ఏప్రిల్ 1: ఈ 3 పనులు చేస్తే కొత్త ఆర్థిక సంవత్సరంలో డబ్బు ఆదా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఐవీబీ కార్తికేయ
- హోదా, బీబీసీ కోసం
ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కాబోతోంది.
వివిధ మదుపు మార్గాల ద్వారా వచ్చిన రాబడిని అర్థం చేసుకుని భవిష్యత్తులో ఎలాంటి రాబడి వస్తుందో బేరీజు వేయడానికి ఏప్రిల్ నెల అనుకూలం.
అంతేకాక బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టిన కొత్త నియమ నిబంధనలు ఏప్రిల్‌లో అమలులోకి వస్తాయి. ఆ రకంగా చూస్తే ఏప్రిల్ నెల, పర్సనల్ ఫైనాన్స్ ప్రయాణంలో చాలా కీలకమైన సమయం.
ఏప్రిల్‌లో మాత్రమే కాకుండా కొత్త ఏడాది మొత్తం ఆర్థిక స్వావలంబన సాధించడానికి ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. ఈ కార్యాచరణ మూడు భాగాలుగా ఉంటుంది.
1. తప్పనిసరిగా తీసుకోవలసిన జాగ్రత్తలు
2. మదుపు మార్గాల రాబడి సమీక్ష
3. మదుపు/ఖర్చుల సమతౌల్యం

ఫొటో సోర్స్, DEEPAK SETHI/GETTY IMAGES
తప్పనిసరి జాగ్రత్తలు
పర్సనల్ ఫైనాన్స్ జాగ్రత్తల్లో మొదటి విషయం బీమా. గతంలో అనేక సార్లు చెప్పినట్టు తగినంత జీవిత బీమా, ఆరోగ్య బీమా కచ్చితంగా ఉండాలి. ఈ విషయంలో ఎలాంటి ఏమరపాటుకూ తావు లేదు.
చాలా మంది బీమా భవిష్యత్తులో ఎప్పుడైనా అవసరం అనిపిస్తే తీసుకోవచ్చు అని వాయిదా వేస్తూ ఉంటారు. ఇది సరైన ఆలోచన కాదు. ఆరోగ్య బీమా ప్రీమియం కూడా ఏటా పెరుగుతూ ఉంటుంది.
అలాగే కొన్ని రకాల రుగ్మతలకు బీమా కవరేజ్ వెంటనే అమలు లోకి రాదు. అందువల్ల అవసరాలకు సరిపోయే బీమా వెంటనే తీసుకోవాలి.
బీమా పాలసీలు మాత్రమే కాకుండా పర్సనల్ ఫైనాన్స్ విషయంలో మరొక ముఖ్యమైన విషయం- జీవిత భాగస్వామికి, ముఖ్యమైన వారికి మన మదుపు వివరాలపై అవగాహన ఉండాలి.
మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫైల్ లేదా స్మార్ట్ ఫోన్ ఉపకరణాల ద్వారా లేదంటే డైరీలో అయినా బీమా, మదుపు వివరాలు ఉండాలి.
ఒకవేళ వ్యక్తిగత సలహాదారు ఉంటే వారి ఫోన్ నంబర్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఏదైనా అనుకోని విపత్తు జరిగితే ముఖ్యమైన వివరాలు సులభంగా అందేలా చూసుకోవాలి.
ఏప్రిల్ నెలలో అమలులోకి వచ్చిన కొత్త నియమ నిబంధనల గురించి అధ్యయనం చేసి మనకు వర్తించే నియమాలకు తగిన విధంగా చేయాల్సిన మార్పులు చేయాలి.
ఆదాయపు పన్ను విషయంలో ఎలాంటి పన్ను విధానాన్ని ఎన్నుకోవాలి, నెల జీతం లెక్కించడానికి ఎలాంటి మదుపు వివరాలు సమర్పించాలి లాంటి వివరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
అలాగే కొన్ని బీమా పాలసీలలో నామినీ విషయంలో మార్పులు చేయడానికి కూడా ఇది మంచి అవకాశం.

ఫొటో సోర్స్, DEEPAK SETHI
2. మదుపు మార్గాల రాబడి సమీక్ష
మదుపు మీద రాబడిని అర్థం చేసుకోవడానికి వివిధ కొలమానాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి మొత్తం రాబడి (Absolute Return), వార్షిక వృద్ధి (CAGR), ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్(IRR), ఎక్స్టెండెడ్ రేట్ ఆఫ్ రిటర్న్(XIRR). అన్ని మదుపు మార్గాలకు ఒకే కొలమానాన్ని వాడలేము.
ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు మొత్తం రాబడి, వార్షిక ప్రీమియంకు ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, మ్యూచువల్ ఫండ్స్‌కు ఎక్స్టెండెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనే కొలమానాలను ఉపయోగించాలి.
ఈ కొలమానాలన్నీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ద్వారా సులభంగా గణించవచ్చు.
SIP మార్గంలో మ్యూచువల్ ఫండ్స్ మదుపు చేస్తే అవి ఏడాది దాటిన తర్వాత నుంచి XIRR గా గణించాలి. మనం చేసిన ప్రతి మదుపుకు సంబంధించిన కొలమానాలు గణించాలి. ఇలా చేయడం ద్వారా లాభసాటిగా ఉన్న మదుపు మార్గాలలోకి మదుపును పెంచే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.
అలాగే సరైన రాబడి లేని మదుపు మార్గాల గురించి అధ్యయనం చేయాలి. మార్కెట్ ఆధారిత మదుపు మార్గాల రాబడిని బేరీజు వేస్తున్నప్పుడు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి.
ఈ మదుపు మార్గాల మీద వచ్చే రాబడి మార్కెట్ గమనానికి అనుసంధానంగా ఉంటుంది. గత రెండు నెలలుగా భారత స్టాక్ మార్కెట్ నష్టాలలో ఉంది.
ఇలాంటి తరుణంలో సహజంగానే మార్కెట్ ఆధారిత మదుపు మార్గాలలో రాబడి తక్కువగా కనిపిస్తుంది. కానీ, ఈ మదుపు మార్గాలు మన ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా, లేవా అనేది చూసుకోవాలి.
స్టాక్ మార్కెట్ ఎప్పుడూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నడిచే మహాయంత్రం. కాబట్టి కేవలం ప్రస్తుత రాబడి కాకుండా భవిష్యత్తులో మన మదుపు మార్గాల మీద రాబడి ఎలా ఉంటుంది అనేది అధ్యయనం చేయాలి.

ఫొటో సోర్స్, Getty Images
3. మదుపు/ఖర్చుల సమతౌల్యం
ఖర్చుల నియంత్రణ అనేది ఆర్థిక విషయమైనా నిజానికి అదొక జీవన విధానం. జీవన ప్రమాణాలు పెరగడం వల్ల ముందు తరాలకు అందుబాటులో లేని అనేక విలాసాలు, సౌకర్యాలు ప్రస్తుత తరానికి అందుతున్నాయి.
ఈ విలాసాలకు అయ్యే ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల అటు నెలవారీ ఈఎంఐలు, ఇతర ఖర్చులు పెరుగుతున్నాయి.
ఈ ఖర్చులు మనం చేయాల్సిన మదుపును దెబ్బతీస్తే అది మన ఆర్థిక లక్ష్యాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో ఖర్చులు-మదుపు మధ్య సమతౌల్యం సాధించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చూద్దాం:
- ఆర్థిక లక్ష్యాలకు ఎంత దూరంలో ఉన్నామో గమనించాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆర్థిక లాభం లేదు. కానీ, ఆ లక్ష్యం పట్ల మన నిబద్ధత మరింత దృఢంగా మారుతుంది. మార్కెట్ ఆటుపోట్లు, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలున్న నేటి కాలంలో ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. అలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఆర్థిక లక్ష్యాల పట్ల నిబద్ధత చాలా ముఖ్యం.
- మదుపు చేసే మొత్తం ఎలక్ట్రానిక్ డెబిట్ ద్వారా వెళ్ళేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముందుగా అనుకున్న మదుపు ఎలాంటి అవరోధాలు లేకుండా జరిగిపోతుంది.
- ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలి. ఆరోగ్యంగా జీవించడం ద్వారా ఆసుపత్రి ఖర్చు తగ్గించుకోవడం చాలా ముఖ్యమైన పొదుపు సూత్రం.
- క్రెడిట్ కార్డ్ ద్వారా అందే లాభాలను పూర్తిగా వినియోగించుకోవాలి. దాదాపు అన్ని క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు పాయింట్స్ ద్వారా ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ఈ పాయింట్ల నుంచి గరిష్ఠంగా లబ్ధి పొందేలా చూడాలి. ఉదాహరణకు క్రెడిట్ కార్డ్ పాయింట్ల ద్వారా ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవాలి. లేదా ఏదైనా అవసరమైన గృహోపకరణాన్ని కొనాలి.
(నోట్: ఈ కథనం మీ అవగాహన కోసం మాత్రమే.)
ఇవి కూడా చదవండి:
- కత్తిపీటతో హత్య చేసేందుకు మా నాన్నే ప్రయత్నించారు – కులం, గౌరవం, ప్రేమ కథ
- ‘రంగమార్తాండ' రివ్యూ: గుండె లోతుల్లోని ఉద్వేగాన్ని బయటకు లాక్కొచ్చే సినిమా
- అదానీ గ్రూప్ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు ఏడాదిగా ఎందుకు నిరసనలు చేస్తున్నారు?
- ఉగాది: మనం ఉన్నది 2023లో కాదు.. 1945 లేదా 2080
- వడగళ్ల వానలు ఎందుకు పడతాయి? అవి వేసవిలోనే ఎందుకు ఎక్కువ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














