గోరుముద్ద, మన ఊరు-మన బడి పథకాలు ఉన్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పిల్లలు ఎందుకు బడి మానేస్తున్నారు?

పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘మా అమ్మాయి తొమ్మిదో తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచి చదువు సరిగా రాలేదు. కనీసం పదో తరగతి వరకు చదువుకుంటుందని ఎంతో చెప్పి చూశాం. కానీ మాట వినలేదు. బడికి వెళ్లనని మొండికేసేది.

మా కాలనీ నుంచి బడికి వెళ్లాలంటే నాలుగు కిలోమీటర్లు దూరం ఉంది. బస్సు ఉండదు. చివరికి చేసేదేం లేక బడి మాన్పించాం.’’

హైదరాబాద్ శివారు కౌకూరు సమీపంలో ఉండే రమణమ్మ(పేరు మార్చాం) బీబీసీతో అన్న మాటలవి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సెకండరీ గ్రేడ్ స్థాయిలో బడి మానేస్తున్న పిల్లల సంఖ్య జాతీయ సగటుతో పోల్చితే ఎక్కువగా ఉంటోంది.

ఇటీవల కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ప్రకారం.. సెకండరీ స్థాయిలో జాతీయ సగటు కంటే ఏపీ, తెలంగాణలో స్కూల్ డ్రాపవుట్లు ఎక్కువగా ఉన్నాయి.

2021-22 సంవత్సరానికి డ్రాపవుట్స్‌లో జాతీయ సగటు 12.61 శాతంగా ఉంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో 16.29 శాతం, తెలంగాణలో 13.74 శాతం నమోదైనట్లు అన్నపూర్ణాదేవి వెల్లడించారు.

విద్యా వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకు వచ్చేలా పథకాలు అమలు చేస్తున్నామని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ‘‘అమ్మ ఒడి, గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన’’ వంటి పథకాలు అమల్లో ఉన్నాయి.

తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం విద్య, ‘‘మన ఊరు.. మన బడి’’ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ‘గోరుముద్ద’ పథకానికి రూ.1,824 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.

తెలంగాణలో ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమానికి రూ.7,289 కోట్లతో బడులను బాగు చేయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గతంలో చెప్పారు.

భారీగా నిధులు ఖర్చు చేస్తున్న సెకండరీ స్థాయిలో బడి మానేసే పిల్లలు ఎక్కువగా ఎందుకు ఉన్నారనేది ఇప్పుడు కీలకంగా మారింది.

యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యుడైస్ ప్లస్) 2021-22 గణాంకాల ప్రకారం- సంఖ్య పరంగా చూస్తే తెలంగాణలో ఎక్కువ మంది పిల్లలు, శాతం పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మంది పిల్లలు మధ్యలోనే బడి మానేశారు. ఈ లెక్కల ప్రకారం తెలంగాణలో 55,637 స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య 34,517 గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌:

ప్రభుత్వ పాఠశాలలు: 45,078

విద్యార్థులు: 46,56,951

తెలంగాణ:

ప్రభుత్వ పాఠశాలలు: 29,971

విద్యార్థులు: 32,63,510

పిల్లలు

ఫొటో సోర్స్, FAMILY ALBUM

ఎందుకీ పరిస్థితి?

ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు అనుభవిస్తున్న సమస్యలతో సెకండరీ స్థాయిలో డ్రాపవుట్స్ పెరగడానికి కారణంగా చెప్పవచ్చని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.

ఈ విషయంపై ఏపీ విద్యా రంగ నిపుణుడు, ఎంఎల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం బీబీసీతో మాట్లాడారు.

‘‘ప్రాథమిక స్థాయి విద్య చాలా బలహీనంగా ఉంది. ఏపీలో 6,557 పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నట్లు గత వారం అసెంబ్లీలో ఏపీ విద్యాశాఖ మంత్రి చెప్పారు. ఇది కూడా కరెక్టు అని చెప్పలేను. నా అంచనా ప్రకారం 12వేల పాఠశాలల్లో ఒకే టీచర్ ఉన్నారు. ఇలాంటి చోట్ల పిల్లలకు ప్రాథమిక స్థాయిలో చదువుపై ఆసక్తి ఎలా వస్తుంది…? దానివల్ల పై తరగతులకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు.

మా పిల్లలు చదవ లేరు అని తల్లిదండ్రులు కూడా బడి మాన్పించేసి పనులకు పంపిస్తున్నారు.’’ అని బాల సుబ్రహ్మణ్యం బీబీసీకి చెప్పారు.

ఇక ఇదే విషయంలో తెలంగాణకు వచ్చేసరికి 2021-22 కేంద్ర విద్యా శాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో 6,392 పాఠశాలల్లో ఒక్కరే టీచర్ పనిచేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

దూరం ‌‍‌‍భారంగా మారిందా?

2009 విద్యా హక్కు చట్టం ప్రకారం, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాల కిలోమీటరు దూరంలో ఉండాలి. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న పాఠశాలలు ౩ కిలోమీటర్ల పరిధిలో ఉండాలి.

అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవని విద్యావేత్తలు చెబుతున్నారు.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్) లెక్కలు విడుదల చేయగా.. తెలంగాణలో 2,508 గ్రామాలకు ఉన్నత పాఠశాల సౌకర్యం లేదని సా‌‍క్షి పత్రిక ఒక కథనంలో పేర్కొంది.

30,395 మంది విద్యార్థులు చదువుకోవడానికి కనీసం మూడు నుంచి ఐదు కిలోమీటర్ల నడుచుకుంటూ వెళుతున్నారని ప్రస్తావించింది.

ఈ విషయంపై రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, ఎంవీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శాంతాసిన్హా బీబీసీతో మాట్లాడారు.

‘‘తెలుగు రాష్ట్రాల్లో సరిపడా సెకండరీ స్కూళ్లు లేవు. విద్య పూర్తిగా ప్రైవేటీకరణ జరిగింది. పిల్లలు చదువుకునేందుకు స్తోమత లేకుండా ఉంది. కొన్ని గ్రామాల్లో హైస్కూల్‌కు వెళ్లాలంటే ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది.

అమ్మాయిలు చదువుకునేందుకు వెళ్లేందుకు ఉచిత బస్‌పాస్‌లు ఇవ్వాలి. స్కూల్ టైమింగ్స్‌లో బస్సులు నడపాలి. అప్పుడే విద్యార్థులు చదువు మానేయకుండా ఉండేందుకు సాధ్యపడుతుంది. పట్టణాలకు వచ్చి హాస్టళ్లలో ఉండి చదువుకోవాలంటే ఫీజులు భరించలేకపోతున్నారు’’ అని శాంతాసిన్హా బీబీసీతో చెప్పారు.

పిల్లలు

ఫొటో సోర్స్, iStock

పేదరికం ప్రభావం చూపుతోందా?

కోవిడ్ ప్రబలిన తర్వాత పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేదలపై తీవ్ర ప్రభావమే చూపించింది. పట్టణాలకు వలసలు భారీగా పెరిగాయి.

పట్టణ పేదరికం కారణంగా మురికివాడల్లో జనాభా పెరగడం, అక్కడ దగ్గర్లో పాఠశాల సౌకర్యం లేకపోవడం కారణంగా డ్రావవుట్స్ పెరుగుతున్నాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.

‘‘వీటిని డ్రాపవుట్స్ కూడా అనకూడదు.. పుష్ అవుట్స్‌గా చెప్పవచ్చు. పిల్లలు తమంతట తామే బడి మానేసే పరిస్థితులు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఒకసారి బడి మానేస్తే మళ్లి తీసుకువచ్చి చేర్చుకునే యంత్రాంగం లేదు. బ్రిడ్జి కోర్సు పెట్టి తీసుకురావాలి. నాలుగైదేళ్ల కిందట సర్వశిక్ష అభియాన చేసిన సర్వే ప్రకారం కృష్ణా జిల్లాలో బడి మాన్పించి పనులకు పంపిస్తున్నారనేది బయటపడింది.

పేదలకు ఏయే కార్యక్రమాలు తీసుకువస్తే పిల్లలను బడి వైపు మళ్లించవచ్చనే వ్యూహాలు ప్రభుత్వాలకు లేకపోవడం విచారకరం. ’’ అని బీబీసీతో చెప్పారు బాలసుబ్రహ్మణ్యం. ఇంగ్లీష్ మీడియాం కూడా ఓ ప్రధాన అడ్డంకిగా మారుతోందని ఆయన చెప్పారు.

ఈ విషయంపై ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో పేదల కుటుంబాలల్లో పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. సిబ్లింగ్ ఉంటే తల్లిదండ్రులు పనులకు వెళ్లేందుకు పెద్ద పిల్లనో, పిల్లవాడితోనో స్కూల్ మాన్పించి చిన్నవాళ్లను చూసుకునేందుకు ఇంటివద్ద కాపలా ఉంచుతున్నారు. సింగిల్ పేరెంట్ ఉంటే ఇంటికి ఆసరా అవుతుందని తమతో పనులకు తీసుకెళుతున్నారు. ఇలా బడి మానేసే పిల్లలలో వివిధ కారణాలు కనిపిస్తున్నాయి.’’ అని చెప్పారు.

ఈ విషయంపై మేడ్చల్ జిల్లాకు చెందిన కౌకూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ బీబీసీతో మాట్లాడారు.

‘‘బడి మానేస్తుంటే పిల్లలతో విడిగా మాట్లాడతాం. తల్లిదండ్రుల నుంచి తప్పు ఉందనిపిస్తే.. వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాం. కొందరు చదువు రాక బడికి వచ్చేందుకు ఆసక్తి చూపరు. మానేసిన విద్యార్థితో మాట్లాడాం. తల్లిని పిలిచి చెప్పాం. మేం చెప్పినా, తల్లి చెప్పినా మార్పు లేదు. అందుకే కనీసం ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్ కట్టించి పరీక్ష రాయిస్తున్నాం.’’ అని చెప్పారు.

స్కూల్ డ్రాప్ అవుట్స్ పరిస్థితిపై తెలంగాణ విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి బీబీసీతో మాట్లాడుతూ- తెలంగాణలో గురుకులాల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత డ్రాప్ అవుట్స్ చాలా వరకు తగ్గిపోయారని ఆమె చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం తెలంగాణలో 13.74 శాతం డ్రాపవట్స్ ఉన్నారు కదా అని బీబీసీ అడగ్గా- కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటాను తీసుకుని విద్యాశాఖ అధికారులతో సమీక్షించుకుంటామని ఆమె సమాధానమిచ్చారు.

ఇదే విషయమై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్‌ స్పందన కోసం బీబీసీ ప్రయత్నించగా, ఆయన నుంచి స్పందన రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)