్రప్రదేశ్: స్కూల్లో ఫ్యాన్ పాడు చేశారంటూ పిల్లల్ని పోలీస్ స్టేషన్‌లో పెట్టిన టీచర్లు.. అసలు ఏం జరిగింది?

జంగారెడ్డి గూడెం జడ్‌పీ స్కూల్

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఏదయినా స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తే టీచర్లు దండించడం చూశాం. అప్పటికీ అల్లరి తగ్గకపోతే తల్లిదండ్రులని పిలిచి మందలించడం కూడా విన్నాం. ఆపైన క్రమశిక్షణా చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా ఉంటాయి.

కానీ ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెం టీచర్లు చాలా తీవ్ర చర్యలు తీసుకున్నారు. స్కూల్లో వస్తువులు ధ్వంసం చేశారంటూ పిల్లల్ని ఏకంగా పోలీస్ స్టేషన్‌కి అప్పగించారు.

అక్కడ తమను కొట్టారంటూ విద్యార్థులు వాపోయారు. దాంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. టీచర్లు, పోలీసుల తీరు మీద తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులు కూడా రంగ ప్రవేశం చేశారు. బాలల హక్కుల కమిషన్ కూడా విచారణ చేపట్టింది.

జంగారెడ్డి గూడెం జడ్‌పీ స్కూల్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, జంగారెడ్డి గూడెం జడ్‌పీ స్కూల్‌లో ఒక తరగతి గదిలో పాడైన ఫ్యాన్

ఏం జరిగిందంటే...

ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్‌ని ఇటీవల ఆధునీకరించారు. నాడు-నేడు పథకంలో నిధులు కేటాయించారు. వాటితో అదనపు భవనాలు అందుబాటులోకి వచ్చాయి. కొంత ఫర్నిచర్ కూడా దక్కింది.

అయితే వాటిని కొందరు పిల్లల అల్లరి కారణంగా ధ్వంసం చేస్తున్నారన్నది ఉపాధ్యాయుల అభియోగం. స్కూల్లోని కొన్ని తరగతి గదుల్లో ఫ్యాన్ల రెక్కలు ఒంగిపోయి ఉండడం, స్విచ్ బోర్డులు ధ్వంసం కావడం, ట్యూబ్ లైట్లు కనిపించకపోవడం వంటివి జరిగాయి.

వాటికి కారకులుగా 9వ తరగతి చదువుతున్న ముగ్గురు బాలురను గుర్తించారు. ఈ నెల 15వ తేదీన క్లాసు రూములోనే వారిని తొలుత మందలించారు. అప్పటికీ ఆగ్రహం చల్లారని టీచర్లు వారు ముగ్గురుని వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. అక్కడ పోలీసులకు అప్పగించారు.

ఫ్యాన్లు చెడగొట్టారని ముగ్గురు పిల్లలను పోలీస్ స్టేషన్‌కి తీసుకురాగానే పోలీసులు కూడా వారిని స్టేషన్లో కూర్చోబెట్టడం విస్మయం కలిగిస్తోంది.

జంగారెడ్డి గూడెం జడ్‌పీ హైస్కూల్

‘పోలీసులు కొట్టారు...’

ఉదయం 10 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లిన పిల్లల గురించి తమకు సమాచారం లేదని జోష్‌ కుమార్ తాతయ్య వెంకట్రావు బీబీసీతో అన్నారు. ‘‘మా పిల్లలు అల్లరి చేస్తే మొదట మాకు చెప్పకుండా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లడం, అక్కడ కూడా సాయంత్రం వరకూ మాకు సమాచారం ఇవ్వకపోవడం ఏమిటి?’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘సాయంత్రం వరకూ మా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తెలిసింది. టీచర్లను అడిగితే మీకు కాల్ చేశాము. కనెక్ట్ కాలేదని చెబుతున్నారు. అయినా అదేం పద్ధతి? మాకు సమాచారం లేకుండా పోలీస్ స్టేషన్‌కి పంపిస్తే పిల్లలు ఏమి కావాలి? పిల్లలను సన్మార్గంలో నడిపించాల్సిన టీచర్లే ఇలాంటి పనులు చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి?’’ అని ఆయన ప్రశ్నించారు.

పోలీసులు తమను స్టేషన్లో కొట్టారని బాధిత విద్యార్థులు మొదట మీడియా ముందు చెప్పారు. తమ శరీరంపై గాయాలు కూడా చూపించారు. కానీ తర్వాత మాత్రం ఏం జరిగిందన్నది చెప్పడానికి నిరాకరించారు.

జంగారెడ్డి గూడెం పోలీస్ స్టేషన్

‘‘పోలీసుల ఒత్తిడే కారణం...’’

బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా తొలుత మీడియా ముందు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీచర్లు, పోలీసులు తీరు మీద అభ్యంతరం వ్యక్తంచేశారు.

కానీ తదుపరి మాట్లాడేందుకు ముందుకు రాకపోవడానికి పోలీసుల ఒత్తిడి కారణమని జంగారెడ్డి గూడెం పట్టణానికి చెందిన జర్నలిస్ట్ సాయి అబిప్రాయపడ్డారు.

‘‘పిల్లలు తప్పు చేసినా, ఒప్పు చేసినా మందలించి సరిచేయాల్సింది ఉపాధ్యాయులే. కానీ అందుకు భిన్నంగా పోలీసులకు అప్పగించారు. పోలీసులు కూడా చిన్నపిల్లల తప్పిదాన్ని సర్దిచెప్పి పంపించాల్సింది పోయి అక్కడే కూర్చోబెట్టారు. తమను గాయపరిచారంటూ పిల్లలు అందరి ముందూ చెప్పి, ఇప్పుడు ముందుకు రాకపోవడానికి పోలీసులు, అధికారుల ఒత్తిడి కారణం కావచ్చు’’ అంటూ ఆక్ష్న బీబీసీతో పేర్కొన్నారు.

జంగారెడ్డి గూడెం జడ్‌పీ స్కూల్

రంగంలోకి యంత్రాంగం

ఈ ఘటన వెలుగులోకి రాగానే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 9వ తరగతి విద్యార్థులు క్లాసు రూములో చేసిన అల్లరికి ఏకంగా పోలీస్ స్టేషన్‌లో బంధించడం వివాదంగా మారడంతో ఏలూరు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

ఏపీ బాలల హక్కుల కమిషన్ సభ్యుడు రాజేంద్ర కూడా స్కూల్‌కి వచ్చారు. తొలుత ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. తర్వాత విద్యార్థులు, వారి బంధువులతో మాట్లాడారు.

జడ్పీ హైస్కూల్ లో హిందీ, లెక్కలు బోధించే సుధాకర్ రెడ్డి, జయ్ ప్రకాష్‌ అనే ఉపాధ్యాయుల తీరు కారణంగానే ఇంత వివాదమయ్యిందని రాజేంద్ర మీడియాతో అన్నారు. ఘటన పూర్వాపరాలు అధికారులకు నివేదించి, చర్యలకు ఆదేశిస్తామని తెలిపారు. పిల్లల విషయంలో ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా చూస్తామని అన్నారు.

జంగారెడ్డిగూడెం స్కూల్

‘‘కౌన్సిలింగ్ కోసమే తీసుకెళ్లాం...’’

కేవలం పిల్లలను కౌన్సిలింగ్ ఇస్తారనే ఉద్దేశంతోనే తాము పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లామని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు జయ్ ప్రకాష్‌ బీబీసీతో అన్నారు.

‘‘స్కూల్లో కొంతకాలంగా ఫ్యాన్లు పాడు చేస్తున్నారు. చాలా ఫ్యాన్లు రెక్కలు వంచేశారు. ట్యూబ్ లైట్లు పగులగొట్టారు. ఎవరనేది తెలియలేదు. చివరకు పిల్లలందరినీ విచారిస్తే వాళ్లు ముగ్గురే కారణమని తెలిసింది. వారిని మందలించినా మారలేదు. దాంతో పోలీస్ స్టేషన్‌కి అప్పగిస్తే కొంత మారతారని ఆశించాము. అందుకే కౌన్సిలింగ్ చేయమని చెప్పి వారిని అప్పగించాము. మాకు వేరే ఉద్దేశాలు లేవు’’ అంటూ ఆయన తెలిపారు.

స్కూల్ హెడ్ మాస్టర్ జి.జగ్గారావు మాత్రం తనకు సమాచారం లేకుండానే ఇదంతా జరిగిందని, తెలిసిన వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లానని చెబుతున్నారు.

‘‘ఆరోగ్యం బాగోలేదని నా రూమ్‌లో ఉన్నాను. పిల్లలని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారని తర్వాత తెలిసింది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాను. వారి మీద కేసులు పెట్టలేదు. ఫిర్యాదులు కూడా లేవు. ఇంత వివాదం అవుతుందని ఊహించలేదు’’ అని ఆయన బీబీసీతో చెప్పారు.

‘‘నిర్బంధం కాదు, గాయపరచలేదు...’’

జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించి గాయపరిచారంటూ కథనాలు రావడంతో జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ కె.వి.సత్యన్నారాయణ విచారణ చేశారు. జంగారెడ్డిగూడెం సీఐ, ఎస్సైల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పిల్లల తల్లిదండ్రులను కూడా పిలిచి మాట్లాడారు.

‘‘ఎటువంటి కేసులు పెట్టలేదు. టీచర్లు పిల్లలను స్టేషన్‌కి తీసుకొచ్చే సమయానికి ఎస్సై, సీఐ లేరు. ఎగ్జామ్స్ డ్యూటీ కోసం బయట ఉన్నారు. వారు వచ్చే వరకూ కూర్చోబెట్టారు. వారిని లాకప్‌లో పెట్టారని, నిర్బంధించి, గాయపరిచారని చెబుతున్నది వాస్తవం కాదు. కేవలం పిల్లలను సరైన దారిలో పెట్టేందుకు చేసిన ప్రయత్నంగా దీనిని చూడాలి’’ అంటూ ఆయన మీడియాతో అన్నారు.

వీడియో క్యాప్షన్, అమ్మఒడి: పిల్లలను బడికి పంపి, ప్రభుత్వం నుంచి ఏటా రూ.15 వేలు పొందడం ఎలా?

‘‘చర్యలు తీసుకోవాలి...’’

టీనేజ్‌లో ఉన్న పిల్లలను చిన్న తప్పుకే పోలీస్ స్టేషన్‌లో బంధించే పరిస్థితి విచారకరమన్నారు సైకాలజీ కౌన్సిలర్ వి.ప్రకాష్ రెడ్డి. ఇలాంటివి నియంత్రించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘సహజంగా టీనేజ్‌లో పిల్లలకు భావోద్వేగాల మీద నియంత్రణ తక్కువ. చిన్న తప్పు చేసినందుకు, చేయని నేరానికి స్టేషన్‌లో నిర్బంధించే వారి మనసు మీద తీవ్ర ప్రభావం పడుతుంది. వారు దారి తప్పే ప్రమాదం ఉంటుంది. సున్నితంగా మందలించి తరగతిలోనే సరిదిద్దాలి. లేదంటే కౌన్సిలింగ్ ఇప్పించాలి. నేరగాళ్లతో కలిపి స్టేషన్‌లో కూర్చోబెట్టడం ప్రమాదకరం. ఉపాధ్యాయుల్లో ఈ ధోరణి సరికాదు. వారి మీద చర్యలు తీసుకోవాలి. పోలీసులు నిజంగా గాయపరిచినట్టు తేలితే వారిని కూడా శిక్షించాలి’’ అని ఆయన చెప్పారు.

ఇలాంటి పరిణామాలను ఆదిలోనే అడ్డుకోవాలని, ఇతరులు కూడా వీటిని అనుసరిస్తే పిల్లల భవిష్యత్తుని దెబ్బతీసిన వాళ్లమవుతామని ఆయన బీబీసీతో అన్నారు.

జంగారెడ్డి గూడెంలో 9వ తరగతి విద్యార్థులను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన ఘటనపై బాలల హక్కుల కమిషన్ మార్చి 19న స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేసినట్టు కమిషన్ సభ్యుడు జి రాజేంద్రప్రసాద్ ప్రకటించారు.

"మైనర్లను పోలీస్ స్టేషన్ కి తరలించిన ఉపాధ్యాయులు, అక్కడ స్టేషన్ లో బంధించిన పోలీసులపై చర్యలుంటాయి. ఈ కేసు విచారణలో భాగంగా కొన్ని ఆధారాల కోసం అందరితోనూ మాట్లాడాము. వారి వివరాలు సేకరించాము. పిల్లల వాంగ్మూలం కూడా తీసుకున్నాము. వాటి ఆధారంగా కేసు నమోదయ్యింది. కఠిన చర్యలు తీసుకుంటాం.ముగ్గురు టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశాము" అని ఆయన మార్చి 20న బీబీసీకి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)