పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం: దాయాది దేశం ఇప్పుడు అత్యంత ప్రమాదకర కూడలిలో ఉందా?

ఫొటో సోర్స్, RAHAT DAR/EPA-EFE/REX/SHUTTERSTOC
- రచయిత, షుమేలా జాఫ్రీ
- హోదా, బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు, ఆయనను అరెస్ట్ చేయటానికి వచ్చిన పోలీసు, భద్రతా బలగాలకు మధ్య రోజుల పాటు తీవ్ర ఘర్షణలు జరిగాయి.
లాహోర్‌లోని జమాన్ పార్క్‌లో గల ఇమ్రాన్ ఖాన్ నివాసం దగ్గరకు పోలీసులు చేరుకోవడంతో తీవ్ర హింసాత్మక పరిస్థితులు తలెత్తాయి.
ఈ అరెస్ట్ పేరుతో తనని కిడ్నాప్ చేయాలని లేదా హత్య చేయాలని చూస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు.
కోర్టు ఆదేశాల మేరకే ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారని ప్రభుత్వం చెబుతోంది. కోర్టు ముందు ఆయన్న హాజరు పరచాల్సి ఉందని పేర్కొంది.
పలుమార్లు హెచ్చరించిన తర్వాత కూడా ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో, డిస్ట్రిక్, సెషన్ కోర్టులు ఇమ్రాన్ ఖాన్‌కి వ్యతిరేకంగా నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లను జారీ చేశాయి.
ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన లాహోర్ హైకోర్టు తొలుత మార్చి 16 ఉదయం వరకు ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేయకుండా ఆదేశాలిచ్చింది.
ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన, పోలీసులపై దాడులు చేసిన వారి వీడియో ఫుటేజీలను తమకు సమర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ హింసాత్మక ఘర్షణలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని లాహోర్ హైకోర్టు తెలిపింది.
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌ను అడ్డుకునేందుకు ఆయన నివాసం వెలుపల గుమికూడిన ఆందోళనకారుల్ని చెదరకొట్టేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్లను, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.
ఇదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పోలీసుల పైకి, దర్యాప్తు సంస్థలపైకి రాళ్లు, ఇటుకలు విసిరారు. వాటర్ ట్రక్కును, ఇతర వాహనాలను కూడా కాల్చి వేశారు. జమాన్ పార్క్ ప్రాంతం చాలా వరకూ యుద్ధ భూమిని తలపించింది.
ఇమ్రాన్ ఖాన్‌పై జారీ అయిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లను రద్దు చేయాలని కోరుతూ పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఇస్లామాబాద్ హైకోర్టును సైతం ఆశ్రయించింది. అయితే వారి పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
ఏ ట్రయల్ కోర్టు అయితే వీటిని జారీ చేసిందో దాన్నే ఆశ్రయించాలని ఇస్లామాబాద్ హైకోర్టు పీటీఐ పార్టీకి తెలిపింది.

ఫొటో సోర్స్, REUTERS/MOHSIN RAZA
ప్రస్తుత పరిస్థితులు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ రాజకీయాల గురించి ఇచ్చే సంకేతాలేంటి?
ప్రమాదంలో రాజకీయాలు: రాబోయే రోజుల్లో పాకిస్తాన్‌లో ఏం జరగబోతుందో అంచనావేయడం కూడా అసాధ్యమయ్యేలా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మారాయని రాజకీయ వ్యాఖ్యాత హస్సన్ అస్కారి రిజ్వి అన్నారు.
‘‘పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ, పాకిస్తాన్ రాజకీయాలు ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనం అంచనా వేయగలిగింది ఒక్కటే. రాబోయే రోజుల్లో మరింత అశాంతి, ఆందోళనలు చెలరేగనున్నాయి’’ అని ఉద్ఘాటించారు.
ఈ ఆందోళన వల్ల ఐఎంఎఫ్(అంతర్జాతీయ ద్రవ్య నిధి)తో జరిగే చర్చలు ఆలస్యం కానున్నాయని హస్సన్ రిజ్వి భావిస్తున్నారు. దీని వల్ల రాజకీయ అనిశ్చితి ఊహించని స్థాయిలో పెరగనుందన్నారు.
ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు అరెస్ట్ అయినా లేదా రాబోయే రోజుల్లో అరెస్ట్ చేసినా.. ఎన్నికలకు భంగం కలిగే అవకాశం ఉందన్నారు. ఒకవేళ ఎన్నికలు వాయిదాపడితే, ఎలాంటి పరిణామాలు తలెత్తనున్నాయో ఎవరికి తెలియదన్నారు.
నైతికంగా, చట్టపరంగా ఇమ్రాన్ ఖాన్ తనకు తానుగా కోర్టు ముందు హాజరు కావాల్సి ఉందని, కానీ ఈ విషయం అంత తేలిక కాదని డాక్టర్ రిజ్వి అన్నారు.
‘‘మార్చి 18న కోర్టు ముందు హాజరవుతానని ఇమ్రాన్ ఖాన్ వాగ్ధానం ఇచ్చినప్పుడు, ఇలాంటి కేసుల్లో అరెస్ట్ అనేది పాకిస్తాన్‌లో అసలు సంప్రదాయమే కాదు. లాహోర్‌లో ఈ డ్రామా సృష్టించాల్సినవసరం లేదు. ఇదంతా రాజకీయాలు. పోలీసులు పూర్తిగా రాజకీయం చేస్తున్నారు’’ అని అన్నారు.
కీలకమైన పరిణామం: జమాన్ పార్క్‌ను యుద్ధ భూమిగా మార్చడం వెనుక పాకిస్తాన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్‌మెంట్(ఆర్మీ) పాత్ర ఉందని ఇమ్రాన్ ఖాన్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంకేతాలిచ్చారు. సెక్యూరిటీ ఎస్టాబ్లిష్‌మెంట్ మద్దతు లేకుండా జమాన్ పార్క్‌లో ఈ ఆపరేషన్ నిర్వహించడం అసాధ్యమని అన్నారు.
పాకిస్తాన్ రాజకీయాల్లో ఇమ్రాన్ ఖాన్‌ను లేకుండా చేసి, ఆయన పార్టీని నిలువరించేందుకు సెక్యూరిటీ ఎస్టాబ్లిష్‌మెంట్, దాని రాజకీయ కూటములు ఏడాది కాలంగా చేపట్టిన కుట్రకు జమాన్ పార్క్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు నిదర్శనంగా నిలుస్తున్నాయని మరో రాజకీయ వ్యాఖ్యాత రసూల్ భక్ష్ రాయీస్ అన్నారు.
‘‘దీని గురించి వారేం దాచలేదు. కానీ, ఇప్పటి వరకు వారేం సాధించలేకపోయారు. సెక్యూరిటీ ఎస్టాబ్లిష్‌మెంట్, అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు ఉంటే, ఇమ్రాన్ ఖాన్, ప్రజలు మరో వైపు నిల్చున్నారు. ఈ పోరాటంలో ఇమ్రాన్ ఖాన్ కచ్చితంగా లబ్ది పొందుతారు. మరోపక్క ఉన్న వారు కచ్చితంగా ఓడిపోతారు’’ అని చెప్పారు.
మరోసారి చరిత్ర సృష్టించనున్నారని రసూల్ భక్ష్ రాయీస్ అన్నారు. ప్రధానమంత్రి జుల్ఫిఖర్ అలి భుట్టోను తొలగిచేందుకు మార్షల్ లా అడ్మినిస్ట్రేటర్ జియా-ఉల్-హఖ్ వైపు అన్ని రాజకీయ పార్టీలు నిల్చున్నప్పుడు 1970ల్లో కూడా ఇదే జరిగిందన్నారు.
పాకిస్తాన్ రాజకీయ చరిత్రలో ఇదో చెప్పుకోదగ్గ పరిణామం. దేశంలో రాబోయే రాజకీయ పరిస్థితులను ఇది నిర్ణయిస్తోంది. దానిలో ఎస్టాబ్లిష్‌మెంట్ పాత్రను తెలియజేస్తుంది.
హస్సన్ అస్కారి రిజ్వి కూడా దీన్ని అంగీకరించారు. ఈ పరిస్థితుల్లో సంయమనం పాటించాలని ప్రభుత్వాన్ని ఆర్మీ ఆదేశించి ఉండొచ్చు. కానీ అలా చేయడం లేదన్నారు.

ఫొటో సోర్స్, IMRAN KHAN/FACEBOOK
అపనమ్మకం: కోర్టు ముందు తనకు తానుగా హాజరు కాకుండా ఇమ్రాన్ ఖాన్ ఈ పరిస్థితులను తీసుకొచ్చారని కొందరు రాజకీయ నిపుణులు అంచనావేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పాకిస్తాన్ నేతలు కలిసి ఆయన అరెస్ట్‌ను అడ్డుకుంటూ మరింత ఆందోళనలు కలిగిస్తున్నారని సీనియర్ న్యూస్ యాంకర్ హమిద్ మిర్ అన్నారు.
‘‘ఇస్లామాబాద్ పోలీసులను వారు నమ్మడం లేదు. చట్టాన్ని బ్రేక్ చేయడం వారికి మించిన వారు లేదన్నది నమ్మకం. ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు షాబాజ్ గిల్‌ను వారు ఇదే చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ నివాసం బని గాలాలో వారు ఆయన్ను అరెస్ట్ చేసి, ఆ తర్వాత గిల్‌ను మరొకరికి అప్పజెప్పారు’’ అని తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్ కోర్టు ముందు హాజరు కావడానికి కొందరు అనుభవజ్ఞులైన రాజకీయ నేతలు అనుకూలంగా ఉన్నారని పీటీఐకి చెందిన పేరు చెప్పని ఒకరు చెప్పారు. కానీ, ఇమ్రాన్ ఖాన్ అంటే పడిచచ్చేంత ఇష్టమున్న నేతలు, మద్దతు దారులు మాత్రం ఆయన పోలీసుల ముందు లొంగిపోవడాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
అయితే, ఇమ్రాన్ ఖాన్‌కి బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు హోం మంత్రి రాణా సనావుల్లా. మాజీ ప్రధాన మంత్రికి గుణపాఠాన్ని చెబుతానన్నారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆందోళనలకు దిగేందుకు ఇదొక సాకుగా చూపుతున్నారన్నారు.
ప్రమాదకరమైన ఉదాహరణ: తోశఖానా కేసు విచారణను ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థన మేరకు ఇప్పటికే పలు మార్లు వాయిదా వేసింది కోర్టు. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ ఈసారి కూడా ఇలానే చేస్తే, భవిష్యత్‌లో ప్రమాదకరమైన ఉదాహరణగా ఈ కేసు మారనుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
‘‘ఒకవేళ ఒక రాజకీయ వేత్తకు ప్రజల మద్దతుంటే, కోర్టులు వారికి సమన్లు పంపినా లేదా అరెస్ట్ వారెంట్లు జారీ చేసినా కూడా వారి మద్దతుదారులతో కలిసి ఆందోళనలకు దిగుతారు. కోర్టుల ముందు తలవంచరు. దేశాన్ని నిరాశ్రయంగా మార్చుతారు’’ అని అనలిస్ట్ బారిస్టర్ మునీబ్ ఫరూఖ్ అన్నారు.
‘‘జమాన్ ఖాన్‌లో ఏదైతే జరిగిందో, అది కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తుంది. నాన్ బెయిలబుల్ వారెంట్ల విధానం చాలా స్పష్టంగా ఉన్నాయి. కోర్టుల ముందు నిందితుడ్ని హాజరుపరచాలని జడ్జీలు కోరుకున్నప్పుడు, వారికి వారుగా వెళ్లి నిందితుల్ని తీసుకురారు. దర్యాప్తు సంస్థలను వారు వాడతారు. న్యాయపరమైన ఆదేశాలను పాటించేందుకు ఒకవేళ పోలీసులు అక్కడకు వెళ్లినప్పుడు, వారి పనిని చేయనీయకుండా అడ్డుపడితే, దర్యాప్తు సంస్థల తరఫున ప్రభుత్వం నిల్చుంటుంది’’ అని మునీబ్ అన్నారు.
పాకిస్తాన్‌లో ఇదొక చారిత్రాత్మక పరిణామమని మునీబ్ అభివర్ణించారు.
‘‘ఇమ్రాన్ ఖాన్ ప్రముఖ రాజకీయ నాయకుడన్నది నిజం. ప్రజల్లో ఆయన పార్టీ పాతుకుపోయిందని తెలుసు. కానీ, ఇది ఆయన చట్టాలకు వెలుపల ఉండేలా చేస్తుందా? దేశమంతా ఆయన ముందు మోకాళ్లపై కూలబడాలా? ఆయనకు లొంగిపోవాలా?’’ అని ప్రశ్నించారు.
హాస్యాస్పదం ఏంటంటే.. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ మీడియా కెమెరాల ముందు పోలీసులకు లొంగిపోతే, ఆయన మద్దతుదారులతో ఆందోళనకు దిగిన ఆ పోలీసులే ఆయన భద్రతకు బాధ్యత వహిస్తారన్నది నిజం.

ఫొటో సోర్స్, EPA
అరాచకం, అంతర్యుద్ధం: పోలీసులు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులపై దాడులు చేశారని పీటీఐ ఆరోపించిన సమయంలో, ఈ అరాచకాన్ని ఇమ్రాన్ ఖాన్‌నే క్రియేట్ చేశారని సమాచార శాఖ మంత్రి మరియమ్ ఔరంగజేబు ఆరోపించారు. దేశాన్ని అంతర్యుద్ధం దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు.
‘‘పోలీసుల వద్ద బుల్లెట్లు లేవు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులే పోలీసులపై దాడులు చేశారు. మహిళలను, చిన్న పిల్లలను వారు అడ్డం పెట్టుకుంటున్నారు’’ అని ఇస్లామాబాద్‌లోని పత్రికా సమావేశంలో మంత్రి అన్నారు. లాహోర్‌లోని ఇమ్రాన్ ఖాన్ నివాసం వెలుపల ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి 65 మంది పోలీసులు గాయపడ్డారని ఆమె తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌తో ప్రభుత్వం ఏం చేయదని, పలు కేసుల్లో కోర్టులు ఆయనపై అరెస్ట్ వారెంట్లు జారీ చేశాయని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
ప్రస్తుతం ఇది న్యాయ వ్యవస్థకు పరీక్షగా మారిందన్నారు.
ఒకవేళ కోర్టులు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ వారెంట్లను రద్దు చేసినా లేదా వాయిదావేసినా, అదే రకమైన ఉపశమనాన్ని పాకిస్తాన్‌లో ప్రతి పౌరుడికి కోర్టులు కల్పించాల్సి ఉంటుందని అన్నారు.
ఎవరికి ప్రాణహాని జరగకుండా జమాన్ పార్క్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారని రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. లేదంటే పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారి, ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేయాల్సి వచ్చేదని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ శవాలతో రాజకీయాలు చేయాలనుకుంటున్నారని ఆరోపించారు.
సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు: జమాన్ పార్క్‌కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఈ ఆపరేషన్‌ను ఖండిస్తూ.. పోలీసుల చర్యలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తున్నారు.
ఈ పరిణామాలపై తానెంతో చింతిస్తున్నానని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ట్వీట్ చేశారు. లాహోర్‌లోని ఆందోళనలను ‘‘అనారోగ్యకరమైన ప్రతీకార రాజకీయాలుగా’’ అభివర్ణించారు. ప్రజల ఆర్థిక పరిస్థితులపై దృష్టిసారించాల్సిన ప్రభుత్వం, వేటికి ప్రాధాన్యత ఇస్తుందో ప్రతిబింబిస్తుందన్నారు. ఇమ్రాన్ ఖాన్ సురక్షిత, గౌరవంపై ఆయన ఆందోళనలు వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థకు ఇదొక పరీక్షని ఆయన అభివర్ణించారు.
కొందరు ప్రముఖులు కూడా మాజీ ప్రధాన మంత్రికే మద్దతిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ రక్షణ గురించి ప్రార్థిస్తున్నట్లు నటుడు అతికా ఓధో ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.
పాకిస్తాన్‌లో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ముందుకు వచ్చి ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్తోన్న మద్దతు నమ్మశక్యం కానిదిగా ఉందని ట్విటర్‌లో అద్నాన్ సిద్ధిఖ్ అన్నారు.
మరోవైపు పీటీఐ మద్దతుదారులపై కొందరు పలు విమర్శలు చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మరియమ్ షరీఫ్‌లు జైలుకి వెళ్లడాన్ని గుర్తుకు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, RAHAT DAR/EPA-EFE/REX/SHUTTERSTOCK
ఎందుకు అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు?
రెండు విభిన్న కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ విచారణలకు హాజరు కాకపోతుండటంతో, రెండు కోర్టులు ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేశాయి.
తోశఖానా కేసులో ఫిబ్రవరి 28న ఇమ్రాన్ ఖాన్ కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఆయన కోర్టు ముందు హాజరు కాలేదు.
ఎవరైనా నిందితుడు విచారణలో భాగంగా కోర్టు ముందు హాజరు కావడం తప్పనిసరి.
గతేడాది ఆగస్టులో జరిగిన ర్యాలీలో ఒక మహిళా జడ్జిని బెదిరించారన్న ఆరోపణల కేసు రెండోది.
ఈ రెండు ఈ కేసుల్లో ఆయన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను లాహోర్ హైకోర్టు మార్చి 16 వరకు సస్పెండ్ చేసింది.
తోశఖానా కేసులో కొన్ని వారాల క్రితమే ఇమ్రాన్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ తన నివాసంలో ఆయన లేకపోవడంతో, ఉట్టి చేతులతో వారు వెనుతిరగాల్సి వచ్చింది.
ఈ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్‌ను సస్పెండ్ చేయాలంటూ ఇమ్రాన్ ఖాన్ చేసుకున్న దరఖాస్తును ఇస్లామాబాద్‌లోని సెషన్స్ కోర్టు తిరస్కరించింది. మార్చి 18వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
అయితే.. మహిళా జడ్జికి బెదిరింపుల కేసులో అరెస్ట్ వారెంట్‌ను మార్చి 20 వరకూ సంబంధిత కోర్టు వాయిదా వేసింది. ఆయనను మార్చి 29వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని నిర్దేశించింది.
2022 నవంబర్ నుంచి ఇమ్రాన్ ఖాన్ లాహోర్‌లో నివసిస్తున్నారు. వాజిరాబాద్ సమీపంలో జరిగిన నిరసనల ర్యాలీలో ఆయనపై దాడి జరిగింది. ఆ గాయాల నుంచి ఇమ్రాన్ ఖాన్ కోలుకుంటున్నారు.
గతేడాది ఏప్రిల్‌లోనే ఇమ్రాన్ ఖాన్ అధికారం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయనపై 70కి పైగా కేసులు రిజిస్టర్ అయినట్లు ఆయన పార్టీ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్: జనసేన ఆవిర్భావ సభలో స్వరం మార్చిన అధినేత... కులాల చుట్టూ సాగిన ప్రసంగం
- రష్యా జెట్ ఢీకొని సముద్రంలో కూలిన అమెరికా డ్రోన్
- తెలంగాణ: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం ఎలా జరిగింది?
- సిలికాన్ వ్యాలీ బ్యాంక్: భారత స్టార్టప్‌లు దివాలా తీసిన ఆ బ్యాంకులో ఖాతాలు ఎందుకు తెరిచాయి
- టైగర్ నాగేశ్వర రావు రియల్ స్టోరీ ఏమిటి? ఉన్నోళ్లను దోచుకుని, లేనోళ్లకు పంచేవాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














