పగలు క్లర్క్... రాత్రి ఆటో డ్రైవర్... ఆదివారం బట్టల వ్యాపారి... ఒక వ్యక్తి మూడు పనులు

ఫొటో సోర్స్, BHARGAV PARIKH
- రచయిత, బార్గవ్ పారిఖ్
- హోదా, బీబీసీ కోసం
‘‘ఇంటికి నేను పెద్ద కొడుకును. మేం ఇల్లు కట్టడానికి రుణం తీసుకున్నాం. ఆ తర్వాత మా మా చెల్లి చనిపోయింది. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో మా నాన్న గాయపడ్డారు. ఆ తర్వాత తమ్ముడికి పెళ్లి చేశాం. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. చాలా డబ్బులు ఖర్చయ్యాయి. దీంతో పగలు క్లర్క్‌గా పనిచేస్తున్నాను. రాత్రిపూట ఆటో నడుపుతున్నాను.’’
అహ్మదాబాద్‌లోని బాపూనగర్‌లో జీవించే కిశోర్ ప్రజాపతి వ్యాఖ్యలివీ..
కిశోర్ ప్రజాపతి తండ్రి సోహన్‌లాల్ ప్రజాపతి సొంత ఊరు ఖేడ్‌బ్రహ్మ. అయితే, ఉపాధి కోసం ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తెను వెంట పెట్టుకొని ఆయన అహ్మదాబాద్‌కు వచ్చారు.
అయితే, సోహన్‌లాల్‌కు తాను ఆశించిన ఉద్యోగం రాలేదు. దీంతో కుటుంబాన్ని పోషించేందుకు ఆయన ఆటో నడిపాల్సిన పరిస్థితి వచ్చింది. అలానే ఇద్దరు కొడుకులకు చదివించి ఆయన పెళ్లిళ్లు చేశారు.
సోహన్‌లాల్ పెద్ద కుమారుడు కిశోర్ ఒక ప్రైవేటు సంస్థలో క్లర్క్‌గా పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, BHARGAV PARIKH
దెబ్బ మీద దెబ్బ
‘‘చదువు పూర్తయిన తర్వాత మా తమ్ముడు దిలీప్‌కు ఉద్యోగం వచ్చింది. దీంతో అహ్మదాబాద్‌లో మా కంటూ ఒక ఇల్లు ఉండాలని మా నాన్న భావించారు’’అని బీబీసీతో కిశోర్ చెప్పారు.
‘‘మా ఇంట్లో ముగ్గురు సంపాదించేవారు. దీంతో మేం రుణం తీసుకొని, బాపూనగర్‌లో ఒక ఇల్లు కొన్నాం. కానీ, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. మొదట అనారోగ్యంతో మా చెల్లి చనిపోయింది. దీంతో మా చెల్లి కుమార్తె నందిని బాధ్యతలు కూడా మేమే తీసుకున్నాం. ఆ షాక్ నుంచి బయటకు రాకముందే, మా నాన్న ఆటోకు ప్రమాదం జరిగింది’’అని ఆయన వివరించారు.
‘‘మొదట ఒక మరణం, ఆ తర్వాత మరొకరు ఆస్పత్రి పాలు కావడం అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. దీంతో మాకు రోజు గడవడం చాలా కష్టం అయ్యింది’’అని ఆయన చెప్పారు.
‘‘మా తమ్ముడు, నేను ఇద్దరమూ ప్రైవేటు సంస్థల్లోనే ఉద్యోగాలు చేస్తున్నాం. ఒక రోజు సెలవు తీసుకుంటే, మా జీతం తగ్గిపోతుంది’’అని ఆయన వివరించారు.
తండ్రి ఆరోగ్యం కాస్త కుదుటపడిన వెంటనే, అప్పులు తీర్చేందుకు ఒకరి జీతాన్ని పూర్తిగా కేటాయించాలని కిశోర్, దిలీప్ నిర్ణయించుకున్నారు. రెండో జీతాన్ని ఇల్లు గడిపేందుకు ఉంచుకోవాలని భావించారు.
అయితే, తాజాగా దిలీప్‌కు పెళ్లి అయ్యింది. దీంతో కుటుంబం భారం కిశోర్‌పై పడింది.

ఫొటో సోర్స్, BHARGAV PARIKH
‘‘ఆటో నడుపుతున్నానని ఇంట్లో తెలియదు’’
‘‘నా జీతం రూ.18,000. ఇంటి ఖర్చులన్నీ నేనే చూసుకోవాలి. నాకు ఇద్దరు పిల్లలు అన్ష్, ఆయుష్ కూడా ఉన్నారు. మరోవైపు మా చెల్లి కుమార్తె నందిని కూడా మేం చదివించుకోవాలి. అందుకే డబ్బులు చాలా అవసరం ఉంటుంది’’అని కిశోర్ చెప్పారు.
‘‘అందుకే ఒక పరిష్కారం కోసం ఆలోచించాను. అప్పుడే మా నాన్నలానే నేను కూడా డబ్బుల కోసం రాత్రిపూట ఆటో నడపాలని అనుకుంటున్నానని నా భార్య జ్యోత్స్నకు చెప్పాను. నేను ఆటో నడుపుతున్నానని తెలిస్తే, మా అమ్మానాన్న, తమ్ముడు, ఇతర కుటుంబ సభ్యులు షాక్‌కు గురవుతారు. అందుకే కేవలం రాత్రిపూట మాత్రమే ఆటో నడిపాలని అనుకున్నాను’’అని ఆయన వివరించారు.
‘‘నా భర్త రాత్రిపూట ఆటో నడుపుతున్నారని మా మావయ్యకు తెలిస్తే, ఆయన కూడా ఆటో తొక్కుతానని అంటారు. మావయ్యకు ఒంట్లో బాగోలేదు. ఆయన ఎలా ఈ వయసులో పనిచేయగలరు?’’అని కిశోర్‌భాయ్ భార్య జ్యోత్స్నబెన్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, BHARGAV PARIKH
మరోవైపు కిశోర్‌భాయ్ మాట్లాడుతూ.. ‘‘మా నాన్న ఆరోగ్యం బాగోదు. కానీ, ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిసినప్పుడు ఆయన కూడా ఆటో నడుపుతానని అన్నారు’’అని చెప్పారు.
కిశోర్ రోజు ఎలా ముగుస్తుందో జ్యోత్స్న మాట్లాడుతూ.. ‘‘సాయంత్రం ఉద్యోగం నుంచి నా భర్త ఇంటికి వస్తారు. పిల్లలతో కాసేపు సరదాగా గడుపుతారు. వారితో కలిసి భోజనం చేస్తారు. పిల్లలు నిద్ర పోవడానికి వెళ్లిన వెంటనే, అంటే రాత్రి 11 గంటలకు ఆయన ఆటోతో బయటకు వెళ్తారు. ఉదయం ఐదు గంటలకు మళ్లీ ఇంటికి వస్తారు’’అని వివరించారు.
ఆదాయం కోసం ఆయన మూడో మార్గం కూడా వెతికారు. ప్రతి ఆదివారం కిశోర్, తన భార్య కలిసి రాణిప్ ప్రాంతంలో బట్టలను కూడా అమ్ముతుంటారు.
‘‘నేను ఎక్కువగా మణినగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఆటో నడుపుతుంటాను. ఎందుకంటే అక్కడకు బాపూనగర్ నుంచి వచ్చే ప్రజలు తక్కువగా ఉంటారు’’అని కిశోర్ చెప్పారు. లేకపోతే, తాను ఆటో నడుపుతున్నట్లు అందరికీ తెలిసిపోతుందని ఆయన వివరించారు.
‘‘ఆటో యజమాని నుంచి ఎనిమిది గంటలపాటు అద్దెకు ఆటో తీసుకుంటాను. దీనికి అద్దె రూ.300. ఇది కచ్చితంగా ఆటో యజమానికి ఇచ్చేయాల్సిందే. నెలకు ఆటో వల్ల నాకు రూ.6,000 నుంచి రూ.7,000 వరకు ఆదాయం వస్తుంది’’అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, BHARGAV PARIKH
‘‘బట్టల వ్యాపారంతో రూ.4,000’’
రాణిప్ ఆదివారం మార్కెట్‌లో బట్టల వ్యాపారం గురించి మాట్లాడుతూ.. ‘‘మేం రెడీమేడ్ బట్టలను మాకు తెలిసిన హోల్‌సేల్ వ్యాపారి నుంచి శనివారం సాయంత్రం కొంటాం. వీటిని ఆదివారం మార్కెట్‌లో అమ్ముతుంటాం. అలా నెల మొత్తానికి మాకు రూ.4,000 అదనంగా వస్తుంటాయి’’అని కిశోర్ చెప్పారు.
‘‘దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు. కానీ, మేం పనిచేయకుండా ఆయన అడ్డుకోలేడు. నా గురించి తెలిసిన బట్టల హోల్‌సేల్ వ్యాపారులు నాకు ఒక రెండు రూపాయలు ఎక్కువ వచ్చేలా బట్టలు ఇస్తుంటారు’’అని ఆయన తెలిపారు.
‘‘ఇబ్బందులంటే నాకేమీ భయం లేదు. కానీ, దొంగ, పాపపు సొమ్ము నాకు వద్దు. నిజాయితీగానే కుటుంబం కోసం నేను కష్టపడతాను’’అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కత్తిపీటతో హత్య చేసేందుకు మా నాన్నే ప్రయత్నించారు – కులం, గౌరవం, ప్రేమ కథ
- ‘రంగమార్తాండ' రివ్యూ: గుండె లోతుల్లోని ఉద్వేగాన్ని బయటకు లాక్కొచ్చే సినిమా
- అదానీ గ్రూప్ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు ఏడాదిగా ఎందుకు నిరసనలు చేస్తున్నారు?
- ఉగాది: మనం ఉన్నది 2023లో కాదు.. 1945 లేదా 2080
- వడగళ్ల వానలు ఎందుకు పడతాయి? అవి వేసవిలోనే ఎందుకు ఎక్కువ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















