సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
సెమాగ్లుటైడ్.. బరువు తగ్గడానికి వాడే ఇంజెక్షన్ ఇది.
దీన్ని వాడుతున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ ధృవీకరించారు. ఈ డ్రగ్ వాడకం
హాలీవుడ్‌లో దీనిని వాడుతున్నారని అమెరికా మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి.
అమెరికాలో పెరుగుతున్న జనాదరణ కారణంగా ఫార్మసీల వద్ద ఈ ఇంజెక్షన్ కొరతకు దారితీస్తోంది.
సెమాగ్లుటైడ్ అని పిలిచే ఈ ఔషధాన్ని వెగోవి, ఓజెంపిక్, రైబెల్సస్ అనే వాణిజ్య పేర్లతో విక్రయిస్తున్నారు. దీనిని టైప్ 2 మధుమేహం చికిత్సకు, స్థూలకాయం తగ్గించే మెడిసిన్‌గా ఉపయోగిస్తున్నారు.
ఇప్పుడు బ్రిటన్‌లో నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్)లో ఉపయోగించడానికి ఈ మెడిసిన్‌కు ఆమోదం లభించింది.
ఈ ఇంజెక్షన్ చర్మం కింద వేస్తారు. ఇది ఆహారం తక్కువగా తినేలా నియంత్రిస్తుంది .

ఫొటో సోర్స్, Getty Images
వైద్య నిపుణులు ఏమంటున్నారు?
అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA), బ్రిటన్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్‌కేర్ (ఎన్ఐసీఈ) నిపుణులు ఈ డ్రగ్ సురక్షితమని, బరువు తగ్గించే ప్రక్రియలో ప్రభావవంతమైనదని అంటున్నారు.
అధిక ఒత్తిడి, టైప్ 2 డయాబెటిస్ లాంటి సమస్యలున్న వారికి ఇది పనిచేస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని వాడే పక్షంలో శారీరక వ్యాయామాలు, తక్కువ కేలరీలు ఉండే ఆహారం తప్పనిసరని స్పష్టం చేస్తున్నారు.
పోషకాహారం, జీవనశైలిలో తగిన మార్పులు చేసుకుంటే సెమాగ్లుటైడ్ 10 శాతానికి పైగా బరువును తగ్గించగలదని ఎన్ఐసీఈ చెబుతోంది.
పెప్టైడ్-1 అనే గట్ హార్మోన్ తరహాలో సెమాగ్లుటైడ్ ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది.
సాధారణంగా తిన్న తర్వాత ఈ హార్మోన్ విడుదలవుతుంది. ఇది కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఇది తీసుకొనే కేలరీలను తగ్గించేందుకు దోహదం చేస్తుంది.
స్పెషలిస్టులు సిఫార్సు చేస్తే తప్ప ఈ ఇంజెక్షన్ వాడకూడదు. అంతేకాకుండా ఈ డ్రగ్ దాదాపు రెండేళ్లు వాడాలి.
ఈ ఔషధానికి ప్రజాదరణ చాలా ఎక్కువగా ఉంది. అమెరికాలో దీనికి బాగా కొరత ఏర్పడింది కూడా.
వెరైటీ మ్యాగజైన్‌లో గత సంవత్సరం ప్రచురితమైన ఒక కథనం ప్రకారం ఈ ఔషధాన్ని హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో, వినోద పరిశ్రమలో విరివిగా వాడారు. త్వరగా బరువు తగ్గించుకోవడంలో సంపన్నులకు, అందమైనవారికి బాగా ఉపయోగపడింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మెడిసిన్ వాడటంలో ఎదురవుతున్న సవాళ్లేంటి?
అమెరికాలోని ఇన్సూరెన్స్ కంపెనీలు దీనిపై ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రిస్క్రిప్షన్ డ్రగ్‌గా వాడని వ్యక్తులు, డయాబెటిక్ లేని వ్యక్తులకు ఈ మెడిసిన్ వినియోగానికి అయ్యే ఖర్చును కవర్ చేయడానికి నిరాకరిస్తున్నాయి.
ఈ డ్రగ్ ఖర్చు నెలకు దాదాపు రూ. లక్ష (దాదాపు 1300 డాలర్ల) వరకు ఉంటుంది. అయితే దీనికి జనాదరణ ఎంతగా పెరిగిందంటే అమెరికాలో ఇప్పుడు ఈ డ్రగ్ కొరత ఏర్పడింది. దీంతో ఆరోగ్య సమస్యలతో ఈ ఔషధంపై ఆధారపడే రోగుల్లో ఆందోళన కూడా నెలకొంది.
డ్రగ్ మేకర్ నోవో నార్డిస్క్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లార్స్ జోర్గెన్‌సెన్ ఫిబ్రవరిలో ఎన్‌బీసీ న్యూస్‌తో మాట్లాడుతూ పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచుతున్నామని చెప్పారు. పేషెంట్లు దీన్ని కొనేందుకు ఎదురుచూస్తున్నారని తమకు తెలుసన్నారు.
సెమాగ్లుటైడ్‌ను వైద్యుల ప్రిస్క్రిప్షన్‌పై మాత్రమే ఉపయోగించాలని ఫార్మసిస్టులు హెచ్చరిస్తున్నారు.
అన్ని మెడిసిన్‌ల మాదిరిగానే దీనికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్స్ట్ ఉన్నాయి. ఇది వికారం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు లాంటి దుష్ప్రభావాలు కలిగించే అవకాశం ఉంది.
ఎఫ్‌డీఏ విడుదల చేసిన జాబితాలోని ఇతర దుష్ప్రభావాల్లో తలనొప్పి, అలసట, అజీర్ణం, మైకం, ఉబ్బరం, అపానవాయువు, గ్యాస్ట్రోఎంటరైటిస్, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్నాయి.
థైరాయిడ్ ట్యూమర్స్ వచ్చే ప్రమాదం గురించి కూడా ఆరోగ్య నిపుణులు పేషంట్లను హెచ్చరించాలని ఎఫ్‌డీఏ సూచిస్తోంది.
వ్యక్తిగత లేదా కుటుంబ చరిత్ర ఉన్న రోగుల్లో వెగోవి (సెమాగ్లుటైడ్) ఇంజెక్షన్ మెడల్లరీ థైరాయిడ్ కార్సినోమాను ఉపయోగించరాదని ఎఫ్‌డీఏ చెబుతోంది. అంతేకాకుండా బహుళ ఎండోక్రైన్ నియోప్లాసియా టైప్ 2 సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి ఉన్న రోగులూ దీనిని ఉపయోగించరాదని సూచిస్తోంది.
వేగంగా బరువు తగ్గడం వల్ల చర్మం కొల్లాజెన్, ఎలాస్టిన్‌ను కోల్పోవచ్చు.

ఫొటో సోర్స్, ISTOCK/GETTY IMAGES
ఇంజెక్షన్ వాడిన వ్యక్తులు ఏమంటున్నారు?
ఎవరికి బరువు తగ్గడం సమస్యగా ఉందో, ఎవరికైతే అధిక బరువు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందో వారికి ఈ ఔషధం సానుకూల ప్రత్యామ్నాయం.
36 ఏళ్ల కైలీ వుడ్ తన డాక్టర్ న్యూయార్క్‌లో ఓజెంపిక్ డ్రగ్‌ను సూచించిన తర్వాత, ఏడు నెలల పాటు తీసుకున్నారు.
ఊబకాయం నుంచి ఆరోగ్య స్థితికి చేరుకున్నట్లు, దాదాపు 30 కేజీల బరువు తగ్గినట్లు ఆమె బీబీసీతో చెప్పారు.
"నాకు పీసీవోఎస్, ఇన్సులిన్ నిరోధకత ఉంది. నిజాయతీగా చెప్పాలంటే పిల్లలు పుట్టిన తర్వాత నాకు 30 ఏళ్ల వయసు వచ్చే వరకు నా బరువుతో ఎటువంటి సమస్యలు లేవు" అని కైలీ అంటున్నారు.
“నేను వేగంగా బరువు పెరిగేదాణ్ని. నాకు వ్యక్తిగత వ్యాయామ శిక్షకుడు ఉండేవారు. తెలిసిన ప్రతి ఆహార విధానాన్నీ అనుసరించాను.. కీటో, తక్కువ కార్బ్, అడపాదడపా ఉపవాసం, ఏదీ పని చేయలేదు'' అని ఆమె గుర్తుచేసుకున్నారు.
కైలీ తన వైద్యునితో పరీక్షల కోసం వెళ్లినప్పుడు, ఆమెకు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉందని చెప్పారు. పీసీవోఎస్ కారణంగా ఆమెకు టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉందన్నారు.
"దీర్ఘకాలిక ప్రభావాలు (ఊబకాయం) నన్ను భయపెట్టాయి. ఎందుకంటే నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు" అని ఆమె చెప్పారు.
"నేను నా వంతు కృషి చేయాలనుకున్నా, ఆరోగ్యవంతమైన తల్లి ఎలా ఉంటుందో వారికి చూపించాలనుకుంటున్నా" అని వ్యాఖ్యానించారు.
ఒక టెక్ స్టార్టప్ కోసం పనిచేస్తున్నారు కైలీ. ఆమెకు తన సొంత టిక్‌టాక్ అకౌంట్ ఉంది.
సెమాగ్లుటైడ్‌ను ఉపయోగించాలనుకునే వారు డ్రగ్ దుష్ప్రభావాల గురించి తెలుసుకోవాలని ఆమె అందులో తెలిపారు.
"ఈ మందులను తీసుకోవడం ప్రారంభించినప్పుడు, శరీరం దాదాపు షాక్‌కు గురవుతుంది. తలనొప్పి, వికారం, అలసట వంటివి వస్తాయి. కానీ శరీరం అలవాటు పడటం ప్రారంభిస్తుంది. మార్పులను గమనించాలి" అని ఆమె వివరించారు.
ఈ ఔషధం నిజంగా ప్రజల జీవితాలను మారుస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.
''ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మెడిసిన్''
ఎన్‌ఐసీఈలో మెడిసిన్స్ ఎవాల్యుయేషన్ డైరెక్టర్ హెలెన్ నైట్ మాట్లాడుతూ- "కొంత మందికి బరువు తగ్గడం నిజమైన సవాలు. కాబట్టి సెమాగ్లుటైడ్ వంటి ఔషధం మంచి ఎంపిక" అన్నారు.
బ్రిటన్‌లో ఈ డ్రగ్ అందరికీ అందుబాటులో ఉండదని ఈ నిపుణుడు చెప్పారు.
డాక్టర్ డువాన్ మెల్లర్ ఇంగ్లండ్‌లోని ఆస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో రిజిస్టర్డ్ డైటీషియన్, సీనియర్ లెక్చరర్.
ఆయన మాట్లాడుతూ- "అధిక బరువు లేదా ఊబకాయంతో జీవించాలని ఎవరూ కోరుకోరు. ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకునే వారికి మద్దతు అవసరం. బ్రిటన్‌లో సెమాగ్లుటైడ్ అనేది మరీ బరువు తగ్గించే ప్రోడక్ట్‌గా పరిగణించబోరు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రయోజనం కోసం ఉపయోగించాలి" అని అన్నారు.
ఇవి కూడా చదవండి
- రాహుల్ గాంధీ: ‘‘అదానీ మీద మళ్లీ నేను ఏం మాట్లాడతానోనని మోదీ భయపడ్డారు’’
- ‘కులదురహంకారమే’ కాకినాడలో దళిత యువకుని ప్రాణాలు తీసిందా?
- రాహుల్ గాంధీ: కాంగ్రెస్ నేత ముందున్న మార్గాలు ఏంటి?
- పగలు క్లర్క్... రాత్రి ఆటో డ్రైవర్... ఆదివారం బట్టల వ్యాపారి... ఒక వ్యక్తి మూడు పనులు
- పాకిస్తాన్: అహ్మదీయులు ముస్లింలు కారా... వారి మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయ్...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














