బీటెక్ పానీపూరీ.. ఇలాంటిది మీరెక్కడా చూసుండరు
చదువుకుంటూనే పాకెట్ మనీ కోసం ఉద్యోగాలు చేయడం అన్న కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడే భారత్‌లో కూడా పెరుగుతోంది.
ఇలా బీటెక్ చేస్తూనే తాప్సీ అనే అమ్మాయి దిల్లీలో వినూత్నంగా పానీపూరీలు తయారు చేసి అమ్ముతోంది.
‘‘ఇది నా పానీపూరీ స్టార్టప్. ఇందులో మేం ఆరోగ్యకరమైన పానీ పూరీ సర్వ్ చేస్తాం. వీటిని నూనెలో వేయించి తయారు చేయరు. వీధుల్లో అమ్మే ఆరోగ్యకరమైన మొట్టమొదటి పానీపూరీ ఇదే అని నేను చెబుతాను. మేం తయారుచేసే పానీ కూడా హిమానియన్ రాక్ సాల్ట్ అంటే సైంధవ లవణంతోనే చేస్తాం. అందుకే ఇది మిగతా స్ట్రీట్ ఫుడ్ కంటే భిన్నంగా ఉంటుంది.’’ అని ఆమె చెప్పారు.
జనం తరచూ బీటెక్ చేసి పానీపూరీ స్టాల్ ఎందుకు నడుపుతున్నారని తాప్సీని అడుగుతుంటారు.
‘‘బీటెక్ చేసిన నువ్వు ఇదెందుకు చేస్తున్నావ్ అని జనం అంటారు. మొదటి విషయం అది ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు నేను విద్యార్థినే. ఇంకా మూడో సంవత్సరంలో ఉన్నాను. చదువుతూ ఏదైనా పని చేయడం అనేది విదేశాల్లోనే ఉంటుంది. ఇండియాలో అలా చేయరు అని చాలామంది చెబుతుంటారు. కానీ, మనం కూడా అభివృద్ధి చెందుతున్నాం.
మన దేశంలో చాలా విషయాల్లో మార్పు వస్తోంది. అలాగే, నేను కూడా మన సమాజంలో మార్పుకు నా వంతు సహకరించాను. చదువుకుంటూనే నేను ఇది నడుపుతున్నాను. దీనికి నేనేం సిగ్గుపడటం లేదు. చదువుకుంటూనే ఒక మంచి పని చేస్తున్నానని అనుకుంటున్నాను.
ఇది నా స్టార్టప్ జర్నీ. ఇది ఐదేళ్ల ముందే మొదలైంది. ఆరోగ్యకరమైన జీవనశైలికి మారడం, యోగా, ధ్యానం, పరిశుభ్రంగా తయారు చేసిన ఆరోగ్యకరమైన ఆహారంపై రీసెర్చ్ అనేదే నా ప్రయాణం.’’ అని తాప్సీ చెప్పారు.
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని తాప్సీ కోరుకుంటున్నారు. తన బిజినెస్‌ను మరింత వృద్ధి చేయాలని అనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)