మహాత్మా గాంధీ జయంతి: ‘గాంధీని పూజించడం చాలా ప్రమాదకరం’ అని ఎవరు అన్నారు

మహాత్మా గాంధీ

ఫొటో సోర్స్, Daniel Osei Tufuor

    • రచయిత, కుమార్ ప్రశాంత్
    • హోదా, అధ్యక్షుడు, గాంధీ పీస్ ఫౌండేషన్

ప్రపంచవ్యాప్తంగా నేడు గాంధీ విగ్రహాల రూపంలో కనిపిస్తున్నాడు. సుమారు 70 దేశాల్లో ఆయన విగ్రహాలను పెట్టారు.

భారత రాజకీయ, సాంఘిక ఉద్యమంలో 1917లో అడుగు పెట్టిన గాంధీ ఆ తరువాత 31 ఏళ్ల పాటు నిర్విరామంగా పోరాడారు.

అయితే ఇటీవల కాలంలో ఆయన విగ్రహాలను ధ్వంసం చేయడం తరచూ కనిపిస్తోంది. చాలా దేశాల్లోని ఆయన విగ్రహాల మీద దాడులు జరిగాయి. భారత్‌లోనూ ఇటీవల చంపారన్ వద్ద గల గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

అమెరికాలో 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్' ఉద్యమం సమయంలో కూడా గాంధీ విగ్రహం మీద దాడులు జరిగాయి. ఇలాంటి దాడుల వల్ల కోపం తెచ్చుకోవడం లేక నిరాశ పడిపోవాల్సిన అవసరం లేదు.

మహాత్మా గాంధీ

సవాళ్లు లేకుంటే గాంధీ లేరు

1960, 70లలో దేశంలో నక్సలైట్ ఉద్యమం తారస్థాయిలో ఉన్నప్పుడు కూడా గాంధీ విగ్రహాల మీద దాడులు జరిగాయి. అభ్యంతకర వ్యాఖ్యలు కూడా ఆయన బొమ్మల మీద రాసేవారు. చైనా నేత మావోను కీర్తించే స్లోగన్స్‌ కూడా రాసేవారు గాంధీ విగ్రహాల మీద.

ఆ రోజుల్లోనే బిహార్‌లో ఉన్న జంషెడ్‌పుర్‌లో గాంధీ విగ్రహం మీద దాడి జరిగింది.

'గాంధీ నుంచి చాలా ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు. ఆయన విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఇది కూడా మంచిదేనని నేను అనుకుంటున్నా. గాంధేయవాదులకు ఇదొక సవాలు. సవాళ్లు లేకుంటే గాంధీ అనే వ్యక్తి లేడు' అని నాడు గాంధేయవాదులను ఉద్దేశించి జయప్రకాశ్ నారాయణ్ రాశారు.

నాడు జయప్రకాశ నారాయణ్ తీసుకొచ్చిన ఆలోచనలు 'సంపూర్ణ క్రాంతి' అనే ఉద్యమానికి దారి తీశాయి.

నేడు గాంధీకి వ్యతిరేకంగా పని చేస్తున్న మరొక కేంద్రంగా హిందుత్వవాదులు మారుతున్నారు.

మహాత్మా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు

ప్రపంచవ్యాప్తంగా నేడు చూస్తే అంతటా ఒక సంకుచిత స్వభావం పెరిగి పోతోంది. ఈ సంకుచిత స్వభావుల చేతికే అధికారం వస్తోంది. దాంతో అది మరింత దూకుడుగా మరింత వినాశకారిగా నేడు ముందుకు వస్తోంది. గాంధీ బలైంది కూడా ఇలాంటి విధ్వంసం పేల్చిన తూటాకే. బుల్లెట్‌తో గాంధీ చనిపోలేదు, విశ్వవ్యాప్తంగా మరింతగా విస్తరించాడు.

ఇలా గాంధీ విశ్వవ్యాపితం కావడాన్ని సంకుచిత స్వభావం గల ఛాందసవాదులు జీర్ణించుకోలేక పోయారు. ఏ గాంధీ వల్ల తమ వైఫల్యాలు బయటకు తెలుస్తున్నాయో ఆ గాంధీ గుర్తులను పూర్తిగా చెరిపివేయాలని వారు నిశ్చయించుకున్నారు. నాథూరాం గాడ్సే ఇమేజ్‌ను పెంచడంలో హిందుత్వవాదులు బిజీగా ఉంటే, మరొకవైపు గాంధీకి వ్యతిరేకంగా వామపక్ష వాదులు చైర్మన్ మావోను ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశారు.

అందరూ ఎవరికి వారు తమ సొంత జెండాలను అజెండాలను పాతేందుకు పోటీపడుతున్న తరుణంలో ఈ ప్రజాస్వామ దేశపు సామాన్య పౌరులు మాత్రం నిలబడలేని స్థితిలో ఉన్నారు. అలాంటి వారిని నిలబెట్టేందుకు, వారి స్థాయిని పెంచేందుకు గాంధీ తన జీవితమంతా కష్టపడ్డారు.

మహాత్మా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

హింసతో మానవత్వం నశిస్తుంది

గాంధీ బతికి ఉండే నేడు ఆయనకు 153 ఏళ్లు ఉండేవి. ఇన్ని ఏళ్లు మనిషి బతకగలడా? కానీ గాంధీ మాత్రం ఇంకా జీవిస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయనతో వాదనలకు దిగుతున్నాం. ఆయన విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా గాంధీ మీద వ్యతిరేకతను కోపాన్ని చూపిస్తున్నాం.

గాంధీ ఎప్పుడూ అధికారం చలాయించలేదు. కార్పొరేట్ సామ్రాజ్యానికి, అవి చేసే దురాక్రమణలు, అన్యాయాలకు గాంధీకి ఎటువంటి సంబంధం లేదు. బానిసత్వాన్ని, అణచివేతను ఆయన ఎన్నడూ సమర్థించలేదు. కులం, మతం, రంగు ఆధారంగా వివక్షను చూపించడాన్ని హర్షించలేదు. తన మాటలు, చేతల ద్వారా వీటిని ఆయన ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తూనే వచ్చారు. కాకపోతే ఆయన మార్గం హింసతో కూడుకున్నది కాదు.

హింస అంటేనే అణచివేయడం. అర్థబలం, అంగబలం, అధికారం, ఆయుధం వంటి వాటిని వాడి మనిషిని అణచివేయడమే అవుతుంది. అలా హింసతో మనిషిని అణచివేయాలని గాంధీ అనుకోలేదు. ఎందుకంటే హింస మనిషిలోని మానవత్వాన్ని నాశనం చేస్తుంది. మనిషిలో మరింత క్రూరత్వాన్ని పెంచుతుంది.

మహాత్మా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

గాంధీ అంటే సాధ్యమే

ఒక సమాజం తనకు ఎదురయ్యే కష్టాలను, అవరోధాలను అహింస మార్గంలో ఎలా ఎదుర్కొందో తెలిపే చరిత్ర మనకు ఎక్కడా లేదు. కానీ అలాంటి చరిత్రను రాసినవాడు గాంధీ.

అందువల్ల అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలమనేందుకు ప్రతీకగా గాంధీ మారాడు. ఆయన తరువాత కూడా కొందరు అలా అసాధ్యాలను సుసాధ్యం చేసే మార్గంలో నడిచారు. అందుకే గాంధీ, వినోబాబవే, జయప్రకాశ్ నారయణ్ మధ్య మనమొక ట్రయాంగిల్ గీయొచ్చు. వీరి అహింసా మార్గంలో నాలుగో పేరు ఆ తరువాత రాలేదు.

అందరి మనసుల మాదిరిగానే ఈ ముగ్గురిలో ఎవరి బలహీనతలు, బలాలు వారికి ఉన్నాయి. కానీ గాంధీకి వ్యతిరేకంగా మాత్రమే ఎందుకు ఇంత ప్రచారం జరుగుతోంది?

ఎందుకు అటు కరడుగట్టిన వామపక్షవాదులు, ఇటు తీవ్ర హిందుత్వవాదులు ఇద్దరూ గాంధీని వ్యతిరేకిస్తున్నారు? గాంధీ అంటే ఉన్న ఈ ద్వేషం నేడు పుట్టుకొచ్చింది కాదు. దీనికి చాలా చరిత్రే ఉంది.

మూడు బుల్లెట్లు తగిలి ప్రాణాలు వదలడానికి ముందే ఎన్నో దాడులను గాంధీ ఎదుర్కొన్నాడు. ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఒక సైంటిఫిక్ ఈక్వెషన్‌ పరిష్కరించే ఆలోచన పరిధిని దాటి ముందుకు వెళ్లాలి.

అంటరానితనం, అసమానత్వం, అణచివేతను ఏ స్థాయిలోనూ ఇసుమంత కూడా సహించని వ్యక్తి గాంధీ. వీటిని అడ్డుకునేందుకు తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. అదే సమయంలో పగలు, ప్రతీకారాలకు కూడా గాంధీ వ్యతిరేకమే. శత్రువులను డీల్ చేయాలంటే హింస, ప్రతిహింస, పగ, ప్రతీకారం వంటి పద్ధతులు మాత్రమే మనుషులకు తెలుసు.

మన చరిత్ర మొత్తాన్ని తరచి చూస్తే హింస, ప్రతిహింస, పగ, ప్రతీకారాలే మనకు కనిపిస్తాయి. ఈ విషవలయం నుంచి మనుషులను బయట పడేసే మరొక శక్తి కోసం ప్రయత్నాలు చేసిన వాడు గాంధీ.

నేడు వామపక్ష వాదుల్లో గాంధీ మీద వ్యతిరేకత కొంత మేరకు తగ్గింది. గాంధీ మీద దళిత పార్టీలు విషం చిమ్మడం కూడా నెమ్మదించింది. దళితుల నుంచి కొంత సానుభూతి కూడా గాంధీ పట్ల కనిపిస్తోంది. అయితే నేటికీ ఆయన విగ్రహాల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వారు ఎన్నడూ నిరసన వ్యక్తం చేయలేదు.

మహాత్మా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

గాంధీని పూజించడం చాలా ప్రమాదకరం

గాంధీ వంటి వ్యక్తులను విగ్రహాలకు పరిమితం చేసి పూజించడం అనే చాలా ప్రమాదకరమైన ధోరణి. అర్థం లేని చర్య. దానికి బదులుగా ఆయన విలువలను నెలకొల్పేందుకు ప్రయత్నించాలి.

గాంధీ ఆలోచనలకు నేటికీ సమకాలీనత ఉందో లేదో నినాదాలు చేయడం, విగ్రహాలు పెట్టడం, వేడుకలు చేయడం వల్ల తెలియదు. సమస్యలు పరిష్కరించడం ద్వారా అది తెలుస్తుంది.

గాంధీని నమ్మే వారికి, ఆయన కావాలని కోరుకునే వారికి ఒక మార్గం ఉంది. అది గాంధీ చూపించిన విలువల దారిలో నడవడం. నిజాయితీతో బతకడం. ఈ విలువలే పునాదులుగా నిలబెట్టుకున్న విగ్రహాన్ని ఎవరూ కూల్చలేరు.

'గాంధీని పూజించడం చాలా ప్రమాదకరం. అది ఓటములకు దారి తీస్తుంది' అని జయప్రకాశ్ నారాయణ్ చేసిన హెచ్చరికను మరచిపోకూడదు.

వీడియో క్యాప్షన్, అంబేడ్కర్: ‘కులాంతర వివాహాలు, కలిసి భోజనాలు చేయడం వల్ల కుల వ్యవస్థ అంతం కాదు’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)