ఆంధ్రప్రదేశ్: ‘కులదురహంకారమే’ కాకినాడలో దళిత యువకుని ప్రాణాలు తీసిందా?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
‘‘ఆసుపత్రికి చేరేలోగా నా ఒడిలోనే ప్రాణం పోయింది.’’
కొడుకు రామును పోగొట్టుకున్న తల్లి ఆవేదన ఇది.
ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాకు చెందిన దళిత యువకుడు రామును కొందరు హత్య చేశారు.
ఆరోజు ఏం జరిగింది?
కాకినాడ జిల్లాలోని తొండంగి మండలం శృంగవృక్షం గ్రామంలో ఏటా ఉగాదికి ముందు రోజు నూకాలమ్మ జాతర నిర్వహిస్తారు. రెండో రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి.
ఈ ఏడాది జాతర తొలిరోజు.. ఎస్సీ పేటకు చెందిన యువకులకు, ఇతర కులాల వారికి చిన్న వివాదం జరిగింది. ఎస్సీ కులానికి చెందిన సిద్ధాంతపు రవి అనే యువకుడి కాలు తమకు తగిలిందని ఇతర కులాలకు చెందిన కొందరు తగాదాకి దిగారు.
రెండో రోజు వివాదం పెద్దది అయింది.
మొదటి రోజు జరిగిన దానికి ‘ప్రతీకారం’ తీర్చుకునేందుకు కాపు, ఒంటరి సహా ఇతర కులాలకు చెందిన కొందరు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఎస్సీ పేటకు చెందిన ఎక్కువ మంది జాతరకి దూరంగా ఉన్నారు.
కానీ తొండంగి నుంచి అమ్మమ్మ ఇంటికి వచ్చిన నడిపల్లి రాము సహా ఇంకొందరు స్థానికులు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలోనే కొందరు కాపు, ఒంటరి కులాలకు చెందినవారు దాడికి దిగారు. ఆ దాడిలో కొందరు ఎస్సీ యువకులు గాయపడ్డారు.

మరొకసారి దాడి
రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఆలయ సమీపంలో తన బైకు ఉండిపోవడంతో దానిని తెచ్చుకునేందుకు వెళ్లిన రాముపై మరోసారి దాడి జరిగింది. ఈసారి రాళ్లు, కర్రలతో పాటుగా బీరు బాటిళ్లతో దాడి చేయడంతో రాము తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ విషయం తెలుసుకున్న కొందరు ఎస్సీ పేట యువకులు అక్కడికి వచ్చి రాముని తొండంగి పీహెచ్‌సీకి తరలించాల్సి వచ్చింది. అక్కడి నుంచి తుని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్య సిబ్బంది సూచించడంతో తీవ్రంగా గాయాలుపాలైన రాముని ఆటోలో తరలిస్తుండగా మార్గం మధ్యలోనే చనిపోయాడు.
‘‘ఒడిలోనే చనిపోయాడు’’
"అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తానని బయలుదేరాడు. అప్పుడే పని నుంచి వచ్చి సర్దుకుని వెళ్లాడు. మళ్లీ ఇంటికి వస్తాడులే అని అనుకున్నాం. కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత దెబ్బలు తగిలాయని ఫోన్ వచ్చింది.
ఎక్కడో బండి మీద నుంచి పడి ఉంటాడని అనుకున్నాం. కానీ తీరా చూస్తే మెడ, ముఖం, ఒళ్లంతా దెబ్బలే. ఏదో మాట్లాడాలని అనుకుంటున్నాడు. మాట్లాడలేకపోతున్నాడు. ఆటోలో వేసుకుని తుని తీసుకెళ్ళబోయాం. ఆసుపత్రికి చేరేలోగా నా ఒడిలోనే ప్రాణం పోయింది" అంటూ తుని అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తొండంగి గ్రామానికి చెందిన నడిపల్లి మంగ కన్నీళ్లు పెట్టుకున్నారు.
కన్నబిడ్డను కోల్పోయిన ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.
తొండంగిలో నివసించే నడిపల్లి మంగ, నాగేశ్వరరావుల కుమారుడైన రాము (22) బీఎస్సీ డిగ్రీ చదివాడు. పోలీస్ కానిస్టేబుల్ కావాలని కలలు కన్నాడు.
"మా వాడు డిగ్రీ చదివినా ఏ పనికీ వెనుకాడలేదు. ప్రస్తుతం తాపీ పనికి వెళుతున్నాడు. కానిస్టేబుల్ కావాలని కోరుకునేవాడు. నిత్యం అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేసేవాడు. మొన్నటిసారి అవకాశం రాకపోయినా మళ్లీ ప్రయత్నిస్తానని మాతో చెప్పాడు. అలాంటిది ఇప్పుడు జాతర కోసమని సరదాగా వెళితే చంపేశారు. జాతరలు చంపుకోవడానికేనా?. ఇలా ఎంతమందిని చంపేస్తారు?" అంటూ నాగేశ్వరరావు ప్రశ్నించారు.
చేతికంది వచ్చిన కొడుకును తమకు దక్కకుండా చేసిన వారిని శిక్షించాలని ఆయన కోరుతున్నారు.

కొంతకాలంగా వివాదాలు..
మండల కేంద్రం తొండంగి గ్రామానికి శృంగవృక్షం చేరువలో ఉంటుంది. ఈ గ్రామాల మధ్య సంబంధాల్లో కుల విబేధాలు చాలా సార్లు బహిరంగంగానే తలెత్తుతుంటాయి. చివరకు క్రికెట్ మ్యాచ్‌లు ఆడే దగ్గర కూడా అవి కనిపిస్తుంటాయి.
శృంగవృక్షం ఎస్సీ పేట క్రికెట్ జట్టు బలంగా ఉండటం కొద్దిరోజులుగా ఇతరులకు నచ్చడం లేదని స్థానిక యువకుడు ప్రభాకర్ బీబీసీతో అన్నారు.
‘‘మా జట్టు వరుసగా గెలుస్తూ వచ్చేది. దానిని సహించలేక చాలాసార్లు చిన్న చిన్న గొడవలు జరిగేవి. కానీ అవి గ్రౌండ్ వరకే ఉండేవి. ఈసారి జాతరలో ఇలా దాడి చేస్తారని, ఏకంగా మా పేట మీదకు వస్తారని ఊహించలేదు. అందరినీ భయకంపితుల్ని చేయాలనే లక్ష్యంతో మూకుమ్మడి దాడి జరిగింది. అయినా అసలు నిందితులను కాపాడేందుకు రాజకీయంగా ప్రయత్నిస్తున్నారు" అని ప్రభాకర్ ఆరోపించారు.
గ్రామంలోని చెరువు భూముల విషయంలో కూడా ఎస్సీ, కాపుల మధ్య వివాదం ఉంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బస్సా గంగాధరరావు అనే వ్యక్తి గ్రామంలోని భూములపై పెత్తనం చేస్తూ ఎస్సీల భూములు సాగు చేయడానికి ఆటంకాలు కల్పించారని గ్రామానికి చెందిన రైతు ఒకరు బీబీసీతో అన్నారు. నూకాలమ్మ జాతరలో వివాదానికి అది కూడా కారణం అని అభిప్రాయపడ్డారు.
బస్సా గంగాధరరావు ప్రస్తుతం ఈ కేసులో నిందితునిగా ఉన్నారు.

ఫొటో సోర్స్, Kakinada Police
పోలీసుల వైఫల్యమా..?
కాకినాడ జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో తొండంగి ఒకటి. ఈ మండలంలో కొన్ని గ్రామాలు సముద్రతీరంలోను, మరికొన్ని మెట్ట ప్రాంతానికి ఆనుకుని ఉంటాయి.
ఎస్సీలపై ఇతర కులాల వారు దాడులు చేశారంటూ తరచు పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదులు వస్తూ ఉంటాయి. గతంలో తొండంగి మండలంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద అనేక కేసులు నమోదయ్యాయి.
అలాంటి సున్నిత ప్రాంతంలో జాతరల సందర్భంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం ప్రశ్నార్థకంగా మారింది.
వరుసగా రెండో రోజులు దాడులు జరిగినప్పటికీ గాయపడిన రాముని సకాలంలో ఆసుపత్రికి తరలించడానికి కూడా పోలీసులు సాయం చేయలేదు. తొండంగి పీహెచ్‌సీ నుంచి తుని తరలించేందుకు కనీసం 108 వాహనం కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఆటోలో తరలించాల్సి వచ్చింది.
దాంతో తీవ్రంగా గాయపడిన రాముకు వైద్యం సకాలంలో అందలేదు. అదే అతని ప్రాణాల మీదకు తెచ్చిందనే అనుమానం వ్యక్తమవుతోంది.
పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారంగా చూసినా 21వ తేదీ రాత్రి జరిగిన ఘటనపై 22వ తేదీ ఉదయం 8 గంటల సమయంలో అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. దాంతో పోలీసు భద్రతా వైఫల్యం కూడా వివాదానికి కారణమనే ఆరోపణలు వస్తున్నాయి.

‘‘మాకు బాగా కావాల్సిన వారు’’
ఏపీ రోడ్లు, భవానాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా సొంత నియోజకవర్గం తుని పరిధిలో ఈ హత్య జరిగింది. కానీ ఆయన తొలి మూడు రోజుల పాటు బాధితులను పరామర్శించలేదు. బాధితులకు భరోసా కల్పించడానికి జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు కూడా తొండంగి మండలానికి వెళ్లలేదు.
ఈ విషయం మీద దాడిశెట్టి రాజాతో బీబీసీ మాట్లాడింది.
"ఘటన జరిగిన వెంటనే స్పందించాం. పోలీసులు కూడా వెంటనే రంగంలో దిగారు. మృతుడి కుటుంబం మాకు బాగా కావాల్సిన వారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన కుల ఘర్షణ. మద్యం మత్తులో ఆవేశాలకు పోయారు.
అక్కడ రెండు నెలలుగా వివాదం ఉంది. అది గరగల ఊరేగింపు సమయంలో బయటపడింది. పక్క ఊరి నుంచి వచ్చిన యువకుడి మృతి విచారకరం. ప్రభుత్వం తరపున రూ.10 లక్షల నష్టపరిహారం, రెండు ఎకరాల భూమి కూడా ఇవ్వాలని నిర్ణయించాం’’ అని దాడిశెట్టి రాజా తెలిపారు.
విపక్షాలు బాధితులను పరామర్శిస్తున్నాయి. టీడీపీ, సీపీఎంతో పాటు ‘‘కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం’’ వంటి దళిత సంఘాలు కూడా గ్రామంలో పర్యటించాయి.
"ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. నిందితులందరినీ శిక్షించాలి. అసలు కారకులను రాజకీయ జోక్యంతో పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతోందనే ఆందోళన బాధితుల్లో ఉంది. ఇది సమంజసం కాదు. కఠిన చర్యలు తీసుకోవాలి.
బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. గాయపడిన వారి కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వాలి. 5 ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి" అంటూ కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Dadisetty Raja/Facebook
‘‘సకాలంలో స్పందించాం’’
మార్చి 21వ తేదీ రాత్రి జరిగిన ఘటనలో 23వ తేదీన కొందరు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. మొత్తం 12 మంది మీద కేసు నమోదు చేశారు.
"గరగలు ఊరేగింపు జరుగుతుండగా రెండు వర్గాలవారికి గొడవ జరిగింది. రెండు వర్గాల యువకులు వీధిలో గుమికూడి గొడవపడ్డారు. ఆ గొడవ పెద్దదిగా మారి ఒక వర్గం లోని కొంత మంది మరొక వర్గానికి చెందిన వీధి వద్దకు వెళ్లి వారిపై దాడి చేశారు.
అక్కడే ఊరి చివర అమ్మవార్ల గుడి వద్ద బందోబస్తులో ఉన్న ముగ్గురు పోలీస్ సిబ్బంది వెంటనే వెళ్లి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో గాయాలైన వారిని తుని ఏరియా ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. వారిలో తొండంగి గ్రామానికి చెందిన నడిపల్లి రాముకి తొలుత తొండంగిలో ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం తుని ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే అతను చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు’’ అని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు తెలిపారు.
ఈ వ్యవహారంలో పోలీసులు సకాలంలో స్పందించినట్టు ఆయన వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- కత్తిపీటతో హత్య చేసేందుకు మా నాన్నే ప్రయత్నించారు – కులం, గౌరవం, ప్రేమ కథ
- ‘రంగమార్తాండ' రివ్యూ: గుండె లోతుల్లోని ఉద్వేగాన్ని బయటకు లాక్కొచ్చే సినిమా
- అదానీ గ్రూప్ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఛత్తీస్గఢ్లో గిరిజనులు ఏడాదిగా ఎందుకు నిరసనలు చేస్తున్నారు?
- ఉగాది: మనం ఉన్నది 2023లో కాదు.. 1945 లేదా 2080
- వడగళ్ల వానలు ఎందుకు పడతాయి? అవి వేసవిలోనే ఎందుకు ఎక్కువ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








