90 వేల మంది ఊచకోత: 45 ఏళ్ల తరువాత శవాలను తవ్వితీసి అస్థికలు అప్పగించిన ప్రభుత్వం, తమవారివి కావంటున్న కుటుంబీకులు

వ్యాన్ డునెమ్ కుటుంబం

ఫొటో సోర్స్, VAN DUNEM FAMILY

ఫొటో క్యాప్షన్, 1977 మారణకాండలో మరణించిన జావో ఎర్నెస్టో వ్యాన్ డునెమ్ తల్లి సీతా వ్యాలెస్
    • రచయిత, మారీ హర్పర్
    • హోదా, ఆఫ్రికా ఎడిటర్, బీబీసీ వరల్డ్ సర్వీస్ న్యూస్

అంగోలాలో 1977లో జరిగిన ఊచకోత అనంతరం ఆ భయం, నిశ్శబ్ధం దశాబ్దాల పాటు కొనసాగింది. అంగోలాకు చెందిన 90 వేల మంది ప్రజలు అప్పుడు సామూహిక హత్యలకు గురయ్యారు.

ఈ భయానక ఘటనలో కనిపించకుండా పోయిన వ్యక్తులకు చెందిన కుటుంబాలు, తమ వారి గురించి గొంతెత్తడం ప్రారంభించాయి.

తమ ప్రశ్నలకు బదులు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం మొదలెట్టాయి.

ప్రజలతో రాజీ కుదుర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. అయితే, రాజీ కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కొందరి పట్ల దారుణంగా బెడిసికొట్టాయి.

జోస్ వ్యాన్ డునెమ్

ఫొటో సోర్స్, VAN DUNEM FAMILY

ఫొటో క్యాప్షన్, జోస్ వ్యాన్ డునెమ్

జావో ఎర్నెస్టో వ్యాన్ డునెమ్ అనే వ్యక్తి, తన తల్లిదండ్రులు రెండుసార్లు మరణించినట్లుగా భావిస్తున్నారు.

మూడు నెలల వయస్సులో అనాథగా మారిన జావో ఎర్నెస్టో వ్యాన్ డునెమ్‌కు గత సంవత్సరం ఒక వార్త ఆనందాన్ని ఇచ్చింది.

అప్పుడు జాతీయ టెలివిజన్‌లో కనిపించిన అంగోలా న్యాయశాఖ మంత్రి ఒక ప్రకటన చేశారు. జావో తల్లిదండ్రులతో పాటు మరణించిన వారి అవశేషాలు, 45 ఏళ్ల తర్వాత లభ్యమైనట్లు ఆయన ప్రకటించారు.

‘‘ఎట్టకేలకు నా తల్లిదండ్రులను నేను తిరిగి పొందబోతున్నా’’ అని అనుకున్నట్లు బీబీసీతో జావో చెప్పారు.

1977 తిరుగుబాటును నడిపించిన నాయకుల్లో సీతా వాలెస్, జోస్ వ్యాన్ డునెమ్ కూడా ఉన్నారు.

ఎంపీఎల్‌ఏ ప్రభుత్వంలో సీతా, జోస్ ఇద్దరూ యువ సభ్యులు. అప్పుడు మే నెలలో ఏం జరిగిందనేది ఇప్పటికీ అనుమానాస్పదంగానే మిగిలిపోయింది.

సామూహిక ఖననం చేసిన వారి ఎముకలను వెలికితీసే ప్రక్రియను కూడా అధికారిక లెక్కింపు ప్రక్రియలో భాగంగా భావించారు.

కానీ, ఈ ప్రక్రియతోనే జావో వ్యాన్ ఆశలు అడుగంటిపోయాయి.

రుయ్ కొయిలో

ఫొటో సోర్స్, COELHO FAMILY

ఫొటో క్యాప్షన్, రుయ్ కొయిలో

ఒక ప్రత్యేక ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజిస్టులతో కూడిన బృందం, వెలికితీసిన అవశేషాలను పరీక్షించి దర్యాప్తు నివేదికను సమర్పించింది. దీనిప్రకారం, అక్కడ లభ్యమైన మృతదేహాలకు, జావో వ్యాన్ డీఎన్‌ఏకు ఎలాంటి సంబంధం లేదని తెలిసింది.

‘‘ఈ అంగోలా అధికారులు నా కుటుంబాన్ని తిరిగి బాధపెట్టాలని చూస్తున్నారా? ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారా? ఇన్నేళ్ల బాధ తర్వాత కూడా వారు ఇలా ఎలా చేయగలరు? అని నాలో నేను అనుకున్నా’’ అని ప్రస్తుతం లిస్బన్‌లో నివసిస్తూ, ఆర్థికవేత్తగా పనిచేస్తోన్న వాన్ డునెమ్ చెప్పారు.

1977 ఊచకోతతో అనాథలుగా మారిన ఇతరులతో కలిసి జావో వ్యాన్ డునెమ్ 2018లో ‘‘ఎం27’’ పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు.

ఆ సమయంలో ఏం జరిగింది? తమ తల్లిదండ్రులకు సంబంధించిన అవశేషాలు, మరణ ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారు ఈ సంఘాన్ని నెలకొల్పారు.

ఇది జరిగిన ఏడాది తర్వాత, అంగోలా ప్రభుత్వం నోరు విప్పింది.

1975లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలో జరిగిన రాజకీయ హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేసేందుకు అంగోలా అధ్యక్షుడు జావో లారెన్సో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

1977 ఘటనతో పాటు, యునైటా రెబెల్స్‌తో 27 ఏళ్ల పాటు కొనసాగి 2002లో ముగిసిన యుద్ధంపై కూడా దర్యాప్తు చేయాలని కమిషన్‌ను ఆదేశించారు.

మారణకాండ గురించి ప్రస్తావిస్తూ, లారెన్సో 2021 మే 6వ తేదీన ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆ ఘటనను ‘అతిపెద్ద దారుణం’’గా అభివర్ణించినందుకు క్షమించమని అడిగారు.

రుయ్ తుకాయన

ఫొటో సోర్స్, RUI TUKAYANA

ఫొటో క్యాప్షన్, రుయ్ తుకాయన

బుల్డోజర్లు తవ్వడం ప్రారంభించాయి. మృతదేహాల అవశేషాలను గుర్తించడానికి బ్రెజిల్ శాస్త్రవేత్తను అక్కడికి పంపించారు.

వెలికితీతలో బయటపడిన పుర్రెలు, ఎముకల దృశ్యాలను టెలివిజన్‌లో చూసి ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు.

డీఎన్‌ఏను అందించి, అవశేషాల సంబంధీకులను గుర్తించడంలో సహాయపడాలని అధికారులు చేసిన అభ్యర్థనను ప్రజలు తిరస్కరించారు. దీనిపై స్వతంత్ర విచారణ జరపాలని పట్టుబట్టారు.

ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చింది. నాటి తిరుగుబాటులో ప్రధాన పాత్ర పోషించిన నిటో అల్వెస్‌తో పాటు ముగ్గురు కీలక నేతల అవశేషాలను గుర్తించినట్లు ప్రభుత్వం చెప్పింది.

బయల్పడిన మృతదేహాలు తమవారివేనని, ఈ నేతలకు సంబంధించిన కుటుంబాలు అంగీకరించి అంత్యక్రియలను నిర్వహించాయి. 2022 జూన్‌లో అధికారిక లాంఛనాలతో జరిగిన ఈ అంత్యక్రియల్లో ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. వారి శవపేటికలపై అంగోలా జాతీయ జెండాను కప్పారు.

ఇది జరిగిన కొన్నిరోజుల తర్వాత, జావో వ్యాన్ డునెమ్ తల్లిదండ్రులతో పాటు ఇతర ప్రధాన నాయకుల ఎముకలు లభ్యమైనట్లు, వాటిని వారి సంబంధీకులకు అప్పజెప్పనున్నట్లు టీవీలో ప్రకటించారు.

అయితే, ప్రభుత్వం చెప్పినట్లుగా ఆ అవశేషాలు తమ కుటుంబీకులవే అని ఆ కుటుంబాలు నమ్మలేదు.

అనుమానంతో వారు ఒక స్వతంత్ర ఫోరెన్సిక్ బృందాన్ని నియమించుకున్నారు. పోర్చుగల్‌లోని కోయింబ్రా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రఖ్యాత ఫోరెన్సిక్ సైంటిస్ట్, ప్రొఫెసర్ డ్యువార్టే నునో వియెరా నేతృత్వంలో ఈ బృందం పనిచేసింది.

డ్యువార్టే డజన్ల కొద్దీ అంతర్జాతీయ మిషన్లలో పాల్గొన్నారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: రామోజీపేటలో ఏం జరిగింది?

'ఎముకలు చాలా మాట్లాడతాయి'

"స్వేచ్ఛ, పారదర్శకత మా పనిలోని కీలకాంశాలు. అదృశ్యమైన వారిని అన్వేషించేటప్పుడు, మొదటి నుంచి వారి కుటుంబాలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యుల్ని చేయాలి. అలా చేయకపోతే వారికి నమ్మకం కలగదు. దురదృష్టవశాత్తు అంగోలాలో ఇది జరగలేదు.

దర్యాప్తు కోసం ప్రభుత్వం నియమించిన బ్రెజిలియన్ శాస్త్రవేత్త గురించి నేను ఎన్నడూ వినలేదు. బ్రెజిల్‌లోని నా సహచరులు కూడా ఆయన గురించి ఎప్పుడూ వినలేదు’’ అని వియెరా చెప్పారు.

వియోరా బృందం అంగోలాకు రాగానే, చిందరవందరగా ఎముకలు పడేసి ఉన్న ఒక గదిలోకి వారిని తీసుకెళ్లారు. న్యాయశాఖ మంత్రి ప్రస్తావించిన అవశేషాలు ఇవే.

"ఎముకలు చాలా మాట్లాడతాయి" అని వియెరా అన్నారు.

‘‘ఎముకల నుంచి సమాచారాన్ని పొందడమే మా పని. మేం మొదట వాటిని చూసినప్పుడు, అవి ఉన్న స్థితిని బట్టే వారికి ఏం జరిగిందో సగం అర్థం అవుతుంది’’ అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, కారంచేడు హింసాకాండకు నేటితో 36 ఏళ్లు, బాధితులకు న్యాయం జరిగిందా?

ఆ బృందం, ఎముకలన్నింటినీ వేరు పరిచింది. తర్వాత వాటిలో రెండు మృతదేహాలు మహిళలవని వారు గుర్తించారు. వారిలో ఒకరు వ్యాన్ డునెమ్ తల్లి అయ్యే అవకాశం ఉందని వారు చెప్పారు.

కానీ, ఆ మృతదేహాల డీఎన్‌ఏను బంధువుల డీఎన్‌ఏతో పరీక్షించిప్పుడు ఒక్కరితో కూడా సరిపోలలేదు.

అందులో, ఇద్దరు చిన్నపిల్లల మృతదేహాలు కూడా ఉన్నాయి. వారిలో ఒకరికి అంగవైకల్యం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు.

ఎముకల మీద ఉన్న మట్టికి, తవ్వకాలు జరిగిన చోట ఉన్న మట్టికి అసలు సంబంధమే లేనట్లు పరిశోధనలో తెలిసింది. దీంతో ప్రభుత్వం చెప్పిన ఆధారాలకు, నిజాలకు అసలు పొంతనే లేనట్లు తెలిసింది.

వ్యాన్ డునెమ్‌కు ఎదురైన నిరాశే ఇతరులు కూడా అనుభవించారు.

"మా నాన్న అవశేషాలు దొరికాయని అధికారులు చెప్పినప్పుడు, మా కుటుంబం ఎంతో సంతోషించింది’’ అని ఇప్పుడు పోర్చుగల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తోన్న రుయ్ తుకాయన చెప్పారు.

"ఎట్టకేలకు తమ సోదరుడి మృతదేహాన్ని గౌరవప్రదంగా ఖననం చేయవచ్చని మా బంధువులు కొందరు ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టారు. నా తండ్రి రుయ్ కోయిలో మరణించిన మూడు నెలలకు నేను పుట్టాను. ఆయన ఎలా ఉంటారో నాకు తెలియదు. కానీ, ప్రభుత్వం మాకు అందించిన అవశేషాలు మా నాన్నవి కాదని స్వతంత్ర బృందం గుర్తించినప్పుడు, మేం రెండోసారి అతన్ని కోల్పోయినట్లు అనిపించింది’’ అని రుయ్ అన్నారు.

వ్యాన్ డునెమ్ కూడా ఇదే భావనలో ఉన్నారు.

అదృశ్యమైన వారి అవశేషాలు ఎప్పటికీ దొరక్కపోయే అవకాశం కూడా ఉంది.

"విమానాల నుంచి మృతదేహాలను సముద్రంలో పడేయడం ఒకప్పుడు అతి సాధారణ వ్యవహారం. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ హత్యల్లో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు ఇప్పటికీ బతికే ఉన్నారు. అంగోలా రాజకీయాల్లో వారు కీలక పదవుల్లో ఉన్నారు’’ అని ప్రొఫెసర్ వియెరా అన్నారు.

స్వతంత్ర నిపుణుల పరిశోధనల గురించి అధికారులకు తెలిసింది. దాని గురించి ఇప్పటి వరకు వారు ఏమీ మాట్లాడలేదు.

ప్రభుత్వం తీరును క్రూరమైనదిగా ఎం27 సంఘం అభివర్ణించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)