రాహుల్ గాంధీ: ‘‘అదానీ మీద మళ్లీ నేను ఏం మాట్లాడతానోనని మోదీ భయపడ్డారు’’

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Rahul Gandhi/YouTube

లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన తరువాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.

''అదానీతో ప్రధాని నరేంద్ర మోదీకున్న సంబంధాల మీద నేను ప్రశ్నించినందుకే'' తన మీద అనర్హత వేటు వేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

''ప్రధాని నరేంద్ర మోదీ, అదానీ మధ్య సంబంధాలున్నాయి. దాని గురించి నేను ప్రశ్నిస్తున్నాను. అదానీ మీద మళ్లీ నేను ఏం మాట్లాడతానోనని మోదీ భయపడుతున్నారు.

అదానీ షెల్ కంపెనీల్లోకి రూ.20 వేల కోట్లు ఎలా వచ్చాయి? ఆ డబ్బు ఎవరిదో ఎవరు చెప్పడం లేదు. దాని గురించి ప్రశ్నిస్తుంటే నా మీద దాడి చేస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘించి అదానీకి ఎయిర్‌పోర్టులు ఇచ్చారు. రక్షణ విభాగంలోనూ అదానీ కంపెనీలు పని చేస్తున్నాయి. వీటికి సంబంధించిన వివరంగా రాశాను. తగిన ఆధారాలు సబ్‌మిట్ చేశాను.

కానీ వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

నేను ఓబీసీలను అవమానించానని, విదేశాల్లో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడానని అబద్ధాలు చెబుతున్నారు. సాకులు వెతుక్కుంటున్నారు.

నేను భారత వ్యవహారాల్లో విదేశీ జోక్యం కోరానంటూ నా మీద బీజేపీ మంత్రి పార్లమెంటులో నిందలు వేశారు. ఆ ఆరోపణల మీద స్పందించేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ సర్‌ను అడిగాను. రెండు సార్లు లేఖలు రాశాను. నేనే వెళ్లి ఆయనను వ్యక్తిగతంగా కలిశాను.

కానీ స్పీకర్ సర్ అందుకు అవకాశం లేదని చెప్పారు. నా ప్రసంగాన్ని రికార్డుల నుంచి తొలగించారు.

మీరు ఏమైనా చేయొచ్చు కానీ నా గొంతును ఆపలేరు. నేను ప్రశ్నిస్తూనే ఉంటా. నన్ను జైలులో వేసినా కూడా నా గొంతు మూగబోదు.

అదానీ-మోదీల సంబంధం గురించి నేను మళ్లీ ప్రశ్నిస్తాననే కారణంతో నా మీద అనర్హత వేటు వేశారు.

అదానీకి వచ్చిన ఆ రూ.20 వేల కోట్లు ఎవరివి అని ప్రశ్నించినందుకే ఇదంతా చేస్తున్నారు'' అని రాహుల్ గాంధీ అన్నారు.

రాహుల్ గాంధీ ప్రశ్నలు:

  • ప్రధాని మోదీ, అదానీల మధ్య సంబంధం ఏంటి?
  • అదానీ గ్రూపులోకి రూ.20 వేల కోట్లు వచ్చాయి. అవి అదానీ డబ్బులు కాదు. మరి ఆ డబ్బులు ఎవరివి?

కేరళలోని వయనాడ్ ప్రజలతో తనకు కుటుంబం వంటి సంబంధం ఉందని, ఈ వ్యవహారం మీద వారికి త్వరలోనే వివరంగా లేక రాస్తానని అన్నారు.

''క్షమాపణలు చెప్పడానికి నా పేరు సావర్కర్ కాదు... నా పేరు గాంధీ... నేను క్షమాపణలు ఎప్పుడూ అడగను'' అని కూడా ఆయన మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మరోవైపు రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ ఖండిస్తోంది. ఆయన తప్పు చేయడం వల్లే చట్టప్రకారం కోర్టులు దోషిగా తేల్చాయని అస్సా ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ అన్నారు. రాహుల్ గాంధీ ఓబీసీలను కించపరిచేలా మాట్లాడారని తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)