కాకినాడ-జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్: వేల మంది ఖాతాదారులను ఈ బ్యాంకు ఎలా రోడ్డున పడేసింది?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం

"సామర్లకోట ఎంపీడీవో ఆఫీసులో అటెండర్‌గా పనిచేశాను. రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులు ఇక్కడ బ్యాంకులో దాచిపెట్టాను. నా కొడుకు ఇల్లు అమ్మితే వాటిని కూడా నా పేరుతో అయితే ఎక్కువ వడ్డీ వస్తుందని వాటిని కూడా ఇక్కడే డిపాజిట్ చేశాను. బ్యాంకు మునిగిపోతుందని తెలియక రెండు నెలల ముందు కూడా కొంత మొత్తం ఉంటే వేసేశాను. అంతా పోయింది. ఏడాదిగా బ్యాంకు చుట్టూ తిరగడమే తప్ప ఒక్క పైసా రాలేదు. చివరకు మందులకు కూడా డబ్బులు లేవు. నావల్లే అంతా పోయిందని ఇంట్లో బిడ్డలు కూడా చూడడం లేదు’’అని కన్నీరు పెట్టుకున్నారు కొరెడ్ల వీరభద్రరావు.
కాకినాడలోని జయలక్ష్మీ కోఆపరేటవ్ బ్యాంక్ బాధితుల్లో ఆయన ఒకరు. ఇలాంటి వారు 20 వేల మందికి పైగా ఉన్నారు. వారిలో ఇప్పటికే 36 మంది చనిపోయారని, మరో 40 మంది ఆస్పత్రి పాలయ్యారని బాధితులు చెబుతున్నారు.
డిపాజిటర్లలో దాదాపుగా మూడొంతుల మంది రిటైర్ అయిన వారే. తమ రిటైర్మెంట్ సొమ్ముని బ్యాంకులో దాచిపెట్టుకుని, జీవితాన్ని నెట్టుకురావాలని ఆశించిన వారే. కానీ ఇప్పుడు ఆ బ్యాంకు దివాళా తీయడం, యాజమాన్యం చేతులెత్తేసిన తరుణంలో బాధితులంతా గగ్గోలు పెడుతున్నారు.
ఏడాదిగా బాధితులు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. కానీ ప్రయోజనం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఈ బ్యాంకు వ్యవహారంలో సీబీసీఐడీ దర్యాప్తు జరిపింది. సహకార శాఖ అధికారులు కూడా నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నామని చెబుతున్నారు. మరి ఈ బాధితుల గోడు తీరేదెన్నడు అన్నది ప్రశ్నగానే ఉంది.

అధిక వడ్డీల ఆశ జూపి...
కాకినాడ కేంద్రంగా ఈ ఏర్పడిన జయలక్ష్మీ మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ కో ఆపరేటివ్ సొసైటీ వేగంగా విస్తరించింది.
మ్యాక్స్ చట్టాన్ని అనుసరించి 1999లో ఈ సొసైటీ రిజిస్టర్ అయ్యింది. అప్పటి నుంచి వేల మంది ఖాతాదారులతో కోఆపరేటివ్ బ్యాంకు వివిధ ప్రాంతాలకు వ్యాపించింది.
కాకినాడతో పాటు రాజమహేంద్రవరం, అమలాపురం, తుని వంటి ప్రాంతాలతో పాటు విశాఖపట్నం, విజయవాడలో కూడా బ్రాంచీలు ఏర్పాటు చేశారు.
జాతీయ బ్యాంకులతో పాటు ఇతర లోకల్ బ్యాంకులతో పోలిస్తే అధిక వడ్డీలు ఇస్తుండడంతో అత్యధికులు తమ సొమ్ముని జమ చేయడానికి మొగ్గు చూపారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల మీద గురిపెట్టి వారిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.
హఠాత్తుగా 2022 మార్చి నెల మధ్యలో డిపాజిటర్లకు తమ సొమ్ము తిరిగి చెల్లించడంలో జాప్యం జరిగింది. కొద్ది రోజులు గడిచేనాటికి ఏప్రిల్‌లో మొత్తం బ్యాంకు శాఖలన్నీ దివాళా తీసే పరిస్థితి వచ్చింది.
బ్యాంకు చైర్మన్ రాయవరపు ఆంజనేయులు, ఆయన భార్య విశాలక్ష్మి సహా డైరెక్టర్లంతా పరారయ్యారు. దాంతో ఖాతాదారులు రోడ్డున పడాల్సి వచ్చింది.
ఏడాదిగా ఎదురుచూపులే..
ఆ బ్యాంకులో జమ చేసిన సొమ్ములు తిరిగి చెల్లించకుండా బోర్డు తిప్పేయడంతో ఖాతాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాంతో జయలక్ష్మీ ఎంఏఎం సొసైటీ యాజమాన్యం మీద పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.
తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు. వివిధ సందర్భాల్లో అధికారులను కలిశారు. నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కూడా కలిసి అభ్యర్థించారు.
బ్యాంకు ఎదుట నిరసనలకు దిగారు. వివిధ రూపాల్లో తమ ఆందోళన వ్యక్త పరిచారు. అయినా వారికి ఫలితం దక్కలేదు.
నేటికీ తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో చాలామంది ఎదురుచూస్తున్నారు. నిత్యం బ్యాంకు వద్దకు రావడం, ఏదో జరుగుతుందనే ఆశాభావంతో సాగడం మినహా తమకు మరో దారి లేకుండా పోయిందని బ్యాంకు ఖాతాదారురాలు జి లక్ష్మి బీబీసీతో అన్నారు.
"బ్యాంకులో వచ్చే వడ్డీ డబ్బులతో మందులు తెచ్చుకునే వాళ్లం. ఇప్పుడు ఏడాది నుంచి ఆ డబ్బులు రాకపోవడంతో మాకు మందులు కొనుక్కునే స్తోమత కూడా లేదు. కొందరు అలానే ప్రాణాలు కోల్పోయారు. మా ఆరోగ్యాలు కూడా క్షీణిస్తున్నాయి. ప్రభుత్వం ఏదోటి చేయకపోతుందా, మా డబ్బులు తిరిగి రాకపోతాయా అనే ఆశతోనే బతుకుతున్నాం" అంటూ ఆమె వివరించారు.

పథకం ప్రకారమే పక్కదారి
దాదాపుగా ఐదు జిల్లాల పరిధిలో 29 బ్రాంచీలు, 300 మంది సిబ్బందితో నడిచిన బ్యాంకు హఠాత్తుగా మూతపడడం వెనుక పెద్ద ప్రణాళిక ఉందని బాధితుల అంచనా. సహకార శాఖ విచారణ, సీబీసీఐడీ దర్యాప్తులో కూడా ఇదే తేలింది.
దాదాపు రూ. 560 కోట్ల డిపాజిట్లను ఈ బ్యాంకు తరపున సేకరించారు. ఆ డిపాజిట్లను రుణాలుగా ఇచ్చారు. అయితే దాదాపు పదేళ్ల పాటు సమర్థవంతంగా నడపడం ద్వారా బ్యాంకు విస్తరించిన యాజమాన్యం, ఆ తర్వాత వచ్చిన డిపాజిట్లను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిందనేది సీఐడీ అధికారుల మాట.
ఉదాహరణకు చక్రభాస్కర రావు అనే డైరెక్టర్ తను రూ. 2 కోట్ల రుణం తీసుకోవడమే కాకుండా, ఆయనే మరో రూ. 25 కోట్లకు గ్యారంటీ ఇచ్చినట్టు బ్యాంకు నివేదికల్లో ఉంది. తగిన హామీ పత్రాలు లేకుండా పదులు, వందల కోట్ల రుణాలు కొందరికి, అందులోనూ బ్యాంకు డైరెక్టర్ల బంధువులకు కట్టబెట్టినట్టు ఆధారాలున్నాయి.
ముఖ్యంగా బ్యాంకు నిర్వాహకులుగా ఉన్న విశాలక్ష్మి, ఆంజనేయులు కలిసి మొత్తం డిపాజిట్లలో 20 శాతం రుణాలుగా ఇవ్వడం, మిగిలిన సొమ్ముని వివిధ కంపెనీల్లో పెట్టుబడుల పేరుతో మళ్లించినట్టు ప్రస్తుతం బ్యాంకు నిర్వహణ బాధ్యత తీసుకున్న చైర్మన్ జి.త్రినాథ రావు చెబుతున్నారు.
‘‘డిపాజిట్‌లను సద్వినియోగం చేస్తే ఈ బ్యాంకు మరింత అభివృద్ధి అయ్యేది. కానీ అత్యాశకు పోయి వాటిని ఎటువంటి గ్యారంటీ లేకుండా సొంత వారి పేరుతో మళ్లించారు. డైరెక్టర్లు, నిర్వాహకులు కలిసి తమకు నచ్చిన రీతిలో వందల కోట్లను వాడేశారు. దాంతో ప్రస్తుతం లెక్కలు తీస్తుంటే రూ. 250 కోట్ల మేరకు మాత్రమే రుణాలు తీసుకున్న వారు కనిపిస్తున్నారు. మిగిలిన మొత్తం మాయం చేసేశారు. డీఫాల్టర్లలో చాలా మంది ప్రముఖుల బంధువులున్నారు. వాటిని వసూలు చేసేందుకు అధికారులు సహకరించాలి. అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుంది’’అని ఆయన బీబీసీతో అన్నారు.
బ్యాంకు మూతపడి, పాత పాలకవర్గం మోసం చేయడంతో వారిని తొలగించి నిబంధనల మేరకు కొత్త పాలకవర్గాన్ని ఎంచుకున్నారు. అక్టోబర్ నుంచి మళ్లీ బ్యాంకు కార్యకలాపాలు మొదలెట్టారు. కానీ రుణాలు తీసుకున్న వారి నుంచి వసూలు చేయగలిగితేనే పట్టాలెక్కే పరిస్థితి వస్తుందని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు.
ప్రభుత్వం సహకరించాలి: ప్రస్తుత డైరెక్టర్
జయలక్ష్మీ మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ కో ఆపరేటివ్ సొసైటీ కుంభకోణం విషయంలో ఆశించిన రీతిలో ప్రభుత్వం కదలడం లేదన్నది బాధితుల వాదన. ఖాతాదారులంతా ఆర్థికంగా మునిగిపోయినందున వారిని ఆదుకోవడానికి కొంత మొత్తం నిధులు విడుదల చేయాలని, రుణాల వసూలు తర్వాత తిరిగి జమ చేసుకోవచ్చని ప్రస్తుత డైరెక్టర్‌గా ఉన్న డి మల్లేశ్వర రావు అంటున్నారు.
"ప్రభుత్వం తొలుత రూ. 200 కోట్లు సహాయం చేయాలి. బ్యాంకు నుంచి అప్పులు తీసుకున్న వారు తిరిగి చెల్లించాలంటే వారి డాక్యుమెంట్లు వెనక్కి ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం అవన్నీ సీబీసీఐడీ చేతుల్లో ఉన్నాయి. వాటిని ఇప్పిస్తే రికవరీ పెరుగుతుంది. ఇప్పటి వరకూ రూ. 2 కోట్లు వెనక్కి వచ్చాయి. బ్రాంచీలన్నీ మూసేశాము. ఖర్చులు తగ్గించి రావాల్సిన మొత్తం వసూలు చేయగలిగితే కొంత మేర న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం" అంటూ ఆయన వివరించారు.
ఆస్తుల స్వాహాకు యత్నాలు
బ్యాంకు పేరుతో పలు ఆస్తులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భూములు, ఇతర స్థిర ఆస్తులుగా ఉన్న వాటిని కొందరు పక్కదారి పట్టించే పనిలో ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
"బ్యాంకు ఆస్తులను కాపాడాలి. కాకినాడ సెజ్‌లో కూడా కొన్ని భూములున్నాయి. అవన్నీ విలువైనవి. వాటిని కొందరు స్వాహా చేసే ప్రయత్నం జరుగుతోంది. దానిని అడ్డుకోవాలి. బ్యాంకు ఆస్తులను పరిరక్షించాలి. నష్టపోయిన ఖాతాదారులకు అవి చేరేలా చూడాలి. రికార్డులు తారుమారు చేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వం స్పందించాలి" అంటూ కాకినాడ రూరల్ ఇంద్రపాలెం మాజీ సర్పంచ్ పలివెల వీరబాబు అన్నారు.
బ్యాంకు డిపాజిటర్లలో పేద బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారని, వారి జీవితాలు రోడ్డునపడినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి కనికరం చూపడం లేదని ఆయన విమర్శించారు. రుణాలు తీసుకున్న వారిలో కొందరు రాజకీయ నేతల బంధువులు ఉండడంతో వాటి రికవరీ వైపు దృష్టి పెట్టడం లేదని వీరబాబు అభిప్రాయపడ్డారు.
నిబంధనల ప్రకారమే: అధికారులు
మాజీ పాలకవర్గంలో, ఈ కుంభకోణానికి కారకులుగా భావిస్తున్న వారిలో కొందరిని పోలీసులు అరెస్టులు చేశారు. నేటికీ కొందరు డైరెక్టర్లు జైల్లో ఉన్నారు. కానీ బాధితుల్లో అత్యధికులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
మ్యాక్స్ చట్టం ప్రకారం కోఆపరేటివ్ బ్యాంకుల వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం లేదని కాకినాడ జిల్లా సహకార శాఖ అధికారి దుర్గా ప్రసాద్ చెబుతున్నారు.
"నిబంధనల మేరకు ఐదుగురు సభ్యుల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాని ఆధారంగా అడ్ హక్ కమిటీ వేసి, ఆ తర్వాత జనరల్ బాడీలో పూర్తి కమిటీ వేశాము. చట్టం ప్రకారం వ్యవహరిస్తున్నాం. సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం. ఆస్తులను పరిరక్షించడం, బాధితులను ఆదుకునే చర్యలకు పూనుకుంటున్నాం. ఎవరికీ అన్యాయం జరగదని భావిస్తున్నాం" అంటూ ఆయన బీబీసీకి తెలిపారు.
ప్రభుత్వ వాదన ఎలా ఉన్నప్పటికీ ఏడాది గడుస్తున్నా సమస్య పరిష్కారానికి తగిన చొరవ ప్రభుత్వం నుంచి లేదనే వాదన బాధితుల నుంచి గట్టిగా వస్తోంది.
ఇవి కూడా చదవండి
- ఆస్కార్-ఆర్ఆర్ఆర్: వైఎస్ జగన్ ‘‘తెలుగు జెండా’’ అంటే ప్రాంతీయ వాదం అవుతుందా?
- కే హుయ్ క్వాన్: ఒకప్పుడు శరణార్థి...నేడు ఆస్కార్ విజేత
- మాతృత్వం: ‘మా అమ్మ వయసు 50 ఏళ్లయితే మాత్రం.. రెండవ బిడ్డను కనడానికి ఎందుకు సిగ్గుపడాలి?’
- కర్నాటక: ‘‘మైకుల్లో ప్రార్థించకుంటే అల్లాకు వినపడదా..’’ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు... మరి నిబంధనలు ఏం చెబుతున్నాయి
- లావణి డ్యాన్స్: మహిళలను ప్రైవేటుగా బుక్ చేసుకునే ఈ నృత్యం ఏంటి? ఈ జీవితం మీద ఆ మహిళలు ఏమంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


















