కేథలిక్ చర్చి ఫాదర్లు ఇక పెళ్లి చేసుకోవచ్చా? బ్రహ్మచర్యంపై పోప్ ఫ్రాన్సిస్ మాటలు ఏం చెబుతున్నాయి?

కేథలిక్ చర్చి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రోమన్ కేథలిక్ క్రైస్తవుల అతి పెద్ద మత గురువు పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేథలిక్ ఫాదర్లు పెళ్లిళ్లు చేసుకోవచ్చనే భావన స్ఫురించేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ సమాజంలో చర్చకు కారణం అయ్యాయి.

ఆయన మాటలపై అంత చర్చ ఎందుకు, చర్చిలో పాస్టర్లు పెళ్లిళ్లు చేసుకుంటారు కదా, దానికి అనుమతి ఎందుకు అనే విషయాలు అర్థం కావాలి అంటే, ముందు కేథలిక్ చర్చి గురించి అర్థం కావాలి.

కేథలిక్ చర్చి

ఫొటో సోర్స్, Getty Images

ఎవరీ రోమన్ కేథలిక్కులు?

క్రైస్తవుల్లో అనేక శాఖలున్నాయి. అందులో ప్రధానమైనవి కేథలిక్, ప్రొటెస్టెంట్. మళ్లీ ఆ కేథలిక్కుల్లో చాలా రకాలు ఉన్నాయి.

వాటికన్ సిటీలో ఉండే పోప్‌ను ప్రపంచంలో క్రైస్తవుల పెద్దగా గుర్తించి ఆయన అడుగుజాడల్లో నడిచేవారు కేథలిక్కులు. వీరికి చర్చి చాలా పెద్ద వ్యవస్థ. తమ ఊరిలోని చర్చిలో ఉండే ప్రీస్ట్ లేదా ఫాదర్ నుంచి పోప్ వరకూ వారికి హైరార్కీ ఉంటుంది. ఇది వందల ఏళ్ల నుంచి పాటిస్తూ వస్తున్న చర్చి వ్యవస్థ.

దీనికి భిన్నంగా పోప్‌తో సంబంధం లేకుండా సొంత విధానాల్లో చర్చిలు నడిపే వారిని, లేదా ఏదైనా మిషనరీ తరపున చర్చిలు నడిపే వారినీ ప్రొటెస్టెంట్లు అంటారు. ఈ చర్చిల్లో పాస్టర్ల నియామకాలు, కొత్త చర్చిల స్థాపన.. ఇవన్నీ ఎవరికి వారు సొంతంగా నిర్ణయం తీసుకుంటారు. లేదా సంబంధిత మిషనరీ నియమిస్తుంది.

కేథలిక్ చర్చి

ఫొటో సోర్స్, Getty Images

ఎవరైనా ఒక వ్యక్తి, ఏ వయసులో అయినా ఒక ప్రొటెస్టెంట్ చర్చి పెట్టుకోవచ్చు. ఎవరైనా పాస్టర్ కావచ్చు. ఆ పాస్టర్లు పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనవచ్చు.

కొబ్బరికాయలు కొట్టడం, గుండు చేయించుకోవడం, కొవ్వొత్తులు వెలిగించడం, బొట్టు పెట్టుకోవడాన్ని కేథలిక్కులు అంగీకరిస్తారు. ప్రొటెస్టెంట్లు ఒప్పుకోరు.

సంపాదనలో దశమ భాగం దానం ఇవ్వడం ప్రొటెస్టెంట్లలో ఉంటుంది. కేథలిక్కుల్లో ఇది పెద్దగా కనిపించదు.

కేథలిక్ చర్చిలకు ఆదాయాలు వచ్చే ఆస్తులు, ఫాదర్లకు జీతాలూ ఉంటాయి.

కేథలిక్కుల్లో ఒక చర్చి కట్టడం నుంచి, ఫాదర్ నియామకం వరకూ అన్నీ ఒక హైరార్కీ కింద జరుగుతాయి. కేథలిక్కులు ఫాదర్, బ్రదర్ అని పిలిస్తే, ప్రొటెస్టెంట్లు పాస్టర్ అని పిలుస్తారు.

కేథలిక్ చర్చిల్లో బ్రదర్స్, ఫాదర్స్, నన్స్ - వీళ్లు బ్రహ్మచర్యం పాటిస్తారు. వీరు పెళ్లిళ్లు చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదు. వీరి ఎంపిక చాలా కఠినంగా ఉంటుంది. స్కూలు దశలో మొదలుపెట్టి 12 ఏళ్ల శిక్షణ తరువాతే ఎవరైనా కేథలిక్ చర్చిలో ఫాదర్ లేదా ప్రీస్ట్ కాగలరు.

‘‘ఒక మనిషి ప్రీస్ట్ అవ్వాలంటే కేథలిక్ చర్చిలో 14 ఏళ్లు గడపాలి. 13-15 ఏళ్ల వయసులో సెమినరి అనే మత పాఠశాలకు పంపుతారు. అక్కడ 14 ఏళ్లు, ఒక్కోసారి 16 ఏళ్లు గడిపిన తర్వాత వాళ్లకు సన్యాసం ఇస్తారు. మధ్యలో మత పెద్దలకు నచ్చకపోయినా, విద్యార్థికి నచ్చకపోయినా వెనక్కు పంపేస్తారు’’అని ఆ ఎంపిక విధానాన్ని వివరించారు విజయవాడకు చెందిన ఒక కేథలిక్.

కేథలిక్ చర్చి

ఫొటో సోర్స్, Getty Images

బ్రహ్మచర్యం - లైంగిక నేరాలు

బ్రహ్మచర్యం వల్లే చాలా మంది కేథలిక్ చర్చిల్లో మత గురువులుగా వెళ్లడం లేదు అనే వాదన ఒకటి ఉంది. మరో ముఖ్యమైన సమస్య- బ్రహ్మచర్యం పాటించలేని కొందరు మత పెద్దలు, కోరికలు తీర్చుకోవడం కోసం దారులు వెతుక్కోవడం, వాటిని దాచుకోవడానికి నేరాలు చేయడం, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యల వరకూ వెళ్లడం.

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక కేథలిక్ చర్చి మత గురువులపై అనేక రకాలైన లైంగిక నేరాలు బయటపడడం, వాటిపై చర్చిలు స్పందించడం... ఇలాంటివి వార్తల్లో తరచూ చూస్తుంటాం.

క్రైస్తవ మత గురువులు బ్రహ్మచర్యం ఎందుకు పాటించాలనే చర్చ ఈ క్రమంలోనే ప్రారంభం అయింది. కేథలిక్ మత పెద్దలు మాత్రం దీన్ని ఒప్పుకోలేదు. అయితే మొదటిసారి ఆ వాదనకు అనుకూలంగా ఏకంగా ఒక పోప్ మాట్లాడడం పెద్ద విషయం.

పోప్ ఫ్రాన్సిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రహ్మచర్యంపై పోప్ ఫ్రాన్సిస్ వ్యాఖ్యలు కేథలిక్ క్రైస్తవుల్లో పెద్ద చర్చకు దారితీశాయి.

పోప్ ఫ్రాన్సిస్ ఏమన్నారు?

‘‘బ్రహ్మచర్యం అనేది పవిత్రమైనది కాకపోవచ్చు’’ అని స్వయంగా పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.

‘‘మత గురువులకు బ్రహ్మచర్యం దేవుడు ఇచ్చిన వరం. అయితే ఇది తాత్కాలికమైనది, ఎక్కువగా పశ్చిమ దేశాల చర్చిల్లో జరిగేది. మత గురువు వివాహం చేసుకోకూడదని ఎక్కడా లేదు. పశ్చిమ దేశాల చర్చిల్లో ఇది కేవలం తాత్కాలిక నిబంధనే అన్నారు’’ పోప్.

తాను బాధ్యతలు స్వీకరించి పదేళ్లు అయిన సందర్భంగా, అర్జెంటీనా‌కు చెందిన మీడియా సంస్థ ఇన్ఫోబేకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా కేథలిక్ చర్చిల్లో మత గురువు హోదా ఇవ్వడం అత్యంత పవిత్ర కార్యక్రమం. దానినే ప్రీస్ట్లీ ఆర్డినేషన్ అంటారు.

‘‘ఈ బ్రహ్మచర్యం అనేది ఆర్డినేషన్ లాగా శాశ్వతమైనది కాదు’’ అని అన్నారు పోప్. (మత గురువు హోదా శాశ్వతమైనది, కానీ బ్రహ్మచర్యం శాశ్వతమైనది కాదు అనే ఉద్దేశం.)

ఆ బ్రహ్మచర్య నిబంధన సవరిస్తారా అని అడిగినప్పుడు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. ‘‘అవును. అవును. ఈస్టర్న్ చర్చిలో ఎక్కువ మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆర్డినేషన్‌కు ముందే వారు బ్రహ్మచారిగా ఉంటారా? పెళ్లి చేసుకుంటారా? అనే ఛాయిస్ తీసుకునే అవకాశం ఉంది’’ అన్నారు పోప్.

ఇప్పటికే పెళ్లి అయి పిల్లలు ఉన్న కేథలిక్ మత గురువులు ఉన్నారని ఆయన చెప్పారు. బ్రహ్మచర్యం కేవలం క్రమశిక్షణ మాత్రమే అని ఆయన అన్నారు.

కేథలిక్ చర్చి

ఫొటో సోర్స్, Getty Images

బ్రహ్మచర్యం నిబంధన సవరించే అవకాశం ఉందా అన్నప్పుడు స్వయంగా పోప్ దానికి అనుకూలంగా మాట్లాడడంతో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజంలో అదొక పెద్ద చర్చకు దారి తీసింది.

అటు ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు చర్చిల్లో కొన్ని సరళమైన నిబంధనలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఈస్టర్న్ రైట్ కేథలిక్ చర్చి మతాధికారులకు ఎక్కువ స్వేచ్ఛ ఉంది. తాజాగా జర్మన్ కేథలిక్ చర్చి ఈ బ్రహ్మచర్యం గురించి బహిరంగంగా మాట్లాడడం ప్రారంభించింది.

జర్మనీలో పలువురు కేథలిక్ మత పెద్దలు దీని గురించి మాట్లాడారు.

‘‘బ్రహ్మచారులు, పెళ్లైన వారు.. రెండు రకాల మతాధికారులు ఉంటే బావుంటుంది. శృంగార జీవితం మానవ లక్షణాల్లో ఒకటి. పెళ్లి కేవలం శృంగారం కోసం మాత్రమే కాదు‘‘ అని 2022లో వ్యాఖ్యానించారు మ్యూనిక్ ఆర్చి బిషప్‌గా ఉన్న కార్డినల్ రీన్హార్డ్ మార్క్స్.

మత పెద్ద కావాలంటే బ్రహ్మచారిగా ఉండాలన్న నిబంధన తీసేయాలంటూ జర్మన్ కేథలిక్ చర్చి పోప్‌కు విజ్ఞప్తి కూడా చేసింది.

వీడియో క్యాప్షన్, గుణదల: మేరీ మాతకు భక్తులు తలనీలాలు అర్పించే చర్చి ఇది

అంత తేలిక కాదు!

ఈ నిబంధనను తీసేయడం అంత తేలిక కాదు. గతంలో ఇటువంటి డిమాండ్ వచ్చినప్పుడు స్వయంగా ఇదే పోప్ వ్యతిరేకించారు. 2019లో ఆయన దీన్ని వ్యతిరేకించారు. అప్పట్లో చాలా చోట్ల చర్చిల్లో ఫాదర్ల కొరత వచ్చింది. దీంతో బ్రహ్మచర్యం రూల్ తీసేస్తే చాలా మంది ఫాదర్లు అవుతారని, ఆ రూల్ తీసేయాలని డిమాండ్ చేశారు.

కానీ దానికి పోప్ ఒప్పుకోలేదు. ‘‘బ్రహ్మచర్యం ఒక బహుమానం అనీ, అది స్వచ్ఛందంగా పాటించే ఆప్షన్‌గా ఇవ్వటానికి ఒప్పుకోలేను’’అని ఆయన అన్నారు.

86 ఏళ్ల పోప్ ఇప్పుడు తన వైఖరి మార్చుకున్నట్టు కనిపిస్తోంది.

కానీ క్షేత్ర స్థాయిలో అమలు అంత తేలిక కాదు అంటున్నారు పలువురు కేథలిక్కులు. కేథలిక్కు చర్చిల్లో ఫాదర్లు, ప్రీస్టులకు చర్చి ఇచ్చే జీతాలే ఆధారం. వారు దశమ భాగాలు తీసుకోరు. కానీ సొంత కుటుంబం ఏర్పడితే అప్పుడు కేథలిక్ చర్చిలోకి లేనిపోని జాడ్యాలు వస్తాయనే ఆందోళనను పలువురు కేథలిక్కులు వ్యక్తంచేస్తున్నారు.

‘‘దానికి జనం అంత తేలిగ్గా ఒప్పుకోరు. ఆ చర్చిలకు వెళ్లే వారు తమ ఫాదర్ ఇలానే ఉండాలి అని అనుకుంటారు. అదొక్కటే కాదు.. ఫాదర్లకు పెళ్లిళ్లు అయ్యి సొంత కుటుంబాలు వస్తే, ఇప్పుడు ఆ చర్చిలకు ఉన్న వేల కోట్ల ఆస్తులు, ఫాదర్ల కుటుంబాలకు వెళ్లిపోతాయి’’ అని ఒక కేథలిక్ అనుమానం వ్యక్తంచేశారు.

‘‘మహిళలతో సంబంధాల ఆరోపణలు వచ్చిన వారిని చర్చీలు దూరంగా బదిలీ చేస్తుంటాయి. కానీ కొన్నిసార్లు అవి బయటపడతాయన్న భయంతో ఆత్మహత్య చేసుకున్న వారూ ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రీస్ట్ లేదా ఫాదర్ అంటే వచ్చే హోదా, జీతం చూసి వచ్చే వాళ్లు, ఒకసారి అందులోకి దిగిన తరువాత, నిష్టగా ఉండలేక చాలా ఇబ్బంది పడతారు. అక్కడ నుంచి మొదలవుతాయి సమస్యలు’’ అని విజయవాడకు చెందిన కేథలిక్ అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, హైదరాబాద్: కాథలిక్ చర్చికి కార్డినల్‌గా ఎంపికైన తొలి దళితుడు పూల ఆంథోని

బ్రహ్మచర్యం ఆస్తుల సంరక్షణకేనా?

ఆస్తుల సంరక్షణే చర్చి ఫాదర్ల బ్రహ్మచర్యం రూల్ పుట్టడానికి కారణమని వాదించే వారూ ఉన్నారు. క్రైస్తవంలో బ్రహ్మచర్యానికి మత పరమైన ప్రాధాన్యం ఉన్నప్పటికీ, దీనిని తప్పనిసరి నిబంధన చేయడానికి ఆస్తులే ప్రధాన కారణమని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.

బ్రహ్మచర్యం కచ్చితమైన నిబంధనగా మారి సుమారు వెయ్యేళ్లు అయ్యింది. 12వ శతాబ్దంలో ఈ నిబంధన వచ్చినట్టు ఎక్కువ మంది చరిత్రకారుల అభిప్రాయం. ముఖ్యంగా చర్చి ఆస్తులను కాపాడుకోవడం కోసం ఈ నిబంధన విధించారని చెబుతారు.

చర్చి ఫాదర్‌‌కు కుటుంబం ఉండకపోతే సహజంగానే, ఆస్తులు చర్చికే ఉండిపోతాయి అనేది దీని మూలం సూత్రం అని వారు అంటారు.

‘‘ఒక రకంగా ఈ బ్రహ్మచర్యం రూల్ ఉంది కాబట్టే కాథలిక్ చర్చిల ఆస్తులు ఉండిపోయాయి. లేకపోతే మా ప్రొటెస్టెంట్ చర్చిల్లో కొందరు పాస్టర్లు అమ్ముకున్నట్టు చర్చి ఆస్తులు అమ్మేసుకునేవారు’’ అని విశాఖపట్నానికి చెందిన ఒక ప్రొటెస్టెంట్ చర్చి చరిత్రకారుడు వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)