తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?

తెలంగాణ గిరిజనులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఎ.కిశోర్‌బాబు
    • హోదా, బీబీసీ కోసం

మారుమూల అట‌వీ ప్రాంతాల్లో క‌రెంటు, ర‌హ‌దారి స‌దుపాయం కూడా లేనిచోట బ‌తికే ఒక ఆదివాసీ యువకుడు లేదా యువతి పారిశ్రామికవేత్త‌గా మారాలంటే అంత సుల‌భ‌మా?

అలాంటి గిరిజనులు ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) గ‌డ‌ప తొక్క‌డమంటే మాట‌లా?

కొన్నిసార్లు ఇది ఊహించ‌డం కూడా క‌ష్ట‌మే. కానీ ఇలాంటి ఆదివాసీల‌ను ఐఎస్‌బీ లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క సంస్థ‌కు తీసుకొచ్చి అక్క‌డ వారికి వ్యాపార పాఠాలు నేర్పి, వారిని యువ పారిశ్రామికవేత్త‌లుగా, వ్యాపార వేత్త‌లుగా ఎదిగేలా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక ప్ర‌త్యేక ప‌థ‌కం అమ‌లు చేస్తోంది.

దానిపేరే సీఎం ఎస్‌టీ ఎంట్రపెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ (సీఎంఎస్‌టీఈఐ).

గిరిజ‌న యువ‌త పారిశ్రామికవేత్త‌లుగా, వ్యాపార‌వేత్త‌లుగా ఎద‌గ‌డానికి బాట‌లు వేస్తూ అమ‌లు చేస్తున్న ప‌థ‌కం ఇది.

ఈ ప‌థ‌కం ద్వారా తెలంగాణ ప్ర‌భుత్వం ఏటా 100 మంది గిరిజ‌న యువ‌తీ యువ‌కుల‌ను ఔత్సాహిక పారిశ్రామికవేత్త‌లు, వ్యాపార‌వేత్త‌లుగా త‌యారు చేస్తోంది.

వారికి ఐఎస్‌బీలో ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వ‌డ‌మే కాకుండా, వారు ప‌రిశ్ర‌మ‌, వ్యాపారం ప్రారంభించ‌డానికి వీలుగా పెట్టుబ‌డిలో రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు రాయితీపై ప్ర‌త్యేక రుణ స‌దుపాయం కూడా క‌ల్పిస్తోంది.

ఈ సీఎం ఎస్‌టీ ఎంట్రపెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ (సీఎంఎస్‌టీఈఐ) అంటే ఏమిటి? దీనికి ఎంపిక‌ అవ‌డానికి గిరిజ‌నుల‌కు ఉండాల్సిన అర్హ‌త‌లేమిటి? త‌దిత‌ర వివ‌రాల‌న్నీ తెలుసుకుందాం.

తెలంగాణ గిరిజనులు

ఏమిటి సీఎంఎస్‌టీఈఐ?

తెలంగాణ‌లో గిరిజ‌నుల సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. 2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం మొత్తం తెలంగాణ జ‌నాభాలో గిరిజ‌నం 9.34 శాతం ఉన్నారు.

గోండులు, చెంచులు, కోలం, చెంచు, లంబాడి, కొండ‌రెడ్డి, ఎరుక‌ల త‌దిర గిరిజ‌న ఉప తెగ‌ల ప్ర‌జ‌లు ఈ రాష్ట్రంలోని అట‌వీ ప్రాంతాల్లో జీవిస్తున్నారు

ఈ గిరిజ‌నుల్లోని యువ‌తీ యువ‌కుల‌కు ప్రోత్సాహం అందించి వారిని వ్యాపార‌వేత్త‌లుగా ఎదిగేలా చేయ‌డానికి ఉద్దేశించిన ప‌థ‌కం ఇది. 2018వ‌ సంవ‌త్స‌రంలో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించారు.

తెలంగాణ గిరిజ‌న సంక్షేమ శాఖలోని గిరిజ‌న ఆర్థిక స‌హ‌కార సంస్థ ఈ ప‌థ‌కాన్ని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సౌజ‌న్యంతో నిర్వ‌హిస్తోంది.

తెలంగాణ గిరిజనులు

ఫొటో సోర్స్, Getty Images

ప‌రిశ్ర‌మ పెట్ట‌డానికి ఆర్థిక స‌హాయం ఎలా చేస్తారు?

ఈ ప‌థ‌కం కింద ఎంపికైన గిరిజ‌న యువ‌తీ యువ‌కులు ముందుగా తాము నెల‌కొల్పే ప‌రిశ్ర‌మ లేదా వ్యాపారానికి సంబంధించి పెట్టుబ‌డి వ్యయంలో 10శాతం అభ్య‌ర్థే భ‌రించాలి.

మిగిలిన 90 శాతం పెట్టుబ‌డి బ్యాంకుల నుంచి రుణాలుగా అంద‌జేస్తారు

అందులో 35 శాతం వ‌ర‌కు లేదా అత్య‌ధికంగా రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణంలో రాయితీని ప్ర‌భుత్వం క‌ల్పిస్తుంది.

ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్ర‌భుత్వం నిర్దేశించిన షెడ్యూల్డు ఏరియాల్లో నెల‌కొల్పితే అదనంగా మ‌రో 5 శాతం రాయితీ క‌ల్పిస్తారు.

మ‌హిళ‌ల‌కైతే 45 శాతం రాయితీ క‌ల్పిస్తారు.

ఉదాహ‌ర‌ణ‌కు మీరు స్థాపించ‌బోయే వ్యాపారం లేదా ప‌రిశ్ర‌మ యూనిట్ పెట్టుబ‌డి వ్య‌యం రూ.కోటి అవుతుంద‌నుకోండి.

అందులో దాదాపు రూ.35 ల‌క్ష‌ల నుంచి రూ.50 ల‌క్ష‌ల దాకా రాయితీ వ‌స్తుంది.

మీరు ఒక ప‌ది శాతం అంటే 10 లక్ష‌ల రూపాయ‌ల పెట్టుబడి పెడితే చాలు.

మిగిలిన సొమ్ము బ్యాంకులు రుణాల రూపంలో అంద‌జేస్తాయి.

35 శాతం రాయితీ అనుకున్నా దాదాపు రూ.35 ల‌క్ష‌ల రూపాయిలు మీరు ఉచితంగా పొందిన‌ట్లే.

తెలంగాణ గిరిజనులు

ఫొటో సోర్స్, Getty Images

ఎలాంటి అర్హ‌త‌లుండాలి?

అభ్యర్థుల వ‌య‌సు 21 నుంచి 40 సంవ‌త్స‌రాల‌లోపు ఉండాలి.

క‌నీసం డిగ్రీ చ‌దివి ఉండాలి. ఉన్నత విద్యా వంతులు కూడా అర్హులే.

సాంకేతిక విద్య‌లో ఉన్నత విద్య చ‌దివిన వారికి ప్రాధాన్యం ఉంటుంది

సృజ‌నాత్మ‌క ఆలోచ‌న‌లు, కొత్త కొత్త వ్యాపార ఆలోచ‌న‌లు ఉన్న‌వారికి ప్రాధాన్యం ఇస్తారు.

స్టార్ట‌ప్‌లు పెట్టుకోవాలని అనుకొనేవారినీ ప్రోత్స‌హిస్తారు.

అభ్య‌ర్థికి తాను స్థాపించ‌ద‌ల‌చుకున్న వ్యాపార రంగంలో క‌నీసం రెండు సంవ‌త్స‌రాల అనుభ‌వం ఉండాలి.

ఏ ప‌రిశ్ర‌మ‌లు పెట్టుకోవ‌చ్చు?

ప్ర‌ధానంగా 14 ర‌కాల రంగాల్లో గిరిజ‌న యువ‌త‌కు వ్యాపార అవ‌కాశాలు స‌మృద్ధిగా ఉన్నాయ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం గుర్తించింది. అవి ఏమిటంటే..

  • లైఫ్ సైన్సెస్: ఔషధాలు, వ్యాక్సీన్ల తయారీ, వైద్య పరికరాల తయారీ..
  • ఐటీ హార్డ్‌వేర్: బయోమెడికల్ డివైజెస్, ఎలక్ట్రానిక్, సెల్యులార్ కమూనికేషన్, ఎఫ్ఏబీ..
  • ప్రిసెషన్ ఇంజినీరింగ్, ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్
  • ఫుడ్ ప్రాసెసింగ్, న్యూట్రిషన్ ప్రాడెక్ట్స్, డెయిరీ, పౌల్ట్రీ, మాంసం ఉత్పత్తి, చేపల పెంపకం
  • ఆటోమొబైల్స్, ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్, ఆటో-కాంపొనెంట్స్, ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు
  • టెక్స్‌టైల్స్, లెదర్ పరిశ్రమలు
  • ప్లాస్టిక్స్, పాలీమర్స్, రసాయనాలు, పెట్రో-కెమికల్స్, గ్లాస్, సెరామిక్స్
  • ఎఫ్ఎంసీజీ, గృహోపకరణాలు
  • బంగారు ఆభరణాలు
  • ఇంజినీరింగ్, క్యాపిటల్ గూడ్స్
  • వ్యర్థాల నిర్వహణ, గ్రీన్ టెక్నాలజీ
  • పునరుత్పాదక ఇంధనం, సౌర పార్కులు
  • ఖనిజ, కలప పరిశ్రమలు
  • రవాణా, లాజిస్టిక్స్ హబ్స్

ఇవే కాకుండా అభ్య‌ర్థి ఆస‌క్తి, వ్యాపార ఆలోచ‌న‌లను బ‌ట్టి వారు నెల‌కొల్పానుకున్న ప‌రిశ్ర‌మ లేదా వ్యాపార సంస్థ ఏర్పాటు చేసుకోవ‌డానికి రుణం ఇస్తారు.

చిన్న, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, ఎంఎస్ ఎంఈలు స్టార్ట‌ప్‌లు పెట్ట‌ద‌ల‌చుకున్న వారికి కూడా ప్రోత్సాహ‌మిస్తారు.

తెలంగాణ గిరిజనులు

ఫొటో సోర్స్, Getty Images

ఎంపిక ఎలా?

ఏటా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంలోని గిరిజ‌న సంక్షేమ శాఖ ఈ ప‌థ‌కం కింద ల‌బ్ధిదారుల ఎంపిక కోసం నోటిఫికేష‌న్ జారీ చేస్తుంది.

ఆస‌క్తిగల అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

రాత ప‌రీక్ష ఉంటుందా?

ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

ఇందులో ఆప్టిట్యూడ్‌, ఎస్సే రైటింగ్ త‌ర‌హా ప‌రీక్ష‌లుంటాయి.

డాక్ట‌ర్ బీఆర్‌ అంబేడ్కర్ సార్వ‌త్రిక విశ్వ విద్యాల‌యం దీన్ని నిర్వ‌హిస్తుంది.

ఈ ప‌రీక్ష‌ల నుంచీ 200 మంది అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు

రాత ప‌రీక్ష‌లో క‌నీసం ఎన్ని మార్కులు సాధించాలి?

అంబేడ్కర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ నిర్వ‌హించే ప‌రీక్ష‌ల్లో అభ్య‌ర్థులు క‌నీసం 50 శాతానికి త‌క్కువ కాకుండా మార్కులు సాధించాలి.

అంత‌కంటే త‌క్కువ మార్కులు సాధించిన వారి ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీల‌న‌లోకి తీసుకోరు.

వీడియో క్యాప్షన్, వేసవిలో చల్లని నీటిని అందించే ‘రంజన్లను’ పేదవాడి ఫ్రిడ్జ్ గా ఆదిలాబాద్‌లో పిలుస్తారు.

ఎంత‌ మందిని ఎంపిక చేస్తారు?

ఒక ఏడాదికి కేవ‌లం వంద మందిని మాత్ర‌మే ఈ ప‌థ‌కానికి ఎంపిక చేస్తారు.

రాత ప‌రీక్ష ద్వారా ఎంపికైన 200 మంది అభ్య‌ర్థుల‌కు మ‌ళ్లీ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తారు

ఇందులో అభ్య‌ర్థికి వ్యాపారం ప‌ట్ల ఆస‌క్తి ఉన్న‌దా లేదా, అభ్య‌ర్థి యాటిట్యూడ్‌, ఆలోచ‌నా విధానాలు, ప్ర‌తిభాపాఠ‌వాలు, నైపుణ్యాలు త‌దిత‌ర అంశాల‌ను బేరీజు వేసుకుని ఈ ఎంపిక జ‌రుగుతుంది.

ఇంట‌ర్వ్యూ త‌రువాత ఈ 200 మంది అభ్య‌ర్థుల నుంచీ వంద మందిని వడ‌పోస్తారు.

ఐఎస్‌బీ శిక్ష‌ణ ఇస్తారా?

చివ‌ర‌గా ప‌థ‌కం కోసం ఎంపికైన 100 మందికి ప్ర‌తిష్ఠాత్మ‌క ఇండియ‌న్ స్కూలు ఆఫ్ బిజినెస్‌లో శిక్ష‌ణ ఇస్తారు.

ఈ శిక్ష‌ణ 45 రోజుల పాటు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో నిర్వ‌హిస్తారు.

ఐఎస్‌బీలో శిక్ష‌ణ కాలంలో అభ్య‌ర్థుల‌కు ఉచిత వ‌స‌తి క‌ల్పిస్తారు.

చివ‌ర‌గా ఎంపికైన 100 మంది అభ్య‌ర్థుల‌కు ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో 45 రోజులు పాటు ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇస్తారు.

ఈ వంద మందిని రెండు బృందాలుగా వేరుచేసి విడివిడిగా శిక్ష‌ణ ఇస్తారు.

అభ్య‌ర్థులకు వ్యాపార పాఠాల‌ను, నైపుణ్యాల‌ను బోధిస్తారు.

విజ‌య‌వంత‌మైన ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపార సంస్థ‌ల‌కు క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌నకు తీసుకెళ‌తారు.

వీడియో క్యాప్షన్, ‘‘కలెక్టర్ కుర్చీలో కూర్చోగానే... ఆ స్థానం నాదే అనిపించింది’’ - ఒక్క రోజు కలెక్టర్ శ్రావణి

శిక్ష‌ణ పూర్త‌య్యాక ఏం చేస్తారు?

ఒక‌సారి ఐఎస్‌బీ శిక్ష‌ణ పూర్త‌య్యాక అభ్య‌ర్థులు తాము నెల‌కొల్ప‌ద‌ల‌చిన వ్యాపారానికి సంబంధించి అవ‌స‌ర‌మైన రుణ స‌దుపాయం క‌ల్పిస్తారు.

ఆ వ్యాపారం సంస్థ విజ‌య‌వంతంగా నెల‌కొల్ప‌డానికి అవ‌స‌ర‌మైన స‌హ‌కారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం, తెలంగాణ గిరిజ‌న సంక్షేమ శాక అంద‌జేస్తుంది.

సిబిల్ స్కోరు ఎంత ఉండాలి?

రుణాలు పొందాలంటే అభ్య‌ర్థుల క్రెడిట్ స్కోరు మంచిగా ఉండాలి.

అప్పుడే వారు ఎలాంటి ఆటంకాలు లేకుండా సుల‌భంగా రుణాలు పొంద‌గ‌లుగుతారు.

కుటుంబంలో ఎంత‌మందికి రుణం ఇస్తారు?

ఒక కుటుంబం నుంచి ఒక్క‌రికి మాత్రమే ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది.

ఇప్ప‌టికే కుటుంబంలో ఎవ‌రైనా ఈ ప‌థ‌కం పొందుతుంటే మిగిలిన వారికి దీనికి అర్హులు కారు.

ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఏమేమి ధ్రువ‌ప‌త్రాలు కావాలి?

  • ఆధార్ కార్డు
  • విద్యార్హ‌త‌లు తెలియ‌జేసే స‌ర్టిఫికెట్లు
  • పుట్టిన తేదీ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం లేదా ఎస్‌ఎస్‌సీ స‌ర్టిఫికెట్‌
  • మండ‌ల రెవెన్యూ అధికారి లేదా జిల్లా క‌లెక్ట‌ర్ జారీ చేసిన కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం
  • నివాస ధ్రువీకరణ పత్రం
  • పాన్ కార్డు

ఎంపిక ప‌రీక్ష ఏ విధంగా ఉంటుంది?

పేపర్-1 - ఆబ్జెక్టివ్ పరీక్ష

ఇందులో రెండు భాగాలుంటాయి. ప‌రీక్షా స‌మ‌యం ఒక గంట‌

యూనిట్-1 : వెర్బల్ ఎబిలిటీ – బేసిక్ ఇంగ్లిష్, గ్రామర్

యూనిట్-2 : జనరల్ అవేర్‌నెస్, జనరల్ నాలెడ్జ్

పేపర్-2 : ఎస్సే

ఇందులో మూడు భాగాలుంటాయి. ప‌రీక్షా స‌మ‌యం రెండు గంట‌లు

యూనిట్-3 : బేసిక్ ఫైనాన్స్

యూనిట్-4 : బేసిక్ ఎకనామిక్స్

యూనిట్-5 : ఎంట్రపెన్యూర్‌షిప్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)