కేరళ క్రైస్తవులు అంత్యక్రియల్లో ఫొటోలు ఎందుకు తీయించుకుంటారు?

అంత్యక్రియలు

ఫొటో సోర్స్, EXECUTIVE EVENTS

    • రచయిత, మెరిల్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"మృతదేహాన్ని మార్చురీ నుంచి ఇంటికి తీసుకెళ్లిన క్షణం నుంచి మేం ఫోటోలు తీయడం ప్రారంభిస్తాం" అంటున్నాడు బిట్టు.

ఈయన కేరళ రాష్ట్రంలో దాదాపు 20 సంవత్సరాలుగా ఫోటో స్టూడియోను నడుపుతున్నాడు.

ఒక వ్యక్తి జీవితంలో ముఖ్యమైన సంఘటనలను తన కెమెరాలో నిక్షిప్తం చేయడమే ఆయన పని. వాటిలో బాప్టిజం, నిశ్చితార్థాలు, వివాహాల నుంచి అంత్యక్రియలూ ఉంటాయి.

బిట్టు ఈ వారంలోనే కొట్టాయం జిల్లాలో కనీసం మూడు క్రైస్తవ అంత్యక్రియలను ఫోటోలు తీశారు.

"అంత్యక్రియలకు మూడు గంటల ముందే మా పని ప్రారంభమవుతుంది. మేం మృతదేహంతో కుటుంబం, బంధువులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫోటోలు తీయాల్సి ఉంటుంది " అని బిట్టు అన్నారు.

శవపేటికలో మృతదేహం పక్కన గుంపులుగా నిలబడి ఫోటో తీసుకోవడానికి కుటుంబీకులు, స్నేహితులు, బంధువులు వరుసలో ఉంటారు.

కొందరు ఏడుస్తారు, మరికొందరు గంభీరంగా కనిపిస్తారు. బిట్టు ఈ క్షణాలను జాగ్రత్తగా ఫోటో ఆల్బమ్‌గా రూపొందిస్తారు. అది దుఃఖంలో ఉన్న కుటుంబానికి జ్ఞాపకం అవుతుంది.

అంత్యక్రియల్లో ఫోటోగ్రఫీ

ఫొటో సోర్స్, EXECUTIVE EVENTS

ఇంటి నుంచి స్మశానం వరకు ఒక విస్తృతమైన వీడ్కోలు

కేరళ జనాభా దాదాపు 3.3 కోట్లు. జనాభాలో 18 శాతం ఉన్న క్రైస్తవులకు ఈ సంప్రదాయం ప్రత్యేకమైనదని నిపుణులు అంటున్నారు.

"క్రైస్తవునికి మరణం పూర్తిగా విచారకరం కాదు" అని కేరళలోని సైరో-మలబార్ క్యాథలిక్ చర్చి మతాధికారి ఫాదర్ మాథ్యూ కిలుక్కన్ చెప్పారు.

మతవిశ్వాసాల ప్రకారం మరణం అనేది స్వర్గాన్ని చేరుకొనేందుకు చేసే ప్రయాణానికి ప్రారంభం లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే గత ఏడాది పతనంతిట్ట జిల్లాలో ఒక క్రైస్తవ కుటుంబం వారి తల్లి శవపేటిక పక్కన చిరునవ్వుతో దిగిన ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. దానిపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తే, మరికొందరు సమర్థించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

నాటి ఘటనపై కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్‌కుట్టి ఆ కుటుంబానికి మద్దతుగా నిలిచారు. "ఆనందంగా జీవించిన వారికి చిరునవ్వుతో వీడ్కోలు ఇవ్వడం కంటే సంతోషం ఏముంది?" అని ఆయన ఫేస్‌బుక్‌లో రాశారు.

అంత్యక్రియలను వీడియో లేదా ఫొటోలు తీయడం ఇతర కార్యక్రమాల మాదిరే ఉంటుందని ఎర్నాకుళం జిల్లాలోని ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజు కన్నంపూఝ చెప్పారు.

కేరళలో హిందువులు, ముస్లింలు మాత్రం చాలా అరుదుగానే ఇలా చేస్తాయని ఆయన చెప్పారు.

"ఇంట్లో ప్రార్థనల నుంచి చర్చి వైపు ఊరేగింపు, శ్మశాన ప్రాంగణంలోని ప్రార్థనా మందిరం వద్ద ఆచారాల వరకు క్రైస్తవ వేడుక అనేది ఒక విస్తృతమైన వీడ్కోలు'' అని కన్నంపూఝ తెలిపారు.

క్రైస్తవుల అంత్యక్రియలు

ఫొటో సోర్స్, EXECUTIVE EVENTS

ఈ ఫొటో సంస్కృతి ఎప్పుడు వచ్చింది?

క్రైస్తవుల అంత్యక్రియలను చిత్రీకరించే ఆచారం ఎప్పుడు ప్రారంభమైందో గుర్తించడం చాలా కష్టమని సైరో-మలబార్ క్యాథలిక్ చర్చి మతాధికారి, ఫాదర్ మాథ్యూ కిలుక్కన్ అంటున్నారు.

"ఫొటోగ్రఫీ ప్రారంభమైనప్పుడు చాలా ఖరీదైనది. ఇప్పటిలా అందరికీ అందుబాటులో లేదు. ఫొటోగ్రఫీ సాధారణ వ్యక్తి జీవితంలో కలిసిపోయినపుడు ఈ ఆచారాలలో అది కూడా భాగమైంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

అంత్యక్రియలను కవర్ చేయడానికి ఐదు నుంచి 12 గంటలు పట్టవచ్చు.

"కొన్నిసార్లు మేం మా పనిని అంత్యక్రియలకు ముందు రాత్రి ప్రారంభిస్తాం. సమాజంలోని ప్రముఖ వ్యక్తులు, ఒక బిషప్ లేదా సినీ నటులు మరణించినప్పుడు నివాళులర్పించడానికి చేరుకునే వీఐపీల రాకను కూడా మేం డాక్యుమెంట్ చేస్తాం" అని బిట్టు అంటున్నాడు.

బిట్టు మొదట ప్రారంభించినప్పుడు తన ఫొటోల్లో మరింత స్థిరత్వం ఉందన్నారు.

మరణించిన వ్యక్తి క్లోజ్-అప్ షాట్‌లు, శవపేటిక పక్కన కూర్చున్న బంధువుల ఫొటోలు, వీడ్కోలు పలికిన కుటుంబం ఫోటోలు, వారు చేసిన ఆచారాల గురించి బిట్టు చెప్పారు.

వెడ్డింగ్ ఫొటోగ్రఫీ మాదిరి అంత్యక్రియల ఫొటోగ్రఫీ శైలి కూడా మార్పు చెందిందని ఆయన చెబుతున్నారు.

"వెడ్డింగ్ ఇండస్ట్రీలో క్యాండిడ్ ఫొటోగ్రఫీ ట్రెండ్ ఇక్కడ కూడా కనిపించింది. కాబట్టి ఇప్పటి ఆలోచన కూడా ఎమోషన్‌ను క్యాప్చర్ చేయడమే" అని ఆయన వివరించారు.

"ఎవరైనా బంధువు పట్టలేనంత దుఃఖంతో కన్నీటిపర్యంతం కావొచ్చు. మరొక వ్యక్తి వారిని ఓదార్చవచ్చు లేదా దగ్గరగా ఉండవచ్చు. మేం ఇప్పుడు ఈ క్షణాలను క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తాం" అని బిట్టు వివరించారు.

ఒకప్పుడు ఆల్బమ్‌లు భద్రపరిచేవారు. ఇపుడు ఫొటోలు వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో రికార్డ్‌గా షేర్ చేస్తున్నారు. కార్యక్రమానికి హాజరుకాలేని వారితో ఆ క్షణాలను పంచుకుంటున్నారు.

కేరళలో అంత్యక్రియలు

ఫొటో సోర్స్, EXECUTIVE EVENTS

ఫొటో క్యాప్షన్, క్రైస్తవుల అంత్యక్రియల్లో ఫోటోలు తీయడం సంప్రదాయంగా మారింది.

అంత్యక్రియల కోసం ప్రత్యేక ప్యాకేజీలు

ఫొటోలను జ్ఞాపకంగా ఉంచుకోవడానికి తనకు క్లయింట్‌లు కూడా ఉన్నారని బిట్టు చెప్పారు. వారి కోసం ఖరీదైన ఈవెంట్ మేనేజర్‌ని నియమించుకుంటూ ఆడంబరాన్ని ప్రదర్శిస్తారని తెలిపారు.

రాష్ట్రంలో విస్తృతంగా జరిగే అంత్యక్రియలు పెరుగుతున్నాయని కన్నంపూఝ అంటున్నారు. కన్నంపూఝ ఏడేళ్ల క్రితం ప్రత్యేక అంత్యక్రియల ప్యాకేజీ (ఇట్స్ యువర్ డే)ని ప్రారంభించారు.

ఇందులో మొబైల్ మార్చురీ, శవపేటిక, పూల ఏర్పాట్లు, లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్, ఫుడ్ క్యాటరింగ్, అంబులెన్స్, ఇంటి వెలుపల పందిరిని ఏర్పాటు చేయడం, ఫొటోగ్రఫీ వంటివి ఉన్నాయి.

ఈ ఫొటోలు తీసుకున్న వ్యక్తులు వాటివైపు తిరిగి చూడరని అంటున్నారు. కానీ ఆ క్షణం ముఖ్యమైనది.

తమ ఫొటో వైరల్ కావడంపై ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరం లేదని పతనంతిట్టా కుటుంబం చెబుతోంది.

వారు తమ మాతృమూర్తితో "నవ్వుతున్న ముఖాలతో" చివరి ఫొటో తీయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వారు ఆమె పట్ల గర్వపడుతున్నారు.

"ఆమెకు మంచి వీడ్కోలు లభించేలా ఆమెతో చివరి ఫొటోను తీసుకోవాలనేది మా సమష్టి నిర్ణయం" అని కుటుంబ సభ్యుడు ఒకరు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)