అమెరికా డ్రోన్: రష్యా జెట్ ఢీ కొన్న ఫుటేజీ విడుదల

అమెరికా డ్రోన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జోనాథన్ బీల్, థామస్ మాకింతోష్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

తమ డ్రోన్‌ను రష్యా జెట్ కూల్చివేసిందని చెబుతున్న అమెరికా అందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని విడుదల చేసింది.

నల్లసముద్రం మీద రష్యా జెట్ ఢీ కొని అమెరికా డ్రోన్ మంగళవారం పడిపోయింది. క్రైమియా ప్రాంతంలో కూలినట్లు అమెరికా తెలిపింది.

అమెరికా డ్రోన్ ప్రొపెల్లర్‌ను తమ సుఖోయ్-27 ఫైటర్ జెట్ నాశనం చేసిందంటూ వస్తున్న వార్తలను రష్యా ఖండించింది.

ఈ డ్రోన్‌పై దాడి ఘటన దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు కొనసాగిందని అమెరికా చెప్పింది. కానీ నిమిషం కంటే తక్కువ నిడివి గల వీడియో ఫుటేజీ మాత్రమే ఆ దేశం విడుదల చేసింది.

బుధవారం రాత్రి అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ మాట్లాడుతూ "మేం ఇప్పటివరకు తెలియజేసిన వాస్తవాలపై స్పష్టతతో ఉన్నాం" అన్నారు.

పెంటగాన్ ఏ వీడియోను విడుదల చేయాలో పరిశీలిస్తుందని తెలిపారు. మిలిటరీ పబ్లిక్‌గా వీడియో ఫుటేజీని విడుదల చేయడానికి కొంత సమయం తీసుకుంటాయని ఆయన స్పష్టంచేశారు.

డ్రోన్ దృశ్యాలు

ఆ వీడియోలో ఏముంది?

ఇంధనాన్ని విడుదల చేస్తూ రష్యన్ సుఖోయ్-27 విమానం డ్రోన్‌కు అత్యంత సమీపంగా వచ్చిందని నిఘా డ్రోన్ ఫ్యూజ్ కింద అమర్చిన కెమెరాలో రికార్డైన ఫీడ్ ద్వారా తెలుస్తోంది.

మొదటిసారి వచ్చినపుడు ఇది కెమెరా లెన్స్‌ను మసక చేసినట్లు అనిపిస్తుంది. రెండోసారి మరింత దగ్గరగా వచ్చినట్లు ఉంది.

రిమోట్‌ ద్వారా నడిచే ఈ పైలెట్ రహిత విమానం వీడియో ఫీడ్‌కు అంతరాయం కలిగించింది. వీడియో మళ్లీ కనిపించేసరికి విమానం వెనుక భాగంలో డ్రోన్ ప్రొపెల్లర్ బ్లేడ్ వంగి ఉంది.

బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్‌తో అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ రష్యా చర్య ఉద్దేశపూర్వకమా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనేది స్పష్టంగా తెలియలేదన్నారు.

అయితే ఇది పూర్తిగా తగనిదని, అసురక్షితమైనదని, వృత్తి ధర్మానికి వ్యతిరేకమైనది కాబట్టి అలా ఆలోచించాల్సిన అవసరం లేదని కూడా తెలిపారు.

కాగా, నల్ల సముద్రం మీదుగా నిఘా విమానాలు కొనసాగుతాయన్నారు జాన్ కిర్బీ. అయితే మిలిటరీ ఎస్కార్ట్‌లు అవసరం లేదని స్పష్టంచేశారు.

రష్యా ఏం సమాధానం చెప్పింది?

అయితే తమ భూభాగంలోకి ఆ డ్రోన్ సమీపించిందని రష్యా ఆరోపిస్తోంది. వీడియోలో మాత్రం కేవలం సముద్రం, ఆకాశం, మేఘాలు చూడగలుగుతున్నామని తెలిపింది.

యుక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఈ ప్రాంతంపై ఏకపక్షంగా నో-ఫ్లై జోన్‌ను విధించినట్లు మాస్కో మంగళవారం సూచించినట్లు తెలుస్తోంది.

అమెరికాలోని రష్యా రాయబారి అనటోలీ ఆంటోనోవ్ స్పందిస్తూ ప్రత్యేక సైనిక ఆపరేషన్‌లో భాగంగా రూపొందించిన తాత్కాలిక గగనతల సరిహద్దు నిబంధనలు డ్రోన్ ఉల్లంఘించిందని తెలిపారు.

అయితే ఆ గగనతలం అంతర్జాతీయమైనదని, నిషేధిత ప్రాంతమేం కాదంటూ జాన్ కిర్బీ వాదించారు.

క్రాష్ జరిగిన కొన్ని గంటల తర్వాత అమెరికా ఓ ప్రకటన విడుదల చేసింది. రష్యా జెట్‌లు ఢీకొనడానికి ముందు డ్రోన్‌పై చాలాసార్లు ఇంధనాన్ని కుమ్మరించాయని ఆ ప్రకనటలో తెలిపింది.

పెంటగాన్ ప్రతినిధి బ్రిగ్ జనరల్ పాట్ రైడర్ విలేకరులతో మాట్లాడుతూ దాడి తర్వాత డ్రోన్ ఎగరలేదని, నియంత్రణ కోల్పోయామని అన్నారు. ఈ దాడిలో రష్యా విమానం కూడా దెబ్బతిని ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు.

డ్రోన్ అవశేషాలు ఎవరికి దొరికాయి?

'క్లిష్టమైన విన్యాసాల' తర్వాత డ్రోన్ కూలిపోయిందని, విమానాలను ట్రాక్ చేయగలిగే ట్రాన్స్‌పాండర్‌లు (కమ్యూనికేషన్ పరికరాలు) ఆఫ్ అయి ఉన్నాయని, కానీ అది ఎగురుతోందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది.

అయితే, అమెరికా వీడియో విడుదల చేయడంపై క్రెమ్లిన్ ఇంకా స్పందించలేదు.

బుధవారం రష్యా భద్రతా మండలి కార్యదర్శి నికోలాయ్ పత్రుషేవ్ మాట్లాడుతూ డ్రోన్ భాగాలను కనిపెట్టి, సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

గురువారం నల్ల సముద్రంలో డ్రోన్ కూలిన ప్రదేశంలో రష్యా నౌకలు కనిపించాయని అమెరికా మీడియా తెలిపింది.

అమెరికా కూడా డ్రోన్ కోసం వెతుకుతున్నదని జాన్ కిర్బీ చెప్పారు.

ఒకవేళ రష్యా దాన్ని పొందితే 'ఉపయోగకరమైన మేధస్సును ఉపయోగించుకునే వారి సామర్థ్యం చాలా తక్కువ'గా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.

కాగా, నీటిలో దిగిన డ్రోన్‌ అంతటి ముఖ్యమైనదేమీ కాదంటూ అమెరికా అత్యున్నత సైనిక జనరల్ జనరల్ మార్క్ మిల్లీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)