నిఖత్ జరీన్: ఒళ్లంతా దెబ్బలు, రక్తం చూసి అమ్మ భయపడింది.. బాక్సింగ్ చేసే అమ్మాయికి పెళ్లి కాదని నాన్నను భయపెట్టారు.. అయినా వెనుకాడలేదు

నిఖత్ జరీన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ వరుసగా రెండో ఏడాది విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.

సీనియర్ విభాగంలో దిగ్గజ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా ఆమె ఘనత సాధించారు.

దిల్లీ వేదికగా జరిగిన అంతర్జతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) వరల్డ్ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం 50 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో ఆమె 5-0 తేడాతో గెలుపొందారు.

ఫైనల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ వియత్నాం క్రీడాకారిణి న్యూయెన్‌పై విజయం సాధించారు.

బాక్సింగ్‌లో రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా నిఖత్ జరీన్ రికార్డ్ సృష్టించారు.

ఆమె ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్’ నామినీల్లో ఒకరు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఫైనల్ చేరిందిలా....

50 కేజీల ఫ్లై వెయిట్ కేటగిరీలో పోటీపడుతున్న నిఖత్ జరీన్ ఈ టోర్నీ తొలి రౌండ్‌లో 5-0తో ఇస్మాయిలోవా అనఖనిమ్ (అజర్‌బైజాన్)పై గెలుపొందింది.

ఏకపక్షంగా సాగిన రెండో రౌండ్‌లో కూడా 5-0తో టాప్ సీడ్ బొవులామ్ రౌమస్యా (అల్జీరియా)పై నెగ్గింది.

ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో కూడా 5-0తో హరీరా అల్వారెజ్ ఫాతిమా (మెక్సికో)పై సులభంగా గెలిచింది.

క్వార్టర్స్ పోరులో థాయ్‌లాండ్ క్రీడాకారిణి రక్సత్ చౌథామట్ నుంచి నిఖత్‌కు ప్రతిఘటన ఎదురైంది. అయినప్పటికీ ఈ బౌట్‌లో నిఖత్ 5-2తో రక్సత్‌ను ఓడించింది.

సెమీఫైనల్లో కూడా ఐదో సీడ్ వాలెన్సియా విక్టోరియా (కొలంబియా)పై 5-0తో నెగ్గి వరుసగా రెండో ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించింది.

జూనియర్ స్థాయిలో కూడా ఆమె 2011లో వరల్డ్ చాంపియన్‌గా నిలిచారు.

నిఖత్ జరీన్

ఫొటో సోర్స్, @NIKHAT_ZAREEN

తండ్రి ప్రోత్సాహంతో....

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లో పుట్టిపెరిగిన నిఖత్ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది.

నిఖత్ జరీన్ తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ తన కుమార్తెను బాక్సింగ్‌లో ప్రోత్సహించి స్వయంగా తనే ఒక ఏడాది పాటు శిక్షణ ఇచ్చారు.

తరువాత 2009లో విశాఖపట్నానికి చెందిన ద్రోణాచార్య అవార్డీ ఐవీ రావు దగ్గర ఆమె శిక్షణ పొందింది.

అప్పటి నుంచీ ఆమె పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడుతూ వచ్చింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టార్గెట్ ఒలంపిక్ పోడియం స్కీమ్‌కి ఎంపిక అయింది.

2011లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన అంతర్జాతీయ విమెన్స్ యూత్ అండ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలవడం ఆమె కెరీర్‌లో తొలి పెద్ద అడుగు.

ఆ తర్వాత నిలకడగా మెరుగైన ప్రదర్శనను కనబరిచిన నిఖత్ అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలను సాధించారు.

అదే జోరులో గత ఏడాది తొలిసారి వరల్డ్ చాంపియన్‌గా నిలిచారు.

నిఖత్ జరీన్

ఫొటో సోర్స్, @NIKHAT_ZAREEN

ఫొటో క్యాప్షన్, 2022లో నిఖత్ జరీన్ తొలిసారి వరల్డ్ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌గా అవతరించారు

బాక్సింగ్ ప్రస్థానం మొదలైందిలా

తెలంగాణలోని నిజామాబాద్ పట్టణంలో కలెక్టరేట్ గ్రౌండ్‌లో పరుగు ప్రాక్టీస్ చేస్తోంది నిఖత్. ఆమె 100, 200, 300 మీటర్ల పరుగు ప్రాక్టీస్ చేసేది. ఆమెను గొప్ప అథ్లెట్‌గా తీర్చిదిద్దాలన్నది తండ్రి జమీల్ కల.

రోజూ గ్రౌండ్‌కు తీసుకెళ్లి, తీసుకువస్తుండేవారు తండ్రి. గ్రౌండ్ తరువాత స్కూల్. స్ప్రింట్ ప్రాక్టీస్ చేస్తోన్న నిఖత్ అదే గ్రౌండ్‌లో జరుగుతోన్న బాక్సింగ్ ట్రైనింగ్ కూడా గమనించేది. అక్కడ చాలా మంది అబ్బాయిలు శిక్షణ తీసుకుంటున్నారు. ఒకరోజు ఆ శిక్షణ సాగుతున్నపుడు తాను బాక్సింగ్ నేర్చుకుంటాను అని అడిగింది తండ్రిని.

''ఆమె అడిగిన తరువాత నేను బాక్సింగ్ గురించి ఆలోచించాను. దానికి చాలా ధైర్యం కావాలి. అది మగ పిల్లల ఆట. రఫ్ గేమ్. నేను అదే విషయం మా అమ్మాయికి చెప్పాను. దెబ్బలు తగులుతాయి. దెబ్బల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి (పరోక్షంగా పెళ్లి ప్రస్తావిస్తూ). చాలా పవర్ కావాలి అని చెప్పాను. తను మాత్రం కష్టపడతాను అంది. అప్పటికే కొన్ని రోజులుగా గమనించిందేమో, బాక్సింగ్ నేర్చుకుంటాను అని చెప్పింది. నేను వెంటనే ఒప్పుకున్నాను'' అంటూ నిఖత్ బాక్సింగ్ ప్రస్థానం మొదలైన విధానాన్ని వివరించారు ఆమె తండ్రి జమీల్.

12 ఏళ్ల వయసు నుంచే క్రీడల్లో తన ప్రయాణం ప్రారంభించింది నిఖాత్. కూతరిని బాక్సింగ్ లో చేర్చే విషయమై కోచ్‌తో మాట్లాడటానికి వెళ్లాడు ఆ తండ్రి. అథ్లెట్స్‌తో పోలిస్తే బాక్సింగ్‌లో పోటీ తక్కువ అనీ, తప్పకుండా జాతీయ స్థాయికి, వీలుంటే అంతర్జాతీయ స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుందనీ ఆమె తండ్రికి చెప్పారు కోచ్.

బాక్సింగ్‌లో అమ్మాయిలు కూడా తక్కువ కావడం ఆమెకు కలిసి వస్తుందని వివరించారు. అలా చేరిన నిఖాత్‌ను అప్పుడు నిజామాబాద్‌లో మగవారికి బాక్సింగ్ శిక్షణ ఇస్తున్న కోచ్ ప్రోత్సహించారు.

కట్ చేస్తే, ఏడాది తిరిగేలోగానే బాక్సింగ్‌లో మంచి నైపుణ్యంతో జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం మొదలుపెట్టింది నిఖాత్ జరీన్. జాతీయ స్థాయిలో బ్రాంజ్, ఆ తరువాత గోల్డ్ వచ్చింది. ఇది జరిగింది 2010లో.

నిఖత్ జరీన్

ఫొటో సోర్స్, TWITTER/NIKHAT JAREEN

'ఆమెను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అని బంధువులు అనేవారు'

నిఖత్ తండ్రి క్రికెట్, ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఆ ఆసక్తే ఆయన నలుగురు కూతుళ్లలో ఇదర్ని క్రీడాకారిణులుగా తయారు చేసేలా చేసింది.

నిఖత్ ఇద్దరు అక్కలు ఫిజియోథెరపిస్టులు కాగా, చెల్లి బ్యాడ్మింటన్ ఆడతారు. క్రీడల్లో శిక్షణకు అనుకూలంగా ఉండడం కోసం వారు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చేశారు.

''బాక్సింగ్ ఎందుకు? ఆమెను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా?' అని బంధువులూ, బయటి వారు కూడా అన్నారు. కానీ ఆమెను క్రీడల్లోకి పంపాలన్నది నా నిర్ణయం. నేను పట్టుదలతో ఉన్నాను. ఏదో ఒకరోజు ఆమె ఒలింపిక్స్ ఆడాలని నా ప్రణాళిక. కచ్చితంగా అక్కడ కూడా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను'' అని ఆమె తండ్రి జమీల్ బీబీసీతో చెప్పారు.

ముస్లిం కుటుంబం కావడం వల్ల నిక్కరు, టీషర్టులో అమ్మాయిని గ్రౌండుకు తీసుకెళ్లడం ఇబ్బందిగా ఉండేదని ఆమె తండ్రి మీడియాతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, నిఖత్ జరీన్: 'తెలంగాణ పేరును క్రీడారంగంలో నా కూతురు స్వర్ణాక్షరాలతో లిఖించింది'

'దెబ్బలు, రక్తం, స్కార్స్ చూసి ఏడ్చాను...'

నిఖత్‌ను ఆమె తల్లి పర్వీన్ ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు. కానీ ఆమెకెప్పుడూ నిఖత్‌కు ఏమైనా దెబ్బలు తగులుతాయేమోనని బెంగగా ఉండేది.

''ఒకసారి ఆమెకు ప్రాక్టీసులో స్పైరింగ్ దెబ్బ తగిలింది. నేను గమనించలేదు. ఇంటికి వెళ్లాక వాళ్ల అమ్మ చూసింది. బాక్సింగ్ వదిలేసి వేరే గేమ్ చూసుకోమని సలహా ఇచ్చింది. కానీ నిఖత్ ఒప్పుకోలేదు. నిజామాబాద్ లో ప్రాక్టీస్ చేసేందుకు అమ్మాయిలు లేకపోవడంతో మగ పిల్లలతో కలసి ఆడేది. 'అబ్బాయిలో స్పీడ్, పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా జరిగింది. భవిష్యత్తులో నేను ఎక్కువ ప్రాక్టీస్ చేసి దాన్ని తట్టుకుంటా. నేను వారికి కౌంటర్ ఇస్తా. మంచి రిజల్ట్స్ వస్తాయి. నేను కొడతా' అని వాళ్ల అమ్మకు నచ్చచెప్పింది పర్వీన్'' అని జమీల్ వివరించారు.

''మొదటిసారి బాక్సింగ్ అనగానే భయపడ్డాను. అబ్బాయిలతో ట్రైనింగ్. ఆడపిల్ల తెల్లవారుజామునే వెళ్లాలి. చిన్న చిన్న దెబ్బలు, రక్తం, స్కార్స్ చూసి ఏడ్చాను. ఈ ఆట వద్దు అన్నాను. ముఖం పాడైపోతే భవిష్యత్తులో సమస్య (పెళ్లి విషయంలో) వస్తుంది అన్నాను. కానీ తను పట్టు పట్టింది. వాళ్ల నాన్న బాగా సపోర్ట్ ఇచ్చారు. తల్లిగా నేను కొంచెం భయపడి వద్దనుకున్నాను. తరువాత అలవాటు అయిపోంది'' అంటూ నిఖత్ ప్రాక్టీస్ తొలిరోజులను గుర్తు చేసుకున్నారు ఆమె తల్లి పర్వీన్.

నిఖత్ తల్లి కూడా స్కూల్ డేస్‌లో కబడ్డీ ఆడేవారు.

నిఖత్ జరీన్

ఫొటో సోర్స్, @NIKHAT_ZAREEN

మేరీ కోమ్‌తో బాక్సింగ్ వివాదం

2000వ సంవత్సరంలో మేరీ కోమ్ రాష్ట్రస్థాయి చాంపియన్ అయ్యేప్పటికి నిఖత్ నాలుగేళ్ల చిన్నారి. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఇద్దరూ ఒకే బాక్సింగ్ రింగులో తలపడ్డారు.

ఒలింపిక్స్ ఎంపిక విషయంలో తనకూ సమాన అవకాశం ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేసింది నిఖత్. తనకు ఆదర్శం మేరీ కోమ్ అని చెప్పింది. అదే సందర్భంలో క్రీడల్లో ఫెయిర్ చాన్స్ ఇవ్వాలని కోరింది. చివరకు మ్యాచ్ ఏర్పాటు చేశారు. మేరీ చేతిలో నిఖత్ ఓడిపోయింది.

ఆ మ్యాచ్ విషయంలో కూడా వివాదాలు వచ్చాయి. మ్యాచ్ అయ్యాక నిఖత్‌కి హగ్, షేక్ హ్యాండ్ ఇవ్వలేదు మేరీ. ఆమెను గౌరవించాలంటే, ముందు ఆమె ఇతరులను గౌరవించాలని మీడియాతో వ్యాఖ్యానించారు మేరీ కోమ్.

వీడియో క్యాప్షన్, బీబీసీ 'ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ నామినీ నిఖత్ జరీన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)