రాహుల్ గాంధీ: రాజకీయ చదరంగంలో పోరాడుతున్న అయిదో తరం ‘యోధుడు’

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Rahul Gandhi/Facebook

    • రచయిత, రషీద్ కిద్వాయ్
    • హోదా, సీనియర్ పాత్రికేయుడు, బీబీసీ కోసం

ఒకసారి తైమూర్ రాజవంశాల మనుగడ గురించి ప్రముఖ చరిత్రకారుడు ఇబ్న్ ఖల్దూన్‌ను అడిగారు.

ఒక రాజవంశ వైభవం నాలుగు తరాలకు మించి ఉండదని ఖల్దూన్ సమాధానమిచ్చారు.

మొదటి తరం విజయపు బాటలు వేస్తే, రెండో తరం పరిపాలనలో మెరుగ్గా ఉంటుంది. ఇక మూడో తరానికి విజయం లేదా పరిపాలన గురించి ఏమాత్రం పట్టదు. ఈతరం వారు తమ పూర్వీకుల సంపదను ఖర్చు చేసే పనిలో ఉంటారు.

ఫలితంగా, నాలుగో తరం వారు సంపదతో పాటు హ్యుమన్ ఎనర్జీ (మానవ శక్తిని)ని కూడా ఖర్చు చేస్తారు. అందుకే, ప్రతీ రాజ కుటుంబం పతనం అనేది దాని వృద్ధితోనే మొదలవుతుందని అన్నారు.

ఖల్దూన్ ప్రకారం, ఇది ఒక సహజమైన ప్రక్రియ. దీన్ని నివారించలేం.

సోనియా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

నెహ్రూ-గాంధీ కుటుంబం

సమకాలీన భారత చరిత్రలో నెహ్రూ-గాంధీ కుటుంబం ఎత్తుపల్లాలను పరిశీలిస్తే, ఇబ్న్ ఖల్దూన్ వివరించిన ప్రక్రియ గుర్తుకు వస్తుంది.

బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీకి సన్నిహిత సహచరుడిగా జవహర్‌లాల్ నెహ్రూ (1889-1964) దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు.

ఆయన కుమార్తె ఇందిరా గాంధీ (1917-1984) తన తండ్రి వారసత్వాన్ని విస్తరించారు. పాకిస్తాన్‌పై యుద్ధంలో, బంగ్లాదేశ్ ఏర్పాటులో ఆమె కీలక పాత్ర పోషించారు. 20వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా అవతరించారు.

ఇందిర గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ (1944-1991) కూడా భారతదేశానికి ప్రధాన మంత్రిగా వ్యవహరించారు. రాజీవ్ గాంధీ అనేక ప్రయోగాలు చేశారు. వాటికి తగిన మూల్యం కూడా చెల్లించారు.

రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ పేరుకు కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 138 ఏళ్ల చరిత్ర ఉన్న భారత జాతీయ కాంగ్రెస్‌కు ఆమె ఎక్కువ కాలం అధ్యక్షురాలిగా పనిచేశారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

నెహ్రూ-గాంధీ కుటుంబంలోని అయిదో తరానికి చెందిన వ్యక్తి రాహుల్ గాంధీ. గాంధీ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన ఆరో సభ్యుడు రాహుల్ గాంధీ. 138 ఏళ్ల కాంగ్రెస్‌ చరిత్రలో నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు 51 ఏళ్ల పాటు అధ్యక్షులుగా కొనసాగారు. అందులో సోనియా గాంధీ ఏకంగా 22 ఏళ్లపాటు అధ్యక్షురాలిగా పనిచేశారు.

జవహర్‌లాల్ నెహ్రూ 11 ఏళ్లు, ఇందిరా గాంధీ ఏడేళ్లు, రాజీవ్ గాంధీ ఆరేళ్లు, మోతీలాల్ నెహ్రూ రెండేళ్లు ఏఐసీసీకి నాయకత్వం వహించారు. ఏఐసీసీకి 87వ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు. 16 నెలల కంటే తక్కువ కాలమే ఆయన ఆ పదవిలో ఉన్నారు. 2017 డిసెంబర్ నుంచి 2019 మే వరకు ఆయన ఏఐసీసీ చీఫ్‌గా పని చేశారు.

2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ, రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రాజకీయ వ్యవహార శైలి, ఆయన తల్లి సోనియా గాంధీకి భిన్నంగా ఉండేది. చాలా చర్చల అనంతరం1998లో సోనియాగాంధీకి కాంగ్రెస్ పగ్గాలు అందాయి. అప్పటి కాంగ్రెస్‌లో చీలికలు ఉండేవి. ఇదే ఆమెకు వారసత్వంగా లభించింది. అయితే, కాంగ్రెస్ నాయకులను ఏకం చేయడంలో ఆమె విజయవంతం అయ్యారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ధైర్యంగా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ

సోనియా గాంధీతో పోల్చితే, 53 ఏళ్ల రాహుల్ గాంధీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ పరిణామాల గురించి బెదరకుండా స్పష్టంగా, ధైర్యంగా మాట్లాడుతున్నారు.

లండన్, కేంబ్రిడ్జ్‌లలో ఆయన ఇటీవల చేసిన ప్రకటనలు వివాదానికి దారితీశాయి. ‘‘మీ కుమారుడిని కంట్రోల్ చేయండి’’ అని బీజేపీ నేతలు, రాహుల్ తల్లి సోనియా గాంధీని కోరాల్సి వచ్చింది.

భారత ప్రజాస్వామ్యంలో నాణ్యత లోపించిందని వ్యాఖ్యానించడంతో పాటు 'పెగాసస్ వివాదం', 'చైనా ముప్పు' వంటి అంశాల గురించి కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు.

రాహుల్ గాంధీ రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. మొదటిది 'భారతదేశం రాష్ట్రాల సమాఖ్య' అని, రెండవది దౌత్యంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని ఆరోపణలు చేస్తున్నారు.

అయితే, ఎన్నికల దృక్కోణంలో చూస్తే రాహుల్ గాంధీ దృష్టి సారించిన ఈ అంశాలు, ఓట్లను తమ వైపు ఆకర్షించడంలో విఫలమయ్యాయని కాంగ్రెస్‌లోని చాలా మంది నమ్ముతారు.

అమర్త్యసేన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రముఖ ఆర్థికవేత్త ప్రశంసలు

1994 అక్టోబర్ నుంచి 1995 జూలై వరకు రాహుల్ గాంధీ, ట్రినిటీ విద్యార్థిగా ఉన్నారు. డెవలప్‌మెంట్ స్టడీస్‌లో ఆయన ఎంఫిల్ చేశారు.

రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్యసేన్ అన్నారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం, 1999లో అమర్త్యసేన్‌ను భారతరత్న పురస్కారంతో గౌరవించింది.

2009 ఆగస్టులో అవుట్‌లుక్ మ్యాగజీన్‌కు చెందిన వినోద్ మెహతా, అంజలి పూరీలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమర్త్యసేన్, రాహుల్ గాంధీని ప్రశంసించారు. రాహుల్‌ గాంధీ సమర్థుడైన వ్యక్తి అని అభివర్ణించారు.

‘‘నాకు రాహుల్ గురించి కొంచెం తెలుసు. ఆయన నన్ను ట్రినిటీలో కలవడానికి వచ్చినప్పుడు నేను ఒక రోజంతా ఆయనతోనే ఉన్నాను. ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో దాని గురించి మేం చర్చించాం. ఆ సమయంలో ఆయనకు రాజకీయాలకు సంబంధించిన ప్రణాళికలు లేవు. ఆయనే ఈ విషయం చెప్పారు. తర్వాత ఆయన దృక్పథం మారింది. భారత అభివృద్ధికి ఆయన నిబద్ధతతో ఉన్నాడని నేను చెప్పగలను’’ అని అమర్త్యసేన్ అన్నారు.

డెవలప్‌మెంట్ ఎకనమిక్స్‌లో ఎంఫిల్ చేసిన రాహుల్, కేంబ్రిడ్జ్‌లో తమకు బోధించిన విషయాల్లో చాలా వాటితో తాను విభేదిస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. గతంలో కంటే ఇప్పుడు తనలో వామపక్ష భావాలు చాలా తగ్గిపోయాయని అన్నారు.

రాజకీయాల్లో దోషులకు, అవినీతిపరులకు రక్షణ కల్పించే ఆర్డినెన్స్ కాపీని రాహుల్ గాంధీ ఎలా చింపివేశారో 2013లో ప్రపంచం చూసింది. ఇది జరిగిన కొద్దిరోజుల తర్వాత రాహుల్, మన్మోహన్ సింగ్‌కు క్షమాపణలు చెప్పారు.

10 ఏళ్ల క్రితం తాను స్వయంగా చింపివేసి, చట్టంగా మారకుండా చేసిన ఆర్డినెన్స్ ఈరోజు ఆయనను లోక్‌సభ నుంచి బహిష్కరించకుండా కాపాడి ఉండేది.

ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

నాయనమ్మ ఇందిరా గాంధీ, రాహుల్‌ని ఎలా చూసేవారు?

చిన్నతనంలో ఉన్న రాహుల్ గాంధీ ప్రవర్తనకు, ఇందిరాగాంధీ చాలా ప్రాధాన్యతను ఇచ్చేవారు.

1984 అక్టోబర్‌లో ఇందిరాగాంధీ మరణించినప్పుడు రాహుల్‌ గాంధీ వయస్సు 14 ఏళ్లు. కానీ, రాజీవ్ లేదా సోనియాతో మాట్లాడని విషయాల గురించి కూడా అప్పట్లో ఆమె రాహుల్ గాంధీతో మాట్లాడేవారు.

ఉదాహరణకు, 'ఆపరేషన్ బ్లూ స్టార్' తర్వాత తనను హత్య చేస్తారని ఇందిరా గాంధీ ఊహించారు. అందుకే ఆమె రాహుల్ గాంధీతో ‘ఒకవేళ నేను మరణిస్తే భయపడి ఏడ్వకుండా వెంటనే చార్జ్ తీసుకోవాలి’ అని చెప్పారు.

ఆమె రాహుల్‌తో మెల్లిగా మాట్లాడేవారు. తానూ పూర్తి కాలం పాటు జీవించానని, ఒకవేళ తను మరణిస్తే అంత్యక్రియలు ఎలా చేయాలో కూడా 14 ఏళ్ల రాహుల్ గాంధీతో ఆమె చర్చించేవారు.

బహుశా, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి రాహుల్ ఆ సమయంలో చాలా చిన్నవాడు. కానీ, ఇందిర తన ఆలోచనను పంచుకోవడానికి రాహుల్ గాంధీని సరైన వ్యక్తిగా భావించారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణలో భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీని కలిసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

39 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నెహ్రూవియన్ లౌకికవాద ఆలోచనకు విరుద్ధంగా, రాహుల్ గాంధీ తన రాజకీయ ప్రచారంలో మతాన్ని చేర్చడానికి చేసిన ప్రయత్నాన్ని కొందరు ప్రశ్నించారు.

సెక్యులరిజానికి జవహర్‌లాల్ నెహ్రూ స్పష్టమైన నిర్వచనాన్ని ఇచ్చారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాల నుంచి మతం అనేది దూరంగా ఉండాలని నెహ్రూ అన్నారు. నెహ్రూ ఆలోచనలో, మతం అనేది ఒక వ్యక్తికి చెందిన వ్యక్తిగత విషయం. ఈ విషయంలో ప్రభుత్వాలు తనంతట తానుగా దూరంగా ఉండాలని నెహ్రూ కోరుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)