ఆరోగ్యం: ఏం తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది? విటమిన్ టాబ్లెట్లు మంచివేనా?

ఫొటో సోర్స్, NATHAN G
- రచయిత, డాక్టర్ ప్రతిభ లక్ష్మి
- హోదా, బీబీసీ కోసం
ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి గురించి చాలామంది చాలా విషయాలు పంచుకుంటున్నారు.
రోగ నిరోధక శక్తి పెంచడానికి సాధారణ ఆహారం నుంచి కషాయాలు, లేహ్యాలు, పానీయాలు, పొడులు.. శ్లోకాలు, మంత్రాలు, తంత్రాలు, పూజలు ఒకటేమిటి ఎన్నో ఎన్నో చెప్తున్నారు.
చెప్పేవారిలో నిపుణులు ఉంటున్నారు, అనుభవంతో జ్ఞానం సంపాదించినవారు ఉంటున్నారు, అవేమీ లేకుండా ఎవరుపడితే వారు కూడా చెప్తున్నారు.
దీంతో ఏం తినాలి? ఎందుకు తినాలి? ఏది మంచిది? ఏది మంచిది కాదు అనేది తెలియని ఒకరకమైన గందరగోళం ఏర్పడుతోంది.
ఏదైనా ఒక రోగం రాకుండా మన శరీరాన్ని కాపాడడానికి, మనకు రోగ నిరోధక వ్యవస్థ ఉంది. అందులో మన శరీరంలోని తెల్ల రక్తకణాలు ముఖ్య భాగం.
అనారోగ్యం రాకుండా కాపాడడం, సోకిన తరువాత వ్యాధికి కారణమైన క్రిమిని చంపడమనేది మన శరీరంలోని తెల్ల రక్త కణాలు, అవి తయారు చేసే యాంటీబాడీల లక్షణం.
అయితే, మనకు ఇన్ఫెక్షన్ సోకక ముందే, మన రక్త కణాలకు ఆ రోగ నిరోధక శక్తిని కలిగించేవి కేవలం టీకాలు మాత్రమే.

ఫొటో సోర్స్, Getty Images
శరీర రోగ నిరోధక వ్యవస్థ మెరుగు పడాలి అంటే, మనం రోజూ, "సమతుల ఆహారం" తీసుకోవాలి.
ముఖ్యంగా అందులో సరిపడా మాంసకృత్తులు (proteins) ఉండేలా చూసుకోవాలి.
రోజూ పండ్లు, కూరగాయలు తినాలి. రోజు వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన జీవన విధానం కొనసాగిస్తూ, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి, ఎవరి పద్దతిలో వారు, యోగ, ధ్యానం మొదలైన పద్ధతులు పాటించవచ్చు.
అవన్నీ చేయకుండా సులువుగా లభిస్తాయని, ప్రచారాలు చూసి, విని మోసపోతే మన ఆరోగ్యానికి మేలు కాదు కదా, ఇంకా కీడు చేసుకునే అవకాశం ఉంది.
మనం మన రోగ నిరోధక వ్యవస్థను జీవిత కాలం కాపాడుకోవడానికి ప్రయత్నించాలి.
కాబట్టి దానికి సులువైన పద్దతులు ఉండవు. చచ్చే వరకు ఎవరు ఉన్నా లేకపోయినా, మన శరీరం మనతోనే ఉండాలి కదా. అందుకే దాన్ని గౌరవించాలి. కాపాడు కావాలి.
- ఆహారాన్ని ఆహారంలాగే ఆస్వాదించండి. ఔషధం అని భ్రమపడకండి.
- కషాయాలతో అసిడిటీ పెరుగుతుంది తప్ప, పెద్దగా లాభం లేదు. అనవసరంగా అనారోగ్యం పాలుకాకండి.
- ఆవిరి పట్టడం, లేదా వేడి నీళ్లు తాగడం వల్ల వైరస్ చనిపోదు, (క్షణాల్లో అది mucus membrane నుండి శరీరంలోకి వెళ్ళిపోతుంది. ముక్కులో, నోట్లో, గొంతులో నుంచి కడుపులోకి వెల్లదు)
- రోజూ మల్టీ విటమిన్ మాత్రలు వేసుకోవడం వల్ల లాభం లేదు. లోపం ఉంటే తప్ప వాటి వాడకం నిరుపయోగం.
- అయితే, విటమిన్ లోపం ఉందా లేదా అని కచ్చితంగా తెలియాలంటే పరీక్ష చేసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
తినే ఆహారంలో పోషకాలు తగ్గుతున్నాయి అనే ఒక మాట వినబడుతున్నా అది పూర్తిగా నిజం కాదు.
పండిస్తున్న ఆహారంలో కొంత మార్పు వచ్చినా, మన ఆహారపు అలవాట్లు, జీవన శైలిలోనే ఎక్కువ సమస్య కనిపిస్తుంది.
మన శరీరానికి ప్రమాదాన్ని కలిగించే జంక్ ఫుడ్ తినడం, శారీరక శ్రమ తగ్గడం, లవణాలు లేని బాటిల్ నీటిని తాగడం, ఎండలో ఉండకపోవడం.. పొగాకు, మద్యం వంటి దురలవాట్లను సాధారణం అనుకోవడం.. ఇలాంటి జీవన శైలి వల్లే రోగ నిరోధక వ్యవస్థ చతికిలబడుతుంది. అవన్నీ అదుపు చేయకుండా, ఏదో ఒక మాత్రతో ఆరోగ్యంగా ఉండడం సాధ్యపడదు.
రాగి చెంబులో నీరు తాగడం మంచిది అని చెప్పగానే నమ్మేసి రాగి పాత్రలు, గ్లాసులు, చెంబులు కొని వాడుతున్నారు కానీ, అసలు రాగి లోపం మన జనాభాలో ఉందా, నిజంగా దాన్ని పెంచుకునే అవసరం ఉందా అని ఆలోచించడం మానేశారు. ఆలోచిస్తే తెలుస్తుంది, దాని అవసరం లేదు అని.
అలాగే ప్లాస్టిక్ పాత్రలలో ముఖ్యంగా వేడి ఆహార పదార్థాలు, తాగడం తినడం, వల్ల అనేక నష్టాలు ఉన్నాయి అని ఎంత చెబుతున్నా మనం వినడం లేదు. ఎందుకంటే అవి సులువుగా లభిస్తాయని.
శాకాహారులకు మాంసకృత్తుల నుండి లభించే కొన్ని విటమిన్ల లోపం ఉండడం సహజమే. కండరాలను, ఎముకలను బలంగా ఉంచడానికి అవసరమైన విటమిన్ డీ లోపానికి గల కారణాలు, వాటి పర్యవసానాలు ఇంతకు ముందు ఒక వ్యాసంలో వివరించడం జరిగింది.
అలాగే వృద్ధులు, మధుమేహం వంటి దీర్ఘ కాలిక జబ్బులతో బాధ పడే వారికి, లేక జీర్ణ వ్యవస్థలో ఏదైనా సమస్య ఉన్న వారికి, కొన్ని లవణాల లోపం సహజం. ముఖ్యంగా విటమిన్ B12.
మద్యం తాగే అలవాటు ఉన్న వారికి దానితో పాటు, విటమిన్ B1, folic acid మొదలగు వాటి అవసరం అధికంగా ఉంటుంది. కాబట్టి, వాళ్లు ఆ లోపాలను మాత్రలతో కృత్రిమంగా భర్తీ చేసుకోవడం మంచిది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ముందు చెప్పిన అనేక కారణాల వల్ల ముఖ్యంగా ఎదిగే పిల్లలకు లవణాల లోపం ఉండడం వల్ల, వారి శారీరిక, మానసిక ఎదుగుదల తగ్గిపోయే ప్రమాదం ఉంది.
కాబట్టి ఈ మధ్య కాలంలో పిల్లలకు అవసరమైన విటమిన్లను అందించడానికి సులువైన పద్దతిలో వారికి చూడడానికి, తినడానికి నచ్చేలాగా లభిస్తున్నాయి. ఇది ఇవ్వడం మంచిదేనా అంటే, ప్రతి రోజూ ఆహారంలో మంచి కూరగాయలు, పండ్లు ఇవ్వలేని వారు, లవణాలు లేని, RO UV నీరు తాగడం వల్ల నీరసపడిపోతున్నవారు, ఇలాంటి సులువైన పద్దతిలో అయినా లవణాలను తీసుకోవడం మంచిదే అని చెప్పాలి.
ఆహారంలో తీసుకోలేని వారు, మందుల రూపంలో తీసుకోక తప్పదు కదా.!
(రచయిత వైద్యురాలు, అభిప్రాయాలు వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- గోళ్లు ఎందుకు కొరుకుతారు?
- యువ అథ్లెట్లలో కొందరికి గుండెపోటు ఎందుకు వస్తోంది?
- ఈ స్కూలు పిల్లలు రోజూ రెండుసార్లు డబ్బాలు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు?
- తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్సీఎల్లో సాఫ్ట్వేర్ జాబ్... ఎంపిక ఎలా?
- గుజరాత్: శివాలయం మీద హక్కులను హిందూ సంస్థలకు ఇచ్చేందుకు జైనులు ఎందుకు ఒప్పుకోవడం లేదు...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














