ప్రీమెచ్యూర్ బేబీ: ఐదు నెలలకే పుట్టి.. కష్టాలతో పోరాడి బతికిన గట్టి పిండం

ఫొటో సోర్స్, RACHEL STONEHOUSE
- రచయిత, టింక్ లెవెలిన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కడుపులో బిడ్డ 22 వారాలకు.. అంటే 5 నెలలకే పుడితే బతికే అవకాశాలు 10 శాతం మాత్రమే ఉంటాయి. కానీ, తమ పాప అన్ని అడ్డంకులను దాటుకుని ఎదుగుతోందని తల్లిదండ్రులు చెప్పారు.
ఈ పాపకు ఇమోజెన్ అని పేరు పెట్టారు. బ్రిటన్‌లోని స్వాన్సీలో గత ఏడాది సెప్టెంబర్ 6న
సింగిల్‌టన్ హాస్పిటల్‌లో పుట్టింది. పుట్టినప్పుడు 515 గ్రాముల బరువు ఉంది.
అప్పటి నుంచి ఆస్పత్రిలోని నియో నాటల్ కేర్‌లో చికిత్స అందించారు.
ఎట్టకేలకు, పుట్టిన 132 రోజులకు ఇమోజెన్ ఇంటికి చేరింది. అంటే అప్పటికి పాప వయసు ఆరు నెలలు.
పాప తల్లి రాచెల్ స్టోన్‌హౌస్ (28) ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
"ఒక జీవితకాలంలో మనం ఎదుర్కునే సమస్యల కన్నా ఎక్కువ ఇమోజెన్ ఈ ఆరు నెలల్లో ఎదుర్కొంది. అన్నిటినీ దాటి తారాజువ్వలా దూసుకొచ్చింది" అన్నారామె.
ప్రపంచంలోనే, నెలలు నిండకుండా అతి తక్కువ వయసులో పుట్టిన పాప అమెరికాకు చెందిన కర్టిస్ జై-కీత్ మీన్స్. 21 వారాల ఒక రోజుకు పుట్టింది. ఇమోజెన్ కన్నా 11 రోజులు ముందే బయటికొచ్చింది కర్టిస్.

ఫొటో సోర్స్, RACHEL STONEHOUSE
రాచెల్‌కు నెలలు నిండాకుండానే రక్తస్రావం కావడంతో బ్రిడ్జెండ్స్‌లోని ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ హాస్పిటల్‌కు వెళ్లారు. తరువాత ఉమ్మనీరు బయటికొచ్చింది. దాంతో, ఆమెను సింగిల్‌టన్ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు.
"చాలా భయమేసింది. నొప్పి భరించలేకపోయాను. నేను, నా కడుపులో బిడ్డ ఎలాగైనాా బతకాలి అనుకున్నా. నొప్పిని పంటి బిగువున భరిస్తూ ఊపిరి తీసుకున్నా" అని రాచెల్ చెప్పారు.
ఆస్పత్రికి వెళ్లిన వెంటనే ఇమోజెన్ పుట్టేసింది. ఆ పసికందును తల్లి గర్భాన్ని పోలిన బ్యాగ్‌లో ఉంచి ఇంక్యుబేటర్‌లో పెట్టారు.
ఎన్ఐసీయూలో ఉన్న పాప చాలా పీలగా, చాలా సున్నితంగా, అరచేయి కన్నా చిన్నగా ఉందని రాచెల్ చెప్పారు.
"ఈ పాప నా కడుపులో ఉండాలి. కానీ, లేదు. నా కడుపులో పిండం బయటికొచ్చి నా కళ్ల ముందుంది. ఈ ఆస్పత్రిని, నా చుట్టూ ఉన్న వాళ్లను నమ్మడం తప్ప ఇంకేం చేయలేను అనిపించింది" అన్నారు రాచెల్.
బిడ్డ మెదడులో గ్రేడ్ 3 బ్లీడింగ్ అయిందని రాచెల్‌కు, ఆమె భర్త కోరీకి చెప్పారు.
ఎన్ఐసీయూలో ఉన్న 98 రోజుల్లో పాపకు లెక్కలేనన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. గుండెలో గుసగుస శబ్దం, ఊపిరితిత్తులలో రక్తస్రావం, సెప్సిస్ లాంటి ఎన్నో సమస్యలు వచ్చాయి. పలుమార్లు రక్తం ఎక్కించారు.
"రోజూ ఆమెకు సూదులు గుచ్చేవారు. కానీ, అంతా పాప బాగు కోసమే అని నన్ను నేను సముదాయించుకున్నా" అన్నారు రాచెల్.

ఫొటో సోర్స్, RACHEL STONEHOUSE
ఆస్పత్రిలోని నర్సుల సహాయంతో రాచెల్ తల్లి పాలను బయటకు తీయగలిగారు. ఇమోజెన్‌కు 16 వారాల వరకు తల్లి పాలు పట్టారు.
రాచెల్ దంపతులు 13 వారాల పాటు ఆస్పత్రిలోనే గడిపారు. బిడ్డతో వీలైనంత ఎక్కువసేపు గడపాలన్న ఉద్దేశంతో అక్కడే ఉండిపోయారు. వారిద్దరికీ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ కౌన్సిలింగ్ ఇచ్చారు.
జనవరి 15న ఇమోజెన్‌ను ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ ఆస్పత్రిలో స్పెషల్ కేర్ బేబీ యూనిట్‌కు తరలించారు. అక్కడ మరో 34 రోజులు పాపకు చికిత్స అందించారు.
"నా జీవితంలో అవి అత్యంత భయంకరమైన రోజులు. కానీ, ఆస్పత్రి సిబ్బంది నాకు, నా కుటుంబానికి పెద్ద అండగా నిలిచారు. నాకు భరోసా ఇచ్చారు" అని రాచెల్ చెప్పారు.
ఇమోజెన్ ఇప్పుడు ఇంట్లో అమ్మ, నాన్నలతో ఉంది. కానీ, ఇంకా పాపకు ఆక్సిజన్ అందిస్తున్నారు. అయితే, పాపకు అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని, చూపు, వినికిడి సమస్యలు లేవని డాక్టర్లు చెప్పారు.
రాచెల్‌కు నెలలు నిండకుండానే కాన్పు జరగడానికి 40 శాతం అవకాశం ఉందని ముందే చెప్పారు. అయితే, స్పష్టమైన కారణాలు తెలియలేదు.
ఇప్పుడు రాచెల్ ఒక అమ్మగా ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. తన బిడ్డను కాపాడిన ఆస్పత్రికి జీవితాంతం రుణపడి ఉంటానని అంటున్నారామె.
"డాక్టర్లు, నర్సులు నిజంగానే సూపర్ హీరోలు. వాళ్లు లేకపోతే నా బిడ్డ నాకు దక్కేది కాదు" అన్నారు రాచెల్.
ఇవి కూడా చదవండి:
- అమెరికా ఆశలు చూపించి బాలి తీసుకెళ్లి బంధించారు.. భారతీయులను కిడ్నాప్ చేస్తున్న ఇండొనేసియా ముఠా
- ఆస్కార్ 2023 : ఈ అవార్డులకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది?
- ‘ప్రార్థనల కోసం డబ్బులు చెల్లించి అప్పుల పాలయ్యాను, అద్భుతం జరిగేదెప్పుడు?’
- BBC She: మహిళలు ఎలాంటి వార్తలను ఇష్టపడతారు?
- దిల్లీ మద్యం కేసు: కవితను 9 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ.. 16న మళ్లీ విచారణకు పిలుపు














