'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

ఫొటో సోర్స్, BBC NEWS
- రచయిత, పల్లబ్ ఘోష్
- హోదా, సైన్స్ కరెస్పాండెంట్
జీన్ ఎడిటెడ్ ఫుడ్‌ను తయారు చేసి, అమ్మేందుకు అనుమతించేలా ఇంగ్లండ్‌లో చట్టాన్ని మార్చారు.
ఈ టెక్నాలజీ వల్ల ఆహార ఉత్పత్తిలో మెరుగుదలతోపాటు ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే యూకేలోని ఇతర ప్రాంతాల్లో దీన్ని అనుమతించకూడదంటూ పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జీన్ ఎడిటెడ్ ఫుడ్ అంటే ఏంటి?
రైతులు ఎన్నో ఏళ్లుగా సంప్రదాయ క్రాస్ బ్రీడింగ్ వ్యవసాయ విధానాలను అనుసరించి అనేక కొత్త వంగడాలతో ఆహార పంటలను ఉత్పత్తి చేశారు.
ఉదాహరణకు, రుచిగా ఉండని ఒక పెద్ద క్యాబేజీ రకాన్ని చాలా రుచిగా ఉండే చిన్న క్యాబేజీ రకాన్ని కలిపి రైతులు ఒక కొత్త క్యాబేజీ రకాన్ని సృష్టించవచ్చు.
ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయి కొత్త క్యాబేజీ వంగడం తయారు కావడానికి సంవత్సరాల సమయం పడుతుంది. ఎందుకంటే, క్యాబేజీలోని వందల వేల జన్యువులు సరైన మార్గంలో కలపడం ద్వారా పెద్ద పరిమాణంలో ఉండి మంచి రుచిని కలిగి ఉండే ఒక క్యాబేజీ వంగడాన్ని తయారు చేయడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. ఒకే ప్రయత్నంలో దీన్ని సాధిస్తామని అనుకోవడానికి వీల్లేదు.
కానీ, జన్యు పద్ధతిలో ఈ శ్రమ ఉండదు.
జన్యు పద్ధతి ద్వారా పరిమాణం, రుచికి ఏ జన్యువులు కారణం అవుతాయో శాస్త్రవేత్తలు గుర్తించగలుగుతారు. ఇలా గుర్తించిన జన్యువులను సరైన చోట అనుసంధానించి కొత్త రకాలను చాలా వేగంగా అభివృద్ధి చేస్తారు.

ఫొటో సోర్స్, JIC
ఏ జన్యు పద్ధతులను వాడతారు?
ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో 20 ఏళ్లకు పైగా ‘జన్యు మార్పిడి’ (జెనెటిక్ మాడిఫికేషన్ – జీఎం) అనే విధానాన్ని వాడుతున్నారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో ఈ పద్ధతిని వాడటం లేదు.
జీఎం విధానంలో ఒక మొక్క డీఎన్ఏలో వేరే జాతి మొక్క లేదా జంతువుల డీఎన్‌ఏను జోడిస్తారు. క్రాస్ బ్రీడింగ్ ద్వారా ఉత్పత్తి చేయలేని కొత్త రకమైన మొక్కను ఈ విధానం ద్వారా సృష్టించవచ్చు.
సిస్‌జెనెసిస్: ఇది కూడా జీఎం విధానం వంటిదే. కాకపోతే ఇందులో ఒక మొక్కకు అదే జాతికి చెందిన లేదా దాని దగ్గరి జాతికి చెందిన డీఎన్‌ఏను జోడిస్తారు.
జీన్-ఎడిటింగ్ (జీఈ): ఇది సరికొత్త టెక్నాలజీ. ఈ విధానంలో శాస్త్రవేత్తలు నిర్దిష్ట జన్యువులను లక్ష్యంగా చేసుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
జీన్ ఎడిటెడ్ ఆహార పదార్థాలు యూకేలో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?
బ్రెగ్జిట్ కారణంగా బ్రిటన్ ప్రభుత్వం, ఇంగ్లండ్‌లో జీన్ ఎడిటెడ్ పంటల సాగుకు చాలా తేలికైన నిబంధనల్ని విధించింది. ఈయూలోని ఇతర ప్రాంతాల్లో ఈ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి.
జీఈ టెక్నాలజీ చాలా కొత్తది కాబట్టి ఈ విధానంలో ఉత్పత్తి అయిన కొత్త రకాలు మార్కెట్‌లో అందుబాటులోకి రావడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. అయితే ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి.
జీన్ ఎడిటెడ్ జంతువులకు చెందిన మాంసం, గుడ్లు, పాల పదార్థాలను అమ్మేందుకు కూడా ఇంగ్లండ్‌లో తెచ్చిన తాజా చట్టం వీలు కల్పిస్తుంది. ఇది ఎంపీల ఆమోదం పొందాల్సి ఉంది. ఈ టెక్నాలజీ వల్ల జంతు సంరక్షణపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త నియమాల ప్రకారం, జీన్ ఎడిటెడ్ ఆహారాల మీద ‘జీఈ ఫుడ్’ అనే లేబుల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ జీఈ ఫుడ్స్‌ను కూడా సంప్రదాయ ఉత్పత్తుల్లాగే వారు భావిస్తున్నారు.
స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ ఇప్పటివరకు జీఈ పంటలపై తమ చట్టాలను మార్చలేదు.

ఫొటో సోర్స్, JIC
అందుబాటులో ఉన్న జీన్ ఎడిటెడ్ ఆహారాలు ఏంటి?
జపాన్‌లో మీరు ‘జీఏబీఏ’ అనే రసాయనం అధికంగా ఉండే టొమాటోలను కొనుగోలు చేయవచ్చు.
అమెరికాకు చెందిన ఒక సంస్థ గింజలు లేని బ్లాక్‌బెర్రీలను, చెర్రీలను జీన్ ఎడిటెడ్ విధానంలో తయారు చేస్తుంది.
యూకేలో విటమిన్ ‘డి’ కలిగి ఉండే టొమాటోలను పరిశోధకులు అభివృద్ధి చేశారు.
హెర్ట్‌పోర్డ్‌షైర్‌లోని శాస్త్రవేత్తలు జీన్ ఎడిటెడ్ గోధుమలతో ప్రయోగాలు చేస్తున్నారు.
ఆహార పరిశ్రమ ప్రధానంగా, ప్రస్తుతమున్న పంటల్లో కొత్త రకాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి జీఈ టెక్నాలజీని ఉపయోగించాలని అనుకుంటోంది.
అధిక దిగుబడిని అందించే, వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలిచే రకాలను తయారు చేయడంపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి.

ఫొటో సోర్స్, ACCELIGEN
జీన్ ఎడిటెడ్ ఆహారాలు మంచివేనా?
అందుబాటులో ఉన్న మూడు జన్యు పద్ధతుల ద్వారా తయారు చేసిన ఆహారాలు, తినేందుకు సురక్షితమైనవే అని శాస్త్రవేత్తలు భరోసా ఇచ్చారు. జన్యు సాంకేతిక ద్వారా అభివృద్ధి చేసిన ఆహారాలకు కఠిన పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు.
ఉత్తర, దక్షిణ అమెరికాలతో పాటు ఆసియాలోని కోట్ల మంది 25 ఏళ్లుగా జీఎం ఆహార పదార్థాలను తీసుకుంటున్నారని వారు ప్రస్తావించారు. ఇవి ప్రజలపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపించట్లేదని చెప్పారు.
అయినప్పటికీ, ఈయూలో ఆరోగ్య ప్రమాదాలు, పర్యావరణ ప్రభావంపై ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని జీఎం లేదా జీఈ ఆహారాలను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయరు. వాటిని విక్రయించరు.

ఫొటో సోర్స్, BBC NEWS
సమస్యలు ఏంటి?
జీన్ ఎడిటెడ్ ఆహారాలను వ్యతిరేకించే చాలా మంది సామాజిక కార్యకర్తలు, జీఎం టెక్నాలజీతో ఉత్పత్తి చేసిన ఆహార పదార్థాలకు, జీఈ ఆహారాలకు పెద్ద తేడా లేదని అంటున్నారు.
జీన్ ఎడిటెడ్ ఆహారాలకు అదనపు పరీక్షలు అవసరం లేదని, వాటి వల్ల కొత్త రకమైన అలర్జీలు, విష పదార్థాలు తయారవుతాయని వారు భయపడుతున్నారు.
పర్యావరణంపై కూడా జీన్ ఎడిటెడ్ పంటలు ప్రభావం చూపిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జీఎం పంట వల్ల మానవ ఆరోగ్యానికి, పర్యావరణ వ్యవస్థలకు హాని కలిగినట్లు ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు అంటున్నారు. జీఈ పంటలకు కూడా ఇదే వర్తిస్తుందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- కత్తిపీటతో హత్య చేసేందుకు మా నాన్నే ప్రయత్నించారు – కులం, గౌరవం, ప్రేమ కథ
- ‘రంగమార్తాండ' రివ్యూ: గుండె లోతుల్లోని ఉద్వేగాన్ని బయటకు లాక్కొచ్చే సినిమా
- అదానీ గ్రూప్ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు ఏడాదిగా ఎందుకు నిరసనలు చేస్తున్నారు?
- ఉగాది: మనం ఉన్నది 2023లో కాదు.. 1945 లేదా 2080
- వడగళ్ల వానలు ఎందుకు పడతాయి? అవి వేసవిలోనే ఎందుకు ఎక్కువ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














