పాకిస్తాన్‌: అహ్మదీయులు ముస్లింలు కారా... వారి మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయ్...

అహ్మదీయులు

ఫొటో సోర్స్, SHUMAILA JAFFERY/BBC

    • రచయిత, షుమైలా జాఫ్రీ
    • హోదా, బీబీసీ న్యూస్

పాకిస్తాన్‌లోని సెంట్రల్ పంజాబ్‌ రాబ్‌వా పట్టణంలో 2022 ఆగస్టు 12న నజీర్ అహ్మద్ ఉదయం వాకింగ్‌కు బయలుదేరారు.

ఆ రోజు శుక్రవారం కావడంతో మరణించిన తమ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేసేందుకు మధ్యలో శ్మశానానికి కూడా వెళ్లారు.

అయితే, తిరిగి వస్తున్నప్పుడు, తనకు పరిచయమున్న వ్యక్తితో ‘‘లర్రీ అడ్డా’’కు సమీపంలో కొన్ని నిమిషాలు మాట్లాడేందుకు ఆగారు. అలా మాట్లాడుతున్నప్పుడే, ఆయన దగ్గరకు బాగా పెరిగిన గడ్డంతో ఓ యువకుడు వచ్చాడు.

మాట్లాడుతున్న నజీర్‌ను మధ్యలో ఆపి ‘‘మీరు అహ్మదీయులా?’’అని ప్రశ్నించారు.

‘‘అవును. నేను అహ్మదీయుడినే’’అని నజీర్ తలూపారు. వెంటనే ఆ యువకుడు కత్తితో నజీర్‌పై దాడి చేశాడు. ‘‘మహమ్మద్ ప్రవక్త పేరుకు కీర్తి కలుగును గాక’’అంటూ నినాదాలు కూడా చేశాడు.

అహ్మదీయులు

ఫొటో సోర్స్, SHUMAILA JAFFERY/BBC

‘‘మేం ఎవరో బయటకు చెప్పకూడదు’’

దాడిచేసిన యువకుడిని ఘటన స్థలంలోనే పోలీసులు అరెస్టు చేశారు. చేసిన నేరాన్ని అతడు అంగీకరించాడు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

రాబ్‌వా పట్టణం పేరును చెనాబ్‌నగర్‌గా ప్రభుత్వం పేరు మార్చింది. ఇక్కడే జమాతే-అహ్మదీయ ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఈ ప్రాంతంలో చాలా మంది అహ్మదీయులు జీవిస్తారు.

పాకిస్తాన్‌లో మొత్తంగా 40 లక్షల మందికిపైగా అహ్మదీయులు జీవిస్తున్నారు. అహ్మదీయ వర్గం 1889లో భారత్‌లోని పంజాబ్‌లో ఖాదియాన్ గ్రామంలో ఏర్పడింది.

ఇస్లాంలోని సున్నీ, షియాల విశ్వాసాల కంటే అహ్మదీయుల విశ్వాసాలు కాస్త భిన్నంగా ఉంటాయి. అందుకే వీరిని అవిశ్వాసులు లేదా అన్యమతస్థులుగా ఇతర ముస్లిం వర్గాలలోని చాలా మంది భావిస్తుంటారు.

మరోవైపు 1974లో పాకిస్తాన్‌లోని జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వం అహ్మదీయులను ముస్లిమేతరులుగా ప్రకటించేందుకు ఒక రాజ్యాంగ సవరణ కూడా తీసుకొచ్చింది.

దీనికి పదేళ్ల తర్వాత జియా-వుల్-హక్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను కూడా తీసుకొచ్చింది. దీని ప్రకారం, అహ్మదీయులు తమను తాము ముస్లింలుగా ప్రకటించుకోవడాన్ని నేరంగా పరిగణిస్తారు.

ఖమర్ సులేమాన్

ఫొటో సోర్స్, SHUMAILA JAFFERY/BBC

ఫొటో క్యాప్షన్, ఖమర్ సులేమాన్

నజీర్ అహ్మద్ మార్నింగ్ వాక్‌కు వెళ్లినప్పుడు ఆయన కుమార్తె రెబియా నిద్రపోతున్నారు. ఆయనకు ఆమె సరిగ్గా వీడ్కోలు కూడా పలకలేకపోయారు. (నజీర్ కుమార్తె గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు ఆమె పేరు మార్చాం)

‘‘రాత్రి నిద్రపోవడానికి వెళ్లేముందు, ఆయనకు కొత్త దుప్పటి ఇచ్చాను. ఆయన నవ్వుతూ దాన్ని తీసుకున్నారు. ఆ మరుసటి రోజు ఆసుపత్రిలో ఆయన మృతదేహంపై తెల్ల దుప్పటి కప్పడం చూశాను. నేను తట్టుకోలేకపోయాను. జీవితాంతం అది నాకు అలానే గుర్తుండిపోతుంది’’ అని ఆమె అన్నారు.

‘‘నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ మాకు లేదు. మా భావాలను స్వేచ్ఛగా మేం ప్రకటించలేం. అసలు మేం ఎవరిమో, మేం ఎవరిని అనుసరిస్తామో కూడా బయటకు చెప్పుకోలేం. మాకు చాలా భయమేస్తోంది. ఈ భయం నానాటికీ పెరుగుతోంది. మేం భద్రంగా ఉంటామనే నమ్మకం తగ్గిపోతోంది. అహ్మదీయులు చాలా భయంతో జీవిస్తున్నారు’’అని ఆమె వ్యాఖ్యానించారు.

అహ్మదీయులు

ఫొటో సోర్స్, SHUMAILA JAFFERY/BBC

అణచివేత....

పాకిస్తాన్‌లో ఎప్పటినుంచో అహ్మదీయులు అణచివేతకు గురవుతున్నారు. వారిపై దాడులు, వారి ఆస్తులు, ప్రార్థనా మందిరాల ధ్వంసం వార్తలు ఎప్పటికప్పుడే వస్తుంటాయి. ప్రార్థనల కోసం గుమిగూడటం, తమ ప్రార్థనా మందిరాలను మసీదులుగా పిలవడం, మైకుల్లో ఆజాన్ వినిపించడం లాంటి అంశాల్లో ఆంక్షలు విధిస్తూ చట్టాలు కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఖురాన్‌లోని వాక్యాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం లేదా తమ సమాధులు, ఇళ్లపై కొన్ని మత చిహ్నాలు పెట్టుకోవడం వల్ల కూడా వీరు చట్టపరమైన ఇబ్బందుల్లో ఇరుక్కునే అవకాశముంది.

2010 నుంచి ఏప్రిల్ 2022 మధ్య 28సార్లు వీరి శ్మశానాలపై దాడులు చేసిన ఘటనలు వెలుగుచూసినట్లు అహ్మదీయుల ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు 2021 నుంచి తమ ప్రార్థనా స్థలాలపైనా దాడులు పెరిగాయని వారు వివరిస్తున్నారు. మరోవైపు ఖురాన్‌లో వాక్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు తమపై కేసులు బుక్ చేస్తున్నారని తెలిపారు.

పాకిస్తాన్‌లోని జమాతే అహ్మదీయ అధికార ప్రతినిధిగా ఖమర్ సులేమాన్ కొనసాగుతున్నారు. కొన్ని నెలలుగా ఇక్కడ అహ్మదీయులపై దాడులు పెరిగాయని ఆయన వివరించారు. దీనికి కారణం దేశంలో మత ఛాందసవాదం, అతివాదం పెరగడమేనని ఆయన చెప్పారు.

‘‘నిజానికి ప్రజల్లో మాపై అంత వ్యతిరేకత ఏమీ ఉండదు. ఎందుకంటే ఇక్కడి వారు తమ మనుగడ కోసం నిత్యం పోరాడుతుంటారు. వారికి ఇలాంటి వాటిని పట్టించుకునే సమయం ఉండదు. కానీ, ఇటీవల కాలంలో కొందరు కావాలనే మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు’’అని ఆయన అన్నారు.

అహ్మదీయులు

ఫొటో సోర్స్, SHUMAILA JAFFERY/BBC

మత విశ్వాసాల కంటే.. అసూయ, ద్వేషం, అధికారమే ఈ తప్పుడు ప్రచారాలకు కారణమని ఖమర్ అన్నారు.

‘‘అసలు మా గోడు చెప్పుకునేందుకు ఎలాంటి వేదికలూ ఇక్కడ ఉండవు. కొందరైతే మేం ముస్లిం విరోధులమని అకారణంగానే దూషిస్తుంటారు. ఖతమ్-ఎ-నబూవత్ లాంటి సంస్థలైతే బహిరంగంగానే మాపై విద్వేషాన్ని వెదజల్లుతుంటాయి. వారికి మా గురించి ఏమీ తెలియదు. వారు ప్రతి అంశంతోనూ రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’’అని ఖమర్ అన్నారు.

ఇలాంటి ప్రతికూల వాతావరణం, విసుగెత్తిపోవడం వల్లే చాలా మంది అహ్మదీయులు దేశం విడిచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని ఖమర్ అన్నారు.

‘‘అహ్మదీయులు ఇక్కడ జీవించాలి అనుకుంటే, ఆంక్షలను తప్పకుండా పాటించాల్సిందేనని రాజకీయ నాయకులే చెబుతున్నారు. లేదంటే వేరే ప్రాంతాలకు వెళ్లిపోవాలని అంటున్నారు. అయితే, ఇంత మంది మేం ఎక్కడకు వెళ్లిపోవాలి? ఇదే మా భూమి, ఇదే మా దేశం, మేం ఇక్కడే పుట్టాం.. మమ్మల్ని వెళ్లిపొమ్మని ఎలా చెబుతారు’’అని ఆయన ప్రశ్నించారు.

అహ్మదీయుల పరిస్థితికి ప్రభుత్వమే కారణమని ఆయన తప్పుపట్టారు.

‘‘వ్యక్తిగత కక్షతో ఒక మతాధికారి విద్వేషం వెదజల్లితే, ప్రభుత్వం అడ్డుకోవడం లేదు. అంటే పరోక్షంగా ఆయనకు మద్దతు పలుకుతున్నట్లే కదా’’అని ఆయన ప్రశ్నించారు.

అహ్మదీయులు

ఫొటో సోర్స్, SHUMAILA JAFFERY/BBC

‘‘దైవ దూషకులుగా ముద్ర’’

పాకిస్తాన్ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు కూడా అహ్మదీయులకు అందడం లేదని న్యాయవాదిగా పనిచేస్తున్న యాసిర్ హమ్దానీ అన్నారు. ఆ వివక్ష పూరిత సవరణ తర్వాత, అహ్మదీయుల మత స్వేచ్ఛకు కళ్లెంవేసే చాలా చట్టాలను తీసుకొచ్చారని ఆయన వివరించారు.

‘‘అహ్మదీయులకు వ్యతిరేకంగా విద్వేషాన్ని వెదజల్లే సంస్థలు చాలా ఉన్నాయి. నాజీ జర్మనీలో యూదులను చూసినట్లే వారు మమ్మల్ని చూస్తున్నారు’’అని యాసిర్ వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్‌లో తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ లాంటి సంస్థలకు నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణకు, అహ్మదీయులపై దాడులకు మధ్య సంబంధముందని చరిత్రకారుడు అలీ ఉస్మాన్ ఖాస్మి భావిస్తున్నారు. ‘‘అయితే, అన్ని వేళ్లూ ఈ సంస్థలవైపే చూపించకూడదు. ఇక్కడ ప్రభుత్వానికి కూడా పాత్ర ఉంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘అహ్మదీయ వ్యతిరేక ప్రచారాలు, ఖతమ్-ఎ-నబువాత్ ప్రచారాల్లో 2017 నుంచి తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ మద్దతుదారుల పాత్ర పెరుగుతోంది’’అని ఆయన చెప్పారు.

పాకిస్తాన్‌లో చట్టాలు కూడా అహ్మదీయుల-వ్యతిరేక ధోరణిని ప్రోత్సహిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘మీరు పాకిస్తాన్‌లోని చట్టాలు, కోర్టు తీర్పులు, పార్లమెంటు ఆమోదించిన రాజ్యాంగ సవరణలు చూడండి.. వీటిలో అహ్మదీయులపై దైవదూషకులుగా, మత విరోధులుగా ముద్రలు వేస్తున్నట్లు కనిపిస్తుంది’’అని ఆయన అన్నారు.

‘‘కేవలం ఇక్కడ జీవించడమే దైవ దూషణగా చాలా మంది ముస్లింలు భావిస్తే, ఇక వారిని ఎలా చూస్తారో మీరే ఊహించుకోండి. పాకిస్తాన్‌లో అహ్మదీయులను చాలా అమానవీయంగా చూస్తున్నారు’’అని అలీ ఉస్మాన్ వ్యాఖ్యానించారు.

2020లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మైనారిటీల జాతీయ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. అయితే, దీనిలో అహ్మదీయులకు ప్రాతినిధ్యమే లేదు. దీనిపై ప్రశ్నించినప్పుడు, అహ్మదీయులు మైనారిటీల కిందకు రారని అప్పటి సమాచార ప్రసార శాఖ మంత్రి షిబ్లి ఫరాజ్ వ్యాఖ్యానించారు.

మరోవైపు పంజాబ్‌ ప్రావిన్స్‌లోనూ ప్రధాన స్రవంతి నుంచి అహ్మదీయులను వేరుచేసేలా కొన్ని చట్టాలు తీసుకొచ్చారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో ఆకలి కేకలు-వీక్లీషో విత్ జీఎస్‌

చాలా వివక్ష..

డిసెంబరు, జనవరి నెలల్లో గుర్జన్‌వాలా, వాజీరాబాద్‌ జిల్లాల్లో అహ్మదీయుల ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసిన ఘటనల్లో స్థానిక అధికారుల పాత్ర కూడా ఉందని గత పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ గత ఫిబ్రవరిలో చేపట్టిన దర్యాప్తులో తేలింది.

‘‘స్థానిక రాజకీయ-మత సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ ఘటనలు మొదలయ్యాయి. మూకదాడులను అడ్డుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నామని స్థానిక అధికారులు చెబుతున్నారు. కానీ, వారి చర్యలు ఒక వర్గంపై మరింత విద్వేషాన్ని వెదజల్లేలా ఉన్నాయి’’అని మానవ హక్కుల కమిషన్ తమ నివేదికలో వ్యాఖ్యానించింది.

‘‘ఇక్కడ స్థానిక అధికారులు, పోలీసులు, న్యాయ వ్యవస్థను ఒక మతపరమైన సంస్థ ప్రభావితం చేసింది. మొత్తంగా వీరంతా శాంతి భద్రతలను కాపాడటంలో, అహ్మదీయుల ప్రాథమిక హక్కుల పరిరక్షణలో విఫలమయ్యారు’’అని ఆ నివేదికలో వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, దేశం దివాలా అంచుల్లో ఉందని హెచ్చరిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

చట్టపరమైన వివక్ష మాత్రమే కాదు. అహ్మదీయులు ఇక్కడ సామాజిక వివక్ష కూడా ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్‌లో అహ్మదీయులను లక్ష్యంగా చేసుకోవడం చాలా తేలికని మానవ హక్కుల ఉద్యమకారిణి తహీరా అబ్దుల్లా అన్నారు.

‘‘ఇక్కడ రాజకీయ నాయకులకు మతం అనేది ఆయుధం లాంటిది. ఇప్పటికే అధ్వానంగా మారిన జీవితాలను వీరు దుర్భరంగా చేస్తున్నారు’’అని ఆమె వ్యాఖ్యానించారు.

అహ్మదీయులపై అణచివేతలో ప్రభుత్వానికి కూడా భాగముందా? అని ప్రశ్నించినప్పుడు ‘‘సాయం కోసం పోలీసుల దగ్గరకు వెళ్తే, వారు చూసీచూడనట్లు ఊరుకుంటున్నారు. ఎఫ్ఐఆర్‌లు నమోదుచేయడానికి కూడా పోలీసులు సహకరించడం లేదు. మీరే చెప్పండి ప్రభుత్వానికి పాత్ర ఉందా?.. దర్యాప్తుల్లోనూ అహ్మదీయులపై వివక్ష కొనసాగుతోంది’’అని ఆమె అన్నారు.

ఇటీవల పార్లమెంటులో మాట్లాడుతూ అహ్మదీయుల పరిస్థితికి క్షమాపణలు చెబుతున్నాని పాకిస్తాన్ మానవ హక్కుల మంత్రి రియాజ్ హుస్సేన్ పీర్‌జాదా వ్యాఖ్యానించారు. సమాజంలో అసహనం పెరుగుతోందని, వారిపై తరచూ దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వ సంస్థలు వారిని కాపాడలేకపోతున్నాయని ఆయన అంగీకరించారు.

అహ్మదీయురాలు కావడంతో తను కూడా ఎన్నో వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చిందని నజీర్ అహ్మద్ కుమార్తె వెల్లడించారు. తన వర్గమేంటో తను బయటకు చెప్పనని, ఎందుకంటే కాలేజీ రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు.

‘‘ఒకసారి ఫేస్‌బుక్‌లో మా క్లాసుకు చెందిన కొందరిని అన్‌ఫ్రెండ్ చేయమని నాకు సూచించారు. మేం షాపింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ కొందరు మాకు వస్తువులు అమ్మేందుకు నిరాకరించారు. హిజాబ్‌ను మేం ప్రత్యేకంగా ధరిస్తాం. అలా వారు మమ్మల్ని గుర్తుపడుతుంటారు. మేం వీధుల్లో నడుస్తుంటే వెనుక అరుస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మేం ఎలా మనుగడ సాగించగలం?’’అని ఆమె ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)