‘రామ్‌జీ నగర్ గ్యాంగ్’: లాయర్లను పెట్టుకుని మరీ దొంగతనాలు చేసే ముఠా కథ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రమీల కృష్ణన్
- హోదా, బీబీసీ తమిళ్
మహిళలు వాడే పిన్నీసులు, హెయిర్‌పిన్‌లను వాడుతూ కారు విండోలను ధ్వంసం చేయడం, వస్తువులను దొంగతనం చేసే ఘటనలు ఇటీవల కాలంలో చెన్నైలో పెరిగిపోయాయి.
ప్రజల నిత్యావసర వస్తువులతో దొంగతనం చేసే వారిగా పేరున్న ‘రామ్‌జీ నగర్’ దొంగల ముఠా ఈ దోపిడీలు చేస్తున్నదని చెన్నై పోలీసు అధికారులు ధ్రువీకరించారు.
దీనిపై విచారణ ప్రారంభించినట్లు చెన్నై పోలీసులు తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా విదేశాల్లో మాత్రమే దొంగతనాలు చేసిన ‘రామ్‌జీ నగర్’ దొంగలు, ప్రస్తుతం ఈ దోపిడీలను తమిళనాడులో కూడా ప్రారంభించారని పోలీసులు గుర్తించారు.
రెండు నెలల పాటు సుదీర్ఘ వెతుకులాట తర్వాత, చెన్నైలోని తెయ్నంపేట్ పోలీసు స్టేషన్‌కు చెందిన అధికారులు రామ్‌జీ నగర్ దొంగల ముఠాకు చెందిన ఒక వ్యక్తిని బెంగళూరులో అరెస్ట్ చేశారు.
రామ్‌జీ నగర్ దొంగల ముఠాకు చెందిన 33 ఏళ్ల శబరి అనే వ్యక్తిని తాము అదుపులోకి తీసుకున్నామని, ఇతర వ్యక్తులను కూడా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రామ్‌జీ నగర్ దొంగలెవరు? వారి నేపథ్యమేంటి?
గుజరాత్ నుంచి వచ్చిన రామ్‌జీ మోలే నిర్వహించే కాటన్ మిల్‌లో పనిచేసేందుకు గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి కార్మికులు ఆ ప్రాంతానికి వెళ్లారు.
ఈ మిల్‌తోనే ఈ ప్రాంతానికి రామ్‌జీ నగర్ అనే పేరు వచ్చింది. 1990 నుంచి 2007 మధ్య కాలంలో ఈ కాటన్ మిల్ నడిచింది.
ఈ ప్లాంట్‌లో పనిచేయడానికి వెళ్లిన చాలా మంది కార్మికులు ప్రస్తుతం తమిళనాడులోనే ఉంటున్నారు.
ఉత్తరాది, దక్షిణాది భాషలను వారు అనర్గళంగా మాట్లాడతారు. ఈ ప్రాంతంలో నివసించే కొంత మంది వ్యక్తులు దొంగతనాలు చేస్తూ బతుకుతున్నారు.
2 వేలకు పైగా కుటుంబాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.
రామ్‌జీ నగర్ దొంగలపై భారత్‌లో వందలాది పోలీసు స్టేషన్లలో వేలాది దొంగతనం కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్, బెంగళూరు నగరాలతోపాటు హరియాణ, దిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్ వంటి రాష్ట్రాల పోలీసులు రామ్‌జీ నగర్ దొంగల కోసం వెతుకుతున్నారు.
1990 నుంచి ఇప్పటి వరకు, రామ్‌జీ నగర్ దొంగల ముఠా బ్యాంకు దొంగతనాలు చేయడం నుంచి జ్యూవెల్లరీ షాపులను కొల్లగొట్టడం, ఏటీఎంలో డబ్బుల దొంగతనం, పబ్లిక్ ప్రాంతాల్లో పార్క్ చేసిన కారులోని వస్తువులను దొంగతనం చేయడం, రద్దీ ప్రాంతాల్లో ప్రజల జ్యూవెల్లరీని, వాలెట్లను నొక్కేయడం వంటి పలు దొంగతనాలను చేస్తూ, దీన్నే వారి జీవనోపాధిగా మలుచుకున్నారని సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రామ్‌జీ నగర్ ముఠా దొంగతనమెలా చేస్తుంది?
రామ్‌జీ నగర్ దొంగల ముఠాను పట్టుకుని, వారిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నించిన, వారిని అరెస్ట్ చేసిన కొందరు సీనియర్ అధికారులతో బీబీసీ మాట్లాడింది. వీరిలో తమిళనాడు పోలీసు ఐజీగా పనిచేసిన సారంగన్ ఐపీఎస్ కూడా ఒకరు.
తిరుచిరాపల్లి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా సారంగన్ పని చేశారు. ఈ దొంగలను గుర్తించేందుకు వీరి ఫోటోలు, అడ్రస్‌లతో కూడిన డేటాబేస్‌ను ఒకటి క్రియేట్ చేశారు.
‘‘రామ్‌జీ నగర్ దొంగలు ఎవరిపై దాడి చేయరు. ఎవర్ని కొట్టడం కానీ చేయరు. వీరి ప్రత్యేకత ఏంటంటే, ప్రజల దృష్టి మరల్చి, దొంగతనం చేయడమే’’ అని సారంగన్ చెప్పారు.
రామ్‌జీ నగర్ దొంగల ముఠా చేసే దొంగతనాలను ఆయన వివరించారు.
ఉదాహరణకు, రోడ్డుపై పది రూపాయల నోటు వేస్తారు, ఎవరైనా చూసి దాన్ని తీసుకునేందుకు వంగినప్పుడు, వారి వాలెట్ కొట్టేసి పారిపోతారని అన్నారు.
ఏ కారణం లేకుండానే ఇద్దరు వ్యక్తులు గొడవ ప్రారంభిస్తారు. వారిలోకి జ్యూవెల్లరీ వేసుకున్న వ్యక్తిని తోస్తారు. అదే గ్రూప్‌లోని మరో వ్యక్తి వచ్చి, జ్యూవెల్లరీని దొంగతనం చేసి అక్కడి నుంచి పారిపోతారు.
వారు పగలగొట్టే గ్లాస్‌ల శబ్దాలు కూడా పెద్దగా రావు.
గ్యాంగ్‌ల వారీగా స్టోర్లలోకి ప్రవేశించి, ఒక గ్రూప్ అనుమానితంగా ఉంటూ స్టోర్‌లో పనిచేసే వారి దృష్టిమరలిస్తే, మరో గ్రూప్ దొంగతనం చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
దొంగతనానికి గ్రూప్‌లుగా ఎందుకెళ్తారు?
పంజాబి, మరాఠి, భోజ్‌పురి, హిందీ, గుజరాతి వంటి పలు భాషలను మాట్లాడే వారు సంబంధిత రాష్ట్రాలకు వెళ్లి, బ్యాంకుల్లో దొంగతనాలు చేస్తుంటారు.
దొంగతనానికి వెళ్లినప్పుడు వారు గ్రూప్‌లుగా వెళ్తుంటారని అధికారులు చెప్పారు. టీనేజీ వయసు నుంచే వారు దొంగతనాలు చేయడం ప్రారంభిస్తారు.
చాలా మంది ఇతర ఉద్యోగాలకు వెళ్లడం ఇష్టం లేక ఈ దొంగతనాల బాట పడుతున్నారని అధికారులు చెప్పారు.
రామ్‌జీ నగర్ దొంగలు తమతో పాటు ఒక వ్యక్తిని తీసుకొస్తారు, ఆయన స్పాట్‌లో అరెస్ట్ అయ్యేలా చూస్తారని, అలా పోలీసుల దృష్టి మరలిస్తారు. అందుకే వారు గ్రూప్‌లు గ్రూప్‌లుగా దొంగతనానికి వస్తారు. ఇలాంటి సంఘటనలు జరిగినట్లు అధికారులు చెప్పారు.
దేశంలో వివిధ రాష్ట్రాల్లో వీరు దొంగతనాలకు పాల్పడుతూ ఉండటం వల్ల, వీరికి న్యాయవాదుల బృందం కూడా ఉంది. దొంగతనం చేసిన మనీని పంచుకోవడంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే లిటిగేషన్ కోసం కొంత మొత్తాన్ని తీసి పక్కన పెడతారు.
రామ్‌జీ నగర్ ప్రాంతానికి పోలీసులు వెళ్తే, వారికి ఎలాంటి సమాధానం లభించలేదు. వెతకడానికి వెళ్లే వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకురావడం చాలా అరుదు.
ఎందుకు రామ్‌జీ నగర్ దొంగలు మళ్లీ వెలుగులోకి వచ్చారు?
ఎన్నో ఏళ్లుగా విదేశాల్లో వివిధ రకాల దొంగతనాలు చేసిన రామ్‌జీ నగర్ దొంగలు ప్రస్తుతం చెన్నై నగరంలో దొంగతనాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
డీ. నగర్, బండిబజార్, తెయ్నంపేట్ వంటి ప్రాంతాల్లో కార్ల నుంచి ల్యాప్‌టాప్ వంటి పలు విలువైన వస్తువులను వీరు దొంగతనం చేశారు.
ఈ దొంగతనాలు చేస్తున్న గ్యాంగ్‌లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందం కూడా ఏర్పాటైంది.
‘‘రామ్‌జీ నగర్ గ్యాంగ్‌కు చెందిన శబరి అనే వ్యక్తిని మేము ప్రస్తుతం విచారిస్తున్నాం. డీ.నగర్ గిరి రోడ్డు ఏరియాలో కారులో ఉన్న ల్యాప్‌టాప్‌ను ఇతను దొంగతనం చేశాడు.
ఇప్పటి వరకు రామ్‌జీ నగర్ దొంగలు ఇతర రాష్ట్రాల్లో చేసే దొంగతనాల గురించి సమాచారం సేకరిస్తున్నాం. చెన్నైలో పలు ప్రాంతాల్లో వారు పలు దొంగతనాలు చేశారు. చెన్నైలో నగరంలో పలు ప్రాంతాల నుంచి స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజీల ద్వారా అసలైన వ్యక్తిని గుర్తించి, అరెస్ట్ చేసేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. ’’ అని పోలీసు అధికారి తెలిపారు.
విచారణ పూర్తయితేనే, వారు ఎన్ని వస్తువులను దొంగతనం చేశారు, వాటిని ఎక్కడికి తరలించారన్నది కనుగొనగలమని అన్నారు. ఇప్పటి వరకు ఆరు ల్యాప్‌టాప్‌లను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
సీసీటీవీ ఫుటేజ్‌ను ఆధారంగా చేసుకుని, రామ్‌జీ నగర్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తిగా శబరిని గుర్తించామని పోలీసు అధికారులు చెప్పారు. శబరి చెన్నై వదిలివెళ్లి, బెంగళూరులో నివసిస్తున్నాడని పేర్కొన్నారు. దిల్లీకి బయలుదేరుతున్నాడని తెలిసి అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, CHENNAI POLICE
వారు చేసిన దొంగతనాలు
ఇప్పటి వరకు చోటు చేసుకున్న సంఘటనలు చూస్తే, పబ్లిక్ ప్రదేశాల్లో ప్రజలను దృష్టిమరల్చి వారు దొంగతనాలు చేస్తున్నారు.
మొబైల్ ఫోన్లను, ల్యాప్‌టాప్‌లను, ఏటీఎం మిషన్లలో నగదును నింపే కార్ట్‌లను, వాలెట్లను దొంగతనం చేస్తున్నారు.
వేలాది దొంగతనాలను వీరు చేసినప్పటికీ, ఎవరిపై కూడా వీరు దాడి చేయలేదు. 2019లో హైదరాబాద్‌లో ఒక ఏటీఎం సెంటర్‌లో డబ్బు నింపేందుకు వచ్చిన బ్యాంకు అధికారి దృష్టి మరల్చి రూ.58 లక్షలను దొంగలించారు.
అలాగే, బెంగళూరులో రద్దీ రోడ్డులో పార్క్ చేసిన కారులో నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన వస్తువులను, ల్యాప్‌టాప్‌ను, రూ.30 వేలున్న వాలెట్‌ను వీరు దొంగలించిన కేసు ఒక దాఖలైంది.
కేవలం పిన్నీసుతో వీరు కారు విండోను ధ్వంసం చేస్తారు. ఎవరూ చూడకుండా ఈ వస్తువులను దొంగలించారు.
2021లో చండీగర్‌లో కూడా ఇలాంటి దొంగతనం ఒకటి జరిగింది. మనీతో వెళ్తోన్న కార్ట్ డ్రైవర్‌ను ఆయిల్ లీకవుతుందని చెప్పి ఈ దొంగల ముఠా డ్రైవర్ దృష్టి మరల్చింది.
డ్రైవర్ వెహికిల్ దిగిన వెంటనే రూ.39 లక్షలున్న బాక్స్‌ను వీరు కొట్టేశారు. ఈ కేసులో భాగమైన ఇద్దరు వ్యక్తులు చాలా వారాల పాటు తమిళనాడు రాలేదు. ఆ తర్వాత కొన్ని వారాలకు తిరుచునాపల్లి వచ్చి మొబైల్ ఫోన్లు వాడుతున్నప్పుడు, వీరిని పోలీసులు గుర్తించగలిగారు.
తమిళనాడు రామ్‌జీ నగర్ దొంగలు ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి దొంగతనం చేసి, వారి చేసిన పనిని బట్టి దొంగతనంలో దోచేసిన మనీని పంచుకుంటూ ఉంటారని పదవీ విరమణ పొందిన ఒక పోలీసు అధికారి చెప్పారు.
1990ల నుంచి రామ్‌జీ నగర్ దొంగలు చాలా ఫేమస్. దొంగతనం చేసేటప్పుడు వారు ఎవరిపై దాడి చేయరు. వారు కేవలం దొంగతనంపైనే దృష్టిపెడతారు.
ఒకవేళ పట్టుబడితే, వారు దొంగలించిన వస్తువులను తిరిగి ఇచ్చేస్తారు. ఇన్ని సంవత్సరాలు ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు వీరికి సంబంధించిన సమాచారం కోసం తమిళనాడు వచ్చేవారని పోలీసు అధికారి చెప్పారు.
ప్రస్తుతం వారు తమిళనాడులో కూడా దొంగతనం చేయడం ప్రారంభించినట్లు స్పష్టమైందన్నారు.
ఇలాంటి నేరాలు చేసిన రామ్‌జీ నగర్ ప్రాంతానికి చెందిన చాలా మంది ప్రస్తుతం సెటిల్ అయ్యారని, మంచి జీవితం సాగిస్తున్నారని, కొందరు మాత్రం ఇంకా దొంగతనాలు చేస్తున్నారని ఒక పోలీసు అధికారి తెలిపారు.
‘ఒకానొక సమయంలో రామ్‌జీ నగర్ ప్రాంతం దొంగలు నివసించే ప్రాంతంగా పేరుండేది. తిరుచిరాపల్లికి ఇది కేవలం 10కి.మీల దూరంలో ఉండేది. ప్రస్తుతం ఇది నగరంలో భాగమైంది. చాలా మంది వ్యక్తులు వారి భూములను మంచి రేటుకి అమ్మేసుకుని, జీవనం సాగిస్తున్నారు. అయితే, ఇటీవల జరుగుతోన్న సంఘటనల వల్ల కొంత మంది వ్యక్తులు ఈ దొంగతనాలను మళ్లీ ప్రారంభించారని తెలుస్తుంది’’ అని ఆ పోలీసు అధికారి తెలిపారు.
ఈ దొంగతనాల నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలి?
ఈ దొంగతనాల నుంచి ప్రజలు తమకు తాముగా ఎలా సంరక్షించుకోవాలో పోలీసు అధికారిని అడిగినప్పుడు పలు సూచనలు చేశారు.
ఈ దొంగలు దృష్టి మరలిస్తుంటారు కాబట్టి, సామాన్య ప్రజలు తమ వస్తువులను సురక్షితంగా ఉంచుకోవాలి.
పబ్లిక్ ప్రదేశాల్లో జ్యూవెల్లరీ, మనీ, ఇతర విలువైన వస్తువులను బ్యాగ్‌లలో తీసుకుని వెళ్లడాన్ని మానుకోవాలి.
పెద్ద మొత్తంలో నగదును బ్యాంకు నుంచి విత్ డ్రా చేసి తీసుకెళ్లేటప్పుడు లేదా జ్యూవెల్లరీ స్టోర్ నుంచి ఏదైనా వస్తువు కొనుక్కుని తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఎవరైనా చూస్తున్నారా అన్నది గమనించుకోవాలి.
కారులో ఏదైనా తీసుకెళ్లేటప్పుడు కూడా, బయట వ్యక్తులకు అవి కనిపించేలా ఉంచకూడదు.
అలా వదిలేసి వెళ్లకుండా ఎవరినైనా అక్కడ ఉంచి మీరు ఎక్కడికైనా వెళ్లడం మంచిది. లేదా సురక్షితమైన ప్రాంతంలో కారును పార్క్ చేయాలి.
రోడ్డుపై పడ్డ మనీని లేదా ఇతర వస్తువులను తీసుకోకుండా ఉంటే మంచిది.
పబ్లిక్‌లో మీకు తెలియని వ్యక్తులు మీతో మాట్లాడాన్ని అసలు ప్రోత్సహించకూడదు.
అనవసరమైన గొడవలపై మీరు ఫోకస్ చేయొద్దు. రోడ్డుపై గొడవ జరిగేటప్పుడు మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది.
ఇవి కూడా చదవండి:
- రాహుల్ గాంధీ: ‘‘అదానీ మీద మళ్లీ నేను ఏం మాట్లాడతానోనని మోదీ భయపడ్డారు’’
- ‘కులదురహంకారమే’ కాకినాడలో దళిత యువకుని ప్రాణాలు తీసిందా?
- రాహుల్ గాంధీ: కాంగ్రెస్ నేత ముందున్న మార్గాలు ఏంటి?
- పగలు క్లర్క్... రాత్రి ఆటో డ్రైవర్... ఆదివారం బట్టల వ్యాపారి... ఒక వ్యక్తి మూడు పనులు
- పాకిస్తాన్: అహ్మదీయులు ముస్లింలు కారా... వారి మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయ్...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














